• facebook
  • whatsapp
  • telegram

చైనాతో జతకడితే.. అంతే!



చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు (బీఆర్‌ఐ)లో భాగస్వామ్యానికి 2019లో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాన్ని (ఎంఓయూ) పునరుద్ధరించేది లేదని ఇటలీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీని వెనక ఆర్థిక, రాజకీయ కారణాలున్నాయి. బీఆర్‌ఐలో చేరితే చైనాకు ఇటాలియన్‌ ఎగుమతులు, ఇటలీలో చైనా పెట్టుబడులు పెరుగుతాయన్న ఆశ నెరవేరలేదు. మరోవైపు చైనా- అమెరికా, ఐరోపాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు అంతర్జాతీయ సరఫరా గొలుసులను, పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలను మార్చేస్తున్నాయి.


అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని దెబ్బతీయడానికి చైనా చేపట్టిన ప్రాజెక్టుగా బీఆర్‌ఐని జీ7, నాటో దేశాలు పరిగణిస్తున్నాయి. ఈ రెండు కూటములతోపాటు ఐరోపా సమాఖ్య (ఈయూ)లోనూ ఇటలీ సభ్యురాలే. జీ7లో అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌, ఇటలీ సభ్యులుగా ఉన్నాయి. జీ7, నాటో, ఈయూల నుంచి ఇటలీ తప్ప మరే పెద్ద దేశమూ చైనా బీఆర్‌ఐలో చేరలేదు. పైగా 2024లో ఇటలీ జీ7 అధ్యక్ష పదవిని నిర్వహించనున్నది. నేడు చైనాతో అమెరికా, ఐరోపాలకు ఆర్థికంగా, సైనికంగా విభేదాలు పెరుగుతున్న వేళ బీఆర్‌ఐలో కొనసాగడం ఇటలీ ప్రయోజనాలకు క్షేమకరం కాదు. ప్రస్తుత ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ బీఆర్‌ఐ ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని ప్రకటించడం జీ7కు ఊరట కలిగించింది. నిజానికి బీఆర్‌ఐ ఎంఓయూకు 2024 మార్చి వరకు గడువున్నా, ఇటలీ ముందుగానే బయటికొచ్చేసింది. బీఆర్‌ఐ ద్వారా ఇటలీకి లాభంకన్నా నష్టమే ఎక్కువ జరిగిందన్న భావనే దీనికి కారణం. 2019-2023 మధ్య చైనా నుంచి ఇటలీకి వచ్చిన పెట్టుబడులూ పరిమితమే. 2019లో ఇటలీకి చైనా ఎగుమతుల విలువ 3500 కోట్ల డాలర్లు; 2022 కల్లా అది 6100 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో చైనాకు ఇటలీ ఎగుమతులు 1450 కోట్ల డాలర్ల నుంచి 1900 కోట్ల డాలర్లకు మాత్రమే పెరిగాయి. ఇటలీ దిగుమతుల్లో చైనా వాటా తొమ్మిది శాతమైతే చైనా దిగుమతుల్లో ఇటలీ వాటా మూడుశాతం మాత్రమే. ఫలితంగా ఇటలీకి చైనాతో వాణిజ్య లోటు పెరిగిపోయింది. ఇటలీ మార్కెట్లను చైనా ఉత్పత్తులు ముంచెత్తాయి.


ఈ పరిణామాలకు తోడు అనేక ఇటాలియన్‌ కంపెనీలను చైనా స్వాధీనం చేసుకుంది. ఇటలీ ప్రభుత్వ కంపెనీలు కూడా చైనా చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఏర్పడింది. వ్యూహపరంగా కీలకమైన అనేక అధునాతన ఇటాలియన్‌ పరిశ్రమలను చైనా స్వాధీనం చేసుకోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం నెలకొంది. తదనుగుణంగా ఇటలీ పార్లమెంటు ఆమోదించిన గోల్డెన్‌ పవర్‌ చట్టాన్ని ఎప్పటికప్పుడు సవరిస్తున్నారు. ఈ చట్టం కింద ఇటాలియన్‌ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడి ప్రతిపాదనలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. మొదట్లో రక్షణ, జాతీయ భద్రతకు సంబంధించిన పరిశ్రమలకు వర్తింపజేసిన గోల్డెన్‌ పవర్‌ చట్టం పరిధిలోకి 5జీ, రోబోటిక్స్‌, మౌలిక వసతులతోపాటు ఆరోగ్యం, ముడి సరకులు, ఫైనాన్స్‌, మీడియా రంగాలనూ చేర్చారు. తరవాత సైనికపరంగా కీలకమైన సాంకేతికతలు చైనా చేతుల్లో పడకుండా, ఇటలీ ప్రభుత్వరంగ సంస్థలను చైనా స్వాధీనం చేసుకోకుండా ఈ చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేశారు. గోల్డెన్‌ పవర్‌ చట్టం ఈయూ దేశాలన్నింటిలో అత్యంత కఠినమైన స్క్రీనింగ్‌ చట్టం. 2021లో సెమీకండక్టర్‌ కంపెనీలను చైనా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇటలీ ప్రభుత్వం అడ్డుకుంది. తరవాత డ్రోన్లు, ఆహారం తదితర రంగాల్లో గతంలోనే కుదిరిన ఒప్పందాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఐ నుంచి వైదొలగాలని ఇటలీ నిర్ణయించడం ఆశ్చర్యం కలిగించదు. చైనా 2013లో ప్రారంభించిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో 100కు పైగా దేశాలు భాగస్వాములయ్యాయి. దీనికింద చైనా భాగస్వామ్య దేశాల్లో లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులతో రోడ్లు, రైల్వేలు, విద్యుత్కేంద్రాలు తదితర మౌలిక వసతులను నిర్మించదలచింది. కానీ, బీఆర్‌ఐలో చేరిన దేశాలు అప్పుల భారం కింద కుంగిపోతున్నాయి. ఈ పరిస్థితిలో బీఆర్‌ఐకి పోటీగా అమెరికా ప్రారంభించిన ఇండియా- పశ్చిమాసియా- ఐరోపా ఆర్థిక కారిడార్‌ ప్రాజెక్టు (ఐమెక్‌) ఇటలీకి ఎక్కువ ఆకర్షణీయం కానున్నది.


- కైజర్‌ అడపా
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గల్ఫ్‌ సీమలో గట్టి దోస్తానా!

‣ ఏకత్వ తాళంలో భిన్నత్వ రాగాలు

‣ కాగ్‌ విశ్వసనీయతకు తూట్లు

‣ మాల్దీవులతో బంధానికి బీటలు

‣ భవితకు భరోసా.. ప్రత్యామ్నాయ ఇంధనాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 29-12-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం