• facebook
  • whatsapp
  • telegram

బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం

థర్మల్‌ కేంద్రాలకు ఇక్కట్లు

 

 

దేశంలో బొగ్గు కొరతతో కరెంటు ఉత్పత్తి కోతలు తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలో థర్మల్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ఎంత బొగ్గు అవసరమో అంచనాలు రూపొందించాలని కేంద్ర విద్యుత్‌ మండలికి విద్యుత్‌ శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలో బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ది నాలుగో స్థానం. ఇంత భారీగా బొగ్గు ఉన్నా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా తరవాత భారతే రెండోస్థానంలో ఉండటం ఇక్కడ నల్లబంగారానికి ఉన్న కొరతను చాటుతోంది. ఈ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రైవేటు సంస్థలు కూడా వేలంలో పాల్గొని బొగ్గు తవ్వుకోవచ్చని కేంద్రం అవకాశం కల్పించింది. దక్షిణ భారతదేశ విద్యుత్‌ కేంద్రాలకు జీవనాడి వంటి సింగరేణి సంస్థలో బొగ్గు నిక్షేపాలను సైతం సంస్థ సొంతంగా తవ్వుకోవడానికి వీల్లేదంటూ వేలంపాటలో ఉంచింది. ఇంతకాలం బొగ్గు రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న కోల్‌ ఇండియా, సింగరేణి సంస్థలకు మునుపటిలా అడిగినచోటల్లా కొత్త గనుల్ని ఏకపక్షంగా అప్పగించే విధానాన్ని కేంద్రం పక్కనపెట్టింది. ఇటీవల 27 గనుల్ని ప్రైవేటు కంపెనీలు వేలంలో కొన్నాయి. మరో 88 గనుల్ని వేలానికి పెట్టింది. వీటిలో తెలంగాణలో సింగరేణి గనుల సమీపంలోని నాలుగు గనులూ ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేటు సంస్థలతో పోటీపడి బొగ్గు తవ్వితేనే ఈ రెండు ప్రభుత్వరంగ సంస్థలూ నిలబడతాయి.

 

ముందస్తు ప్రణాళికల్లో లోపం...

గత ఏడాదికాలంగా దేశంలో బొగ్గు కొరత విస్తరించడానికి కారణం- విద్యుత్‌ గిరాకీ అంతకంతకూ పెరిగిపోవడమే. గిరాకీ మేరకు కరెంటు ఉత్పత్తి చేసేందుకు సరిపడా బొగ్గును మనదేశ గనుల నుంచి తవ్వి సేకరించలేక విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. సింగరేణి గనుల నుంచి ఏటా 10 కోట్ల టన్నుల బొగ్గు కావాలంటూ అనేక రాష్ట్రాల విద్యుత్‌ కేంద్రాల నుంచి డిమాండు ఉంది. కానీ ఈ సంస్థ గతేడాది (2021-22) 6.50 కోట్ల టన్నులే తవ్వి తీసింది. ఈ ఏడాది (2022-23) ఏడు కోట్ల టన్నులు తవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. విద్యుత్‌ కేంద్రాలకు 2022 ఏప్రిల్‌ నెల అవసరాల్లో బొగ్గు సరఫరా 16శాతం తక్కువగా జరిగింది. దేశవ్యాప్తంగా పలు విద్యుత్‌ కేంద్రాలకు తీవ్ర బొగ్గు కొరత ఉంది. దీన్ని అధిగమించడానికి అదనంగా గూడ్సు రైళ్లను నడపాలని, బొగ్గు వంటి సరకు రవాణాకే ప్రత్యేక రైలు మార్గాలను నిర్మించాలని రైల్వేశాఖ తాజాగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందంటే నల్లబంగారానికి ఉన్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి మనదేశంలో 2021 అక్టోబరులోనే బొగ్గుకు తీవ్ర కొరత ఏర్పడింది. అంతకన్నా ఎక్కువ స్థాయి కొరత 2022 ఏప్రిల్‌, మే నెలల దాకా కొనసాగుతోందంటే- సమస్య నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాదికాలంగా ముందస్తు ప్రణాళికలతో జాగ్రత్తలు తీసుకోలేదా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ధరలతో బొగ్గు కొనలేక ఇండియాలో పలు విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించేశారు. ఉత్పత్తి పెంచడానికి అదనంగా బొగ్గు అవసరం. ప్రస్తుతమున్న మానవ వనరులతో, అవే పాతగనుల నుంచి అదనంగా బొగ్గు తవ్వడం సాధ్యం కాదు. దేశంలో బొగ్గు కొరత సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వ కీలక నిర్వహణ బృందం చేసిన అధ్యయనం ప్రకారం, గత వర్షాకాలంలో అధిక వర్షాలతో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ లోటును పూడ్చేందుకు కొంత ఉత్పత్తి పెంచినా విద్యుత్‌ డిమాండు ఆకాశాన్నంటడంతో అది సరిపోలేదు. 2022 ఏప్రిల్‌లో కోల్‌ఇండియా ఏకంగా 27 శాతం బొగ్గు ఉత్పత్తి పెంచినా కొరత ఏమాత్రం తీరకపోవడం సంక్షోభానికి అద్దం పడుతోంది. బొగ్గు లేనందు వల్ల విద్యుదుత్పత్తి తగ్గడంతో గత నెలలో దేశ విద్యుత్‌ డిమాండులో ఒక శాతం కొరత ఏర్పడింది. ఈ కాస్త కొరతకే ‘భారత ఇంధన ఎక్స్ఛేంజీ’(ఐఈఎక్స్‌)లో కరెంటు యూనిట్‌ విక్రయ సగటు ధర పెరగడంతో పలు రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కమ్‌)లపై వేల కోట్ల రూపాయల ఆర్థికభారం పడింది. తెలుగు రాష్ట్రాల డిస్కమ్‌లే మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో మూడు వేల కోట్ల రూపాయలదాకా వెచ్చించి అధిక ధరలకు కరెంటు కొనాల్సి వచ్చింది. ఈ అదనపు భారాన్ని కరెంటు ఛార్జీల రూపంలో ప్రజలు భరించాల్సిందే.

 

ప్రత్యామ్నాయాలు కీలకం

బొగ్గు వినియోగం తగ్గాలంటే ప్రతి ఇంటిపై సౌర విద్యుత్‌ ఫలకాల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలి. కొత్తగా ఇంటి నిర్మాణానికి అనుమతివ్వాలంటే సౌర విద్యుత్‌ ఏర్పాట్ల కోసం ముందే డబ్బు చెల్లించేలా నిబంధన పెట్టాలి. భారీ అపార్టుమెంట్లపై సౌరవిద్యుత్‌ ఉత్పత్తి ఏర్పాట్ల ద్వారా కరెంటు డిమాండును తట్టుకోవచ్చు. ఇప్పటికే లండన్‌, జర్మనీ, జపాన్‌ వంటి అనేక దేశాల్లో ఇళ్లు, భవనాలపై సౌరవిద్యుత్‌ వాడకం పెరిగి బొగ్గు వినియోగం తగ్గి, కాలుష్యమూ తగ్గుతోంది. వ్యవసాయ బోర్ల మోటార్లకు కరెంటు ఉచితంగా లేదా తక్కువ ఛార్జీలకు ఇచ్చేందుకు ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా రాయితీ రూపంలో రాష్ట్రాలు డిస్కమ్‌లకు చెల్లిస్తున్నాయి. ఆ సొమ్మును వ్యవసాయ మోటార్లకు సౌరవిద్యుత్‌ పరికరాల్ని అమర్చేందుకు వెచ్చిస్తే రాయితీ సొమ్ము మిగలడమే కాకుండా, సాధారణ కరెంటు వినియోగం తగ్గి, బొగ్గు కూడా ఆదా అవుతుంది. తద్వారా కాలుష్యమూ తగ్గుతుంది. అందుకని, ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టడం తక్షణావసరం.

 

దిగుమతులతో భారం

కొరత నుంచి గట్టెక్కడానికి ప్రతి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో వినియోగించే బొగ్గులో 10 శాతం తప్పనిసరిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం తాజాగా నిబంధన విధించింది. సొంత బొగ్గు గనులున్న తెలంగాణ, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బిహార్‌ వంటి రాష్ట్రాల విద్యుత్‌ కేంద్రాలపై ఈ నిబంధనతో తీవ్ర ఆర్థికభారం పడనుంది. ఇదంతా కరెంటు ఛార్జీల రూపంలో వసూలు చేయాల్సిందే. లేకపోతే ఇప్పటికే నష్టాల్లో ఉన్న డిస్కమ్‌లు మరింత ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతాయి. విదేశీ బొగ్గుతో నడిచేలా విద్యుత్‌ కేంద్రాలు నిర్మించిన కొన్ని ప్రైవేటు కంపెనీలను ఆదుకునేందుకు, అందరూ విదేశీ బొగ్గును తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాలనడం సరికాదనే విమర్శలున్నాయి. బొగ్గు గనుల సంస్కరణల పేరుతో కేంద్రం 2020లో తీసుకొచ్చిన కొత్త చట్టం- గనుల ప్రైవేటీకరణ కోసమేనంటూ తెలంగాణ సహా పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. గనుల వేలానికి ప్రకటన ఇస్తే సింగరేణి సంస్థ అందులో పాల్గొనలేదు.

 

- మంగమూరి శ్రీనివాస్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఖలిస్థానీ ముఠాలకు ఐఎస్‌ఐ దన్ను

‣ రైతుకు ద్రవ్యోల్బణం సెగ

‣ కడలిపై పెత్తనానికి డ్రాగన్‌ కుయుక్తులు

‣ పట్టాలకెక్కాల్సిన పన్నుల వ్యవస్థ

‣ నేపాల్‌తో బలపడుతున్న బంధం

Posted Date: 31-05-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం