• facebook
  • whatsapp
  • telegram

కశ్మీరంలో ప్రగతి సమీరం

ప్రధాని పర్యటనపై సర్వత్రా ఆసక్తి

 

 

ముష్కర మూకల స్వైరవిహారంతో దశాబ్దాలపాటు అభివృద్ధికి నోచుకోని జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. మౌలిక వసతుల కల్పనతో పర్యాటక రంగం ఊపందుకుంటోంది. ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు చేకూరుతున్నాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని కొన్నిరోజులుగా జరుగుతున్న ఉగ్రదాడులు ఒకింత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ- 370 అధికరణ రద్దుకు ముందునాటితో పోలిస్తే అక్కడ భద్రతా ప్రమాణాలు పెరిగాయి. ఈ తరుణంలో ఏప్రిల్‌ 24న జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూ ప్రాంతంలోని సాంబా జిల్లా పల్లీ గ్రామం నుంచి గ్రామీణ స్థానిక సంస్థలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

 

మోదీ ప్రత్యేక దృష్టి

ప్రధాని పీఠమెక్కినప్పటి నుంచీ జమ్మూకశ్మీర్‌పై మోదీ ప్రత్యేకంగా దృష్టిసారించారు. రికార్డు స్థాయిలో అక్కడ 20 సార్లు పర్యటించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఉగ్రభూతాన్ని పారదోలాలన్న ప్రాథమిక లక్ష్యంతో ఆయన నేతృత్వంలోని కేంద్ర సర్కారు 2019 ఆగస్టులో 370 అధికరణను ఉపసంహరించుకొని, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించింది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌)గా  దాన్ని విభజించింది. ఆ తరవాత మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తుండటం ఇదే తొలిసారి. నిజానికి ఆయన 2019, 2021లో జమ్మూకశ్మీర్‌కు వెళ్ళినా, సరిహద్దుల్లో సైనిక బలగాలతో దీపావళి జరుపుకొనేందుకే పరిమితమయ్యారు. ఈ దఫా స్థానికంగా పర్యటించనున్నారు. భారీ ర్యాలీలో పాల్గొననున్నారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్న సందేశమిచ్చేందుకే తన పర్యటన కోసం పల్లీ గ్రామాన్ని మోదీ ఎంచుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 370 అధికరణ రద్దు తరవాత జమ్మూకశ్మీర్‌లో ముష్కర కార్యకలాపాలు, నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు తగ్గాయి. గత మూడేళ్లలో అక్కడ 600 మందికిపైగా ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి. కొన్ని నెలల్లో 80 లక్షల మందికిపైగా పర్యాటకులు జమ్మూకశ్మీర్‌ను సందర్శించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్లుగా నిలిచిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది మళ్ళీ మొదలుకానుంది. స్థానిక పర్యాటకం మరింత ఊపందుకొనేందుకు ఇది వీలు కల్పించనుంది. జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడుల పెంపుదలకు కేంద్రం తీవ్రంగా కృషిచేస్తోంది. యూఏఈ సహా పలు గల్ఫ్‌ దేశాల ప్రతినిధుల బృందం ఇటీవల ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించింది. ఇప్పటికే కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. గతేడాది నవంబరులో జమ్మూకశ్మీర్‌లో రూ.11 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో 25 జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం చీనాబ్‌ నదిపై ఇప్పటికే పూర్తయింది. 2022-23కు జమ్మూకశ్మీర్‌కు రూ.1.42 లక్షల కోట్ల బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదించింది. 2018 నవంబరు నుంచి జమ్మూకశ్మీర్‌లో శాసనసభ మనుగడలో లేదు. జమ్మూకశ్మీర్‌ పంచాయతీరాజ్‌ చట్టం-1989ను 2020లో సవరించి స్థానికంగా జిల్లా అభివృద్ధి మండళ్ల(డీడీసీల)ను ఏర్పాటు చేశారు. డీడీసీలకు ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. శాసనసభ లేనప్పటికీ డీడీసీలతో అక్కడ ప్రజాస్వామ్యాన్ని కేంద్రం పరిరక్షిస్తోంది. డీడీసీ, హల్కా పంచాయతీలు, బ్లాక్‌ అభివృద్ధి మండళ్లతో (బీడీసీలతో) జమ్మూకశ్మీర్‌లో తొలిసారి మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమలులోకి రావడం మరో కీలక పరిణామం. పునరావాస ప్యాకేజీ కింద ప్రకటించిన ఉద్యోగాల్లో చేరేందుకు కశ్మీరీ పండిట్‌లు తిరిగొస్తుండటమూ హర్షణీయం.

 

మళ్ళీ ముష్కర కలకలం

దాదాపు నెల రోజులుగా జమ్మూకశ్మీర్‌లో ముష్కర దాడులు మళ్ళీ పెరుగుతున్నాయి. ప్రధానంగా స్థానికేతరులు, హిందువులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వారు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటిదాకా జమ్మూకశ్మీర్‌లో అయిదుగురు సర్పంచులు హత్యకు గురయ్యారు. మరోవైపు- పాకిస్థాన్‌లో ప్రధాని పీఠమెక్కిన తొలిరోజే షెహబాజ్‌ షరీఫ్‌ కశ్మీర్‌లో రక్తం ఏరులై పారుతోందంటూ మొసలికన్నీరు కార్చారు. ఈ పరిస్థితుల్లో ప్రధాని పర్యటన స్థానికుల్లో భద్రతపై భరోసా కల్పించాలి. జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశముంది. ఆ వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని మోదీ, అమిత్‌ షా చెబుతున్నారు. భద్రతాపరిస్థితులు మెరుగుపడితే తప్ప అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదు. గుప్కార్‌ కూటమిగా ఒకే ఛత్రం కిందకు వచ్చిన స్థానిక రాజకీయ పార్టీలు ముష్కర మూకల ఆట కట్టించడంలో కేంద్రానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. తాజా పర్యటనలో మోదీ చీనాబ్‌ నదిపై మూడు జలవిద్యుత్‌ కేంద్రాలకు శంకుస్థాపన చేసే అవకాశముంది. జమ్మూకశ్మీర్‌ నూతన పారిశ్రామిక ప్రగతి విధానం కింద రూ.70 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారని తెలుస్తోంది. అవన్నీ సజావుగా పూర్తవడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు, సురక్షిత తాగునీరు, నిరంతర విద్యుత్‌, విద్యార్థులకు స్మార్ట్‌ తరగతుల వంటివి అందుబాటులోకి వస్తేనే- మోదీ కాంక్షించిన నయా కశ్మీర్‌ ఆవిష్కృతమైనట్లు!

 

- నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పుడమికి రక్షణ తక్షణావసరం

‣ భేదాలు కట్టిపెట్టి... గట్టిమేలు తలపెట్టి

‣ మరో ప్రచ్ఛన్న యుద్ధం!

‣ జల సంరక్షణకు జన భాగస్వామ్యం

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 22-04-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం