• facebook
  • twitter
  • whatsapp
  • telegram

package: రెండేళ్ల కష్టం... రూ.54 లక్షల ప్యాకేజీతో  ఉద్యోగం!


 

వైఫల్యం ఎదురైతే అక్కడితో ఆగిపోవాలనిపిస్తుంది. దక్కిన దాంతో సర్దుకుపోదామనే ఆలోచన తెప్పిస్తుంది. కానీ ఆశ్రిత దాన్నే సోపానంగా చేసుకుని మరోసారి ప్రయత్నించింది. కాబట్టే రూ.54 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించుకుంది.
 

   ఇది చదువు, ఈ దారిలో వెళ్లు... అని చెప్పి మార్గదర్శకత్వం చేసేవారు లేకే చాలామంది విద్యార్థులు వెనకబడుతుంటారు. ఆశ్రిత పరిస్థితీ అంతే! చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడే ఎంటెక్‌కి సిద్ధమవుతుంటారు. అప్పుడు చాలా సమయం ఆదా అవుతుంది. ఈ విషయం ఆశ్రితకు తెలియదు. ఈమెది కరీంనగర్‌ జిల్లాలోని గోపాలరావుపేట. అమ్మ లక్ష్మి, నాన్న అనంతరెడ్డి. వ్యవసాయ కుటుంబం, పైగా ఇద్దరమ్మాయిల్లో ఆశ్రితనే పెద్ద. ఇక దిశానిర్దేశం లేకపోయింది. చిన్నప్పట్నుంచీ బాగా చదువుతుండటంతో ఇంట్లో ప్రోత్సహించారు. ఆశ్రిత కూడా వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. అప్పుడు స్నేహితుల ద్వారా ఐఐటీ, ఐఐఎస్‌సీల్లో ఎంటెక్‌ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలుసుకుంది. అంతా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం నుంచే మొదలుపెడితే తను అప్పుడు సన్నద్ధత ప్రారంభించింది.


   2021లో ప్రవేశపరీక్ష ‘గేట్‌’ రాస్తే 3 వేల ర్యాంకు వచ్చింది. ఎలాగోలా ఎంటెక్‌ చదవడం కాదు... దాన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పూర్తిచేయాలన్నది ఆమె లక్ష్యం. అందుకే మరోసారి సిద్ధమైంది. ఈసారి జాతీయస్థాయిలో 36వ ర్యాంకు వచ్చింది. దాంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) బెంగళూరులో సీటు రావడంతో పాటు న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌లో సైంటిస్టు ఉద్యోగం, బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్, డీఆర్‌డీఓ, ఇస్రో నుంచీ ఇంటర్వ్యూకు పిలుపులొచ్చాయి. పీజీ లక్ష్యంగా పెట్టుకున్న ఆశ్రిత చదువువైపే మొగ్గు చూపింది.


   తాజాగా ఎంటెక్‌ పూర్తిచేసి ప్రాంగణ నియామకాల్లో రూ.54లక్షల ప్యాకేజీతో ‘ఎన్‌వీడీయా’ అనే సంస్థలో ఉద్యోగాన్నీ సంపాదించింది. ‘ప్రముఖ సంస్థల్లో అవకాశం వదులుకోవడం సులువేం కాదు. కానీ ఎంటెక్‌ కోసం రెండేళ్లు కష్టపడ్డా. దాన్ని పక్కనపెట్టడం నచ్చక కొనసాగించా. నా శ్రమకి ఫలితం లభించింది. పరీక్షల్లో ఏదో ఒకటి రాస్తే అయిపోదు. కచ్చితంగా సమాధానం ఇవ్వాలి. ఇంకా తెలియకపోతే వాటి జోలికే వెళ్లొద్దు’ అని తోటివాళ్లకి సలహానిస్తోంది ఆశ్రిత.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు

Posted Date : 24-07-2024 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం