• facebook
  • whatsapp
  • telegram

కాగ్‌ విశ్వసనీయతకు తూట్లురాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సర్కారు ఖజానాకు కాపలాదారు వంటిది. కాగ్‌-పార్లమెంటుకు సమర్పించే ఆడిట్‌ నివేదికలు తగ్గిపోతున్నాయి. 2019-23 మధ్య అది ఏటా సగటున 22 నివేదికలు మాత్రమే సమర్పించింది. 2014-18 మధ్య ఆ సంఖ్య 40దాకా ఉండేది. ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కాగ్‌ కేవలం 18 నివేదికలనే సమర్పించడం గమనార్హం.


కాగ్‌ వ్యవహార శైలిలో అలసత్వం, ఆలస్యం పెరుగుతున్నాయనే ఆరోపణలు ముమ్మరమవుతున్నాయి. కాగ్‌ను బలహీన పరచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలకు ఆ సంస్థ పనితీరే బలం చేకూరుస్తోంది. 2008-13 మధ్యకాలంలో కాగ్‌గా వినోద్‌ రాయ్‌ బాధ్యతలు నిర్వర్తించినప్పుడు పెద్ద సంఖ్యలో నివేదికలు వెలువరించారు. అవి తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 2జీ కుంభకోణంపై ఇచ్చిన ఆడిట్‌ నివేదికలు సంచలనం సృష్టించాయి. 2జీ కుంభకోణంపై వినోద్‌ రాయ్‌ నివేదిక పెను సంచలనం సృష్టించింది. కానీ, ఆ కేసులో ఆధారాలు లేవని దిల్లీ ప్రత్యేక కోర్టు తేల్చింది. వినోద్‌ రాయ్‌కు ఎన్డీయే ప్రభుత్వం పద్మభూషణ్‌ బహూకరించడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఆక్షేపించింది. కాగ్‌ ఆడిట్‌ నివేదికలు సంఖ్యాపరంగానే కాకుండా నాణ్యతాపరంగా కూడా క్షీణిస్తున్నాయని 60 మంది ప్రముఖ పౌరులు, విశ్రాంత ప్రభుత్వాధికారులు కొన్నేళ్ల క్రితం కాగ్‌కు రాసిన లేఖలో విమర్శించారు. కొన్ని అంశాలపై వెలువరించాల్సిన నివేదికలను ఎన్నికల ముంగిట ఉద్దేశపూర్వకంగా తొక్కిపట్టారని ఆరోపించారు. ఇది కాగ్‌ విశ్వసనీయతను దెబ్బతీసిందన్నారు. పెద్దనోట్ల రద్దు బ్యాంకింగ్‌కు సంబంధించిన వ్యవహారం కాబట్టి తమ పరిధిలో లేదని 2017లో నాటి కాగ్‌ శశికాంత్‌ శర్మ వెల్లడించారు. చివరికి చాలా ఆలస్యంగా నివేదిక విడుదల చేశారు.


ఆనవాయితీని విస్మరించి..

కాగ్‌ పనితీరు అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. 2023లోనూ పరిస్థితి ఏమంత మెరుగ్గాలేదని గణాంకాలు చాటుతున్నాయి. ప్రస్తుత కాగ్‌ ఆడిట్‌ నివేదికల సమర్పణలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్‌కు ముందు కాగ్‌ నివేదికను సమర్పించే ఆనవాయితీని సైతం విస్మరిస్తున్న ధోరణి పెరుగుతోంది. పార్లమెంటు, శాసనసభలకు చాలా ఆలస్యంగా కాగ్‌ నివేదికలు సమర్పించడం ప్రభుత్వాలకు అలవాటుగా మారిపోతోంది. 2014-19 మధ్య 42 ఆడిట్‌ నివేదికల సమర్పణలో 90 రోజుల ఆలస్యం జరిగింది. మరికొన్ని నివేదికల విషయంలో 180 రోజులకుపైగా ఆలస్యమైంది. వీటిలో సగానికి పైగా నివేదికలు ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పనితీరుకు సంబంధించినవే. 2018లో కాగ్‌ నివేదికల విషయంలో ఆలస్యం మరీ పెరిగింది. 17 ఆడిట్‌ నివేదికల సమర్పణలో 90 రోజులకుపైగా ఆలస్యం జరిగింది. 2019లో కూడా 21 నివేదికల్లో ఏడింటి సమర్పణకు 90 రోజులకు పైగా ఆలస్యం చోటుచేసుకుంది. కాగ్‌ నుంచి నివేదిక అందిన ఏడు రోజుల్లోగా దాన్ని చట్టసభలకు సమర్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని వినోద్‌ రాయ్‌తో పాటు పలువురు నిపుణులు 2009లో సూచించారు. 14 ఏళ్లు గడచిపోయినా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. కాగ్‌ నివేదికల సమర్పణను ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా పార్లమెంటు, శాసనసభల సమీక్షను తప్పించుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. కాగ్‌ ఆడిట్‌ నివేదిక అందిన తరవాత మాత్రమే ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ), ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (సీపీయూ) వంటి సంఘాల సమావేశాలు జరుగుతాయి. కాలక్రమంలో ఏ ఏటికాయేడు కాగ్‌ సమర్పించే నివేదికల సంఖ్య గణనీయంగా      తగ్గుముఖం పడుతోంది. 2010-11లో కాగ్‌ పార్లమెంటు, శాసనసభలకు 221 ఆడిట్‌ నివేదికలు, 2011-12లో 137 నివేదికలను సమర్పించింది. 2013-14లో 134, 2014-15లో 162 నివేదికలను రూపొందించింది. 2015-16లో 188 ఆడిట్‌ నివేదికలను వెలువరించింది. 2016-17లో 150 నివేదికలను, 2017-18లో 98 నివేదికలను సిద్ధం చేసింది. 2018-19లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోసం కాగ్‌ కేవలం 73 ఆడిట్‌ నివేదికలనే తయారు చేసింది.


సరైన సంస్కరణలతోనే..

భారత రాజ్యాంగం కాగ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమాన హోదా కట్టబెట్టింది. అయితే ఆ పదవిలో నియామకానికి కావలసిన అర్హతలు, అనుసరించాల్సిన పారదర్శక పద్ధతిని 1971నాటి కాగ్‌ చట్టం నిర్దేశించకపోవడం పెద్ద లోపం. అమెరికా, జపాన్‌, బ్రిటన్‌, జర్మనీ వంటి ప్రజాస్వామ్య దేశాలు ఆడిటింగ్‌, అకౌంటింగ్‌లలో నిష్ణాతులైన వారినే కాగ్‌లుగా నియమిస్తాయి. భారత్‌లో అలాంటి ప్రత్యేక నైపుణ్య అనుభవాలు లేని సాధారణ ఐఏఎస్‌ అధికారులనే కాగ్‌గా నియమించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ వ్యవస్థ పనితీరుపై విమర్శలు చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇకనైనా కాగ్‌ నియామక ప్రక్రియలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది.నా దృష్టిలో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) భారత రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన అధికారి. పార్లమెంటు ద్రవ్య వినియోగ చట్టంలో నిర్దేశించిన దానికన్నా పైసా ఎక్కువగా కాని, తక్కువగా కాని ఖర్చు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత కాగ్‌దే. - డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌


నియామక ప్రక్రియ

భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ తన పదవీ కాలంలో నరహరిరావు, ఎ.కె.చందా, ఎ.కె.రాయ్‌లను కాగ్‌ అధికారులుగా నియమించారు. వారంతా తమ వృత్తిలో ప్రత్యేక నైపుణ్యానుభవాలు కలిగినవారే. నాలుగవ, చివరి నిపుణుడు అర్ధేందు బక్షీని ఇందిరాగాంధీ నియమించారు. ప్రధానమంత్రి నేరుగా నియమించగల పదవి కాగ్‌ ఒక్కటే. కాగ్‌ ఎంపికకు అనుసరించే ప్రమాణాలు, పద్ధతిని ప్రజలకు తెలియజేయవచ్చు కదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సీబీఐ, సీవీసీ నియామకాల తరహాలో ఒక ఉన్నత స్థాయి కమిటీ ద్వారా కాగ్‌ నియామకం చేపట్టవచ్చనే అభిప్రాయాలూ ఉన్నాయి. కొలీజియం పద్ధతిలో అధికార, ప్రతిపక్షాలు కాగ్‌ను నియమించాలని ఎల్‌.కె.ఆడ్వాణీ 2012లో సూచించారు. జస్టిస్‌ వెంకటాచలయ్య అధ్యక్షతన వాజ్‌పేయీ ప్రభుత్వం నియమించిన 11 మంది సభ్యుల కమిటీ కూడా కాగ్‌  నియామకానికి ప్రత్యేక చట్టం చేయాలని, బహుళ సభ్యుల కాగ్‌ను నియమించాలని 2002లో సిఫార్సు చేసింది. ఈ విషయంలో జపాన్‌ ఆడిట్‌ కమిషన్‌ పద్ధతిని అనుసరించాలని సూచించింది. బ్రిటన్‌లో కాగ్‌ పార్లమెంటు అధికారి కావడంతోపాటుతన నివేదికను చట్టసభలో   సమర్థించుకునే హక్కునూ కలిగి ఉంటారు. ఆ దేశంలో కాగ్‌ అనుమతి లేనిదే ప్రభుత్వం ఖజానా నుంచి నగదు తీసుకునే వీలులేదు.


 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మాల్దీవులతో బంధానికి బీటలు

‣ భవితకు భరోసా.. ప్రత్యామ్నాయ ఇంధనాలు

‣ లాభసాటి సేద్యం కోసం..

‣ భద్రతకు ఆత్మనిర్భరతే పునాది

‣ డ్రోన్‌ విపణికి కొత్త రెక్కలు

‣ అపస్వరాల ఐక్యతా రాగం!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 25-12-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని