• facebook
  • whatsapp
  • telegram

విశ్వసనీయ బంధానికి బాటలు

ఆశాజనకంగా బ్రిటన్‌ ప్రధాని భారత్‌ పర్యటన

దశాబ్దాలుగా ముందుకూ వెనక్కీ సాగుతున్న భారత్‌, బ్రిటన్‌ సంబంధాలు త్వరలో కొత్త రూపు సంతరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ తాజాగా మన దేశంలో చేపట్టిన పర్యటన ఇందుకు బాటలు పరిచింది. రక్షణ, వాణిజ్యం, వాతావరణ మార్పులు, విద్య, శాస్త్ర సాంకేతికత వంటి రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకునేందుకు అవసరమైన ప్రణాళికలను ఆవిష్కరించింది. గతంలో మాదిరిగా కాగితాలకు పరిమితం చేయకుండా వాటిని కలిసికట్టుగా అమలు చేయగలిగితే ఇరు దేశాలు గణనీయంగా లబ్ధి పొందుతాయి. తమ సాయుధ బలగాలకు అవసరమైన ఆధునిక ఆయుధ సాంకేతికతలను పరస్పర సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని దిల్లీ, లండన్‌ తీర్మానించుకోవడం జాన్సన్‌ పర్యటన ఫలాల్లో అత్యంత కీలకమైనది. రక్షణ రంగంలో మోదీ సర్కారు కాంక్షిస్తున్న స్వావలంబన సాకారమయ్యేందుకు ఇది దోహదపడనుంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆది నుంచీ ఎండగడుతూ వస్తున్న బ్రిటన్‌ ప్రధాని- భారత్‌లో స్వరం తగ్గించి మాట్లాడటం అందరి దృష్టినీ ఆకర్షించింది.

రక్షణ సహకారానికి ఊపు

దేశ విభజన చేదు జ్ఞాపకాలు, ప్రచ్ఛన్న యుద్ధం తదనంతర పరిణామాల ఫలితంగా ఇండియా, బ్రిటన్‌ దీర్ఘకాలంపాటు దాదాపుగా ఏ రంగంలోనూ పరస్పరం పూర్తిస్థాయి విశ్వసనీయ భాగస్వాములుగా అవతరించలేదు. స్నేహపూర్వక దేశాలుగానే ఉన్నా, సమగ్ర వ్యూహాత్మక సంబంధాలు నెలకొల్పుకొనేందుకు ప్రయత్నాలు జరగలేదు. చైనా, పాకిస్థాన్‌లతో లండన్‌ సాన్నిహిత్యమూ అందుకు కారణమే. గత దశాబ్దంలో వాషింగ్టన్‌, బీజింగ్‌ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తరహా పరిస్థితులు ప్రారంభమయ్యేంత వరకు డ్రాగన్‌తో బ్రిటన్‌ అంటకాగింది. జాన్సన్‌ ప్రధాని పీఠమెక్కాక పరిస్థితులు గణనీయంగా మారాయి. మోదీతో ఆయనకున్న వ్యక్తిగత స్నేహం కూడా కలిసి వస్తుండటంతో, ప్రస్తుతం ద్వైపాక్షిక మైత్రిని కొత్త ఎత్తులకు తీసుకెళ్ళేందుకు మునుపెన్నడూ లేనంత అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంతో ప్రపంచ భౌగోళిక రాజకీయాలు కీలక మలుపులో ఉన్నాయి. ఈ తరుణంలో ఇండియాలో బ్రిటన్‌ ప్రధాని పర్యటన మోదీ సర్కారు ఆకాంక్షలకు అనుగుణంగా సాగింది. గత ఏడాది వర్చువల్‌గా భేటీ అయిన మోదీ, జాన్సన్‌- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి 2030 రోడ్‌మ్యాప్‌ను ఆమోదించారు. దానికి అనుగుణంగా ప్రస్తుతం వివిధ ఒప్పందాలు ఖరారయ్యాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో దిల్లీకి తోడుగా నిలవనున్నట్లు జాన్సన్‌ ప్రకటించారు. మన దేశానికి రక్షణ సామగ్రి, సాంకేతికతల బదిలీని సులభతరం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఆధునిక ఆయుధ సంపత్తి అభివృద్ధి కోసం సంయుక్తంగా పరిశోధనలు జరిపేందుకు అంగీకరించారు. సరికొత్త యుద్ధ విమాన సాంకేతికత అభివృద్ధిలో భారత్‌కు భాగస్వామిగా మారతామన్నారు. రష్యా నుంచి ఇండియాకు దిగుమతులను తగ్గించడం కూడా లండన్‌ అజెండాలో భాగమే! తాజా ఒప్పందాలు అమలుకు నోచుకోవడమే కీలకం. ఇరు దేశాలు దీర్ఘకాలంగా కాంక్షిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) దీపావళికల్లా కార్యరూపం దాల్చే అవకాశాలున్నట్లు ప్రకటన వెలువడటం జాన్సన్‌ పర్యటనలో మరో కీలక పరిణామం. ద్వైపాక్షిక సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేర్చడంలో ఎఫ్‌టీఏ దోహదపడనుంది. ఈ ఒప్పందం సాకారమైతే ఇరు దేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. 2035 కల్లా వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపయ్యే అవకాశముంటుంది. ఇండియాకు బ్రిటన్‌ నుంచి విస్కీ, లగ్జరీ కార్ల ఎగుమతి పుంజుకొంటుంది. అయితే ఎఫ్‌టీఏ ఖరారు అంత సులువు కాదు. విస్కీ, కార్లపై ప్రస్తుతం భారత్‌ భారీగా సుంకాలు విధిస్తోంది. ఆ భారాన్ని తగ్గించాలని జాన్సన్‌ సర్కారు పట్టుపట్టడం ఖాయం. అదే సమయంలో భారతీయులకు మరిన్ని వీసాలు అందుబాటులోకి తీసుకురావాలని మోదీ ప్రభుత్వం కూడా ఒత్తిడి పెంచే అవకాశముంది. భారత ఔషధాలు, ఇతర ఉత్పత్తులకు లండన్‌ విపణి ప్రవేశాన్ని సులభతరం చేయాలని డిమాండ్‌ చేయడం లాంఛనమే. బ్రెగ్జిట్‌ తరవాత బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పి క్రమంగా కుంచించుకుపోతోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఆ దేశానికి సుస్థిర భాగస్వాములు అవసరం. 2050 కల్లా ప్రపంచంలోకెల్లా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలన్నీ మనవైపు చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్ని మోదీ సర్కారు సద్వినియోగం చేసుకోవాలి. తమ డిమాండ్లకు జాన్సన్‌ ప్రభుత్వాన్ని ఒప్పించాలి.  

కలిసికట్టుగా ముందుకు

ఖలిస్థానీలు, కశ్మీర్‌ వేర్పాటువాదులపై కొరడా ఝళిపించడంలో బ్రిటన్‌ దీర్ఘకాలంగా అలసత్వం ప్రదర్శిస్తోందనే విమర్శలున్నాయి. లండన్‌పై దిల్లీ అసంతృప్తికి ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటి. నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) వంటి ఖలిస్థానీ సంస్థలు లండన్‌లో భారత హైకమిషన్‌ ఎదుట పదేపదే నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఇతర దేశాలను లక్ష్యంగా చేసుకునేందుకు బ్రిటన్‌ను ఆశ్రయ కేంద్రంగా మార్చుకుంటే సహించబోమంటూ జాన్సన్‌ ఇండియా పర్యటనలో ఉద్ఘాటించారు. ఆయన మాటలు చేతల రూపంలోకి ఎంతవరకు మారతాయో చూడాలి. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్ల అప్పగింతకు సంబంధించి అధికారిక హామీ కూడా ఇవ్వలేదు. నింగి, నేల, నీరుతోపాటు అంతరిక్షం, సైబర్‌ రంగంలో ఎదురయ్యే నూతన సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలని ఇండియా, బ్రిటన్‌ తాజాగా నిశ్చయించుకున్నాయి. కలిసికట్టుగా ముందుకుసాగితే ఈ రంగంలో ఇరు దేశాల్లో వ్యాపారావకాశాలు పెరుగుతాయి. ఉపాధి కల్పన ఊపందుకుంటుంది. ఇండో పసిఫిక్‌లో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఇండియా సహకారం తీసుకోవాలని బ్రిటన్‌ యోచిస్తోంది. జాన్సన్‌ పర్యటనలో ఈ విషయం స్పష్టమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విస్తరణకు సంప్రదింపులు ప్రారంభించాలన్న ఆకాంక్షను లండన్‌ వెలిబుచ్చడం ఇండియా స్వాగతించదగిన పరిణామం.

ఉక్రెయిన్‌పై ఆచితూచి...

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని బ్రిటన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అమెరికా వంటి ఇతర దేశాలతో కలిసి రష్యాను ఆంక్షల చట్రంలో బంధించేందుకు ప్రయత్నిస్తోంది. యుద్ధం జరుగుతుండగానే ఇటీవల కీవ్‌లో పర్యటించిన జాన్సన్‌- ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇదేక్రమంలో జాన్సన్‌ ఇండియాకు విచ్చేయడంతో రష్యాకు వ్యతిరేకంగా గళమెత్తేలా మోదీపై ఒత్తిడి పెంచుతారనే విశ్లేషణలు వచ్చాయి. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. ఉక్రెయిన్‌ సంక్షోభంపై మోదీ, జాన్సన్‌ తమ అభిప్రాయాలు పంచుకున్నప్పటికీ, ద్వైపాక్షిక సంబంధాలకే అధిక ప్రాధాన్యమిచ్చారు. మాస్కోతో దిల్లీ చారిత్రక బంధాన్ని అందరూ గౌరవిస్తున్నారని బ్రిటన్‌ ప్రధాని ఉద్ఘాటించారు. ఉక్రెయిన్‌లో హింసను మోదీ సర్కారు తీవ్రంగా ఖండిస్తోందన్నారు. తరచూ దూకుడుగా మాట్లాడే జాన్సన్‌ నోటి వెంట ఇలాంటి మాటలు రావడం ఆశ్చర్యకరమే. ఉక్రెయిన్‌ సంక్షోభం విషయంలో భారత వైఖరిని మార్చడం ఎవరి తరమూ కాదని ప్రపంచానికి స్పష్టమైన సంకేతాలిచ్చింది.

- మండ నవీన్‌కుమార్‌ గౌడ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పాక్‌ స్నేహ పల్లవి

‣ ఆర్థిక వృద్ధికి ద్రవ్యోల్బణం దెబ్బ

‣ సరిహద్దుల్లో సం‘గ్రామాలు’

‣ క్షేత్ర పాలన... ప్రజాస్వామ్యానికి ఆలంబన!

‣ కశ్మీరంలో ప్రగతి సమీరం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 30-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం