• facebook
  • whatsapp
  • telegram

స్వచ్ఛత కొరవడిన సర్వేక్షణ్‌స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023 పోటీలో దేశంలోని నగరాలు, పట్టణాల ర్యాంకులను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇటీవల ప్రకటించింది. ఈ ర్యాంకులపై ఎప్పటి నుంచో పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇవి నగరాలు, పట్టణాల్లోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టడంలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


ఇటీవలి స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకింగుల్లో దేశంలోని పది అగ్రశ్రేణి పరిశుభ్ర నగరాల జాబితాలో ఇందౌర్‌, సూరత్‌లు సంయుక్తంగా మొదటి స్థానాన్ని దక్కించుకొన్నాయి. ఇందౌర్‌ తొలి స్థానంలో నిలవడం ఇది వరసగా ఏడోసారి. లక్షకు పైగా జనాభా కలిగిన పరిశుభ్ర నగరాల జాబితాలో తరవాతి స్థానాల్లో వరసగా నవీ ముంబయి, గ్రేటర్‌ విశాఖ, భోపాల్‌, విజయవాడ, న్యూదిల్లీ, తిరుపతి, హైదరాబాద్‌, పుణే నిలిచాయి. రాష్ట్రాల వారీగా ర్యాంకుల్లో మహారాష్ట్ర మొదటి స్థానం దక్కించుకుంది. లక్షకు తక్కువ జనాభా కలిగిన నగరాల విభాగంలోనూ ర్యాంకులు కేటాయించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే- టాప్‌టెన్‌ జాబితాలో విశాఖ నాలుగో స్థానం, విజయవాడ ఆరు, తిరుపతి ఎనిమిది, హైదరాబాద్‌ తొమ్మిదో స్థానాల్లో నిలిచాయి. చెత్త రహిత నగరాల్లో హైదరాబాద్‌ ఫైవ్‌ స్టార్‌ రేటింగును సాధించింది. ఇవేకాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు మధ్య, చిన్న శ్రేణి నగరాలు జోనల్‌ అవార్డులను అందుకున్నాయి.


వాస్తవ పరిస్థితులు భిన్నం

స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరుతో నగరాలు, పట్టణాల మధ్య పారిశుద్ధ్య పోటీని 2016 నుంచి ప్రతి ఏటా స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. సుస్థిర పారిశుద్ధ్యాన్ని, వ్యర్థాల నిర్వహణలో పోటీతత్వంతో ఉన్నత ప్రమాణాలను సాధించడం స్వచ్ఛ సర్వేక్షణ్‌ ముఖ్య ఉద్దేశం. 2016లో 73 ప్రధాన నగరాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2023 నాటికి దేశంలోని 4,447 నగరాలు, పట్టణాలకు విస్తరించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా పారిశుద్ధ్య పరిశీలన, ర్యాంకుల నిర్ధారణకు థర్డ్‌పార్టీ మూల్యాంకన వ్యవస్థను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి ర్యాంకులు కేటాయిస్తారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణ, శుద్ధి, బహిరంగ మల విసర్జన నిర్మూలన వంటివి స్వచ్ఛ సర్వేక్షణ్‌ మార్కుల సాధనలో కీలకంగా నిలుస్తాయి.


పారిశుద్ధ్యం పరంగా నగరాలు, పట్టణాల పనితీరును ర్యాంకుల రూపంలో నిర్ణయిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీ పలు సందేహాలకు తావిస్తోంది. ర్యాంకుల మూల్యాంకనంలో లోపాలున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ర్యాంకులకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన కుదరడం లేదని కొన్ని ప్రభుత్వ నివేదికలూ స్పష్టం చేస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేకు రెండు మూడు నెలల ముందు పారిశుద్ధ్య కార్యకలాపాలు చేపట్టిన నగరాలకే ఎక్కువ అవార్డులు దక్కాయని, ఎన్నో ఏళ్లుగా ఇంటింటి చెత్త సేకరణ, పునశ్శుద్ధి, పునర్వినియోగానికి కృషి చేస్తున్న నగరాలు, పట్టణాలకు పోటీలో తక్కువ ర్యాంకులు లభించాయని 2019 స్వచ్ఛ సర్వేక్షణ్‌పై 50 నగరాల్లో శాస్త్రవిజ్ఞాన, పర్యావరణ కేంద్రం జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. సర్వే పూర్తయిన తరవాత పారిశుద్ధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ నివేదిక తేల్చింది. సర్వే కోసం సమర్పించవలసిన పత్రాలను కొన్ని పురపాలికలు పకడ్బందీగా, ర్యాంకులు సాధించడానికి వీలుగా రూపొందిస్తున్నాయి. అవార్డుల ఎంపికకు అవి కీలకంగా నిలుస్తున్నాయి. పరిశుభ్రత పరంగా పురస్కారాలు పొందిన చాలా నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. బహిరంగ మల విసర్జన రహితంగా ప్రకటించిన చాలా నగరాలు, రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని తాజాగా వెలువరించిన మల్టిపుల్‌ ఇండికేటర్‌ సర్వే వెల్లడిస్తోంది. దీంతో పాటు కొన్ని జాతీయ స్థాయి సర్వేలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌, తమిళనాడులను 2018లో వంద శాతం బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాలుగా ప్రకటించారు. వాటిలో 71శాతం మేరకే బహిరంగ మల విసర్జనను నిరోధించగలిగారని జాతీయ గణాంక కార్యాలయ సర్వే వెల్లడించింది. ఇళ్లు, వ్యాపార, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థ జలాలను శుద్ధి చేసిన తరవాతే బయటకు వదిలే నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో వాటర్‌ ప్లస్‌ సర్టిఫికేషన్‌ ఇస్తారు. ఆ వ్యవస్థ సరిగ్గా లేని నగరాలకూ పురస్కారాలు ఇవ్వడం పోటీ నిష్పాక్షికతపై సందేహాలు లేవనెత్తుతోంది. గంగానదీ తీర పట్టణాలను, కంటోన్మెంట్‌ బోర్డులను ప్రత్యేక తరగతులుగా వర్గీకరించి వాటిని పురస్కారాలకు ఎంపిక చేశారు. నర్మద, గోదావరి, కావేరి తదితర నదీ తీర పట్టణాలను విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏటా వరసగా పురస్కారాలు సాధిస్తున్న నగరాల్లో పటిష్ఠమైన పారిశుద్ధ్య వ్యవస్థ ఉంది. ఆ నగరాల సమగ్ర ప్రణాళికలు, బలమైన ఆర్థిక వ్యవస్థలు- స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలో వాటి విజయానికి దోహదం చేస్తున్నాయి. పారిశుద్ధ్య మౌలిక వసతులు పూర్తిస్థాయిలో లేని నగరాలను వాటితో పోటీకి దింపడం సబబుకాదని నిపుణులు చెబుతున్నారు.


కచ్చితత్వం కీలకం

స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీ సమర్థంగా జరగాలంటే మూల్యాంకన వ్యవస్థలో సంస్కరణలు తేవాలి. రెండు మూడు రోజుల తనిఖీలు కాకుండా, నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై నిరంతర నిఘా పెట్టాలి. ర్యాంకుల నిర్ణయంలో పౌరుల అభిప్రాయాల సేకరణ అత్యంత కీలకం. ప్రస్తుతం అరకొరగానే పౌరుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. వీరి సంఖ్యను మరింతగా పెంచాలి. పోటీలో వరస విజయాలు సాధిస్తున్న ఇందౌర్‌, సూరత్‌ వంటి నగరాల అధికార యంత్రాంగాలకు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగస్వామ్యం కల్పించాలి. ర్యాంకుల నిర్ధారణ ఎప్పుడూ కచ్చితత్వంతో ఉండాలి. వాస్తవ పరిస్థితులను పూర్తిస్థాయిలో ప్రతిబింబించే ర్యాంకులు- లోపాలను సరిదిద్దుకోవడానికి, పోటీతత్వం పెంపొందించడానికి, తీరైన వ్యవస్థల నిర్మాణానికి తోడ్పడతాయి. అప్పుడే స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీ పరమార్థం నెరవేరుతుంది. నగరాలు మెరుగైన పారిశుద్ధ్య ప్రమాణాలతో పురోగమిస్తాయి.


అవగాహన అవసరం

‘వ్యర్థంలో అర్థం’ అన్న నినాదాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2023 ఇతివృత్తంగా నిర్ణయించారు. ఆ నినాదానికి అనుగుణమైన కార్యాచరణ నిరుడు నగరాల్లో జరగలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2024 సంవత్సరానికి ‘వ్యర్థాల్ని తగ్గించడం, పునశ్శుద్ధి, పునర్వినియోగం’ అన్న నినాదాన్ని ఇతివృత్తంగా ఎంచుకొన్నారు. ఈ మూడు సూత్రాలతో కూడినదాన్నే వలయ ఆర్థిక వ్యవస్థ(సర్క్యులర్‌ ఎకానమీ)గా చెబుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ లక్ష్య సాకారానికి నగరాల్లో వలయ ఆర్థిక వ్యవస్థపై పురపాలికల పాలక వర్గానికి, అధికార గణానికి, నగర పౌరులకు ప్రభుత్వాలు అవగాహన కల్పించాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌ - యూకే వ్యూహాత్మక సహకారం

‣ చిప్‌ తయారీకి నయా చిరునామా

‣ ఎవరికీ పట్టని ‘పర్యావరణ పరిరక్షణ’

‣ ఎన్నికల వేళ.. ఎటూ తేల్చుకోలేక

‣ ఆసియాన్‌తో డ్రాగన్‌కు ముకుతాడు

Posted Date: 27-01-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని