• facebook
  • whatsapp
  • telegram

నేత మారినా... కథ అదేనా?

భారత్‌-పాక్‌ సంబంధాలపై సర్వత్రా ఆసక్తి

 

 

రాజకీయ అస్థిరతకు పాకిస్థాన్‌ మారుపేరని మరోసారి రుజువైంది. ఆ దేశంలో ఇంతవరకు ఒక్క ప్రధానమంత్రీ అయిదేళ్ల సంపూర్ణ పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇమ్రాన్‌ఖాన్‌ ఇంటిముఖం పట్టారు. ఆయన స్థానంలో పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ను విపక్షాలు మూకుమ్మడిగా ప్రధాని పీఠంపై కూర్చో బెట్టాయి. వాస్తవికవాదిగా పేరున్న షెహబాజ్‌ రాకతో ఇండియా, పాక్‌ సంబంధాలు మెరుగుపడే సూచనలున్నట్లు విశ్లేషణలు వెలువడినా- ప్రధానిగా ఎన్నికైన తరవాత ఆయన చేసిన తొలి ప్రసంగం అందుకు ఉపకరించేలా కనిపించలేదు. కశ్మీర్‌ విషయంలో దిల్లీపై దుమ్మెత్తిపోసేలా ఆయన మాట్లాడారు. దరిమిలా మున్ముందు ఆయన నాయకత్వంలో ద్వైపాక్షిక సంబంధాలు గాడినపడే అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

 

ఇమ్రాన్‌ దుందుడుకు వైఖరి

ఇండియాతో సంబంధాల పునర్నిర్మాణానికి కృషి చేస్తానంటూ 2018లో పాక్‌ ప్రధాని పీఠమెక్కినప్పుడు ఇమ్రాన్‌ఖాన్‌ ఉద్ఘాటించారు. తరవాత అందుకు అవసరమైన విధానాలను అనుసరించలేదు. ఇరు దేశాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కశ్మీర్‌ విషయంలో దుందుడుకుగా వ్యవహరించారు. కశ్మీర్‌ లోయలో తీవ్రస్థాయిలో మానవహక్కుల ఉల్లంఘన చోటుచేసుకుంటోందని అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు గుప్పించారు. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. ప్రతిగా అదే నెలలో భారత బలగాలు పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి మరీ జైషే-మొహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ శిక్షణ శిబిరాలను ధ్వంసం చేశాయి. దాంతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్‌ 370ని మోదీ సర్కారు 2019 ఆగస్టులో ఉపసంహరించుకున్న తరవాత పరిస్థితులు మరింత క్షీణించాయి. ద్వైపాక్షిక వాణిజ్య బంధం పూర్తిగా తెగిపోయింది. దౌత్య సంబంధాలూ నామమాత్రంగా మారాయి.

 

పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు షెహబాజ్‌ తమ్ముడు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశాలున్నాయన్న విశ్లేషణల వెనక ఇదీ ఒక ముఖ్య కారణం. నవాజ్‌తో భారత ప్రధాని మోదీకి అనుబంధం ఉంది. 2015 డిసెంబరులో ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు మోదీ ముందస్తు ప్రకటన చేయకుండా లాహోర్‌లో పర్యటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇండియాతో సత్సంబంధాలు కలిగి ఉండేందుకు నవాజ్‌ ప్రాధాన్యమిచ్చేవారు. దిల్లీకి చేరువయ్యేందుకు కృషిచేస్తానంటూ ఇచ్చిన హామీ 2013 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన విజయానికి బాగా దోహదపడిందని విశ్లేషకులు చెబుతుంటారు. నవాజ్‌ ఆహ్వానం మేరకే 1999లో అప్పటి భారత ప్రధాని వాజ్‌పేయీ లాహోర్‌లో పర్యటించారు. బద్ధ శత్రువులుగా ఉన్న ఇరు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడటానికి ఆ పర్యటన తాత్కాలికంగా దోహదపడింది. పనామా పేపర్ల కేసుతో పదవీచ్యుతుడైనప్పటి నుంచి వివిధ కేసుల్లో విచారణ, జైలుశిక్షను తప్పించుకునేందుకు నవాజ్‌ లండన్‌లో తలదాచుకుంటున్నారు. సోదరుడికి విధేయుడిగా షెహబాజ్‌కు పేరుంది. నవాజ్‌ త్వరలోనే స్వదేశానికి వస్తారనీ వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో షెహబాజ్‌ సర్కారును నవాజ్‌ పాలనకు కొనసాగింపుగా చూడవచ్చన్నది పలువురి అభిప్రాయం. తన అన్న తరహాలోనే ఆయన కూడా మోదీతో సన్నిహితంగా మెలిగే అవకాశాలున్నాయని వారు అంచనా వేస్తున్నారు.

 

సమర్థ నాయకుడిగా పేరు 

పాక్‌ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పంజాబ్‌ ప్రావిన్సుకు దీర్ఘకాలంపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి సమర్థ నాయకుడిగా షెహబాజ్‌ పేరు తెచ్చుకున్నారు. పంజాబ్‌లో మౌలిక వసతులను ఆయన గణనీయంగా మెరుగుపరచారు. పరమత సహనం పాటిస్తారనీ ఆయనకు పేరుంది. ఇటీవల హోలీ పర్వదినాన శుభాకాంక్షలు తెలిపిన షెహబాజ్‌... పాక్‌ అందరి దేశమన్నారు. కుల, మత, వర్ణ విభేదాలకు అక్కడ తావులేదని నొక్కిచెప్పారు. అయితే- దిల్లీతో షెహబాజ్‌ సన్నిహితంగా మెలగడం అంత సులువు కాదు. సంకీర్ణ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో కశ్మీర్‌ విషయంలో ఇమ్రాన్‌ తరహా వైఖరినే ఆయన అనుసరించక తప్పని పరిస్థితులు ఎదురు కావచ్చు. ప్రధానిగా ఎన్నికయ్యాక షెహబాజ్‌ చేసిన తొలి ప్రసంగం ఇందుకు నిదర్శనం. ఇండియాతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని చెబుతూనే- కశ్మీర్‌లో ప్రజల రక్తం ఏరులై పారుతోందంటూ అత్యుత్సాహంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం పరిష్కారమైతేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. చైనాతో తమ దేశ అనుబంధాన్ని కొనియాడారు. ఇండియాకు సంబంధించి నూతన విదేశాంగ విధానాన్ని రూపొందిస్తామని పీఎంఎల్‌-ఎన్‌ నేతలు చెబుతున్నారు. ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు ఒత్తిడి చేస్తామంటున్నారు. అది మోదీ సర్కారుకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కాబట్టి నూతన విదేశాంగ విధానం రూపకల్పనలో షెహబాజ్‌ జాగరూకతతో వ్యవహరించాలి. భారత్‌తో శాంతి చర్చల పునరుద్ధరణకు తాము సిద్ధమని పాక్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఖామర్‌ జావేద్‌ బజ్వా ఇటీవల ప్రకటించారు. 2021 ఫిబ్రవరి నుంచి నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం బాగానే అమలవుతుండటం స్వాగతించదగిన పరిణామం. కొవిడ్‌ దెబ్బకు అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెడుతూనే- దిల్లీతో ద్వైపాక్షిక వాణిజ్య, దౌత్య సంబంధాల పునరుద్ధరణకు షెహబాజ్‌ కృషిచేయాలి.

 

- నవీన్‌ కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మానవ మనుగడకు గొడ్డలిపెట్టు

‣ షాంఘైలో ఆకలి మంటలు

‣ ఆర్థిక సంక్షోభంలో పాక్‌

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 13-04-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం