• facebook
  • whatsapp
  • telegram

అప్పుల ఊబిలో రాష్ట్రాలు

పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పు

కొవిడ్‌ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఆదాయాలను మించి భారీగా వ్యయాలు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దాంతో తప్పనిసరిగా పెద్దయెత్తున అప్పులు చేయాల్సి వచ్చింది. ఫలితంగా ప్రస్తుతం దాదాపు అన్ని దేశాలూ రుణభారంతో కునారిల్లుతున్నాయి. 2019తో పోలిస్తే ప్రపంచ అప్పు దాదాపు 35శాతం పెరిగి 2021 నాటికి 226 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వెల్లడించింది. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి ప్రపంచ దేశాలన్నీ భారీగా రుణాలను ఆశ్రయించాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు చేసిన వ్యయంవల్ల రుణాల శాతం సైతం కొండలా పెరిగినట్లు ఐఎంఎఫ్‌ స్పష్టం చేసింది. గడచిన రెండేళ్లలో పెరిగిన మొత్తం రుణాల్లో దాదాపు 90శాతం సంపన్న దేశాలదే. 2007 నాటికి అభివృద్ధి చెందిన దేశాల రుణభారం జీడీపీలో 70శాతం. 2021 నాటికి అది భారీగా పెరిగి 135శాతానికి చేరింది. ప్రపంచవ్యాప్తంగానైనా, దేశీయంగా అయినా జీడీపీలో 77శాతం కంటే ఎక్కువ రుణం ఉంటే- ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్లేనని ఐఎంఎఫ్‌ పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 35 వరకు అధిక రుణ భారాన్ని మోస్తున్నాయని స్పష్టం చేసింది.

భారత్‌లోనూ భారీగా...

రెండేళ్లలో వరసగా మూడుసార్లు కొవిడ్‌ విజృంభించడంతో దేశీయ, అంతర్జాతీయ రుణాలు పెరిగిపోయాయి. ప్రజారోగ్య సంరక్షణ, పేదల ఆర్థిక అవసరాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ- ఉద్దీపనలు ప్రకటించడం వంటి కారణాలతో 2018 నాటికి జీడీపీలో 70.44శాతం ఉన్న రుణభారం 2021 నాటికి 90.6శాతానికి చేరుకుంది. ఇందులో కేంద్ర రుణభారమే దాదాపు 60శాతానికి మించి ఉండగా, మిగతాది రాష్ట్రాల వాటా. దేశంలో దాదాపు సగం రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయని రిజర్వు బ్యాంకు నివేదిక వెల్లడించింది. రాష్ట్రాలు ఎడాపెడా అప్పులు చేస్తూ ఆ సొమ్మును మౌలిక వసతుల కల్పన, ఉపాధికి ఊతమిచ్చే రంగాలపై కాకుండా- రాయితీలు, ఉచిత పంపకాల పథకాలకే ఎక్కువగా వ్యయం చేస్తున్నాయి. ఫలితంగా సంపద సృష్టి చోటుచేసుకోకపోగా... ఆయా రాష్ట్రాలు మరింతగా అప్పుల ఊబిలోకి జారుకుంటున్నాయి. 2019 మార్చ్‌ నాటికి రాష్ట్రాలు చెల్లించాల్సిన అప్పులు రూ.47.86 లక్షల కోట్లు. 2022 నాటికి అవి దాదాపు రూ.70లక్షల కోట్లకు చేరాయి. పలు రాష్ట్రాలు అప్పుచేసి పప్పుకూడు తింటున్నాయని, ఇది తీవ్ర ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఇటీవల ప్రధానితో జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

పోటాపోటీగా...

దేశంలోని పలు రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ)లో రుణాలు 40శాతానికి చేరువలో ఉన్నాయి. మొత్తం రాష్ట్రాల సగటు అప్పు దాదాపు 32శాతానికి చేరింది. జనవరి 2022 నాటికి దేశంలో పంజాబ్‌ జీఎస్‌డీపీలో 53.3శాతం రుణాలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌, పశ్చిమ్‌బెంగాల్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ తరవాతి స్థానాల్లో ఉన్నాయి. మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న ఏ రాష్ట్ర ఆదాయంతో పోల్చినా ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం తక్కువే. అయినా జీఎస్‌డీపీలో రుణశాతం ఏటా ఎగబాకుతూనేఉంది. రాష్ట్రం విడిపోయేనాటికి రూ.97,123 కోట్ల అప్పులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తన అయిదేళ్ల పాలనలో రూ.1.65లక్షల కోట్లు అప్పు చేయగా... జగన్‌ రెండున్నరేళ్ల పాలనలోనే రూ.1.15లక్షల కోట్ల మేరకు రుణాలు తెచ్చారు. దీంతో 2022 బడ్జెట్‌లో చూపిన లెక్కల ప్రకారం అప్పు రూ.3.90లక్షల కోట్లకు పైగా పెరిగింది. రాష్ట్రం విడిపోయేనాటికి వివిధ కార్పొరేషన్ల పేరిట రూ.14వేల కోట్ల రుణం ఉండగా- అది నేడు దాదాపు లక్ష కోట్ల రూపాయలకు చేరింది. ఇక తెలంగాణలో పన్నుల ఆదాయం గణనీయంగా పెరుగుతున్నా సామాజిక పింఛన్లు, రైతుల ఖాతాల్లో నగదు జమ, విద్యుత్‌ తదితర రాయితీలతో అప్పులు సైతం పెరిగిపోతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి మొత్తం రుణాలు రూ.2,85,116 కోట్లకు చేరాయి. బడ్జెట్‌ వెలుపల వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.1,35,282 కోట్లకు చేరాయి. చెల్లించాల్సిన రుణం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగానే ఉన్నా- బడ్జెటేతర రుణాలను పరిగణనలోకి తీసుకుంటే లక్ష్యానికి మించి అప్పులు ఉన్నాయని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక పేర్కొంది. తెలంగాణలో జీఎస్‌డీపీలో రుణాల వాటా 25శాతంలోపే ఉండటం ఊరటనిచ్చే అంశం. ప్రభుత్వాలు చేస్తున్న అప్పులతో ఆస్తులు సృష్టించి, ఉత్పాదకత పెంచినంతకాలం రుణ చెల్లింపులు కష్టం కాబోవు. జనాకర్షక పథకాలతోనే కాలం వెళ్ళబుచ్చితే మాత్రం అప్పులు తీర్చడం కష్టసాధ్యమవుతుంది. కొన్ని రాష్ట్రాల పరిస్థితి వెనుజువెలా, శ్రీలంకలా తయారుకాకముందే తీసుకునే రుణాలు, తీర్చాల్సిన అప్పులపై స్పష్టమైన విధానాన్ని కేంద్రప్రభుత్వం రూపొందించాల్సిన అవసరం ఉంది.

ఏపీ పరిస్థితిపై కేంద్రం హెచ్చరిక

పార్లమెంటులో వెల్లడించిన లెక్కల ప్రకారం గత రెండేళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌ వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.56,072 కోట్లమేర అప్పులు చేసింది. అది కాకుండా రాష్ట్రంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు దాదాపు రూ.75వేల కోట్లకు పైనే చెల్లించాల్సి ఉంది. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌ అప్పులు దాదాపు రూ.5.50లక్షల కోట్లకు పైమాటే. నెలనెలా జీతాలు, పెన్షన్లకు రూ.5,500 కోట్లు అవుతుంటే వడ్డీలు, పాత అప్పులు చెల్లించేందుకు రూ.3,500 కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతి నెలా దాదాపు అయిదు వేల కోట్ల రూపాయలకు పైబడి కొత్త అప్పులు చేసుకుంటూ పోతోంది. ఏపీలోని కార్పొరేషన్లకు అప్పులు ఇచ్చేముందు సమగ్రంగా విశ్లేషించుకోవాలని కేంద్ర ప్రభుత్వం,  ఆర్‌బీఐ- బ్యాంకులను హెచ్చరించాయంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారుతోందో వెల్లడవుతోంది.

- ఎం.ఎస్‌.వి.త్రిమూర్తులు
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ హక్కులు హరించే కొత్త ఆయుధం!

‣ నేపాల్‌తో బ‌ల‌ప‌డ‌తున్న బంధం

‣ ఇంధన ధరల జోరు

‣ చదువులపై తుపాకీ ఆంక్షలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 09-04-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం