• facebook
  • whatsapp
  • telegram

అడుగంటుతున్న జలాశయాలు



దేశంలోని ప్రధాన జలాశయాలు గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే నాగార్జునసాగర్‌, శ్రీశైలం, ఆలమట్టి వంటి భారీ ప్రాజెక్టుల నుంచి నీరందక కొన్ని జిల్లాల్లో ఖరీఫ్‌ పంట వేయలేదు. రబీ సాగుపైనా ఆశలు వదులుకున్న రైతులు- కనీసం తాగునీటి చెరువులు నింపినా చాలన్నట్లు వేచిచూస్తున్నారు


దేశీయంగా 150 కీలక జలాశయాలు ప్రస్తుతం అడుగంటే స్థితిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులను నిత్యం పర్యవేక్షించే కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇటీవల విడుదల చేసిన నీటి నిల్వ గణాంకాలు చూస్తే- వచ్చే వేసవిలో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉండబోతోందో అర్థమవుతుంది. సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం ప్రస్తుతం జలాశయాల్లో 55శాతం నీరే అందుబాటులో ఉంది. పదేళ్ల సగటు నిల్వలతో పోల్చినా 40శాతం లోటు కనిపిస్తోంది. గతేడాది ఇదే సమయానికి 82శాతం నీటితో కళకళలాడిన ప్రాజెక్టులు రబీలో సైతం ఆదుకున్నాయి. ప్రస్తుత నిల్వల్లోనూ కనీస నీటి మట్టాలకు వదిలేయగా, లీకేజీలు, ఆవిరి రూపంలో పోను మిగిలేది చాలా తక్కువ. ఈ జలాలనూ ప్రాజెక్టుల్లోంచి మోటార్లు పెట్టి తోడుకోవాల్సిందే తప్ప నేరుగా కాలువలకు అందించే పరిస్థితి లేదు.


దేశవ్యాప్తంగా ఇంతే

భారత్‌లో దాదాపు అన్ని ప్రాంతాలూ ప్రస్తుతం నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. 221 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదవడమే దీనికి ప్రధాన కారణం. దక్షిణాదిలో కరవు ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతంలో సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తున్న 42 జలాశయాల్లో ప్రస్తుతం 37శాతం నీరే మిగిలింది. ఇది గతేడాది కన్నా 29శాతం, పదేళ్ల సగటు కన్నా 16శాతం తక్కువ. ముఖ్యంగా కృష్ణా, పెన్నా, కావేరి, తుంగభద్ర నదులపై నిర్మించిన ఆనకట్టల్లో నీటి జాడే లేదు. అందుకే ఈ నదులపైనున్న ప్రాజెక్టులను నమ్ముకున్న రైతులు రబీ సీజన్‌లో విత్తనాలే వేయలేదు. అంతకుముందు ఖరీఫ్‌లోనూ అత్యధిక ఆయకట్టును బీడుగా వదిలేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తాగునీటి ఎద్దడి ముంచుకొస్తోంది. జనవరిలోనే నీటి కొరత తలెత్తింది. ఉన్న కొద్దిపాటి నిల్వలతో రాబోయే రోజుల్లో నీటి ఎద్దడిని అధిగమించడమన్నది పెద్ద సవాలే. మళ్ళీ నైరుతి రుతుపవనాలు వచ్చేవరకు, అంటే- సుమారు ఆరు నెలలపాటు ప్రస్తుతం ఉన్న నిల్వలతో సర్దుకోవాలి. ఉత్తరాదిలోనూ పదేళ్ల సగటుతో పోలిస్తే నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. వరి, గోధుమ ఎక్కువగా పండించే పంజాబ్‌ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. అస్సాం, ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోని జలాశయాల్లో గతంలో కంటే నీటి నిల్వలు తక్కువే ఉన్నాయి. మొత్తంమీద పదేళ్ల సగటు నీటిమట్టంతో పోలిస్తే కేవలం 70 ప్రాజెక్టుల్లోనే నీరు ఎక్కువ ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక చిన్నతరహా ప్రాజెక్టులు ఎప్పుడో అడుగంటాయి.


నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏటా జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలోనే ప్రాజెక్టుల్లోకి 95శాతం నీరు చేరుతుంది. అలాంటిది ఈసారి నైరుతి లోటు మిగిల్చింది. పడిన కొద్దిపాటి వర్షాలూ సీజన్‌ ప్రారంభంలోనే మురిపించాయి. ఫలితంగా కొన్ని జలాశయాల గేట్లు జులై చివరి వారం, ఆగస్టు రెండో వారం వరకే ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఆ తరవాత వర్షాలు మొహం చాటేశాయి. అప్పటికే వేసిన ఖరీఫ్‌ పంటలను కాపాడుకునేందుకూ నిల్వ నీటిని వినియోగించాల్సి వచ్చింది. రుతుపవనాల కాలంలోనే ప్రాజెక్టుల్లోకి కొత్తగా ప్రవాహాలు రాకపోగా, ఉన్న కాస్త నిల్వలూ తరిగిపోసాగాయి. 120 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిరుడు ఆగస్టులో వర్షపాతంలో తీవ్ర లోటు నమోదైంది. ఆగస్టులో 255 మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, గతేడాది 160 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. అదీ మొదటి వారంలోనే. దాంతో రిజర్వాయర్లలో ఆగస్టు చివరి నాటికి 63శాతం నీరే చేరింది.


జాగ్రత్తగా వాడుకుంటేనే..

వర్షాల్లేక, బోరుబావుల వినియోగంతో విద్యుత్తు అవసరాలు పెరిగాయి. మరోవైపు జలాశయాల్లోని నీటిని తాగు అవసరాలకోసం, అక్కడక్కడా వేసిన ఖరీఫ్‌ పంటల కోసం విడుదల చేయాల్సి వచ్చింది. ఇలా నైరుతి ప్రారంభం నుంచే నిల్వ నీటిని విడుదల చేయడం, వరసగా వర్షాలు లేకపోవడంతో ఇప్పుడు ప్రాజెక్టుల్లో జల సవ్వడి లేదు. భూగర్భ జలాలను కలుపుకొని, జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటిని జాగ్రత్తగా వాడుకుంటేనే ఈ వేసవిలో నీటి ఎద్దడిని నిలువరించగలం. ఇకపై తాగునీటి చెరువుల్లోని జలాలను ఇతర అవసరాలకు మళ్ళించకూడదు. ప్రాజెక్టుల్లోనూ లీకేజీలను అరికట్టి ప్రతి బొట్టునూ సద్వినియోగం చేసుకునేలా ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.


- బండపల్లి స్టాలిన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్వచ్ఛత కొరవడిన సర్వేక్షణ్‌

‣ భారత్‌ - యూకే వ్యూహాత్మక సహకారం

‣ చిప్‌ తయారీకి నయా చిరునామా

‣ ఎవరికీ పట్టని ‘పర్యావరణ పరిరక్షణ’

‣ ఎన్నికల వేళ.. ఎటూ తేల్చుకోలేక

‣ ఆసియాన్‌తో డ్రాగన్‌కు ముకుతాడు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Whataapp, Telegram, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 29-01-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం