• facebook
  • whatsapp
  • telegram

కడలిపై పట్టుకు వ్యూహం

సీఎంఎఫ్‌లో సహ భాగస్వామిగా భారత్‌

అమెరికా నేతృత్వంలోని ఉమ్మడి నౌకాదళ కూటమి(సీఎంఎఫ్‌)లో సహ భాగస్వామిగా చేరుతున్నట్లు ఇండియా తాజాగా ప్రకటించింది. హిందూ మహాసముద్రంలో దిల్లీ ప్రయోజనాల పరిరక్షణకు అది దోహదపడుతుంది. అంతర్జాతీయ జలాల్లో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ, స్వేచ్ఛాయుత రవాణాకు తోడ్పడటమే లక్ష్యంగా 2001లో సీఎంఎఫ్‌ ఆవిర్భవించింది. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, టర్కీ సహా 34 దేశాలకు అందులో సభ్యత్వం ఉంది. కూటమి ప్రధాన కార్యాలయం బహ్రెయిన్‌లో ఏర్పాటైంది. రమారమి 32 లక్షల చదరపు మైళ్ల అంతర్జాతీయ జలాల్లో సముద్ర దొంగతనాలు, మాదకద్రవ్యాల సరఫరా, ఆయుధాల అక్రమ రవాణాలను అడ్డుకుంటూ భద్రత, స్థిరత్వాలను కాపాడటం సీఎంఎఫ్‌ లక్ష్యం. అందుకోసం మూడు ఉమ్మడి కార్యదళాలు (సీటీఎఫ్‌-150, సీటీఎఫ్‌-151, సీటీఎఫ్‌-152) కొలువుతీరాయి. ఎర్రసముద్రంలో కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా సీటీఎఫ్‌-153 పేరిట మరో కార్యదళాన్ని ఏర్పాటుచేయాలని కూటమి తాజాగా నిర్ణయించింది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన పశ్చిమ హిందూ మహాసముద్రం(డబ్ల్యూఐఓ)లో కొన్నేళ్లుగా సీఎంఎఫ్‌ ప్రాధాన్యం చాలా పెరిగింది. ఉత్తరాన ఈజిప్టు నుంచి దక్షిణ దిశలో దక్షిణాఫ్రికా, తూర్పున ఇండియా వరకు డబ్ల్యూఐఓ విస్తరించింది. పశ్చిమ దిక్కులో ఆఫ్రికా ఖండం ఉంటుంది. పర్షియన్‌ గల్ఫ్‌, అరేబియన్‌ సముద్రం, ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌, మొజాంబిక్‌ ఛానెల్‌ వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. సీఎంఎఫ్‌లో భాగంగా పలు దేశాలు డబ్ల్యూఐఓలో బలగాలను మోహరించాయి.

భద్రత, ఆర్థిక, దౌత్య వ్యవహారాల పరంగా ఇండియాకు డబ్ల్యూఐఓ చాలా కీలకం. అందుకే సముద్ర దొంగల భరతం పట్టేందుకు దీర్ఘకాలంగా అక్కడ సొంతంగా బలగాలను మోహరిస్తోంది. అమెరికాతో రక్షణ సంబంధాలు గణనీయంగా బలపడినప్పటికీ ఇన్నాళ్లూ సీఎంఎఫ్‌లో చేరేందుకు దిల్లీ సుముఖత చూపలేదు. అందుకు ప్రధాన కారణం- ఆ కూటమిలో పాకిస్థాన్‌ కూడా భాగస్వామిగా ఉండటమే. కానీ, డబ్ల్యూఐఓలో భౌగోళిక రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. దానికితోడు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి    అమెరికా మిత్రపక్షాలతో ఇండియా రక్షణ భాగస్వామ్యం ఇటీవలి కాలంలో బాగా మెరుగుపడింది. దాంతో సీఎంఎఫ్‌లో చేరి అగ్రరాజ్యంతో కలిసి పనిచేయాలని దిల్లీ నిర్ణయించుకుంది.

హిందూ మహాసముద్రంలో ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సముద్రపు దొంగతనాలకు అడ్డుకట్ట వేసే మిషతో డబ్ల్యూఐఓలో భారీగా బలగాలను మోహరిస్తోంది. ఇప్పటికే జిబౌటిలో డ్రాగన్‌ తన స్థావరాన్ని ఏర్పాటుచేసుకుంది. ప్రాంతీయ భద్రతకు ఆ పరిణామాలు ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయి. తూర్పు ఆఫ్రికా తీరప్రాంతాన్ని ‘హెరాయిన్‌ తీరం’గా పిలుస్తుంటారు. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడంతో... అఫ్గాన్‌, పాకిస్థాన్‌ల నుంచి డబ్ల్యూఐఓలో మాదకద్రవ్యాల సరఫరా పెరిగింది. దాన్ని అడ్డుకోలేక తూర్పు ఆఫ్రికా దేశాలు చేతులెత్తేస్తున్నాయి. మాదకద్రవ్యాల సరఫరా ముఠాలు ఉగ్రవాదులతో సంబంధాలు నెరపుతుండటం మరింత ఆందోళనకరంగా మారింది. ఈ క్రమంలో అమెరికా, ఇండియా డబ్ల్యూఐఓలో ఒక్కటిగా ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు సీఎంఎఫ్‌ చక్కటి వేదికగా నిలుస్తుంది. ఇన్నాళ్లూ తూర్పు హిందూ మహాసముద్రం, పసిఫిక్‌ మహాసముద్రంలోనే న్యూదిల్లీ, వాషింగ్టన్‌లు తమ ఉమ్మడి కార్యకలాపాలను ఎక్కువగా కొనసాగించాయి. సీఎంఎఫ్‌లో ఇండియా చేరికతో డబ్ల్యూఐఓలోనూ పరస్పర, బహుళపక్ష సహకారం పెరగనుంది. ఇరు దేశాలు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ- మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు ముకుతాడు వేయాలి. డబ్ల్యూఐఓ తీరప్రాంత దేశాల స్థానిక పోలీసులకు సీఎంఎఫ్‌ శిక్షణ ఇవ్వాలి. చైనా విస్తరణ కాంక్షకు ముకుతాడు వేసే దిశగా సమష్టి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడమూ అత్యావశక్యం.

- శ్రీయాన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సాగుభూమిని మింగేస్తున్న పట్టణీకరణ

‣ ఉత్కంఠభరితం ఫ్రాన్స్‌ అధ్యక్ష సమరం

‣ నేత మారినా... కథ అదేనా?

‣ మానవ మనుగడకు గొడ్డలిపెట్టు

‣ షాంఘైలో ఆకలి మంటలు

‣ ఆర్థిక సంక్షోభంలో పాక్‌

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 18-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం