• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగమే రక్షణ ఛత్రంభారత రాజ్యాంగం ఈ ఏడాది 75వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. 1947కు ముందు నుంచే వందేళ్లపాటు భారతీయులు స్వాతంత్య్రం కోసం వివిధ రూపాల్లో జరిపిన పోరాటాల ఫలమే మన రాజ్యాంగం. రాజ్యాంగ నిర్మాణ సభ 1946 డిసెంబరు నుంచి 1949 నవంబరు వరకు రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనను నిర్వహించింది. 1950 జనవరి 26న భారత్‌ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.


జాతీయోద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించినప్పటి నుంచి బ్రిటిష్‌ సామ్రాజ్యం కూసాలు కదలి నేలమట్టమైంది. స్వాతంత్య్ర ఉద్యమంలో జనబాహుళ్యాన్ని క్రియాశీల భాగస్వాములను చేసిన ఘనత కచ్చితంగా మహాత్ముడిదే. స్వాతంత్య్రానికి పూర్వం 40శాతం భారత భూభాగం 565 రాజ సంస్థానాల కింద ఉండేది. అక్కడ 23శాతం జనాభా నివసించేది. మరికొంత భూభాగం పోర్చుగల్‌, ఫ్రాన్స్‌ దేశాల చేతిలో ఉండేది. క్రమంగా ఈ భూభాగాలన్నీ భారత రిపబ్లిక్‌లో అంతర్భాగమయ్యాయి. భారతదేశ సామాజిక, ఆర్థిక రూపాంతరీకరణకు రాజ్యాంగం సారథ్యం వహించినప్పటికీ- అది పాతబడిపోయిందని, కాలానుగుణంగా మారలేదనే విమర్శలు ఇటీవల వినిపిస్తున్నాయి. దీన్ని తిరగరాయాలనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అమెరికా రాజ్యాంగం 200 ఏళ్ల నుంచీ అమలులో ఉంది. జపాన్‌, కొన్ని ఐరోపా దేశాలు మనతోపాటు, లేదంటే కాస్త ముందుగానే రాజ్యాంగాలను రూపొందించుకున్నాయి. దాదాపుగా 1940-1970 మధ్య వలస పాలన నుంచి విముక్తమైన అనేక దేశాలు దీర్ఘకాలం నియంతృత్వంలోకి జారిపోయాయి. భారత్‌లో మాత్రం ప్రజాస్వామ్యం బలంగా నిలబడింది. ఇందుకు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితోపాటు రాజ్యాంగం ఇచ్చిన దన్ను కూడా మూలకారణం.


మార్పుచేర్పుల తరవాతే..

భారత రాజ్యాంగ ముసాయిదా రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సారథ్యంలో రాజ్యాంగ నిర్మాణసభ పలుమార్లు సమావేశమై ముసాయిదా రచనను పూర్తిచేసింది. ప్రాథమిక హక్కులు, రాష్ట్రాల అధికారాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి రాజ్యాంగంలో పొందుపరచాల్సిన అధికరణలపై ఉప సంఘాలు విస్తృతంగా చర్చించాయి. వాటి సిఫార్సులను క్షుణ్నంగా పరిశీలించిన తరవాతే ఆయా అధికరణలను రాజ్యాంగంలో చేర్చారు. రాజ్యాంగ ముసాయిదాలో ప్రతి వాక్యం, అందులోని పదాల కూర్పు భావితరాలపై చూపగల ప్రభావాన్ని లోతుగా పరిశీలించిన మీదటే వాటిని ఖరారు చేసి రాజ్యాంగంలో పొందుపరచారు. సమాఖ్య స్ఫూర్తి, న్యాయపాలన పట్ల నిబద్ధత, కేంద్ర రాష్ట్రాల మధ్య నిధులు-అధికారాల విభజన, ప్రాథమిక హక్కులు, వాటిపై తగిన నియంత్రణలు, దేశ ప్రజలకు అభివృద్ధి ఫలాల సమాన పంపిణీ, బడుగు బలహీన వర్గాల సాధికారతలకు రాజ్యాంగం భరోసా ఇచ్చింది. రాష్ట్రాల ప్రయోజనాల రక్షణకు ప్రాధాన్యమిచ్చింది. అవసరమైనప్పుడు రాజ్యాంగానికి సవరణలు చేసుకునే వెసులుబాటును సైతం కల్పించింది. రాజ్యాంగ నిర్మాణ సభ చర్చోపచర్చలతో ముసాయిదాలో 2,475 సార్లు మార్పుచేర్పులు చేసిన తరవాతే రాజ్యాంగం తుదిరూపు సంతరించుకొంది. శాసన, పాలన వ్యవస్థలను కొద్దిమంది గుప్పిట్లోకి తీసుకుంటే జరిగే నష్టమేమిటో అంబేడ్కర్‌ నాయకత్వంలోని రాజ్యాంగ నిర్మాణ సభ గుర్తించింది. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సమానత్వాన్ని కాపాడటంలో న్యాయవ్యవస్థకు కీలక పాత్రను కట్టబెట్టింది. ప్రాథమిక హక్కులకు రక్షా కవచమైన 32వ అధికరణ భారత రాజ్యాంగానికి హృదయం, ఆత్మ అని అంబేడ్కర్‌ వర్ణించారు. ఇటీవలి కాలంలో ప్రాథమిక హక్కులపై పదేపదే దాడులు జరుగుతున్నప్పటికీ, దేశంలో నియంతృత్వం ఏర్పడకుండా అడ్డు నిలుస్తున్నవి రాజ్యాంగంలో 12 నుంచి 35వ అధికరణ వరకు ఉల్లేఖించిన ప్రాథమిక హక్కులే. ఈ హక్కులకు భంగం కలగకుండా చూసే బాధ్యతను హైకోర్టులు, సుప్రీంకోర్టు సమర్థంగా నెరవేరుస్తున్నాయి.


పార్టీ ప్రయోజనాలకు, సంకుచిత ప్రయోజనాలకు అతీతంగా రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత పార్లమెంటుపైనా ఉంది. కానీ, ఆ బాధ్యతా నిర్వహణ సక్రమంగా సాగకపోవడంతో పార్లమెంటరీ వ్యవస్థ విశ్వసనీయతపై నీలినీడలు ప్రసరిస్తున్నాయి. రాజ్యాంగ ధర్మాసనాల అధికారాలకు కత్తెర వేసే చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆశ్రితులు, ఉద్యోగ విరమణ చేసిన అంతేవాసులు, రాజకీయ నిరుద్యోగులతో ట్రైబ్యునళ్లను నియమించే పద్ధతి పెరిగిపోయింది. సమాఖ్య పద్ధతికి తిలోదకాలిచ్చి కేంద్రీకృత వ్యవస్థను తీసుకువచ్చే ప్రయత్నమిది. కేంద్ర ప్రభుత్వం పోనుపోను రాష్ట్రాల అధికారాలను కబళించాలని చూడటం ఆందోళనకర పరిణామం. రాష్ట్రాలు కూడా రాజ్యాంగం తమకిచ్చిన అధికారాలను వదులుకొంటూ కేంద్ర పెత్తనానికి తలొగ్గడం కనిపిస్తోంది. వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) విషయంలో ఇదే జరిగింది. రాష్ట్రాలు కూడా స్థానిక సంస్థల అధికారాల్లో జోక్యం చేసుకుంటున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే చట్టాలను తెస్తున్నాయి.


కర్తవ్యమేమిటి?

ప్రజలకు చెందిన వనరులను ప్రైవేటు రంగానికి కట్టబెట్టే ధోరణి ఇటీవల ప్రబలింది. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడానికి 44వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం పెద్ద తప్పు. రష్యా, చైనాల్లో సంపన్నుల ఆస్తులను మాత్రమే ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం కనిపిస్తుంది. భారత్‌లో ప్రభుత్వాలు ప్రైవేటు రంగాలకు ప్రజా ఆస్తులను కట్టబెట్టే విధానాలను చేపడుతున్నాయి. ఇదంతా ప్రజా ప్రయోజనాల కోసమేనన్న కట్టుకథను ముందుకుతెస్తున్నాయి. ఇటీవలి కాలంలో డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దాన్ని కూడా కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే ప్రయత్నమే.


సమాఖ్య స్ఫూర్తికి పట్టం

కొందరు సభ్యులు కేంద్రీకృత వ్యవస్థ కోసం పట్టుపట్టినా రాజ్యాంగ నిర్మాణ సభ సమాఖ్య వ్యవస్థకే మొగ్గు చూపింది. రాష్ట్రాలకు మరిన్ని నిధులు, అధికారాలు, హక్కులు లభించేలా వికేంద్రీకరణకు ఓటు వేసింది. వేర్పాటువాద, విచ్ఛిన్నకర ధోరణులకు పగ్గాలు వేసే నియమ నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరచింది. రాష్ట్రాలకు తగిన నిధులు అందిస్తేనే సమతుల్య ఆర్థికాభివృద్ధి సాధ్యమనే గ్రహింపు రాజ్యాంగంలో ప్రతిబింబించింది. భిన్నత్వంలో ఏకత్వానికి పట్టం కట్టడం వల్లే హిందీ భాషను హిందీయేతరులపై రుద్దకుండా సంయమనం పాటించింది. హిందీతోపాటు ఆంగ్లాన్నీ అధికార భాషగా గుర్తించింది.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అడుగంటుతున్న జలాశయాలు

‣ స్వచ్ఛత కొరవడిన సర్వేక్షణ్‌

‣ భారత్‌ - యూకే వ్యూహాత్మక సహకారం

‣ చిప్‌ తయారీకి నయా చిరునామా

‣ ఎవరికీ పట్టని ‘పర్యావరణ పరిరక్షణ’

‣ ఎన్నికల వేళ.. ఎటూ తేల్చుకోలేక

‣ ఆసియాన్‌తో డ్రాగన్‌కు ముకుతాడు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 29-01-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని