• facebook
  • whatsapp
  • telegram

నేపాల్‌తో బలపడుతున్న బంధం

ప్రధాని మోదీ పర్యటన ఫలప్రదం

సరిహద్దు వివాదాలు, చైనా దూకుడుతో మొన్నటిదాకా బలహీనపడుతున్నట్లు కనిపించిన ఇండియా, నేపాల్‌ మైత్రీబంధం తిరిగి జవసత్వాలు సంతరించుకుంటోంది. నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా గత నెలలో భారత్‌లో పర్యటించారు. ఇటీవల బుద్ధపూర్ణిమనాడు ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌ను సందర్శించారు. ఈ పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాలకు పునరుత్తేజాన్నిస్తున్నాయి. భారత్‌-నేపాల్‌ బంధం సమున్నత హిమాలయ పర్వతాల తరహాలో చెక్కుచెదరనిదన్న మోదీ వ్యాఖ్యలు- ఇరు దేశాల మధ్య ఇటీవలి ఒడుదొడుకులు తాత్కాలిక విభేదాలే తప్ప శత్రుత్వం ఎంతమాత్రం కాదని చాటిచెబుతున్నాయి. దేవ్‌బా, మోదీ పర్యటనల్లో జలవిద్యుత్తు, ఆర్థికం, విద్య తదితర రంగాల్లో పలు ఉభయతారక ఒప్పందాలు కుదిరాయి. కొవిడ్‌ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నవేళ అటు కాఠ్‌మాండూకు, ఇటు దిల్లీకి అవి కీలకంగా మారనున్నాయి.

సరిహద్దు వివాదాలు

పొరుగు దేశాలకు అగ్ర ప్రాధాన్యమిచ్చే ఇండియా విధానంలో నేపాల్‌ చాలా ముఖ్యమైంది. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపరంగా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. 1950 నాటి శాంతి, స్నేహ ఒడంబడిక ఇరుదేశాల మైత్రికి వెన్నెముకలా నిలుస్తోంది. 2021లో నేపాల్‌కు ఇండియా 960 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. నేపాల్‌ మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 30శాతానికి పైగా వాటా భారతీయులదే. దేశీయంగా నానాటికీ పెరిగిపోతున్న విద్యుత్తు గిరాకీని అందుకోవడంలో నేపాల్‌ జలవిద్యుత్తు ప్రాజెక్టులు ఇండియాకు దన్నుగా నిలుస్తున్నాయి. ద్వైపాక్షిక అనుసంధానతను మరింత మెరుగుపరచేలా బిహార్‌లోని జయనగర్‌ నుంచి నేపాల్‌లోని కుర్తా పట్టణం వరకు ప్యాసింజర్‌ రైలు సర్వీసు గత నెలలో ప్రారంభమైంది. ప్రధాని పీఠమెక్కినప్పటి నుంచి మోదీ అయిదుసార్లు నేపాల్‌ను సందర్శించారు. ఇటీవలి పర్యటనలో దేవ్‌బాతో ఫలవంతమైన చర్చలు జరిపారు. 1996లో మహాకాళి ఒప్పందంలో భాగంగా సంతకాలు చేసిన పంచేశ్వర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. నేపాలీ విద్యార్థులు ఇండియాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు మెరుగైన అవకాశాలు కల్పించేలా విద్యారంగంలో కీలక అవగాహనా ఒప్పందాలు సైతం కుదిరాయి. నేపాల్‌లో అరుణ్‌-4 హైడ్రోపవర్‌ ప్రాజెక్టు (490 మెగావాట్ల సామర్థ్యం) అభివృద్ధి కోసం ఇండియాకు చెందిన సట్లెజ్‌ జల విద్యుత్తు నిగమ్‌ (ఎస్‌జేవీఎన్‌) సంస్థ, నేపాల్‌ విద్యుత్తు ప్రాధికార సంస్థ (ఎన్‌ఈఏ) తాజాగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎస్‌జేవీఎన్‌ ఇప్పటికే అక్కడ అరుణ్‌-3 ప్రాజెక్టును (900 మెగావాట్ల సామర్థ్యం) నిర్మిస్తోంది.

బుద్ధుడి జన్మస్థలమైన లుంబినీని మోదీ బుద్ధపూర్ణిమ రోజు సందర్శించడం వ్యూహాత్మకంగా కీలక పరిణామం. ఇద్దరు అత్యంత గొప్ప భారతీయుల్లో ఒకరిగా బుద్ధుడిని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ గతంలో అభివర్ణించడం నేపాలీ ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. బుద్ధుడి జన్మస్థలంపై చర్చకు తెరతీసింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు దిల్లీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. బుద్ధుడి జన్మస్థలంలోని శక్తి తనలో గొప్ప అనుభూతులను కలిగిస్తోందంటూ ఇటీవలి పర్యటనలో మోదీ వ్యాఖ్యానించడంతో ఆ వివాదానికి పూర్తిగా తెరపడినట్లయింది. లుంబినీలో ఇండియా సహకారంతో నిర్మించనున్న అంతర్జాతీయ బౌద్ధ సంస్కృతి, వారసత్వ కేంద్రానికి మోదీ, దేవ్‌బా శంకుస్థాపన చేశారు. ఇండియా, నేపాల్‌ మధ్య కాలాపానీ, సుస్తా వంటి చోట్ల సరిహద్దు వివాదాలు దీర్ఘకాలంగా కొనసాగుతున్నాయి. వాటితోపాటు ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్‌, లింపియధురా ప్రాంతాలను కె.పి.శర్మ ఓలి ప్రధానిగా ఉన్నప్పుడు నేపాల్‌ భూభాగాలుగా చూపడం వివాదాస్పదమైంది. దౌత్యమార్గాల్లో వాటిని పరిష్కరించుకోవడంపై దిల్లీ, కాఠ్‌మాండూ దృష్టి సారించాలి.

చైనా కుయుక్తులు

దక్షిణాసియాలో తన పట్టు పెంచుకునేందుకు నేపాల్‌ కీలకమని చైనా భావిస్తోంది. కొన్నేళ్లుగా రాజకీయ అస్థిరతతో సతమతమవుతున్న కాఠ్‌మాండూను తనవైపు తిప్పుకొనేందుకు భారీగా పెట్టుబడులు గుమ్మరిస్తోంది. జిన్‌పింగ్‌ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) ప్రాజెక్టులో నేపాల్‌ కీలక భాగస్వామి. అక్కడి పొఖారా, లుంబినీ విమానాశ్రయాల విస్తరణ ప్రాజెక్టులు డ్రాగన్‌ చేతిలోనే ఉన్నాయి. టిబెట్‌ నుంచి లుంబినీకి రైలుమార్గం నిర్మాణ ప్రతిపాదనలూ సిద్ధమయ్యాయి. నేపాల్‌ ఎఫ్‌డీఐల విషయంలో ఇండియాను చైనా ఇప్పటికే దాటేసింది. ఈ పరిస్థితుల్లో ఇండియా మౌలిక వసతుల రంగంలో నేపాల్‌కు మరింతగా చేయూతనివ్వాలి. చైనా గుమ్మరించే నిధులకంటే, సాంస్కృతికంగా, చారిత్రకంగా ఇండియా-నేపాల్‌ సంబంధాలు సమున్నతమైనవని కాఠ్‌మాండూ అర్థం చేసుకునేలా చూడాలి. నేపాల్‌లో చైనా గ్రాంట్లతో నిర్మించిన ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు కొనుగోలుకు ఇండియా విముఖంగా ఉంది. దాంతో నూతన ప్రాజెక్టుల్లోకి భారత్‌ పెట్టుబడులను నేపాల్‌ ఆహ్వానిస్తోంది. వాటిని అభివృద్ధి చేసి మిగులు విద్యుత్తును సరఫరా చేసుకోవాలని సూచిస్తోంది. పశ్చిమ సేతీ జలవిద్యుత్తు ప్రాజెక్టును చేపట్టాలంటూ భారత కంపెనీలకు దేవ్‌బా ఆహ్వానం పలకడం వెనక కారణం అదే. ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ నేపాల్‌లో పెట్టుబడులను దిల్లీ పెంచాలి. ఆ దేశం పూర్తిగా డ్రాగన్‌ గుప్పిట్లోకి వెళ్ళకుండా కాచుకోవాలి.

- నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆగని పోరుతో సంక్షోభం తీవ్రం

‣ అడవులను కబళిస్తున్న కార్చిచ్చులు

‣ మోయలేని పన్నుల భారం

‣ మానవ హక్కులకు పాతర!

‣ అగ్రరాజ్యాలకు డ్రాగన్‌ సరికొత్త సవాలు

‣ డిజిటల్‌ అంతరాలకు సాంకేతిక పరిష్కారం

‣ ప్రగతి రథానికి చోదకశక్తి

‣ కచ్చితమైన గణాంకాలే వృద్ధికి పునాది

Posted Date: 25-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం