• facebook
  • whatsapp
  • telegram

మానవ మనుగడకు గొడ్డలిపెట్టు

అటవీ పరిరక్షణలో మందభాగ్యం

 

 

భూమిపై ప్రాణి మనుగడకు ఆధారమైన జీవవైవిధ్యాన్ని, అమూల్యమైన ఆవరణ వ్యవస్థ సేవలను అందించే ప్రాకృతిక వనరులు అరణ్యాలు. భూగోళంపై అడవులు సుమారు 31శాతం మేర విస్తరించి ఉన్నాయి. అందులో 20శాతం రష్యాలోనే కనిపిస్తాయి. 12శాతం వనాలతో బ్రెజిల్‌ రెండో స్థానంలో నిలుస్తుంది. ప్రపంచంలో సగానికి పైగా అరణ్యాలు రష్యా, బ్రెజిల్‌, కెనడా, అమెరికా, చైనాల్లోనే ఉన్నాయి. భూగోళంపై రెండు శాతం అడవుల వాటాతో భారత్‌ పదో స్థానంలో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెయ్యి కోట్ల ఎకరాల అడవుల్లో 179 కోట్ల ఎకరాలు- రక్షిత అడవులు. దక్షిణ అమెరికా ఖండంలో 31శాతం రక్షిత అడవులు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి వ్యూహాత్మక ప్రణాళికను అనుసరించి 2030 నాటికి అడవులను మరో మూడో శాతానికి పెంచాలి. మితిమీరిన మానవ కార్యకలాపాలవల్ల అడవులు క్రమంగా క్షీణిస్తున్నాయి.  

 

అరణ్యాలే ఆధారం

వాతావరణం, నేలలనుబట్టి ప్రపంచవ్యాప్తంగా వివిధరకాల అడవులు ఉద్భవించాయి. సమశీతోష్ణ మండల అడవులకంటే ఉష్ణమండల అడవులు అధిక జీవవైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. మొత్తం అరణ్యాల్లో ఉష్ణమండల అడవుల వాటా 45శాతం. భూమిపై విస్తరించి ఉన్న వివిధ రకాలైన అడవులు జీవ వైవిధ్యంలో వేటికవే విశిష్టమైనవి. అడవులు భూమిపై సమస్త జంతుజాలానికి కావాల్సిన ఆమ్లజనిని అందిస్తున్నాయి. భూతాపాన్ని నిరోధించడానికి తోడ్పడుతున్నాయి. వర్షాలు కురవడానికి, భూమిలోకి నీరు ఇంకడానికి, వరదలను నిరోధించడానికి, సునామీ తుపానుల తీవ్రతను తగ్గించడానికి అడవులు సహకరిస్తున్నాయి. వంటచెరకును, కలపను, ఎన్నో కలపేతర అటవీ ఉత్పత్తులను, ఔషధాలను సైతం అందిస్తున్నాయి. 60 నుంచి 90 శాతం ఔషధ, సుగంధద్రవ్య మొక్కలు అడవులలోనే లభ్యమవుతున్నాయి. ప్రకృతిసిద్ధంగా ఏర్పడే తెగుళ్లు, వ్యాధులను అడవులు, అందులోని వన్యప్రాణులు అదుపులో ఉంచి నియంత్రిస్తాయి. ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో నాలుగోవంతు తమ జీవనోపాధికోసం అరణ్యాలపై ఆధారపడుతున్నారు. భారత్‌లో అడవులపై ఆధారపడే జనాభా 27 నుంచి 40 కోట్ల దాకా ఉంటుందని ఇంధన, వనరుల సంస్థ (టీఈఆర్‌ఐ) 2015లో అంచనా వేసింది. భూమిపైన జీవవైవిధ్యంలో  80శాతం అడవుల్లోనే ఉంది. 80శాతం ఉభయచరాలు,  75శాతం పక్షిజాతులు, 68శాతం క్షీరదాలకు అడవులు ఆధారం. మడ అడవులు ఎన్నోరకాల చేపల జననానికి ఆధారం. అవి నదులద్వారా వచ్చే అవక్షేపాలు సముద్రంలోకి చేరకుండా నిరోధించి, తద్వారా ఎన్నో సముద్ర జీవజాతులకు ఆవశ్యకమైన సముద్రపుగడ్డి, పగడపు దీవులకు హాని జరగకుండా కాపాడతాయి. మడ అడవులు తుపానులకు, సునామీలకు సహజ అవరోధాలు.    

 

కలప, వంటచెరకు సేకరణ, కర్రబొగ్గు ఉత్పత్తి, కార్చిచ్చులు, పశువులను అనియంత్రితంగా మేపడం వంటి వాటివల్ల అడవులు క్షీణించి, పలచబడిపోతున్నాయి. విస్తరిస్తున్న వాణిజ్య, జీవనోపాధి వ్యవసాయంవల్లా అరణ్యాలు అంతర్ధానమవుతున్నాయి. ముక్కలుగా విడిపోతున్నాయి. సహజ, మానవ ప్రేరిత కార్చిచ్చులు, వాతావరణ అంశాలు వంటివి అడవుల క్షీణతకు ఇతర కారణాలు. ప్రపంచానికి 20శాతం ఆక్సిజన్‌ను అందించే అమెజాన్‌ అడవుల్లో 2019లో సంభవించిన కార్చిచ్చువల్ల ఎంతో జీవవైవిధ్యం దెబ్బతింది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండొనేసియా, భారత్‌లలోనూ కార్చిచ్చులు అడవుల క్షీణతకు కారణమవుతున్నాయి. కార్చిచ్చుల్లో 90శాతం మానవ ప్రేరేపితమైనవే! ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆహార, వ్యవసాయ సంస్థ రెండేళ్లక్రితం వెలువరించిన నివేదిక ప్రకారం- ప్రపంచవ్యాప్తంగా 1990 నుంచి 42 కోట్ల హెక్టార్లలో అడవులు అంతర్ధానమయ్యాయి.

 

ప్రధానంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో ఎక్కువగా అరణ్యాలకు నష్టం వాటిల్లింది. 2000-2010 మధ్యకాలంలో పశుపోషణకు, సోయాబీన్‌, పామాయిల్‌ వాణిజ్య వ్యవసాయానికి 40శాతం ఉష్ణమండల అడవులు కనుమరుగయ్యాయి. మరో 33శాతం అరణ్యాలు జీవనోపాధి వ్యవసాయం వల్ల నశించిపోయాయి. అటవీ నిర్మూలన, క్షీణత ఫలితంగా ఇటీవలి కాలంలో మానవ-వన్యప్రాణి ఘర్షణ అధికమైంది. పులులు, చిరుత పులులు వంటివి జనావాసాల్లోకి వచ్చి అలజడి సృష్టిస్తున్నాయి.

 

తక్షణ చర్యలు అవసరం

అడవుల్లోని ప్రాణుల ఆవాస నష్టం సంభవించడం, మానవ కార్యకలాపాలు అటవీ ప్రాంతాల్లోకి విస్తరించడంవల్లనే ప్లేగ్‌, సార్స్‌, కొవిడ్‌-19వంటి జంతు సంబంధ వ్యాధులు విజృంభించినట్లు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అందువల్ల అడవుల నిర్మూలనను, వాటిలోని జీవ వైవిధ్య నష్టాన్ని నివారించడానికి ప్రభుత్వాలు తక్షణం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. అడవులతో ముడివడి ఉన్న ప్రజల వాస్తవిక జీవనోపాధులను, అవసరాలను అరణ్యాలకు భంగం కలగని రీతిలో పరిష్కరించాలి. ప్రత్యామ్నాయాలను అన్వేషించాలి. ప్రపంచవ్యాప్తంగా అటవీ వనరులపై ఆధారపడే 160 కోట్ల జనాభాలో 120 కోట్లమంది నిరుపేదలని ప్రపంచబ్యాంకు నివేదిక గతంలో తెలిపింది. అందువల్ల పేదరిక నిర్మూలనపై ప్రభుత్వాలు అధికంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మొక్కలు నాటే కార్యక్రమాలు అటవీ అభివృద్ధికి తోడ్పడినా, సహజంగా పెరిగే అరణ్యానికి అవి ప్రత్యామ్నాయం కావు. తాత్కాలిక ప్రయోజనాలకోసం అడవులను నాశనం చేస్తే, ఆవరణ వ్యవస్థలు దెబ్బతిని భూమి నివాస యోగ్యతను కోల్పోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి.

 

కార్చిచ్చుల బెడద

దేశీయంగా 33శాతం అడవులు ఉండాలని భారత జాతీయ అటవీ విధానం-1988 సూచించింది. రెండేళ్లకోసారి నిర్వహించే భారత అటవీ స్థితి నివేదిక-2021 ప్రకారం దేశంలో అరణ్య ప్రాంతం లోపల, వెలుపల కలిపి అడవులు 8.9 కోట్ల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. దేశ భూభాగంలో ఇది 24.62శాతం. 2019తో పోలిస్తే మొత్తం అటవీ విస్తీర్ణం 2,261 చదరపు కిలోమీటర్ల మేర (0.28శాతం) పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలు అడవుల పెరుగుదలలో ముందున్నాయి. మెరుగైన అటవీరక్షణ, మొక్కల పెంపకం వంటివి అరణ్యాల పెరుగుదలకు తోడ్పడ్డాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అటవీ నష్టం ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. విస్తాపన వ్యవసాయం, మానవ కార్యకలాపాల ఒత్తిడి, అభివృద్ధి పనులవల్ల ఈశాన్య భారతంలో అరణ్యాలు తరిగిపోతున్నాయి. మొత్తానికి దేశంలో దట్టమైన అరణ్యాలు క్షీణించి బహిరంగ అడవులు, చిట్టడవుల విస్తీర్ణం పెరిగింది. 52 టైగర్‌ రిజర్వుల్లో 22.6 చదరపు కిలోమీటర్ల మేర అటవీ నష్టం సంభవించింది. దేశీయంగా 35శాతం అడవులు కార్చిచ్చులకు గురవుతున్నాయి. ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమ మహారాష్ట్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, మధ్య ఒడిశా, ఆంధ్ర, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చులు ఎక్కువగా సంభవిస్తున్నాయి.

 

- ఎం. రామ్‌మోహన్‌ 

(సహాయ సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆర్థిక సంక్షోభంలో పాక్‌

‣ ఎరువుల విపణి అతలాకుతలం

‣ శ్రీలంకకు భారత్‌ ఆపన్న హస్తం

‣ అప్పుల ఊబిలో రాష్ట్రాలు

‣ ఉభయతారక వాణిజ్య బంధం

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 12-04-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం