• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ అంతరాలకు సాంకేతిక పరిష్కారం

సమాచార ప్రసారం కొత్తపుంతలు

ప్రాచీన కాలం నుంచి శాంతి సమయాల్లో, యుద్ధ కాలంలో సందేశాల ప్రసారానిదే కీలక పాత్ర. పావురాలు, వార్తాహరుల ద్వారానే కాకుండా వెలుగు, శబ్దం, నిప్పు వెలిగించడం, జెండాలు ఊపడం ద్వారా కూడా సంకేతాలు, సందేశాలను దూరంలో ఉన్నవారికి అందించేవారు. 1837లో శామ్యూల్‌ మోర్స్‌ టెలిగ్రాఫ్‌ పద్ధతిని కనిపెట్టారు. అప్పటి నుంచి మోర్స్‌ కోడ్‌లో తీగల ద్వారా సంకేతాలను పంపడం వీలైంది. 1865 మే 17వ తేదీన జెనీవా కేంద్రంగా అంతర్జాతీయ టెలిగ్రాఫ్‌ యూనియన్‌ (ఐటీయూ) ఏర్పడింది. ఈ రంగంలో కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడం, వాటిపై ప్రజల్లో అవగాహన, ప్రాచుర్యం పెంచడం, కమ్యూనికేషన్లలో అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన ప్రమాణాలను నెలకొల్పడం ఐటీయూ లక్ష్యాలు. 1876లో తీగల మార్గం ద్వారా టెలిఫోన్‌ సంభాషణ జరిపే పద్ధతిని అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ కనిపెట్టారు. 1878 జనవరిలో 21 మంది వినియోగదారులతో అమెరికాలో వాణిజ్య ప్రాతిపదికపై మొట్టమొదటి టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజి ఏర్పడింది. రేడియో, టెలిఫోన్ల వాడకం విస్తృతం కావడంతో 1934లో అంతర్జాతీయ టెలిగ్రాఫ్‌ యూనియన్‌ కాస్తా అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ల యూనియన్‌ (ఐటీయూ)గా పేరు మార్చుకుని కొత్త బాధ్యతలను స్వీకరించింది. మొట్టమొదటి ఐటీయూ ఆవిర్భావ దినమైన మే 17వ తేదీని 1969 నుంచి ఏటా ప్రపంచ కమ్యూనికేషన్ల దినంగా జరుపుతున్నారు. ఏటా అదేరోజు ప్రపంచ సమాచార సమాజ దినం కూడా నిర్వహిస్తున్నారు. తరవాత ఈ రెండు కార్యక్రమాలను విడివిడిగా జరిపే బదులు రెండింటినీ కలిపి ‘ప్రపంచ టెలికమ్యూనికేషన్లు, సమాచార సమాజ దినం (డబ్ల్యూటీఐఎస్‌డీ)’గా జరపాలని ఐటీయూ నిర్ణయించింది. ఏటా మే 17వ తేదీన అప్పటి ప్రపంచ సాంకేతిక, సామాజిక అవసరాలను ప్రతిబింబించే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని, తదనుగుణమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వృద్ధులకూ డిజిటల్‌ సాంకేతికతలను అందుబాటులోకి తీసుకొచ్చి ఆరోగ్యవంతమైన రీతిలో వృద్ధాప్యాన్ని గడిపే వెసులుబాటు కల్పించాలనే నినాదంతో ఈ ఏడాది డబ్ల్యూటీఐఎస్‌డీ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.

వేగంగా అభివృద్ధి

మొదటి ప్రపంచ యుద్ధం తరవాతి నుంచి టెలికమ్యూనికేషన్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందసాగింది. సంబంధిత సాంకేతికతల్లో ఇబ్బడిముబ్బడిగా నవీకరణలు సంభవించసాగాయి. ప్రపంచం మానవ సిబ్బంది నిర్వహించే మేగ్నెటో టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజీల నుంచి డిజిటల్‌ ఎలెక్ట్రానిక్‌ ఎక్స్‌ఛేంజీల వైపు పయనించింది. స్తంభాల మీద టెలిఫోన్‌ తీగల స్థానంలో కక్ష్యలో పరిభ్రమించే కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు వచ్చాయి. భూగర్భ కేబుళ్ల స్థానంలో డిజిటల్‌ ఫైబర్‌ లైన్లు ప్రవేశించాయి. మోర్స్‌ సంకేతాలను పంపించే పద్ధతి పాతబడిపోయింది. నేడు డిజిటల్‌ డేటా ప్రవాహ ఉద్ధృతి పెరిగిపోతోంది. నిరంతరాయ అంతర్జాల అనుసంధానత ప్రపంచాన్ని డిజిటల్‌ కుగ్రామంగా మార్చేసింది. పరిమిత ల్యాండ్‌లైన్లు కాలగర్భంలో కలిసిపోతుంటే సెల్‌ఫోన్ల వాడకం అంతకంతకు విస్తృతమవుతోంది. ప్రపంచమంతటా టెలికమ్యూనికేషన్లకు సర్వామోదనీయ ప్రమాణాలను ఏర్పరచడం, నిర్విరామ అనుసంధానతను నిర్వహించడమనే బాధ్యతలను ఐటీయూ సమర్థంగా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ కమ్యూనికేషన్‌ ఉపగ్రహ వ్యవస్థలో వివిధ దేశాలకు రేడియో స్పెక్ట్రమ్‌, ఉపగ్రహాలకు కక్ష్యలను కేటాయించడం వంటి కీలక బాధ్యతలను నెరవేరుస్తోంది. అంతర్జాతీయ ఫ్రీక్వెన్సీ కేటాయింపులు జరుపుతోంది. ఏక కాలంలో అనేకమంది వినియోగదారులు రేడియో తరంగాలను ఉపయోగిస్తే గందరగోళం ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి రేడియో తరంగాలు, ప్రసారాల నియంత్రణకు ప్రపంచ దేశాలు పలు చట్టాలను తెచ్చాయి. ఐటీయూ వాటిని సమన్వయపరుస్తూ ప్రపంచానికి నిరంతరాయంగా టెలికాం సేవలు అందేలా పర్యవేక్షిస్తోంది.

ఆచితూచి వాడేలా...

సమాచార, టెలికాం సేవలు ఆర్థికాభివృద్ధికి కీలకమే అయినా, వాటివల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని అధిగమించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, వేలకొద్దీ డేటా నిక్షిప్త కేంద్రాల వల్ల వెలువడే ఉద్గారాలు ప్రపంచ కర్బన ఉద్గారాల్లో 3.7 శాతమని అంచనా. 2025కల్లా 5జీ, బ్లాక్‌ చైన్‌, వర్చువల్‌ రియాలిటీ వంటి సరికొత్త సాంకేతికతల మూలంగా ఈ ఉద్గారాలు రెట్టింపవుతాయి. దీన్ని నివారించడానికి సభ్యదేశాలు డేటా కేంద్రాలను శిలాజ ఇంధనాలతో కాకుండా హరిత ఇంధనాలతో నిర్వహించేలా ఐటీయూ చర్యలు తీసుకోవాలి. నెటిజన్లు వీడియో స్ట్రీమింగ్‌, వీడియా కాన్ఫరెన్సింగ్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌, సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వంటి ప్రక్రియలను ఆచితూచి వాడేలా జాగ్రత్తపడాలి. కొత్త సాంకేతికతలతో డిజిటల్‌ అంతరాలను అధిగమించాలి. స్పెక్ట్రం, ఉపగ్రహ కక్ష్యలను అన్ని దేశాల మధ్య నిష్పాక్షికంగా పంచాలి. హ్యాకర్ల ఆటకట్టించి, సైబర్‌ భద్రత పెంచాలి. ఈ ఏడాది నినాదానికి అనుగుణంగా- పెద్ద వయసువారు ఆరోగ్యం, శారీరక, మానసిక, ఆర్థిక స్వాతంత్య్రాలను కాపాడుకోవడానికి, అందరితో సునాయాసంగా సంభాషించడానికి టెలికాం, ఐసీటీ సేవలను సమర్థంగా వినియోగించేలా సభ్య దేశాలకు ఐటీయూ మార్గదర్శకత్వం వహించాలి.

సముచిత ధరలు అవసరం

దేశంలో డిజిటల్‌ అసమానతల్ని రూపుమాపడానికి కేంద్రం గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ లైన్ల ద్వారా హైస్పీడ్‌ డిజిటల్‌ అనుసంధానత కల్పించేందుకు భారత్‌ నెట్‌ ప్రాజెక్టును చేపట్టింది. 2017 డిసెంబరుకల్లా మూడు లక్షల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీని సమకూర్చింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ. 2023 మార్చి 31కల్లా 3,25,000 గ్రామాలకు ఈ సౌకర్యం విస్తరించనున్నారు. ఈ గ్రామాలన్నింటికీ ఏడు లక్షల వైఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేస్తారు. వినియోగదారులకు తక్కువ ధరకు వాయిస్‌, డేటా సేవలు అందించడానికి వీలుగా 5జీ స్పెక్ట్రం రిజర్వు ధరను 40శాతం తగ్గించాలని ట్రాయ్‌ సిఫార్సు చేయగా, 90శాతం తగ్గించాలని భారత సెల్యులర్‌ ఆపరేటర్ల సంఘం (సీఓఏఐ) యోచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు తీవ్ర ఆదాయ నష్టం సంభవిస్తుంది. మరోవైపు టెలికాం సేవలు అందించే కంపెనీలు (టీఎస్‌పీ) పోటీ పడి ధరలు తగ్గించడంతో దాదాపు సగం కంపెనీలు దివాలా తీశాయి. వాటికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రూ.4.5 లక్షల కోట్ల మేరకు ఇచ్చిన రుణాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ తీవ్ర ఇబ్బందులకు లోనైంది. పరిశ్రమ ఆర్థికంగా నిలదొక్కుకుని ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలను చేపట్టాలంటే, సంపన్న దేశాల మాదిరిగా వాయిస్‌, డేటా సేవలకు సముచిత ధరలు నిర్ణయించాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రగతి రథానికి చోదకశక్తి

‣ కచ్చితమైన గణాంకాలే వృద్ధికి పునాది

‣ సాగు బాగుకు సేంద్రియ మార్గం

‣ అలీన పథం... ఆదర్శ మార్గం!

‣ కార్చిచ్చులు... అడవులకు పెనుముప్పు

‣ విచక్షణాధికారం పేరిట ఏకపక్ష నిర్ణయాలా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం