• facebook
  • whatsapp
  • telegram

కార్చిచ్చులు... అడవులకు పెనుముప్పు

జన భాగస్వామ్యంతోనే సమర్థ నియంత్రణ

 

 

పచ్చని అడవులను భస్మీపటలం చేస్తున్న కార్చిచ్చులు ప్రపంచదేశాలకు పెనుసవాళ్లు విసురుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమై వనాల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా కార్చిచ్చుల నియంత్రణ అనేక దేశాల్లో క్లిష్టతరంగా మారుతోంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలవల్ల ఇటీవల మూడు రోజుల్లో భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో 7,800 ప్రాంతాల్లో కార్చిచ్చులు రగిలి- వనాలను దహించివేసినట్లు ‘జాతీయ అటవీ సర్వే సంస్థ’ వెల్లడించడం ప్రమాద తీవ్రతను కళ్లకు కడుతోంది. నల్లమల అడవులతో పాటు హిమాలయాలు, తూర్పు, పశ్చిమ కనుమల్లోని వనాల్లో తలెత్తే అగ్నిప్రమాదాలు అనూహ్యమైన ప్రకృతి నష్టాన్ని మిగిలిస్తున్నాయి. కొన్నేళ్లుగా ఏటా భారత్‌ సహా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, రష్యా తదితర దేశాల్లో తలెత్తుతున్న కార్చిచ్చులతో భారీ విస్తీర్ణంలోని అడవులు బూడిదైపోవడం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

 

కలవరపెడుతున్న ప్రమాదాలు  

భూమిపైన ఉన్న 80శాతం మేర జంతువులు, వృక్షజాతులు, కీటకాలకు అడవులు ఆవాసంగా ఉన్నాయి. వాతావరణ మార్పులకు దారితీసే పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు జీవుల మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, ఔషధాలను అందించడంలో అటవీ వనాలు విశేషమైన పోషిస్తున్నాయి. ప్రపంచ అవసరాలను తీరుస్తున్న నీటివనరుల్లో 75శాతం ఏర్పడేందుకు అడవులే కారణం. కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వేగంగా సాగుతున్న అడవుల క్షీణత భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోంది. వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలతోపాటు, వర్షాభావ పరిస్థితులతో ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత కార్చిచ్చులకు ఎక్కువగా కారణమవుతోంది. కార్చిచ్చులు వ్యాపిస్తే మంటలను అదుపులోనికి తీసుకురావడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. గ్లోబల్‌ ఫారెస్ట్‌ వాచ్‌ సంస్థ, మేరీల్యాండ్‌ యూనివర్సిటీ ఇటీవల కార్చిచ్చులకు సంబంధించి గడచిన 20 ఏళ్ల ఉపగ్రహ సమాచార విశ్లేషణతో ఒక నివేదికను విడుదల చేశాయి. ఈ అధ్యయనం ప్రకారం 2001-2021 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 22.20 కోట్ల ఎకరాల్లోని అడవులు దావానలాలవల్ల కనుమరుగయ్యాయంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గత ఏడాదిలోనే 2.70 కోట్ల ఎకరాల్లో అడవులు అగ్నికి ఆహుతయ్యాయి. కార్చిచ్చులవల్ల ఏటా 250 నుంచి 400 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు విడుదలవుతున్నాయని అంచనా.

 

ఆర్థిక వనరులను సమకూర్చి, అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానంతో పటిష్ఠ కార్యాచరణ అమలు చేయడంతో పాటు, అడవుల్లో నివసించే స్థానికుల భాగస్వామ్యం పెంచడం ద్వారా కార్చిచ్చుల నియంత్రణకు వివిధ దేశాలు కృషి చేస్తున్నాయి. అడవులను నమ్ముకొని ఉండే గిరిజనుల సంప్రదాయ పరిరక్షణ ప్రక్రియలకు, సాంకేతికతను జోడించి ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్నేళ్లుగా అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, బొలీవియా, బ్రెజిల్‌ తదితర దేశాల్లో కార్చిచ్చులు అధికంగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కార్చిచ్చుల నియంత్రణకు అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకూ అక్కడ సుమారు 90 కిలోమీటర్ల విద్యుత్‌ లైన్లను భూగర్భ సరఫరా వ్యవస్థగా మార్చారు. అడవుల్లో ప్రాథమిక స్థాయిలో నేలపై గడ్డి అంటుకున్నప్పుడే మంటలను అదుపు చేసేందుకు ఇటీవల ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి కీలకమైన 79 స్థానిక సంస్థలను భాగస్వాములుగా చేర్చి నియంత్రణ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. అమెరికాలో ఏటా వేలాది ప్రాంతాల్లో కార్చిచ్చులు ఎగిసిపడి లక్షలాది ఎకరాల అడవులను బుగ్గి చేస్తున్నాయి. గత ఏడాది అక్కడ 70 లక్షల ఎకరాల్లో అడవులు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. స్థానిక సమూహాలను భాగస్వాములను చేసి కార్చిచ్చుల నియంత్రణకు 30కి పైగా ప్రాజెక్టులకు నిధులను సమకూరుస్తోంది. అందులో భాగస్వాములైన 200 పైగా సమూహాల ప్రజలు అడవుల్లో ఎండిపోయి వృథాగా ఉన్న వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. ఇళ్లకు దగ్గరగా ఉన్న గడ్డి, వృక్షాలను తొలగించి అడవుల్లో కార్చిచ్చు రగిలినా గృహసముదాయాల వరకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. బ్రెజిల్‌లో 2014 నుంచి సమగ్ర అగ్ని ప్రమాదాల యాజమాన్యాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో చిన్న రైతులు, స్థానిక ఆదివాసులు భాగస్వాములుగా ఉంటూ కార్చిచ్చుల నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కెనడా, ఇంగ్లాండ్‌ వంటి దేశాల్లోనూ స్థానికులను భాగస్వాములను చేసి కార్చిచ్చుల నియంత్రణకు ప్రణాళికలను అమలు పరుస్తున్నారు.

 

బలోపేతం కావాల్సిన స్థానిక కమిటీలు

అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చుల నియంత్రణ, నిర్వహణకు భారత్‌లో చట్టబద్ధమైన ఏర్పాట్లు ఉన్నాయి. అటవీ చట్టం 1927 సెక్షన్‌ 26, 33; వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 సెక్షన్‌ 30 ప్రకారం వనాల్లో కార్చిచ్చులకు కారణమయ్యే కార్యకలాపాలను తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నోడల్‌ ఏజెన్సీగా జాతీయ అటవీ అగ్నిప్రమాదాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కార్చిచ్చులు ఏర్పడే అవకాశం ఉన్న వనాలను అటవీ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుంది. దేశంలో ఎక్కడైనా కార్చిచ్చు తలెత్తితే తక్షణమే ఆ ప్రాంతంలోని అటవీ యంత్రాంగాన్ని మొబైల్‌ సంక్షిప్త సందేశాల ద్వారా అప్రమత్తం చేస్తారు. అటవీ సిబ్బంది, ఆర్థిక, రవాణా వనరుల కొరతకు తోడు అటవీ పరిరక్షణలో స్థానిక సమూహాల భాగస్వామ్యం బలహీన పడటం వంటి పరిస్థితులవల్ల ప్రమాదాలను వేగంగా నియంత్రించలేని పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌లో అడవుల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములుగా చేసే ప్రక్రియ దశాబ్దాల క్రితమే మొదలైనా- కొన్నేళ్లుగా బలహీనపడింది. ఉమ్మడి అటవీ యాజమాన్యం, సామాజిక అటవీ యాజమాన్యం తదితర పథకాలు నిర్వీర్యం కావడమే ఇందుకు నిదర్శనం. భారత్‌లో అడవుల సమీపంలో 1.75లక్షల వరకు గ్రామాలున్నాయని అంచనా. ఈ గ్రామాల్లో ఇప్పటికే ఉన్న వనసంరక్షణ సమితులు, జీవవైవిధ్య యాజమాన్య కమిటీలను మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అడవులతో మమేకమై జీవించే గిరిజనులు, ఇతర సమూహాలు అటవీ ఆధారిత ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అడవులు పచ్చగా, పరిపుష్టంగా ఉంటే వారి జీవనమూ సజావుగా సాగుతుంది. వనాల పరిరక్షణ, కార్చిచ్చుల నియంత్రణలో స్థానికుల భాగస్వామ్యంతో సమష్టి కృషి జరిగేలా కార్యాచరణ అమలు కావాలి. అప్పుడే వనాలను అగ్నిప్రమాదాల నుంచి కాపాడుకోగలం!

 

భారత్‌లో పరిస్థితి ఆందోళనకరం

భారత్‌లో దావానలాలు అడవులను దహించివేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘జాతీయ అటవీ సర్వే సంస్థ (ఎఫ్‌ఎస్‌ఐ)-2021’ నివేదిక భారత్‌లోని అడవుల్లో 22శాతానికి కార్చిచ్చుల ప్రమాదం పొంచి ఉందని వెల్లడించింది. దేశంలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఫిబ్రవరి-జూన్‌ మధ్య కాలంలో ఎక్కువ అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. 2021లో దేశవ్యాప్తంగా 3.45 లక్షల దావానలాలు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుకనుమల పరిధిలోకి వచ్చే ఒడిశాలో 51 వేల అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 19 వేలు, తెలంగాణలో 18 వేల చొప్పున ప్రమాదాలు సంభవించాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కరెంటు కోతలతో దేశానికి ఉక్కపోత

‣ రక్షణ రంగంలో డ్రోన్ల విజృంభణ

‣ విదేశీ వాణిజ్యం కొత్తపుంతలు

‣ సమష్టి కృషితోనే పేదరికం నుంచి బయటకు

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 07-05-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం