• facebook
  • whatsapp
  • telegram

ఎన్నికల వేళ.. ఎటూ తేల్చుకోలేక‘నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా’ అని త్యాగరాజు ప్రశ్నించారు. ఈ కీర్తనలో నిధి పదానికి బదులు ఓటును చేరిస్తే, అయోధ్య విషయంలో కాంగ్రెస్‌ డోలాయమాన స్థితి ఏమిటో అర్థమవుతుంది. త్వరలో అక్కడ జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్ళాలా వద్దా? వెళితే మైనారిటీ వర్గం నుంచి వ్యతిరేకత ఎదురవుతుందేమో... వెళ్ళకపోతే మెజారిటీ వర్గం దూరమవుతుందేమోననే సందిగ్ధత ఆ పార్టీలో నెలకొంది.


అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి హాజరయ్యే విషయంలో కాంగ్రెస్‌కు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. అసలు ఈ వేడుకకు ఆహ్వానం అందకపోతే బాగుండేదని కాంగ్రెస్‌ అగ్ర నాయకులు భావించినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఆహ్వానం అందకపోయి ఉంటే రామమందిర ప్రారంభోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ కార్యక్రమంగా మార్చేశారని విమర్శలు గుప్పించడానికి అవకాశం చిక్కేది. మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయం చేశారని తప్పు పట్టడానికి వీలయ్యేది. తీరా జనవరి 22నాటి ప్రారంభోత్సవానికి హాజరు కావలసిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ లోక్‌సభా పక్ష నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌధరిలకు ఆహ్వానం పంపింది. దాంతో ఏదో ఒకటి తేల్చుకోవలసిన అగత్యం కాంగ్రెస్‌ నేతలకు వచ్చిపడింది.


కాంగ్రెస్‌ డోలాయమానం

రామమందిరంలో మూల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠకు రావలసిందిగా విశ్వ హిందూ పరిషత్‌ తమకు పంపిన ఆహ్వానాన్ని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తిరస్కరించారు. వ్యక్తిగతంగా జరగాల్సిన మతపరమైన కార్యక్రమాన్ని భాజపా రాజకీయం చేస్తోందని ఆయన విమర్శించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖీ దీనికి స్పందిస్తూ ‘శ్రీరామచంద్రుడికి ప్రీతిపాత్రులైనవారు మాత్రమే అయోధ్యలో ఆయన దర్శనం చేసుకోగలుగుతారు’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రామాలయ కార్యక్రమానికి రావడం లేదని తెగేసి చెప్పడంవల్ల సీపీఐ(ఎం)కు వచ్చే నష్టమేమీ లేదు. మార్క్సిస్టులు మొదటి నుంచీ మతానికి వ్యతిరేకులే. దేవుడి ఉనికిని వారు విశ్వసించరు. పైగా రామభక్తులు అధికంగా కనిపించే హిందీ రాష్ట్రాల్లో సీపీఐ(ఎం)కు బలం లేదు. కాబట్టి, అయోధ్య ఉత్సవానికి వెళ్ళినా లేకున్నా ఓట్లు, సీట్ల పరంగా ఆ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదు. కేరళలో మాత్రం వివిధ మత వర్గాలతో, ముఖ్యంగా ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌(ఐయూఎంఎల్‌)కు చెందిన ఒక వర్గంతో సీపీఐ(ఎం)కు బలమైన పొత్తు ఉంది. నాస్తిక పార్టీకి చెందిన సీతారాం ఏచూరి ఆస్తికుల కార్యక్రమానికి రారని తెలిసినప్పటికీ, ఆయనకు లాంఛనంగా ఆహ్వానం పంపారు. దాన్ని ఆయన ఎటువంటి ఆర్భాటం చేయకుండా తోసిపుచ్చారు. కానీ, కాంగ్రెస్‌ పరిస్థితి ఇందుకు భిన్నమైనది. తమ అధినాయకురాలు సోనియా గాంధీ అయోధ్యకు వెళ్ళే అవకాశముందని, తుది నిర్ణయాన్ని రామమందిర ప్రారంభోత్సవానికి కొంచెం ముందుగా ప్రకటిస్తామని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఇటీవల ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఒకవేళ ఈ కార్యక్రమానికి హాజరు కాదలచుకోలేకపోతే హస్తం పార్టీ పెద్దగా హడావుడి చేయకుండా అయోధ్యకు దూరంగా ఉండిపోవచ్చు. మొత్తం మీద అయోధ్యకు వెళ్ళవద్దని కాంగ్రెస్‌పై మైనారిటీ వర్గం నుంచి ఒత్తిడి వస్తున్న మాట నిజం. ఉత్తర భారతంలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు చాలా ముఖ్యం. అయోధ్యకు వెళ్ళే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాన్చడంపై కేరళలో ఆ పార్టీ భాగస్వామి అయిన ఐయూఎంఎల్‌ నిరసిస్తోంది. భాజపా వలలో పడవద్దని కాంగ్రెస్‌కు ఆ పార్టీ హితవు చెబుతోంది. పూర్వ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను అయోధ్యకు ఆహ్వానించినా, అనారోగ్యంవల్ల ఆయన వెళ్ళలేకపోవచ్చు.


భాజపా ఒకవైపు హిందూ తురుఫు ముక్కను ఎన్నికల లబ్ధి కోసం బాహాటంగానే ప్రయోగిస్తుంటే, కాంగ్రెస్‌ ఎటూ తేల్చుకోలేక డోలాయమాన స్థితిలో ఊగిసలాడుతోంది. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్‌నాథ్‌ తాను హనుమాన్‌ భక్తుడినని చెప్పుకొన్నారు. రామ మందిర నిర్మాణానికి ఆయన అయిదు వెండి ఇటుకలను విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ, ఈ మృదు హిందుత్వ పంథా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు విజయం తెచ్చిపెట్టలేకపోయింది. అయోధ్యలో రామమందిర స్థలాన్ని ముస్లిముల ఆధీనం నుంచి విడిపించడానికి దీర్ఘకాలంపాటు సాగిన ఉద్యమంపై కాంగ్రెస్‌ గోడమీది పిల్లి వాటం ప్రదర్శించడం హిందువులకు ఏమాత్రం నచ్చలేదు. 1989 పార్లమెంటు ఎన్నికలకు ముందు రాజీవ్‌ గాంధీ అయోధ్యలో శిలాన్యాస్‌ కార్యక్రమానికి అనుమతి ఇచ్చారు. అయోధ్యలో రాముడి జన్మ స్థలానికి సమీపంలోని ఫైజాబాద్‌లో ప్రసంగిస్తూ రామ రాజ్యాన్ని తెస్తానని రాజీవ్‌ ప్రకటించారు. అయినా అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటర్ల మన్నన పొందలేకపోయింది.


ఘనంగా ఏర్పాట్లు

కేంద్రంలోని భాజపా సర్కారు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక ఆడియో వీడియో సాంకేతికతలతో ఈ కార్యక్రమాన్ని కోట్లమంది ఆస్తికులు, నాస్తికులు వీక్షించే అవకాశం కల్పిస్తోంది. ఇకపై ఏటా లక్షల మంది భక్తులు అయోధ్యకు వచ్చి రాముడి దర్శనం చేసుకోనున్నారు. వారి కోసం ఇక్కడ అన్ని వసతులను ఘనంగా ఏర్పాటు చేశారు. కొత్త విమానాశ్రయాన్ని, రైల్వేస్టేషన్‌ను కొలువుదీర్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే రామ మందిరం సాకారం కావడం భాజపాకు కలిసివచ్చే అంశమే. అయోధ్య రామాలయ నిర్మాణ ఘనతను అందిపుచ్చుకోలేక, దాన్ని నిర్మించిన భాజపాను నిందించలేక కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. రామ మందిరం లోక్‌సభ ఎన్నికల్లో తనకు విజయ పతాక అవుతుందని కాషాయ పార్టీ ఆశిస్తోంది.


చెప్పలేక  వెళ్ళలేక

అయోధ్యలో రామాలయ ఆరంభోత్సవానికి రాబోమని, రాలేమని తెగేసి చెప్పగల స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు లేరు. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతారు. రామ మందిరంలో మూల విరాట్టుల ప్రాణ ప్రతిష్ఠకు కాంగ్రెస్‌ నేతలు హాజరైతే ఉత్తర హిందుస్థానంలోని ముస్లిముల ఆగ్రహానికి గురికావలసి రావచ్చు. ఒకవేళ హాజరు కాకపోతే కాంగ్రెస్‌ పార్టీ హిందువులకు వ్యతిరేకమని చాటే అవకాశాన్ని చేతులారా భారతీయ జనతా పార్టీకి అందించినట్లవుతుంది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆసియాన్‌తో డ్రాగన్‌కు ముకుతాడు

‣ ఇటు శాంతి మంత్రం.. అటు రణతంత్రం

‣ నూతన విధానాలతో ఎగుమతులకు ఊతం

‣ చైనాతో జతకడితే.. అంతే!

‣ గల్ఫ్‌ సీమలో గట్టి దోస్తానా!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 12-01-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని