• facebook
  • whatsapp
  • telegram

మాల్దీవుల్లో చైనా చిచ్చు

భారత్‌పై విద్వేష ప్రచారం

ఇండియాతో మాల్దీవుల మైత్రీబంధాన్ని దెబ్బతీసేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. దిల్లీపై ద్వీప సముదాయ దేశంలో విద్వేష ప్రచారాన్ని ఎగదోస్తోంది. ‘భారత్‌ వెళ్లిపోవాలి (ఇండియా ఔట్‌)’ పేరుతో అక్కడ సాగుతున్నది డ్రాగన్‌ ప్రాయోజిత ఉద్యమమేనని ఎప్పటికప్పుడు స్పష్టమవుతూనే ఉంది. అడుగడుగునా తమకు వత్తాసు పలికే మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ దాదాపు మూడు నెలల క్రితం జైలు నుంచి విడుదలై రాజకీయాల్లో మళ్ళీ క్రియాశీలకంగా మారడమూ- ప్రస్తుతం బీజింగ్‌కు కలిసివచ్చే పరిణామమే. 

హిందూ మహాసముద్రానికి మాల్దీవుల్ని గేట్‌వేగా అభివర్ణిస్తారు. వ్యూహాత్మకంగా అది కీలకమైన ప్రాంతంలో ఉంది. సుమారు అయిదున్నర లక్షల జనాభా ఉన్న ఈ దేశానికి పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. అత్యంత సమీప పొరుగు దేశమైన ఇండియాతో మాల్దీవులకు దీర్ఘకాలంగా సత్సంబంధాలున్నాయి. మాలి ఆహార భద్రతకు భారత్‌ అత్యంత కీలకం.

మాల్దీవుల ప్రజలు వినియోగిస్తున్న బియ్యం, చక్కెర, చికెన్‌, గుడ్లు, బంగాళదుంప, ఉల్లి వంటి సరకుల్లో సింహభాగం మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. దశాబ్దాలపాటు సాఫీగా సాగిన ద్వైపాక్షిక చెలిమి 2013లో యమీన్‌ అధ్యక్ష పీఠమెక్కాక తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది. చిన్న దేశాలను రుణాల ఊబిలో దింపి తన గుప్పిట్లోకి తెచ్చుకోవడం అలవాటు చేసుకున్న డ్రాగన్‌- మాల్దీవులపైనా అదే పాచికను ప్రయోగించింది. యమీన్‌ అధ్యక్ష పీఠంపై ఉన్నప్పుడు ఆ దేశానికి భారీగా అప్పులిచ్చింది. ప్రస్తుతం మాల్దీవుల మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఆ దేశానికి బీజింగ్‌ ఇచ్చిన రుణాల విలువే ఎక్కువ అంటే అతిశయోక్తి కాదు. డ్రాగన్‌ రుణ ఉచ్చులో చిక్కుకున్న యమీన్‌- భారత వ్యతిరేక విధానాలను అవలంబించారు. తీరప్రాంతాల్లో గస్తీ నిర్వహణ కోసం దిల్లీ స్నేహపూర్వకంగా అందించిన రెండు ధ్రువ్‌ హెలికాప్టర్లను వెనక్కి ఇచ్చేశారు. తమ దేశంలో విమానాశ్రయ ఆధునికీకరణ కాంట్రాక్టును దక్కించుకున్న భారతీయ కంపెనీని పక్కకు తప్పించి, చైనా సంస్థకు దాన్ని కట్టబెట్టారు.

మాల్దీవుల అధ్యక్ష బాధ్యతల్ని 2018లో ఇబ్రహీం సొలిహ్‌ చేపట్టిన తరవాత- పరిస్థితుల్లో మార్పు వచ్చింది. చైనా రుణ ఊబి నుంచి మెల్లగా బయటపడేందుకు ఆయన చర్యలు ప్రారంభించారు. ఇండియాతో అత్యంత సన్నిహితంగా మెలగుతూ... చైనాపై ఆధారపడటం తగ్గించారు. ప్రధాని మోదీ, సొలిహ్‌ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహమూ ఇందుకు కలిసి వచ్చింది. రెండోసారి ప్రధాని పీఠమెక్కిన తరవాత మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన మాల్దీవులకే. తద్వారా ఆ దేశానికి, సొలిహ్‌తో స్నేహానికి తాను ఇస్తున్న ప్రాధాన్యమేమిటో చాటిచెప్పారు. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ ఇటీవల మాల్దీవుల్లో పర్యటించారు. అక్కడి పోలీసులు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల శిక్షణ కోసం భారత నిధులతో ఏర్పాటుచేసిన ప్రత్యేక కళాశాల సహా పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించారు. భద్రతా వ్యవహారాల్లో ఉపయోగపడే తీరప్రాంత రాడార్‌ వ్యవస్థను ఆ దేశానికి అందజేశారు. విద్య, ఆరోగ్య రంగాల్లో సహకారానికి సంబంధించి కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. మాల్దీవులకు ఇప్పటివరకు గ్రాంట్లు, రుణాలు, శిక్షణ సహకార సొమ్ము తదితర రూపాల్లో ఇండియా దాదాపు రూ.20 వేల కోట్ల వరకు నిధులు సమకూర్చింది. ద్వీపసముదాయ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా, పారదర్శకంగా తాము నిధులు అందిస్తున్నామంటూ జైశంకర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు చైనాకు చురకలంటించేవే.

తమ దేశంలో భారత బలగాల మోహరింపు పెరుగుతోందని యమీన్‌, ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. ‘భారత్‌ వెళ్ళిపోవాలి’ అని డిమాండ్‌ చేస్తూ ప్రత్యేక ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. మాల్దీవుల రాజధాని మాలికి సమీపంలోని ఉథురు థిలా ఫల్హు (యూటీఎఫ్‌) వద్ద కోస్ట్‌గార్డ్‌ హార్బర్‌, డాక్‌యార్డును భారత్‌ అభివృద్ధి చేసేలా 2021 ఫిబ్రవరిలో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. దాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ ప్రాజెక్టు సాకారమైతే భారత్‌కు యూటీఎఫ్‌ మిలిటరీ స్థావరంగా మారుతుందని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో 2019లో జైలుపాలైన యమీన్‌- ఇటీవలే విడుదలయ్యారు. ఆయన్ను ముందు పెట్టి భారత వ్యతిరేక ప్రచారానికి చైనా మరింత ఊపు తీసుకొచ్చే అవకాశముంది. ‘భారత్‌ వెళ్ళిపోవాలి’ నిరసనకు విస్తృత ప్రచారం కల్పిస్తున్న సామాజిక మాధ్యమ ఖాతాలు, కొన్ని మీడియా సంస్థలకు డ్రాగన్‌ నుంచి నిధులు అందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రజలు అప్రమత్తం కావాలి. చైనా ఉచ్చును అర్థం చేసుకోవాలి. లేదంటే ప్రస్తుతం శ్రీలంక ఎలాంటి దుస్థితిని ఎదుర్కొంటోందో అలాంటి పరిస్థితే మాలికీ ఎదురయ్యే ముప్పుంది.

- నవీన్‌కుమార్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ శ్రామిక సంక్షేమానికి భరోసా

‣ ఒప్పందాలకు తిలోదకాలు

‣ ముట్టడి వ్యూహంతో ముందుకు

‣ భూసారం... ఆహార భద్రతకు వరం!

‣ సరిహద్దు వివాదాల పీటముడి

‣ దశాబ్దాల నిర్లిప్తత... కుదేలైన అక్షరాస్యత!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 30-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం