• facebook
  • whatsapp
  • telegram

సముద్రాలకు ప్లాస్టిక్‌ గండం

జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం

 

 

భూగ్రహం అంటామేగానీ, నిజానికి పుడమిపై 70శాతాన్ని సముద్ర జలమే ఆక్రమించింది. జీవ వైవిధ్యానికి సముద్రాలు ఆలవాలాలు. ప్రపంచంలో వంద కోట్లకు పైగా ప్రజలు ప్రొటీన్ల కోసం సాగరాలపైనే ఆధారపడతారు. భూమ్మీద ఉండే ఆమ్లజనిలో సగం సముద్రాల నుంచే వస్తోంది. కొన్ని కోట్ల మందికి సముద్ర ఆధారిత రంగాలే జీవికగా నిలుస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన సాగరాలను ప్లాస్టిక్‌, పారిశ్రామిక వ్యర్థాలు, చమురు తెట్లు ముంచెత్తడం వల్ల వాటిలోని జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే సముద్రాల్లోని సొరచేపలు, తిమింగలాలు భారీగా తగ్గిపోయాయి. సగానికిపైగా పగడపు దిబ్బలు నాశనమయ్యాయి. సముద్రాల్లో అత్యంత లోతైన ప్రాంతం మరియానా ట్రెంచ్‌. అక్కడా చిన్న ప్లాస్టిక్‌ ముక్కలు అసంఖ్యాకంగా పడి ఉన్నాయి. మొత్తం సముద్ర వ్యర్థాల్లో 85శాతం ప్లాస్టిక్‌ ముక్కలే! అవి తీర ప్రాంతాలు, మధ్యలో ఉండే ప్రవాహాలు, మారుమూల ద్వీపాలతో పాటు అన్నిచోట్లా పోగుపడి జీవజాలానికి ఎంతో హాని కలిగిస్తున్నాయి. వాటి ఆవాస ప్రాంతాలనూ దెబ్బతీస్తున్నాయి.

 

అరకొర పునర్వినియోగం

సహజంగానే ప్లాస్టిక్‌ వ్యర్థాలు అంత తేలిగ్గా భూమిలో కలవవు. నీళ్లలో కరగవు. అవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో, నానో ప్లాస్టిక్స్‌గా మారతాయి. ఈ ప్లాస్టిక్స్‌ మరింత ప్రమాదకరం. వాటివల్ల జీవ వైవిధ్యంపై, పర్యావరణ వ్యవస్థపై దుష్ప్రభావాలు పడతాయి. అన్నిరకాల చిన్న, పెద్ద చేపలతో పాటు సముద్ర తాబేళ్లు, పక్షులు, సముద్ర క్షీరద జాతుల జీర్ణ వ్యవస్థలో ప్లాస్టిక్‌ ముక్కలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రాల్లో తేలే ప్లాస్టిక్‌ కవర్లను జెల్లీ చేపలుగా భ్రమపడి సముద్రపు తాబేళ్లు వాటిని తినేస్తున్నాయి. అవి జీర్ణం కాకపోవడంతో ఇతర ఆహారం తీసుకోలేక మరణిస్తున్నాయి. చేపలు, ఇతర సముద్రజీవాలను ఆహారంగా తీసుకొనే క్రమంలో వాటిలో పేరుకుపోయిన మైక్రో, నానో ప్లాస్టిక్‌లు మానవుల్లోకి చేరుతున్నాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. తీర ప్రాంతాల్లో నివసించే వారిని పరీక్షించినప్పుడు వారి ఊపిరితిత్తులు, కాలేయం, ప్లీహం, మూత్రపిండాల్లో మైక్రోప్లాస్టిక్‌లు కనిపిస్తున్నాయి. నవజాత శిశువుల శరీరాల్లోనూ వాటి అవశేషాలుండటం ఆందోళనకరం. ప్లాస్టిక్‌ సంబంధిత రసాయనాలు మానవుల్లోకి చేరడంవల్ల శరీరాభివృద్ధి, పునరుత్పత్తి వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. చాలామంది క్యాన్సర్ల బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునర్వినియోగం ద్వారా ప్లాస్టిక్‌ వ్యర్థాలను చాలావరకు తగ్గించవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్లాస్టిక్‌లో రీసైకిల్‌ అవుతున్నది కేవలం పది శాతమేనని అంచనా. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఆధ్వర్యంలోని ‘పొల్యూషన్‌ టు సొల్యూషన్‌’ అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల ప్రతియేటా మత్స్య సంపదకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు యాభైవేల కోట్ల నుంచి 2.50 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోంది. మధ్యధరా ప్రాంతంలో ఈ నష్టాలు ఏడాదికి 13.8 కోట్ల డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఆసియా పసిఫిక్‌ ఆర్థిక సహకార ప్రాంతంలో ఆ నష్టం వెయ్యి కోట్ల డాలర్లకు పైమాటే. 2009తో పోలిస్తే ఈ నష్టాలు అనంతర కాలంలో పదిరెట్ల దాకా పెరిగాయి.

 

అణుధార్మిక వ్యర్థాలూ...

ప్లాస్టిక్‌తో పాటు పారిశ్రామిక, ఔషధ, అణుధార్మిక వ్యర్థాలూ అధికంగా సాగరాల కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఔషధ పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర వ్యర్థాలను నేరుగా సముద్రాల్లోకి వదిలేస్తున్నారు. ఆ విషపదార్థాలు సముద్ర జీవజాలాల్లోకి, వాటినుంచి మానవులకు చేరుతున్నాయి. మరోవైపు జపాన్‌ లాంటి దేశాలు అణు విద్యుత్తు కర్మాగారాల నుంచి వెలువడిన అణుధార్మిక జలాలనూ సముద్రాలలోనే పారబోస్తున్నాయి. 2011లో వచ్చిన భూకంపంవల్ల జపాన్‌లోని ఫుకుషిమా దైచీ అణు విద్యుత్తు కర్మాగారం తీవ్రంగా దెబ్బతింది. అక్కడి రియాక్టర్లలోని ఇంధన రాడ్లు వేడెక్కకుండా సముద్రపు నీటిని పంపారు. అణువ్యర్థాలతో కూడిన ఆ జలాన్ని కొంత శుద్ధిచేసి, 2023 నుంచి కొన్ని దశాబ్దాలపాటు సముద్రంలోకి వదిలిపెడతామని జపాన్‌ అంటోంది. అందుకు అమెరికా సైతం మద్దతిస్తోంది. చమురు రవాణా నౌకల నుంచి ప్రమాదవశాత్తూ ఒలుకుతున్న చమురు సముద్రంపై తెట్టులాగా ఏర్పడి లోపలున్న చేపలు, ఇతర జీవాలకు ఊపిరి ఆడకుండా చేస్తోంది. అందరూ చేతులు కలిపి సముద్రాల పరిరక్షణకు నడుంకట్టాలని ఐక్యరాజ్య సమితి సైతం ఇటీవల పిలుపిచ్చింది. ఆ దిశగా ప్రపంచ దేశాలు వేగంగా అడుగులు వేయడం తక్షణావసరం.

 

- కామేశ్‌ పువ్వాడ
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అంతరిక్షంలో ఆధిపత్య పోరు

‣ పంటలకు భానుడి సెగ

‣ కల్తీని పారదోలితేనే ఆరోగ్య భారతం

‣ సవాళ్లు అధిగమిస్తేనే సమ్మిళిత అభివృద్ధి

‣ బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం

‣ ఖలిస్థానీ ముఠాలకు ఐఎస్‌ఐ దన్ను

Posted Date: 10-06-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం