• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ సూచీలో అట్టడుగున భారత్‌

మేలుకోకుంటే తీవ్ర దుష్పరిణామాలు

వాతావరణంలో విపరీత మార్పులు అందరినీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అడవుల నరికివేత, గనుల తవ్వకం, శిలాజ ఇంధనాల వాడకం పెరగడం వంటివి పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఈ తరుణంలో పుడమిని పరిరక్షించుకొనేందుకు సమష్టిగా సాగాలని, కర్బన ఉద్గారాలను కట్టడి చేయాలని ‘కాప్‌-26’ సదస్సు వేదికగా ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. 2070 నాటికి కర్బన ఉద్గారాల విడుదల, తొలగింపును సమతుల్యం చేయాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా విడుదలైన ఓ నివేదిక- పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్‌ మరింత వడివడిగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పింది. అమెరికాకు చెందిన యేల్‌, కొలంబియా విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన పర్యావరణ పనితీరు సూచీ 180 దేశాల జాబితాలో భారత్‌ అట్టడుగున నిలిచింది.

వాతావరణ మార్పులు, పర్యావరణ ఆరోగ్యం, ఆవరణ వ్యవస్థల స్థితిగతులు భూమికగా 11 విభాగాలు, వాటిలో మళ్ళీ 40 ఉప విభాగాలతో పర్యావరణ సూచీని విడుదల చేశారు. ఆయా అంశాల్లో వేర్వేరుగా, మొత్తంగా మార్కులు కేటాయించారు. అందులో మొత్తంగా 18.90 స్కోరుతో ఇండియా అడుగు భాగాన నిలిచింది. 77.90 మార్కులతో డెన్మార్క్‌ అగ్ర స్థానాన్ని ఆక్రమించింది. హరిత గృహ వాయువుల పెరుగుదల, వాయు నాణ్యత నానాటికీ తెగ్గోసుకుపోతుండటం వల్ల భారత్‌ ఈ సూచీలో తొలిసారిగా అట్టడుగు స్థాయికి చేరినట్లు నివేదిక తెలియజెప్పింది. మయన్మార్‌ (19.4), వియత్నామ్‌ (20.1), బంగ్లాదేశ్‌(23.1), పాకిస్థాన్‌ (24.6)లు ఇండియాకన్నా మెరుగైన స్థితిలో నిలిచాయి. గాలి నాణ్యత, జీవ వైవిధ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, వ్యర్థాల నిర్వహణ, వాతావరణ మార్పులు వంటి చాలా అంశాల్లో భారత్‌ అట్టడుగునో లేదా దానికి దరిదాపుల్లోనో ఈసురోమంటోంది. మొత్తంగా 28.4 స్కోరుతో చైనా 161వ స్థానంలో నిలిచింది. ట్రంప్‌ హయాములో పారిస్‌ ఒప్పందం నుంచి బయటికి రావడం వంటి కారణాలవల్ల ఈసారి అగ్రరాజ్యం అమెరికా 43వ స్థానానికి పడిపోయింది. రష్యాకు 112వ స్థానం దక్కింది. కర్బన ఉద్గారాలను క్రమంగా తగ్గిస్తామని చైనా, భారత్‌లు హామీ ఇచ్చినా 2050 నాటికి అత్యధిక హరిత గృహ వాయువులు ఆ రెండు దేశాల నుంచే వెలువడతాయని నివేదిక కుండ బద్దలుకొట్టింది. 2050 నాటికి డెన్మార్క్‌, యూకే వంటివి మాత్రమే కర్బన ఉద్గారాల కట్టడిలో నిర్ణీత లక్ష్యాన్ని సాధిస్తాయని తెలియజెప్పింది.

ప్రపంచంలో అత్యంత కాలుష్యభరితమైన 30 నగరాల్లో 21 భారత్‌లోనే ఉన్నాయని అధ్యయనాలు చాటుతున్నాయి. వాయు కాలుష్యం 2019లో దేశీయంగా సమారు 17 లక్షల మంది ప్రాణాలు తోడేసిందని ‘లాన్సెట్‌’ నివేదిక వెల్లడించింది. నీటి కాలుష్యం కారణంగా ఆ ఏడాది భారత్‌లో అయిదు లక్షల మంది బలైపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 67 లక్షల మంది అర్ధాంతరంగా అసువులు బాయడానికి వాయు కాలుష్యమే కారణం! వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్దం చివరి నాటికి భారత్‌ ఏటా తన జీడీపీలో మూడు నుంచి పది శాతం దాకా నష్టపోతుందని లండన్‌కు చెందిన ఓవర్‌సీస్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనా వేసింది. 2040 నాటికి దేశీయంగా పేదరికం 3.5 శాతం మేర పెరగవచ్చునని విశ్లేషించింది. ఈ తరుణంలో పర్యావరణ పరిరక్షణకు భారత్‌ మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వాతావరణ మార్పుల దుష్ఫలితాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేసవిలో విపరీతమైన ఉష్ణోగ్రతలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. వర్షాకాలంలో కుండపోత వానలతో అకస్మాత్తుగా వరదలు విరుచుకు పడుతున్నాయి. వ్యవసాయం, నీటి వనరులు, జీవ వైవిధ్యం, ప్రజారోగ్యం వంటి వాటిపై వాతావరణ మార్పుల ప్రభావం ఉంటుంది. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల వల్ల దేశీయంగా గోధుమ దిగుబడి గణనీయంగా తగ్గింది. భూతాపం కారణంగా ధ్రువప్రాంతాల్లో మంచు గత అయిదు వేల ఏళ్లలో ఎన్నడూ లేనంత వేగంగా కరిగిపోతోందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దానివల్ల సముద్రమట్టాలు పెరిగి, తీర ప్రాంతాలు కడలి గర్భంలో కలిసిపోతాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని ఉప్పాడ వంటి చోట్ల సముద్రం నానాటికీ ముందుకు చొచ్చుకొచ్చి ఇళ్లను కబళిస్తోంది. ఈ ఉత్పాతాలను నివారించాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, పునరుత్పాదక ఇంధన వనరులవైపు మళ్ళాలి. అటవీ విస్తీర్ణాన్ని ఇతోధికంగా పెంచుకోవాలి. కర్బన ఉద్గారాల కట్టడిలో నిర్దేశిత లక్ష్యాలను నిజాయతీగా చేరుకునేలా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషిచేస్తేనే పుడమి పదికాలాలు చల్లగా ఉంటుంది.

- దివ్యాన్షశ్రీ

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రాజ్యాంగ బద్ధతే ప్రామాణికం

‣ సహ్యాద్రి... జీవవైవిధ్యానికి పెన్నిధి!

‣ సముద్రాలకు ప్లాస్టిక్‌ గండం

‣ అంతరిక్షంలో ఆధిపత్య పోరు

‣ పంటలకు భానుడి సెగ

Posted Date: 15-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం