• facebook
  • whatsapp
  • telegram

ఇంధన ధరల జోరు

సామాన్యుల బేజారు

 

 

నానాటికీ పెరుగుతున్న చమురు ధరలు దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్‌- సుమారు 85శాతం చమురును ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకొంటోంది. దేశ ఆర్థికాభివృద్ధిలో ముడిచమురు కీలకపాత్ర పోషిస్తుంది. ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేయగల ఏకైక వనరు సైతం అదే. ఏ దేశంలోనైనా ధరల పెరుగుదలవల్ల ద్రవ్యోల్బణం హెచ్చుతుంది. స్థూల దేశీయోత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా వృద్ధిరేటు దిగజారుతుంది. కరెన్సీ పతనమవుతుంది. విదేశ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతాయి. వీటిన్నింటి ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. భారత్‌ ఇందుకు భిన్నం కాదు. అందుకే కొన్నాళ్లుగా ఇండియా తన చమురు దిగుమతి బిల్లు భారాన్ని తగ్గించుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తోంది. ముడి చమురు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడే తీసుకొనేందుకు సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టినప్పటి నుంచి అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఒక దశలో బ్యారెల్‌ ముడిచమురు 130 డాలర్లకు పైగా ఎగబాకింది.

 

ఇదేం న్యాయం?

గత ఏడాది నవంబరు నాలుగో తేదీ నుంచి కొన్ని నెలలపాటు చమురు కంపెనీలు- పెరుగుతున్న క్రూడ్‌ ధరలకు అనుగుణంగా రిటైల్‌ రేట్లు పెంచలేదు. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే అందుకు కారణం. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరవాత నుంచి దేశీయ ఇంధన ధరలు తరచూ పెరుగుతున్నాయి. గత ఏడాది జనవరి నుంచి జులై మధ్యకాలంలో రీటైల్‌ ధరను పెట్రోలుకు 63 సార్లు, డీజిలుకు 61 సార్లు కంపెనీలు పెంచాయి. కేంద్రం గత ఏడాది నవంబరులో లీటరు పెట్రోలుపై అయిదు రూపాయలు, లీటరు డీజిలుపై పది రూపాయల చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సైతం తమ వ్యాట్‌ వాటాను తగ్గించాయి. గతంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు 20 డాలర్లకే లభించినప్పుడు ఆ ప్రయోజనాన్ని కేంద్రం వినియోగదారుడికి బదలాయించలేదు. కాబట్టి న్యాయంగా అయితే ప్రస్తుతం పెరుగుతున్న ముడిచమురు ధరల భారాన్ని కూడా ప్రజలపై వేయకూడదు. 2015లో పెట్రోలు, డీజిలుపై కేంద్రానికి లభించిన ఆదాయం రూ.99,000 కోట్లు; 2021-22కు అది నాలుగు రెట్లకు పైగా పెరిగి నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరింది.

 

లీటరు పెట్రోలు లేదా డీజిలుకు కొనుగోలుదారుడు చెల్లిస్తున్న ధరలో అత్యధిక భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే చేరుతోంది. అంతర్జాతీయ విపణిలో ముడి చమురుధర పెరిగినప్పుడల్లా కేంద్రం, రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయి. తగ్గినప్పుడు కేంద్రం మాత్రం సెస్‌ రూపంలో కొనుగోలుదారుడి నుంచి లాక్కొంటోంది. అయితే కేంద్రం లబ్ధి పొందుతున్న స్థాయిలో రాష్ట్రాలు లాభపడటంలేదు. ఇంధన ధరలు భారీగా తగ్గితే రాష్ట్రాలకు వ్యాట్‌ తగ్గుదల రూపంలో నష్టం సంభవిస్తుంది. కేంద్రం మాత్రం పలు రకాల సెస్‌లతో లబ్ధి పొందుతోంది. 2018-2021 మధ్య కేంద్రానికి పెరిగిన ఎక్సైజ్‌ పన్ను మొత్తం 62శాతం; రాష్ట్రాల అమ్మకపు పన్ను కేవలం తొమ్మిది శాతమే హెచ్చింది. బహిరంగ విపణి కంటే తక్కువ ధరకే భారత్‌కు ముడిచమురు సరఫరా చేసేందుకు ఇటీవల రష్యా అంగీకరించింది. రవాణా ఖర్చులను సైతం ఆ దేశమే భరించడానికి ఒప్పుకొంది. ఇది శుభ పరిణామమే. ప్రపంచంలో చమురు ఉత్పత్తిలో 2021లో అమెరికా తరవాత రష్యా రెండో అతి పెద్ద దేశం. ఇటీవల రష్యాపై ఆంక్షల నేపథ్యంలో పలు దేశాలు అక్కడి నుంచి ముడి చమురును దిగుమతి చేసుకొనేందుకు సుముఖత చూపడంలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన ప్రభుత్వరంగ చమురు సంస్థలు క్యూ కడుతున్నాయి. ఈ పరిణామంతో అమెరికా సైతం భారత్‌కు ముడి చమురును తక్కువ ధరకే సరఫరా చేసేందుకు ముందుకొచ్చింది. భారత్‌ దీనికి ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.

 

పన్నుల్లో రాయితీలు అవసరం

ముడిచమురు కోసం సుదీర్ఘకాలం ఇతర దేశాలపై ఆధారపడటం మంచిది కాదు. అంతర్జాతీయ స్థాయిలో పెరిగిన ప్రతి పది శాతం ముడి చమురు ధర భారత స్థూల దేశీయోత్పత్తిని సుమారు 0.2శాతం మేర తగ్గిస్తుంది. కరెంటు ఖాతాలోటును 0.3శాతం మేర పెంచుతుంది. ద్రవ్యోల్బణం 0.3శాతం నుంచి 0.4శాతం వరకు పెరుగుతుంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధర వల్ల భారత్‌లోని వాహన వినియోగదారులు, విమానయాన రంగం, పెయింటింగ్‌, టైర్లు, లాజిస్టిక్‌ సంస్థలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం భారత్‌ ముడిచమురు నిల్వ సామర్థ్యం చాలా తక్కువ. భవిష్యత్తులో కొరతను ఎదుర్కోవాలంటే నిల్వ సామర్థ్యం భారీగా పెరగాలి. ప్రభుత్వాలు పలు వస్తువులపై పెంచిన పన్నులను సత్వరమే తగ్గించాలి. కనీసం పేద మధ్య తరగతి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలి. ఆహార దినుసులు, నిత్యావసర సరకులు, ప్రజా రవాణా కోసం వినియోగించే వాహనాలకు వాడే ఇంధనంపై విధించే పన్నుల్లో రాయితీలు కల్పించాలి. ఫలితంగా ఏర్పడిన లోటును పూడ్చుకొనేందుకు ఆడంబర వస్తువుల వినియోగంపై పన్నులను పెంచే అంశాన్ని పరిశీలించవచ్చు.

 

ప్రత్యామ్నాయాలు కీలకం

ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పదిశాతం ఎథనాల్‌ కలిపిన పెట్రోలును విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఆ మేరకు పెట్రోలు ఆదా అవుతోంది. 2026 నాటికి భారత్‌ చైనాను అధిగమించి మూడో అతిపెద్ద ఎథనాల్‌ వినియోగ దేశంగా ఎదుగుతుందని ప్రపంచ ఇంధన ఏజెన్సీ పేర్కొంది. భారత్‌లో దీని వినియోగం 2017-21 మధ్యకాలంలో మూడు రెట్లు పెరిగి 2021 ఏడాదికి బహుశా మూడు కోట్ల లీటర్లకు చేరుతుందని అంచనా. 2021 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 3,628 సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) స్టేషన్లు, 85లక్షలకు పైగా పీఎన్‌జీ (పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫలితంగా ఇంధన పరిశ్రమలో వీటివాటా 2020లో ఉన్న 6.3శాతం నుంచి 2021నాటికి 6.7శాతానికి పెరిగింది. దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాలపై అవగాహన పెరుగుతోంది. 2022 జనవరి నాటికి దేశంలో వీటి సంఖ్య 9.66 లక్షలు. వీటిని తయారు చేస్తున్న సంస్థల సంఖ్య 55. 2021-22 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 4.20 లక్షల వాహనాల విక్రయాలు జరిగాయి. 2030 నాటికి మొత్తం వాహనాల అమ్మకాల్లో 30శాతం విద్యుత్‌ ఆధారితమైనవే ఉండాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించుకొంది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నీటి బొట్టు... నేరుగా మొక్కకు

‣ స్థిరాదాయం కరవు... బతుకే బరువు!

‣ కాలుష్య భూతం.. ఉక్కిరిబిక్కిరవుతున్న భారతం

‣ ప్రాంతీయ సహకారానికి బిమ్‌స్టెక్‌ భరోసా

‣ మాల్దీవుల్లో చైనా చిచ్చు

‣ శ్రామిక సంక్షేమానికి భరోసా

‣ ఒప్పందాలకు తిలోదకాలు

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 05-04-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం