• facebook
  • whatsapp
  • telegram

భేదాలు కట్టిపెట్టి... గట్టిమేలు తలపెట్టి

భారత్‌, అమెరికా 2+2 భేటీ సారమిదే...

‘భారత్‌ తన ఇంధన భద్రత కోసం రష్యా నుంచి చమురు కొంటోంది. ఇది చాలా స్వల్పం. మేం ఒక నెల మొత్తంలో కొంటున్న ఇంధనం కంటే ఐరోపా ఒక పూటలో కొనుగోలు చేస్తున్నది ఎక్కువ'.

‘ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడేముందు అమెరికా తన సొంత రికార్డును   చూసుకోవాలి. గత వారమే ఇద్దరు సిక్కులపై దుర్విచక్షణతో దాడి జరిగింది. ఇక్కడి హక్కుల ఉల్లంఘనపై మాకు కూడా విచారం కలుగుతోంది’ - అమెరికా గడ్డపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇటీవలి వ్యాఖ్యలివి

పోరు నష్టం.. పొందు లాభం’ అని నానుడి! భారత్‌, అమెరికా మధ్య ఇటీవల జరిగిన 2+2 మంత్రులస్థాయి నాలుగో దఫా చర్చల్లో ఇదే స్ఫూర్తి పరిమళించింది. వైరుధ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఉభయుల ప్రయోజనాలు మిళితమైన అంశాల్లో కలిసి నడవాల్సిన అవసరాన్ని ఇరుదేశాలు గుర్తించాయని స్పష్టమవుతోంది. భారత్‌, అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు జైశంకర్‌, రాజ్‌నాథ్‌సింగ్‌- ఆంటొనీ బ్లింకెన్‌, లాయిడ్‌ ఆస్టిన్‌ల మధ్య భేటీ, పర్యవసనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చర్చల సారాంశాన్ని వివరించేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో బ్లింకెన్‌ అసందర్భ ప్రేలాపన, అసంబద్ధ వాదన సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. భారత్‌లోని కొన్ని ప్రభుత్వాలు ఠాణాల్లో, జైళ్లలో మానవ హక్కుల హననానికి పాల్పడుతున్నాయంటూ ఎజెండాలో లేని అంశాన్ని ప్రస్తావించగా, జైశంకర్‌ అదే రీతిలో తిప్పికొట్టారు. రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను తగ్గించుకోవాలన్న అమెరికా వైఖరిని ఉటంకిస్తూ అక్కడి మీడియా అడిగిన ప్రశ్నకూ దీటుగా బదులిచ్చిన తీరు ఇంటాబయటా ప్రశంసలందుకుంది. అగ్రరాజ్యం ఆభిజాత్యాన్ని ఇంత విస్పష్టంగా, సమర్థంగా ఎదుర్కొన్న వైనం- మన విదేశాంగ విధానంలోని స్వతంత్రతను తేటతెల్లం చేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభంపై పశ్చిమ దేశాలతో ఇండియా భుజం కలపలేదన్న అక్కసు బ్లింకెన్‌ వ్యాఖ్యల్లో ధ్వనించింది. వాషింగ్టన్‌ భాగస్వామిగా లేని రోజుల్లోనే రష్యాతో భారత్‌ బలమైన బంధాన్ని కలిగి ఉందని, విదేశాంగ విధానం ఆ దేశ సొంత నిర్ణయమని చెబుతూనే ఇలాంటి వాచాలత్వాన్ని ప్రదర్శించడం ఆక్షేపణీయమే.

పాత ఒప్పందాలకు మరింత పదును

మంత్రుల స్థాయి చర్చలకు ముందు ప్రధాని మోదీ, అధ్యక్షుడు బైడెన్‌ వర్చువల్‌గా భేటీ అయ్యారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు అతిపెద్ద, సుదీర్ఘ ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌, అమెరికాలు పరిష్కారం సూచించగలవన్న మోదీ వ్యాఖ్యలను బైడెన్‌ స్వాగతించారు. ‘రష్యా అంటే దిల్లీకి వణుకు’ అని కొద్దిరోజుల క్రితమే తాను చేసిన వ్యాఖ్యలను తోసిరాజని పరస్పర ఉమ్మడి ప్రయోజనాలే ప్రాతిపదికగా ముందుకు వెళ్ళాలని సంకల్పించారు. 2+2 భేటీలోనూ ఇదే ఒరవడి కొనసాగింది. భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి దౌత్య, రక్షణ, సైనిక సహకారం, వ్యూహాత్మక సంబంధాల్లో ఒక్కటిగా సాగాలన్న నిశ్చయానికి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంతరిక్ష పరిస్థితుల అవగాహన ఒప్పందంపై చర్చించారు. అమెరికా చొరవతో బహ్రెయిన్‌ కేంద్రంగా ఇరవై ఏళ్ల క్రితం ఏర్పాటైన సంయుక్త నౌకాదళ కూటమి(సీఎంఎఫ్‌)లో చేరేందుకు భారత్‌ అంగీకరించింది. పశ్చిమ హిందూ సాగరతీర దేశాలతో సమాచార మార్పిడికి, వస్తురవాణాకు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడికి ఈ బహుపాక్షిక సహకారం తోడ్పాటునందించనుంది. ఇకపై, భారత షిప్‌యార్డుల్లో అమెరికా నౌకలు మరమ్మతులు, నిలుపుదల కార్యకలాపాలు నిర్వహించుకోనున్నాయి. రక్షణ సాంకేతికత, వాణిజ్య ఇనీషియేటివ్‌(డీటీటీఐ)ని పూర్తిస్థాయిలో పట్టాలెక్కించాలని సంకల్పించాయి. ఆయుధ తయారీ, మరమ్మతుల సాంకేతికతను ఇండియాకు అందించాలన్న వాషింగ్టన్‌ ప్రతిపాదనలో- భారత్‌కు రక్షణరంగ దిగుమతుల్లో రష్యా వాటాను తగ్గించి, ఆ ఖాళీని తాను భర్తీ చేయాలన్న ఎత్తుగడ కనిపించింది. దిల్లీ కోణంలో చూసినప్పుడు ‘భారత్‌లో తయారీ’కి ఇది దోహదపడనుంది. టైగర్‌ ట్రంఫ్‌, యుద్ధ అభ్యాస్‌, వజ్రప్రహార్‌, కోప్‌ ఇండియా, మలబార్‌, మిలాన్‌ వంటి నౌకాదళ విన్యాసాలను నిరంతరం కొనసాగించాలని నిర్ణయించడం, ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నిలువరించేందుకేనన్నది సుస్పష్టం.

భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి

ఉక్రెయిన్‌ యుద్ధం తరవాత నెలన్నర రోజులుగా దిల్లీ-వాషింగ్టన్‌ల నడుమ ఎడం పెరిగిందని  పలు ఉదంతాలు సూచిస్తున్నాయి. వివిధ హోదాల్లోని అగ్రరాజ్య ప్రతినిధులు విభిన్న వేదికలపై తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. 2+2 భేటీకి కొద్దిరోజుల ముందు అమెరికా ఉప జాతీయ భద్రతా సలహాదారు దలీప్‌సింగ్‌ భారత్‌లో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్య చర్చకు దారితీసింది. చైనా దురాక్రమణకు దిగితే రష్యా మీకు అండగా ఉంటుందా అని ప్రశ్నించి, దిల్లీ అనివార్యంగా తమవైపు మొగ్గాలన్న భావన వ్యక్తపరచారు. రూపీ-రూబుల్‌ లావాదేవీలను నిలిపివేసే విషయంలోనూ భిన్నాభిప్రాయాలు పొడచూపాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గత డిసెంబరులో దిల్లీకి వచ్చిన సమయంలో 550 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయి. అత్యాధునిక ఎస్‌-400 యాంటీ మిసైల్‌ వ్యవస్థల సరఫరా చేస్తూనే- భారత్‌లోనే పలు రక్షణ పరికరాల తయారీకి క్రెమ్లిన్‌ ముందుకు వచ్చింది. ఈ క్షిపణి వ్యవస్థల కొనుగోళ్లపై గుర్రుగా ఉన్నప్పటికీ మిగతా దేశాల మాదిరి భారత్‌పై ‘కాట్సా’ ఆంక్షలు విధించడానికి అమెరికా సుముఖంగా లేదని స్పష్టమైంది. ‘ఆంక్షల అమలుపై ఇంకా నిర్ణయానికి రాలేదు’ అంటున్న బ్లింకెన్‌ మాటల్లో విభేదాలను కట్టిపెట్టి ప్రయోజనాలకు పెద్దపీట వేసుకోవాలన్న భావం స్పురిస్తోంది. చైనాతో సరిహద్దు విభేదాలు ఉద్రిక్తతలకు దారితీస్తున్న పరిస్థితుల్లో భారత్‌కు అమెరికా అండ అవసరం. 44 లక్షల మంది మేధా సంపన్న ప్రవాస భారతీయులు అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులుగా పనిచేస్తున్నారు. 2.32 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వస్తు వాణిజ్యం రూ.8.47 లక్షల కోట్లకు చేరింది. 75 ఏళ్ల దౌత్య బంధం వ్యూహాత్మక భాగస్వామ్య దశకు చేరి, సైనిక రక్షణ రంగాల్లోనూ ఇచ్చిపుచ్చుకొనే స్థితికి ఎదిగింది. ఈ తరుణంలో ఉభయతారక చెలిమే మేలిమి నిర్ణయమవుతుంది.

శాశ్వత సభ్యత్వానికి సరైన సమయం

రష్యాపై ఆంక్షల విధింపులో తమతోపాటు కలిసి రావాలన్న అమెరికా, ఐరోపా దేశాల ఒత్తిళ్లకు వెరవని స్థిరత్వాన్ని భారత్‌ కనబరుస్తోంది. ఉక్రెయిన్‌లో సాధారణ పౌరుల మరణాలు, ఆస్తుల విధ్వంసాన్ని ఖండించడంతో పాటు ఆహార ధాన్యాలు, ఔషధాల రూపేణా మానవతా సాయాన్ని అందిస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటోంది. తక్షణం ఉద్రిక్తతలు తగ్గించే విషయంలో మిగతా ప్రపంచంతో ఏకాభిప్రాయంతో ఉంది. ఐరాసలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన కీలక ఓటింగ్‌లకు దూరంగా ఉన్నప్పటికీ- దౌత్య చర్యలు, చర్చలే పరిష్కారమని సూచిస్తూ అందుకు సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. భద్రతా మండలిలో ఈ ఏడాది తాత్కాలిక సభ్యదేశంగా ఉన్న భారత్‌- ఐరాస ఛాప్టర్‌, అంతర్జాతీయ న్యాయసూత్రాలను అనుసరిస్తూనే తటస్థ వైఖరికి కట్టుబడి ఉంది. శాశ్వత సభ్యత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తానంటున్న అమెరికా తన మాటలకు కట్టుబడి ఉంటే... ఈ బంధం కొత్త చరిత్రను లిఖిస్తుంది.

- శిరీష
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మరో ప్రచ్ఛన్న యుద్ధం!

‣ జల సంరక్షణకు జన భాగస్వామ్యం

‣ కడలిపై పట్టుకు వ్యూహం

'

‣ పటిష్ఠ వాణిజ్య బంధంపై అనురక్తి

‣ సాగుభూమిని మింగేస్తున్న పట్టణీకరణ

‣ ఉత్కంఠభరితం ఫ్రాన్స్‌ అధ్యక్ష సమరం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 20-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం