• facebook
  • whatsapp
  • telegram

భవితకు భరోసా.. ప్రత్యామ్నాయ ఇంధనాలు



మానవ అభివృద్ధిలో ప్రధాన భూమిక శిలాజ ఇంధనాలదే. అవే, నేడు మనిషి మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి. వీటి వినియోగాన్ని తగ్గించాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు అడుగులు వేయాలి. దుబాయి వేదికగా ఇటీవల ఐరాస వాతావరణ మార్పుల సదస్సు (కాప్‌-28) జరిగింది. ఇందులో శిలాజ ఇంధనాల వాడకానికి స్వస్తి పలకాలని తీర్మానించారు.


వాతావరణ మార్పులకు భూతాపమే ప్రధాన కారణం. ఇందుకు మనుషులు ఉత్పత్తి చేసే ఉద్గారాలు దోహదపడుతున్నాయి. అవి చమురు, గ్యాస్‌, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను వినియోగించడం వల్ల విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కాప్‌-28 సదస్సులో యూఏఈ ఏకాభిప్రాయం పేరిట వెలువడిన సంయుక్త ప్రకటనలో కాలుష్య కారక ఇంధనాల వినియోగాన్ని న్యాయంగా, సమాన ప్రాతిపదికపై విరమించాలని పిలుపిచ్చారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరులను మూడురెట్లు పెంచాలని పేర్కొన్నారు. 2050 నాటికి నెట్‌ జీరో ఉద్గారాలే లక్ష్యంగా రూపొందించిన ఒప్పందాన్ని సభ్యదేశాల ప్రతినిధులు ఆమోదించారు. పారిస్‌ సదస్సు తీర్మానం ప్రకారం ఉష్ణోగ్రతల పెరుగుదలను అరికట్టేందుకు ప్రపంచ దేశాలన్నీ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాలని సదస్సు తీర్మానించింది.


ప్రత్యేక నిధి..

గ్రీన్‌హౌస్‌ వాయువులు, కర్బన ఉద్గారాల విడుదలలో అధిక వాటా అగ్ర రాజ్యాలదే. ఆయా దేశాల చర్యలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తద్వారా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో పేద దేశాలు నష్టపోతున్నాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు బడా దేశాలు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన చాలా ఏళ్లుగా ఉంది. గత కాప్‌-27 సదస్సులో ఈ అంశంపై జరిగిన చర్చలకు, ఈసారి కాస్త సానుకూల ఫలితాలు కనిపించాయి. పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం ఇవ్వాలన్న ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. వాతావరణ మార్పుల వల్ల నష్టపోయే దేశాలకు ఆర్థిక సాయం అందించేందుకు నష్టం, హాని పరిహార నిధి ఏర్పాటు చేయడానికి కాప్‌-28 సదస్సులో ఆమోదం లభించింది. సుమారు 70 కోట్లకుపైగా డాలర్లతో నిధి ఏర్పాటు కాగా, దాదాపు పది కోట్ల డాలర్లు ఇచ్చేందుకు ఆతిథ్య దేశమైన యూఏఈ అంగీకారం తెలిపింది. అమెరికా చాలా తక్కువ విరాళంతో ముందుకురావడం- వాతావరణ మార్పుల నష్టాన్ని అగ్రదేశాలు తేలిగ్గా తీసుకుంటున్నాయనేందుకు నిదర్శనం.


దేశీయ అవసరాలు తీర్చడానికి ఓ వైపు శిలాజ ఇంధన వనరులను ఉపయోగిస్తూనే, పునరుత్పాదక ఇంధన శక్తి వనరుల స్థాపనలో ఇండియా వేగం పెంచింది. ఇదే విషయాన్ని కాప్‌-28 సదస్సు వేదికగా స్పష్టం చేసింది. 2005-2019 మధ్యకాలంలో హరిత వాయువుల విడుదలను 33 శాతానికి తగ్గించామని, 2030 నాటికి చేరుకోవాల్సిన లక్ష్యాలను ముందుగానే అందుకున్నామని పేర్కొంది. తాము ఇప్పటికే పర్యావరణ పరిరక్షణ కోసం పునరుత్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేసింది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వనరులను మూడురెట్లు పెంచాలనే విధాన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ఈ రంగంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ గణనీయమైన వృద్ధి సాధించింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వ్యవస్థల స్థాపన, పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. శిలాజ ఇంధన రహిత విద్యుత్‌ ఉత్పత్తిలో 2030 నాటికి 500 గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకు తీసుకురావాలని కంకణం కట్టుకుంది. ఇందుకోసం జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌, పీఎం కుసుమ్‌ పథకం, పునరుత్పాదక ఇంధన రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి, హరిత ఇంధన నడవాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. భారత్‌, ఫ్రాన్స్‌ కృషి ఫలితంగా అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటైంది. ప్రజల భాగస్వామ్యంతో కూడిన గ్రీన్‌ కార్బన్‌ క్రెడిట్‌ విధాన రూపకల్పనను ప్రతిపాదించింది. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి నుంచి పూర్తిగా దూరం జరగలేని పరిస్థితి ఉంది. ఇంధన ఉత్పత్తికి బొగ్గును వినియోగిస్తూనే, పునరుత్పాదక ఇంధన వనరులను పెంచేందుకు భారత్‌ ప్రయత్నిస్తోంది. కర్బన ఉద్గారాలు, గ్రీన్‌హౌస్‌ వాయువుల శాతాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోంది.


ఒప్పందాలకే పరిమితం

ఇప్పుడిప్పుడే దేశాలన్నీ వాతావరణ మార్పులతో తలెత్తే సమస్యలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయాలు లేవని, శిలాజ ఇంధనాల్ని తగ్గించడమే మార్గమని కాప్‌ సదస్సు నిర్ణయించడం ముదావహం. అయితే, నిర్దేశిత లక్ష్యాలను పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎంతమేరకు అందుకుంటాయనేది ప్రశ్నార్థకమే. ఆయా దేశాలు పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మరలాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు, ఆధునిక సాంకేతికత అవసరం. చాలా దేశాలు పారిస్‌ ఒప్పందాన్నే తుంగలో తొక్కుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఘనంగా మాట్లాడే అగ్రదేశాలు, కాలుష్య కారకాల నివారణ కోసం పటిష్ఠ చర్యలను చేపట్టడం లేదు. కాప్‌ వంటి సదస్సులు కేవలం ఒప్పందాలకే పరిమితం అవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో కాప్‌-28 వేదికగా జరిగిన ఒప్పందాలు నిర్దిష్టంగా అమల్లోకి వచ్చి, అన్ని దేశాలు పర్యావరణ పరిరక్షణకు పాటుపడతాయని ఆశిద్దాం!


లక్ష్యాల సాధనే కీలకం

పెట్రోలు, డీజిల్‌ ఉత్పత్తిలో కీలక దేశాల్లో యూఏఈ ఒకటి. ఈ దేశానికి వచ్చే ఆదాయంలో గణనీయ వాటా చమురు అమ్మకాల ద్వారానే సమకూరుతోంది. మరోవైపు, ఈ దేశం నుంచే కోట్ల టన్నుల    కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదల అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కాప్‌-28 సదస్సుకు దుబాయి వేదిక కావడంతో శిలాజ ఇంధనాలు, వాటి కారణంగా వెలువడే కాలుష్యంపై ఎలాంటి చర్చా ఉండదని అంతా అంచనా వేశారు. అందుకు భిన్నంగా సదస్సులో తీర్మానం జరిగింది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న చమురు, గ్యాస్‌, బొగ్గు తదితర శిలాజ ఇంధనాల వినియోగాన్ని నెమ్మదిగా తగ్గించుకోవాలని, శుద్ధ ఇంధనాల ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలని ప్రపంచ దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఈ లక్ష్యాల సాధన కోసం ప్రపంచ దేశాలు పునరుత్పాదక ఇంధన వనరులను మూడురెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. ప్రపంచ అణుశక్తి సామర్థ్యాన్ని 2050నాటికి మూడురెట్లు పెంచాలని తీర్మానించాయి. వాస్తవ కార్యాచరణలో ఇవి ఏ మేరకు అమలవుతాయో చూడాలి.


- ఎం.కరుణాకర్‌ రెడ్డి (‘వాక్‌ ఫర్‌ వాటర్‌’ వ్యవస్థాపకులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ లాభసాటి సేద్యం కోసం..

‣ భద్రతకు ఆత్మనిర్భరతే పునాది

‣ డ్రోన్‌ విపణికి కొత్త రెక్కలు

‣ అపస్వరాల ఐక్యతా రాగం!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Follow us on Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 25-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం