• facebook
  • whatsapp
  • telegram

రక్షణ రంగంలో డ్రోన్ల విజృంభణ

స్వావలంబనకు భారత్‌ కృషి

 

 

ఆధునిక యుద్ధంలో మానవ రహిత డ్రోన్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. అఫ్గానిస్థాన్‌, పశ్చిమాసియాలలో కొందరు ఉగ్రవాదులను డ్రోన్ల సాయంతో అమెరికా మట్టుపెట్టిన దగ్గర నుంచి వాటి ఉపయోగమేమిటో ప్రపంచానికి తెలిసివచ్చింది. కేవలం టర్కీ, ఇజ్రాయెల్‌ సరఫరా చేసిన డ్రోన్లతోనే ఆర్మీనియా సైన్యాన్ని అజర్‌బైజాన్‌ ఓడించగలిగింది. కారుచౌక చైనీస్‌ డ్రోన్ల సాయంతో భారత్‌లోకి మాదకద్రవ్యాలను పాకిస్థాన్‌ దొంగ రవాణా చేస్తోంది. పాక్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా 2021 జూన్‌లో జమ్మూలోని భారత వైమానిక దళ స్థావరంపై ఒక డ్రోన్‌తో నాటుబాంబులు ప్రయోగించింది. 2021లో మొత్తం 67 పాక్‌ డ్రోన్లను కనిపెట్టామని, తమ కంటపడకుండా మరెన్నో డ్రోన్లు తిరిగి ఉండవచ్చని భారత సరిహద్దు భద్రతాదళం తెలిపింది. చైనా, టర్కీల సహకారంతో పాకిస్థాన్‌ సొంతంగా డ్రోన్ల తయారీ చేపడుతోంది.

 

డీఆర్‌డీఓ ముందడుగు

డ్రోన్లలో అగ్రరాజ్య హోదాను సాధించడానికి అమెరికా, రష్యా, చైనాలతోపాటు ఇజ్రాయెల్‌, టర్కీలు సైతం పోటీపడుతున్నాయి. డ్రోన్ల విషయంలో భారత్‌ మాత్రం వెనకబడి పోయిందన్నది నిష్ఠుర సత్యం. భారత్‌ ఇప్పటిదాకా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానం, పరికరాలతో సొంత డ్రోన్‌నుగానీ, మానవ రహిత గగన వాహనం (యూఏవీ)గానీ తయారు చేయలేకపోవడం ఆందోళనకరం. అభ్యాస్‌, లక్ష్య అనే పైలట్‌ రహిత టార్గెట్‌ డ్రోన్లను, నిఘా కార్యకలాపాల కోసం నేత్ర యూఏవీని రూపొందించినా, అవి శత్రువుపై నేరుగా పోరాడలేవు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) వడిసెల వంటి విసిరే సాధనం నుంచి ప్రయోగించే నిశాంత్‌ యూఏవీని తయారుచేసింది. అవి వరసగా కూలిపోవడంతో పక్కన పడేశారు. అందుకే మూడు దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌ నుంచి హెరాన్‌, సెర్చర్‌ యూఏవీలను ఇండియా దిగుమతి చేసుకోక తప్పడంలేదు. వాటికి తోడు అమెరికా నుంచి కొన్ని ప్రిడేటర్‌ డ్రోన్లను లీజుకు తీసుకుని ఉపయోగిస్తోంది.

 

డ్రోన్లకోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అగత్యాన్ని తప్పించడానికి డీఆర్‌డీఓ అవిశ్రాంతంగా పనిచేస్తోంది. తాము రూపొందిస్తున్న రుస్తుం-2 డ్రోన్‌ ఇటీవల ఆకాశంలో 27,500 అడుగుల ఎత్తును అందుకొని 18 గంటలపాటు నిర్విరామంగా ఎగిరిందని డీఆర్‌డీఓ ఛైర్మన్‌ జి.సతీశ్‌ రెడ్డి వెల్లడించారు. గగనతలం నుంచి నిఘాకు, శత్రు కదలికలపై సమాచార సేకరణకు తోడ్పడే రుస్తుం-2 డ్రోన్‌ తపస్‌-బీహెచ్‌-201గా పేరు మార్చుకుంది. దానికి బాంబులు, క్షిపణులను అమర్చడం గురించి సైన్యంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సతీశ్‌ రెడ్డి తెలిపారు. దాంతోపాటు డీఆర్‌డీఓ అనుబంధ ఏరోనాటికల్‌ అభివృద్ధి సంస్థ (ఏడీఈ) భారత వైమానిక దళం కోసం మానవ రహిత పోరాట గగన వాహనం (యుకావ్‌) ఘాతక్‌ను రూపొందిస్తోంది. దీనికి బాంబులు, క్షిపణులను ప్రయోగించే సత్తా ఉంది. రాడార్లకు చిక్కకుండా ఎగిరే ఈ స్టెల్త్‌ డ్రోన్‌ను నిరుడు రహస్యంగా ప్రయోగించి చూశారు. దానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

 

న్యూ స్పేస్‌ రీసెర్చ్‌ అండ్‌ టెక్నాలజీస్‌ అంకుర సంస్థ డ్రోన్ల దండు రూపకల్పనలో భారత సైన్యానికి సహకరిస్తోంది. న్యూ స్పేస్‌తోపాటు అమెరికా వైమానిక దళానికి చెందిన పరిశోధన ప్రయోగశాలల నుంచీ సహకారం తీసుకుని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఆల్ఫా ఎస్‌ అనే డ్రోన్ల దండు వ్యవస్థను రూపొందిస్తోంది. తేజస్‌ యుద్ధ విమానం, కొత్తగా రూపొందిస్తున్న అయిదో తరం యుద్ధ విమానం అమ్కా నుంచి ప్రయోగించడానికి అనువైన డ్రోన్లను హెచ్‌ఏఎల్‌ తయారు చేయదలచింది. మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం కింద ఈ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం అండదండలు అందిస్తోంది.

 

‘ప్రైవేటు’ భాగస్వామ్యం

డ్రోన్ల తయారీలో మరికొన్ని భారతీయ ప్రైవేటు సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌ రోబోటిక్స్‌ సంస్థ ఇంద్రజాల్‌ అనే యాంటీ డ్రోన్‌ వ్యవస్థను రూపొందించింది. రన్‌ వే అవసరం లేకుండా ఉన్నచోట నుంచే నిట్టనిలువుగా పైకి ఎగిరే (వీటోల్‌) స్విచ్‌ డ్రోన్‌ను ముంబయికి చెందిన ఐడియాఫోర్జ్‌ సంస్థ తయారు చేసింది. భారత సైన్యానికి 200 వీటోల్‌ డ్రోన్ల సరఫరాకు ఇజ్రాయెల్‌, రష్యా, ఉక్రెయిన్‌, ఫ్రాన్స్‌ సంస్థలు పోటీపడినా- వాటిని తోసిరాజని ఐడియాఫోర్జ్‌ మార్చి నెలలో ఈ కాంట్రాక్టు చేజిక్కించుకుంది. హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ హిందుస్థాన్‌ యూఏవీ సిస్టమ్స్‌ హిమాలయాల్లో 18,000 అడుగుల ఎత్తున ఎగురుతూ శత్రు సేనల కదలికలను కనిపెట్టగల డ్రోన్లను రూపొందించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు చేయీచేయీ కలిపి డ్రోన్ల రంగంలో భారత్‌ను ప్రముఖ శక్తిగా నిలబెట్టాల్సిన సమయం వచ్చేసింది. అందుకే మేక్‌ ఇన్‌ ఇండియా కింద సొంతంగా డ్రోన్ల తయారీపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆలోగా త్రివిధ సాయుధ దళాలకోసం అమెరికా నుంచి కొనదలచిన ప్రిడేటర్‌ డ్రోన్ల సంఖ్యను ఎంతమేరకు కుదించవచ్చునో నిర్ధారించడానికి ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. వాషింగ్టన్‌లో జరిగిన భారత్‌, అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రుల (2 ప్లస్‌ 2) సమావేశంలో డ్రోన్‌ దాడులను ఎదుర్కొనే వ్యవస్థలు, ఇంటెలిజెన్స్‌, నిఘాల కోసం ఇస్టార్‌ వ్యవస్థల అభివృద్ధిలో పరస్పరం సహకరించుకోవాలని నిశ్చయించారు. కృత్రిమ మేధతో పనిచేసే డ్రోన్ల దండులనూ సంయుక్తంగా రూపొందించాలని నిర్ణయించారు.

 

ఊపందుకొంటున్న పరిశోధనలు

ప్రపంచంలో మొట్టమొదటి డ్రోన్ల దండు దాడి 2018లో సిరియాలో జరిగింది. అక్కడ రష్యన్‌ సేనలపై 13 డ్రోన్లు మూకుమ్మడిగా దాడి చేశాయి. రష్యన్లు ఎలక్ట్రానిక్‌ యుద్ధ సాంకేతికతతో వాటిలో ఏడింటిని కూల్చి, మిగతా ఆరు డ్రోన్లను నిస్తేజం చేశారు. అప్పటి నుంచి 2020 వరకు మొత్తం 150 డ్రోన్లను రష్యన్లు ఎదుర్కొన్నారు. సిరియాలో రష్యన్‌ సేనల అనుభవాన్ని గమనించిన భారత్‌ 2019 నుంచి డ్రోన్ల దండులపై పరిశోధన జరుపుతోంది. శత్రు డ్రోన్ల ఎలక్ట్రానిక్‌ వ్యవస్థలను స్తంభింపజేసి, లేజర్లతో వాటిని కూల్చివేయగల యాంటీ డ్రోన్‌ వ్యవస్థను డీఆర్‌డీఓ రూపొందించింది. ఎక్కడికైనా తీసుకెళ్ళగల ఈ పోర్టబుల్‌ వ్యవస్థలను 2020 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత సందర్శనకు వచ్చినప్పుడే మోహరించారు. అదే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట వద్దా వాటిని నియోగించారు. 2021లో సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైన్యం 75 మానవ రహిత పోరాట గగన వాహనాల (యుకావ్‌) దండును ప్రయోగించింది. మున్ముందు 1,000 యుకావ్‌ డ్రోన్ల దండును ప్రయోగించాలని భారత్‌ కంకణబద్ధమైంది.

 

- ఆర్య

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కళ తప్పుతున్న జీవవైవిధ్యం

‣ విశ్వసనీయ బంధానికి బాటలు

‣ పాక్‌ స్నేహ పల్లవి

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 03-05-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం