• facebook
  • whatsapp
  • telegram

ఆసియాన్‌తో డ్రాగన్‌కు ముకుతాడు



ఒకటిన్నర దశాబ్దాల క్రితం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)లో నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని భారత్‌, ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌) సంకల్పించాయి. ఇందుకోసం ఫిబ్రవరి 18, 19 తేదీల్లో దిల్లీలో చర్చలు జరపనున్నాయి. వాణిజ్య లోటును తొలగించడంతోపాటు చైనా వంటి ఇతర దేశాల్లో తయారైన సరకులను ఆగ్నేయాసియా దేశాల మీదుగా భారత్‌కు ఎగుమతి చేయడాన్ని నిరోధించడంపైనా దృష్టి సారించనున్నారు.


ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌)తో భారత్‌ 2009లో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ‘ఆసియాన్‌-ఇండియా సరకుల వ్యాపార ఒప్పందం (ఐటీగా)’అని పిలుస్తారు. కాలక్రమంలో భారత్‌కు ఆసియాన్‌ దేశాలతో వాణిజ్య లోటు బాగా పెరిగిపోయింది. దాంతో ఐటీగాను సమీక్షించాలని కొంతకాలంగా ఇండియా కోరుతోంది. 2025కల్లా ఆ ఒప్పందంపై సమీక్ష చర్చలను పూర్తిచేయాలని నిరుడు ఆగస్టులో ఇండొనేసియాలో జరిగిన భేటీ సందర్భంగా భారత్‌, ఆసియాన్‌ దేశాల వాణిజ్య మంత్రులు నిర్ణయించారు. ఆ దిశగా ఇప్పుడు చర్చలు జోరందుకొన్నాయి.


ఎగుమతులకు అడ్డంకులు

భారత్‌కు 2009లో ఆసియాన్‌తో దాదాపు 800 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు ఉండేది. అది 2017కల్లా 1,000 కోట్ల డాలర్లకు పెరిగి, ఇప్పుడు 4,400 కోట్ల డాలర్లకు చేరింది. 2008-09లో భారత్‌ నుంచి ఆసియాన్‌ దేశాలకు 1,910 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఆ విలువ 2022-23లో 4,400 కోట్ల డాలర్లకు పెరిగింది. అదేకాలంలో ఆసియాన్‌ నుంచి భారత్‌కు దిగుమతులు 2,620 కోట్ల డాలర్ల నుంచి 8,760 కోట్ల డాలర్లకు ఎగబాకాయి. భారతీయ సరకులకు ఆసియాన్‌ దేశాల్లో సరైన మార్కెట్‌ లభించడం లేదు. ఒప్పందంలో లేని దేశాల సరకులను నిరోధించడానికి పాటించాల్సిన నిబంధనలను రూల్స్‌ ఆఫ్‌ ఆరిజిన్‌ (ఆర్‌ఓఓ) అంటారు. వీటితో పాటు దిగుమతి నియంత్రణలు, సుంకాలతో నిమిత్తంలేని ఇతర అడ్డంకులు- భారత్‌ నుంచి ఎగుమతులకు అవరోధంగా పరిణమించాయి. ఎఫ్‌టీఏ కింద ఇండియా ఇస్తున్నన్ని రాయితీలను ఆసియాన్‌ దేశాలు భారత్‌కు కల్పించడం లేదు. భారతీయ ఉక్కు ఉత్పత్తులు, ఔషధాలకు ఆసియాన్‌ దేశాల్లో సరైన మార్కెట్‌ లభించడం లేదు. మలేసియా, ఇండొనేసియాల నుంచి పామాయిల్‌ మాత్రం భారత్‌లోకి భారీగా దిగుమతి అవుతోంది. వియత్నాం, మలేసియాల నుంచి ఎలెక్ట్రానిక్‌ ఎగుమతులూ వెల్లువెత్తుతున్నాయి. ఇది చాలదన్నట్లు చైనాలో తయారైన సెట్‌టాప్‌ బాక్సుల వంటి ఉపకరణాలు ఆసియాన్‌ దేశాల ద్వారా భారత్‌లోకి వచ్చిపడుతున్నాయి.


స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జరిగే సమీక్షలో మార్కెట్‌ లభ్యత, రూల్స్‌ ఆఫ్‌ ఆరిజిన్‌ (ఆర్‌ఓఓ) గురించి చర్చిస్తారు. చైనా వంటి మూడో దేశం నుంచి ఆసియాన్‌ దేశాల మీదుగా భారత్‌కు వచ్చే సరకులకు సుంకంలో రాయితీలను ఇవ్వడం తీవ్ర నష్టం కలిగిస్తోంది. 2018-19లో వియత్నాం, మలేసియాల నుంచి ఉన్నపళాన ఎలెక్ట్రానిక్స్‌ దిగుమతులు పెరగడంతో ఎఫ్‌టీఏ దుర్వినియోగమవుతోందని భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దిగుమతుల వెనక చైనా హస్తముందని అనుమానించింది. పారిశ్రామిక ఉత్పత్తుల్లో కనీసం 35శాతం ఆసియాన్‌ దేశాల్లోనే తుదిరూపు సంతరించుకుని, తయారు కావాలి. ఈ రెండు నిబంధనలను నెరవేరిస్తేనే ఆసియాన్‌ దేశాల ఎగుమతులకు భారత్‌ సుంకంలో రాయితీలను ఇవ్వాలి. భారత్‌-ఆసియాన్‌ చర్చల్లో ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఆర్‌ఓఓను పటిష్ఠపరచాలని భారత్‌ కోరుతోంది. తద్వారా ఆసియాన్‌తో వాణిజ్య లోటును తగ్గించుకోవడం, స్వదేశీ కంపెనీలు ఆసియాన్‌కు ఎగుమతులను పెంచడం సాధ్యపడుతుంది. పర్యావరణ హితకరమైన రీతిలో ఉత్పత్తి, వ్యాపారాలను సాగించడం... సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలు మాత్రం ఐటీగా చర్చల్లో ప్రస్తావనకు రాబోవడం లేదు.


1967లో రూపుదిద్దుకున్న ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్‌)లో మలేసియా, సింగపూర్‌, ఇండొనేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌, బ్రునై, కంబోడియా, లావోస్‌, మయన్మార్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. 1991లో తూర్పువైపు చూపు, 2014లో తూర్పు దిశగా కార్యాచరణ విధానాలను చేపట్టిన భారత్‌- ఆసియాన్‌ దేశాలతో ఆర్థిక, వ్యూహపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇది ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ ప్రాబల్య విస్తరణకు దోహదపడుతుంది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడం ద్వారా భారత్‌ను ఆర్థికంగా పటిష్ఠ పరచుకోవాలన్నది ప్రభుత్వ యోచన. ఈశాన్య భారత రాష్ట్రాలకు ఆసియాన్‌ దేశాలతో వాణిజ్య బంధాన్ని విస్తరించడానికి కేంద్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకొంటోంది. దీనివల్ల ఈశాన్య భారతం ఆర్థికంగా పురోగమిస్తుంది. ఈ రాష్ట్రాల్లో చైనా పన్నాగాలను అడ్డుకోవడమూ సాధ్యపడుతుంది. భారత్‌ ప్రధానంగా సముద్ర మార్గంలో వాణిజ్యం సాగిస్తోంది. ఇండొనేసియా నుంచి జపాన్‌ వరకు సరకుల ఎగుమతి, దిగుమతులకు సముద్ర మార్గాలే శరణ్యం. ఈశాన్య భారతం నుంచి భూమార్గంలో ఆసియాన్‌కు వాణిజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తూనే... ఇండో-పసిఫిక్‌ వ్యూహం ద్వారా సముద్ర వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికీ భారత్‌ నడుం కట్టింది. సార్క్‌, బిమ్‌స్టెక్‌ బృందాలకూ ఆసియాన్‌కూ మధ్య వారధిగా నిలవాలని లక్షిస్తోంది.


వాణిజ్య విస్తరణకు అవకాశాలు

ఈశాన్య భారత రాష్ట్రాల్లో మౌలిక వసతులను పెంపొందించి, ఆసియాన్‌ దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించడం- ఆ రాష్ట్రాల ఆర్థిక పురోగతికి ఎంతగానో తోడ్పడుతుంది. ఆసియాన్‌తో వాణిజ్య లోటు తగ్గడానికి సైతం దోహదపడుతుంది. సరకుల ఎగుమతి దిగుమతుల్లో హెచ్చుతగ్గులను నివారించడమే కాదు, భవిష్యత్తులో సేవల రంగంలో వాణిజ్యాన్ని విస్తరించడంపైనా భారత్‌ ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇండియా నుంచి టెలికమ్యూనికేషన్లు, ఐటీ, ఐటీఆధారిత సేవలు, విద్యా వైద్య సేవల ఎగుమతులను పెంచుకోవాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింతగా అభివృద్ధిపరచాలి. ఇది భారత్‌ సర్వతోముఖ ఆర్థిక ప్రగతికి చోదకశక్తి అవుతుంది.


ఎదుగుదలకు అవరోధం

భారత్‌తో పోలిస్తే చైనాతోనే ఆసియాన్‌ దేశాలకు విస్తృతమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. ఆసియాన్‌తో ఒప్పందాన్ని అనుసరించి భారతీయ కంపెనీలు ప్రధానంగా మూల ఉత్పాదక యంత్రాలను, ముడిసరకులను, పూర్తిస్థాయిలో తయారుకాని ఉత్పత్తులను ఆసియాన్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఇది మన తయారీ సంస్థల ఎదుగుదలను నిరోధిస్తోంది. ముఖ్యంగా రసాయనాలు, లోహాల ఉత్పత్తిదారులకు నష్టం కలిగిస్తోంది. ఈ సమస్యలను అధిగమించడం ఇండియాకు ఎంతో అవసరం.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇటు శాంతి మంత్రం.. అటు రణతంత్రం

‣ నూతన విధానాలతో ఎగుమతులకు ఊతం

‣ చైనాతో జతకడితే.. అంతే!

‣ గల్ఫ్‌ సీమలో గట్టి దోస్తానా!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 12-01-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం