• facebook
  • whatsapp
  • telegram

ఎగుమతుల కలిమి... సేద్యానికి బలిమి!హరిత విప్లవం తరవాత దేశంలో వివిధ పంటల సాగు గణనీయంగా పెరిగింది. పలు వాణిజ్య పంటలు అన్నదాతల ఆదాయ వృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. వాటి ఎగుమతులను మరింతగా పెంచితే రైతులతో పాటు దేశార్థికానికీ మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఆహార ధాన్యాలే కాకుండా పలు రకాల వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ భారత్‌ ప్రత్యేక స్థానం సముపార్జించింది. వివిధ వాణిజ్య పంటల్లో సత్తా చాటుతోంది. పూర్తిగా ఎగుమతుల కోసమే కొన్ని పంటలు సాగవుతున్నాయి. ఈ జాబితాలో గెర్కిన్‌ (కీర దోస జాతికి చెందిన కాయలు) మొదటి స్థానంలో నిలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ పంట ఎగుమతులు భారీగా పెరిగాయి. మనదేశం నుంచి మొత్తం 2.44 లక్షల టన్నులను వివిధ దేశాలు దిగుమతి చేసుకున్నాయి. ఇది అంతకు ముందు ఏడాదికంటే 7.4శాతం అధికం. వీటి ద్వారా సుమారు రూ.21 వేల కోట్ల ఆదాయం వచ్చింది. 2022-23తో పోలిస్తే ఆదాయ పరంగా 17శాతం ఎక్కువ. గెర్కిన్‌కు సంబంధించి అమెరికా మార్కెట్‌లో మెక్సికోతో భారత్‌ పోటీ పడుతోంది. రవాణా ఖర్చులు అధికంగా ఉండటంవల్ల అమెరికా మార్కెట్లో ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు గెర్కిన్‌ ఎగుమతిదారుల సంఘం చెబుతోంది.


ఐరోపాలో నిరుడు గెర్కిన్‌ పంట దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. దాంతో కొన్ని దేశాలు దిగుమతి చేసుకున్నాయి. ఈ పరిణామం మన దేశానికి కలిసివచ్చింది. అధిక రవాణా ఖర్చులతో పాటు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత గెర్కిన్‌పై 10 నుంచి 14శాతం వరకు సుంకం ఉంటోంది. ఈయూ, ఐరోపాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంటే ఎగుమతులకు మరింత ఊతమిచ్చినట్లవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మనదేశంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో వీటిని సాగు చేస్తున్నారు. గెర్కిన్‌ను విదేశాల్లో ఊరగాయగా ఉపయోగిస్తారు. మన దేశంలో కర్ణాటక రాష్ట్రమే ప్రధాన ఉత్పత్తిదారు. ఈ పంటను రైతులు ఒప్పంద పద్ధతిలో సాగు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు, ఎగుమతి సంస్థలు రైతులకు పెట్టుబడి అందించి సాగు చేయిస్తున్నాయి. దిగుబడులను వారి నుంచి కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. కర్ణాటకలో దాదాపు 60 వేల ఎకరాల్లో గెర్కిన్‌ సాగవుతోంది. సుమారు లక్షమంది అన్నదాతలు ఇందులో నిమగ్నమయ్యారు. దేశంలో ఉత్పత్తి అయ్యే గెర్కిన్‌లో 99శాతంపైగా ఎగుమతి అవుతోంది. స్థానికంగా వినియోగం లేకున్నా భారత్‌ నేడు ఈ పంట ఉత్పత్తి, ప్రాసెసింగ్‌లో కీలకంగా మారింది. అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ఎగుమతులను పెంచుకోవచ్చనేందుకు ఇది ఒక ఉదాహరణ.


వ్యవసాయ జీడీపీలోను, జీవనోపాధికి, ఆదాయాన్ని అందించడంలో వాణిజ్య పంటలదే కీలక పాత్ర. వాణిజ్య పంట ఉత్పత్తుల ఎగుమతుల కారణంగా చెప్పుకోదగ్గ స్థాయిలో విదేశ మారకద్రవ్యం సమకూరుతోంది. ఈ రంగాన్ని మరింత మెరుగుపరచడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చవచ్చు. అధిక విలువ కలిగిన పంటల ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా ఎగుమతులను పెంచడానికి వీలు కలుగుతుంది. భారత్‌లో ఉన్న వైవిధ్యభరితమైన వాతావరణ పరిస్థితులు పలురకాల పంటల సాగుకు అనుకూలం. నాణ్యత, వైవిధ్యం కారణంగా మనదేశంలో పండే అనేక ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంటోంది. దేశంలో పత్తి, చెరకు, జనపనార, నూనె గింజలు వంటివి ప్రధాన వాణిజ్య పంటలు. వీటి ఎగుమతులకు అపార అవకాశాలు ఉన్నాయి. వాణిజ్య పంటలను అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. యాంత్రీకరణ, అధిక దిగుబడులు కారణంగా అక్కడి రైతుల ఆదాయాలు సైతం అధికంగా ఉంటున్నాయి. మన దేశంలో పరిస్థితులు అందుకు భిన్నం. ఎక్కువమంది చిన్న సన్నకారు రైతులే కావడంతో వారి ఆదాయాలు అంతంత మాత్రమే. ప్రభుత్వాలు ప్రజల ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని వరి, గోధుమ వంటి పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆహార పంటలతో పాటు వాణిజ్య, ఉద్యాన పంటలను మరింతగా ప్రోత్సహించాలి. అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్న పంటల సాగుకు అన్నదాతలను సమాయత్తం చేయాలి. పంటలకు సరైన మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేయాలి. ఎగుమతులను ఎంతమేర పెంచితే రైతులకు అంతగా ప్రయోజనం కలుగుతుంది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నప్పుడు అన్నదాతల ఆదాయం వృద్ధి చెందుతుంది. లేదంటే రైతుల ఆదాయం రెట్టింపు చేయడమనేది కేవలం నినాదంగానే మిగిలిపోతుంది.


- డి.సతీష్‌బాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వేడెక్కుతున్న భూగర్భ జలాలు

‣ భారత్‌ - బంగ్లా చెట్టపట్టాల్‌

‣ ప్రాభవం కోల్పోతున్న జీ7

‣ ఏకాకిని కాదంటున్న పుతిన్‌

‣ స్విస్‌ శాంతి సదస్సులో తటస్థ భారత్‌

‣ దక్షిణాఫ్రికాలో గాలి మార్పు

‣ భూ సంరక్షణతో కరవుమీద పైచేయి

Posted Date: 26-06-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

వ్యవసాయం

మరిన్ని