• facebook
  • whatsapp
  • telegram

ఎవరికీ పట్టని ‘పర్యావరణ పరిరక్షణ’



పర్యావరణ అనుమతులు పూర్తిగా మంజూరు కాకుండానే పలు అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలకు ఎక్కుతున్నాయి. కేంద్రం సవరిస్తున్న నిబంధనలు దీనికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇలాంటి సవరణ ఉత్తర్వులను ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం నిలుపుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.


పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 ప్రకారం అభివృద్ధి ప్రాజెక్టుల్లో ప్రకృతి వనరులకు జరిగే నష్ట నియంత్రణకు పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) నిబంధనల అమలు తప్పనిసరి. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలు పర్యావరణ చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని వనశక్తి సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ ఆదేశాలను నిలుపుదల చేస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీచేసింది. ఏళ్ల తరబడి దేశవ్యాప్తంగా అమలులో ఉన్న అటవీ, పర్యావరణ, కోస్తా నియంత్రణ అనుమతుల ప్రక్రియ లోపభూయిష్ఠంగా ఉందనే విమర్శలున్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రైవేటు సంస్థలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అనేక ప్రాజెక్టుల్లో సైతం పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి.


అనుమతులు లేకుండా..

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి, ఉపాధి కల్పన, పరిశ్రమల ఏర్పాటు, ఖనిజాల తవ్వకం, ఆనకట్టల నిర్మాణానికి భూ, అటవీ, జల వనరుల వినియోగం తప్పనిసరి. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న వాతావరణ దుష్ప్రభావాలకు గత వందేళ్లలో జరిగిన పర్యావరణ విధ్వంసమే ప్రధాన కారణమని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రాజెక్టుల వల్ల ప్రకృతి వ్యవస్థలకు జరిగే నష్టాన్ని ముందుగా అంచనా వేసి, దాన్ని భర్తీ చేసే ఖర్చును ప్రాజెక్టుల వ్యయంలో భాగం చేసే పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) ప్రక్రియ కీలకంగా నిలుస్తుంది. ప్రస్తుతం వందకు పైగా దేశాలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఈఐఏ ప్రక్రియను అనుసరిస్తున్నాయి. భారత్‌లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు, ప్రమాదకర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణకు పర్యావరణ అనుమతుల ప్రక్రియను వర్తింపజేయడంలో తీవ్ర జాప్యం జరిగింది. 1984 నాటి భోపాల్‌ విషవాయు దుర్ఘటనతో ప్రభుత్వ వ్యవస్థలు మేల్కొన్నాయి. పరిశ్రమలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులను తప్పనిసరి చేస్తూ 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని, ఆ తరవాత ఈఐఏ మార్గదర్శకాలను అమలులోకి తెచ్చారు. ఈఐఏ ప్రక్రియను చిత్తశుద్ధితో అమలు చేస్తే కాలుష్య తీవ్రతతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు. వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ప్రైవేటు సంస్థల అవసరాల ముందు ప్రకృతి వ్యవస్థల పరిరక్షణకు ప్రాధాన్యం దక్కడం లేదు. పైగా ప్రభుత్వ అనుమతులు వేగంగా మంజూరు అవుతున్నాయి. ఈ ప్రక్రియను మరింత సరళతరం చేయడానికి మూడేళ్ల క్రితం చేసిన ప్రయత్నాలు వివాదాస్పదమవడంతో కేంద్రం వెనక్కు తగ్గింది. ప్రాజెక్టులకు అనుమతులిచ్చే ప్రక్రియలో జాప్యం జరుగుతుందనే నెపంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2006 నుంచి 2023 మధ్య కాలంలో 110 సార్లు ఈఐఏ నిబంధనల్లో మార్పులు తెచ్చింది. ఒక్క 2022లోనే 36 సార్లు మార్పులు చేశారు. ఇందులో భాగంగా పూర్తిస్థాయి అనుమతులు లేకుండా పనులు మొదలుపెట్టే స్వేచ్ఛను కల్పించారు. ఇది సుప్రీంకోర్టు దృష్టికి రావడంతో వాటిని నిలిపివేస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈఐఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు చేపట్టే ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుమతులు తప్పనిసరి. అటవీ భూముల బదలాయింపునకు అటవీ పరిరక్షణ చట్టం, ప్రత్యామ్నాయ వనీకరణ చట్టం వర్తిస్తాయి. తీరప్రాంతాల్లో ప్రాజెక్టులకు కోస్తా నియంత్రణ, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ నిబంధనలు, ప్రజా భద్రత చట్టం, జీవవైవిధ్య పరిరక్షణ చట్టం, ట్రైబ్యునళ్లు ఇచ్చిన తీర్పులు వర్తిస్తాయి. ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతం గిరిజన ప్రాంతాల్లో ఉంటే గ్రామసభలను, అటవీ హక్కుల గుర్తింపు కమిటీలను సంప్రదించాలి. ప్రాజెక్టుకు అనుమతులు దక్కిన తరవాత నిబంధనలను ఎలా పాటిస్తున్నారన్న దానిపై యాజమాన్యాలు ఆరు నెలలకోసారి నివేదికలు ఇవ్వాలి. వాటిని నిపుణుల కమిటీలు పర్యవేక్షించాలి. ఈ ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోంది.


వ్యవస్థల బలోపేతం అత్యవసరం

సహజ వనరుల వినియోగంలో అడ్డగోలుగా నియమాలను ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వ్యవస్థలు విఫలమవుతున్నాయి. 2019-22 మధ్య పర్యావరణ నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 1737 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో 39 మందికే శిక్షలు పడ్డాయి. మూడేళ్ల క్రితం విశాఖలో ఎల్‌జీ పాలిమర్‌ విషవాయు ప్రమాదం 12 మందిని పొట్టనపెట్టుకుంది. ఈ ఘటనపై నియమించిన కేంద్ర, రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీలతో పాటు, హరిత ట్రైబ్యునల్‌ సైతం పర్యావరణ అనుమతుల మంజూరులో డొల్లతనాన్ని పట్టిచూపింది. పర్యావరణ నష్టాన్ని నియంత్రించడానికి ఏర్పాటైన జాతీయ హరిత ట్రైబ్యునళ్లు దేశ రాజధానితో సహా వివిధ ప్రాంతాల్లో అయిదు చోట్లే ఉన్నాయి. ఇవి పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరించలేకపోతున్నాయి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక్కో హరిత ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చట్టం ప్రకారం ప్రకృతి వ్యవస్థల పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం ప్రభుత్వాలు, పరిశ్రమల బాధ్యత. ఇకనైనా ఈఐఏ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలి. ఉల్లంఘనలను వేగంగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నష్టాల భర్తీ చర్యలు చేపట్టాలి. పర్యావరణ అనుమతుల ప్రక్రియ పటిష్ఠ అమలుకు అవసరమైన సిబ్బంది, నిపుణులను నియమించి సాంకేతిక, ఆర్థిక వనరులనూ సమకూర్చాలి.


భారీగా జరిమానాలు

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు క్షేత్రస్థాయిలో తగినన్ని వ్యవస్థాగత ఏర్పాట్లు లేకపోవడం వల్ల అనేక చట్టాలతో ముడివడ్డ అనుమతుల ఉల్లంఘనలను గుర్తించడం క్లిష్టంగా మారింది. సగటున దేశవ్యాప్తంగా ఏటా రెండు వేల ప్రాజెక్టులకు వివిధ అనుమతులు మంజూరవుతున్నాయి. వీటితో పాటు అప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి పర్యావరణ మంత్రిత్వ శాఖలో దాదాపు ఎనభై మంది సిబ్బందే పనిచేస్తున్నారు. అనుమతుల ఉల్లంఘనపై పౌర సమాజం, సేవా సంస్థలు- హరిత ట్రైబ్యునళ్లను, న్యాయస్థానాలను ఆశ్రయిస్తే తప్ప స్పందన ఉండటం లేదు. అప్పటికే చాలా నష్టం జరిగిపోతోంది. 2022-23లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల్లో పర్యావరణ చట్ట నిబంధనల అతిక్రమణలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ రూ.79 వేల కోట్ల జరిమానాలు విధించింది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎన్నికల వేళ.. ఎటూ తేల్చుకోలేక

‣ ఆసియాన్‌తో డ్రాగన్‌కు ముకుతాడు

‣ ఇటు శాంతి మంత్రం.. అటు రణతంత్రం

‣ నూతన విధానాలతో ఎగుమతులకు ఊతం

‣ చైనాతో జతకడితే.. అంతే!

‣ గల్ఫ్‌ సీమలో గట్టి దోస్తానా!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 12-01-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం