• facebook
  • whatsapp
  • telegram

దశాబ్దాల నిర్లిప్తత... కుదేలైన అక్షరాస్యత!

అరకొర కేటాయింపులతో దక్కని ప్రయోజనం

అక్షరాస్యత మానవాభివృద్ధిలోనే కాదు... దేశ ప్రగతిలోనూ అత్యంత కీలకం. వ్యక్తి వికాసానికి, విజ్ఞాన సముపార్జనకు, అంతరాలను రూపుమాపడానికి, ఆర్థిక స్వావలంబనకు విద్యే ఆలంబనగా నిలుస్తుంది. వలస పాలకులు అమలు చేసిన విద్యావిధానాలు సంప్రదాయ విద్యార్జనకు భిన్నంగా, కేవలం వారి అవసరాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉండటంతో ఎక్కువ మంది చదువుకోవడానికి మొగ్గుచూపేవారు కాదు. ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించే నాటికి దేశ సగటు అక్షరాస్యత కేవలం 12 శాతమే. స్వాతంత్య్రానంతరం సంపూర్ణ అక్షరాస్యత సాధనకు వివిధ పథకాలను అమలు చేసినా పెద్దగా ఫలితాలు దక్కలేదు. నియత విద్యపై చూపిన శ్రద్ధను వయోజన విద్యా కార్యక్రమాలపై చూపకపోవడంతో ఏడున్నర దశాబ్దాల తరవాత కూడా మన అక్షరాస్యత రేటు సుమారు 77 శాతానికి పరిమితమైంది. 2017-18 నాటి యునెస్కో లెక్కల ప్రకారం ప్రపంచంలో చదవడం, రాయడం రానివారిలో 35 శాతం భారత్‌లోనే ఉన్నారని, సంపూర్ణ అక్షరాస్యత సాధనకు మరో నాలుగు దశాబ్దాలు పడుతుందని అంచనా. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం- 15 ఏళ్లు దాటి అక్షరాస్యత లేనివారి కోసం తాజాగా నవభారత్‌ సాక్షరతా కార్యక్రమాన్ని ప్రకటించింది. జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)-2020లో భాగంగా ఈ పథకాన్ని అయిదేళ్లపాటు అమలు చేయాలని నిర్ణయించారు.

నిరంతరం మందగమనమే

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియత విద్యపై చూపిన శ్రద్ధను వయోజనుల అక్షరాస్యతపై చూపడం లేదు. ఈ పథకాలన్నీ నిరంతరం మందగమనంలోనే కొనసాగాయి. ఫలితంగా జపాన్‌, చైనా వంటి సమకాలీన దేశాలతో పోల్చితే అక్షరాస్యతలో భారత్‌ తీసికట్టుగానే ఉండిపోతోంది. స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాల తరవాత వయోజన విద్యకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి జాతీయ వయోజన విద్యా కార్యక్రమాన్ని (ఎన్‌ఏఈపీ) 1978 అక్టోబరు 2న ప్రారంభించింది. పగలంతా కాయకష్టం చేసే వయోజనులు రాత్రి బడికి రావడానికి ఇష్టపడకపోవడంతో కేవలం సంతకం చేయడం వస్తే చాలన్న స్థాయికి వచ్చారు. తొలినాళ్లలో తమ పేరు తాము రాసుకోగలిగే వారందరినీ అక్షరాస్యులుగానే భావించారు. 1988లో జాతీయ సాక్షరతా మిషన్‌ (ఎన్‌ఎల్‌ఎం) ద్వారా వయోజన విద్యకు మంచి ఊపు వచ్చింది. అంతర్జాతీయ సంస్థల ఒత్తిడితో అనియత విద్యా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచబ్యాంకు పర్యవేక్షణ ఉన్నంత వరకూ ఈ పథకాలు కొనసాగినా తరవాత మూలనపడేశారు. వయోజన అక్షరాస్యత వల్ల సార్వత్రిక విద్యాభివృద్ధికి అనువైన వాతావరణం ఏర్పడుతుందనే అభిప్రాయం ఉన్నా- దానికంటే పాఠశాల విద్యకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 14 ఏళ్ల వయసులోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించే లక్ష్యంతో 2002లో ఎన్‌డీఏ హయాములో విద్యాహక్కు బిల్లు-2002ను రూపొందించారు. 2009లో యూపీఏ ప్రభుత్వ హయాములో అది చట్టరూపాన్ని దాల్చింది. రాజ్యాంగ సవరణ ద్వారా హక్కుగా చేర్చిన తరవాత సైతం చట్టంగా అమలులోకి రావడానికి ఏడేళ్లు పట్టింది. ఈ చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు దృష్టి సారించాల్సి ఉంది. కానీ విద్యాసంవత్సరం ప్రారంభంలో హడావుడి చేసి, కనిపించిన పిల్లలను బడిలో చేర్పించి అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. చట్టం అమలులోకి వచ్చి పుష్కరం దాటినా ఇంకా బడిమానేసే బాలలు ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ డ్రాపవుట్లు అధికంగానే ఉంటున్నా ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూడైస్‌)లో అధికారులు నమోదు చేయడం లేదు. పేదరికం వల్ల తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా పనులకు వెళ్లాల్సి రావడం, వలస జీవితాలు, ఆడపిల్లల్లో రుతుక్రమ సమస్యలు, భద్రతపై భయం, బాల్యవివాహాలు, దూరాభారం వంటివన్నీ పాఠశాల విద్య నుంచి పిల్లలను దూరం చేస్తున్నాయి. కేవలం రుతుక్రమం కారణంగా దేశంలో కోట్ల మంది బాలికలు ఏటా పాఠశాలలకు వెళ్లడాన్ని మానేస్తున్నారు. బడిలో మధ్యాహ్న భోజనం పథకం అమలు, బాలికలకు శానిటరీ నాప్కిన్ల పంపిణీ తదితర సదుపాయాలు కల్పించడం వంటివి కొంత మేరకు హాజరు శాతాన్ని పెంచినా, కుటుంబాల ఆర్థిక అవసరాల వల్ల తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో పిల్లల చదువులపై శ్రద్ధ చూపడం లేదు. చదువుకుంటేనే సామాజికంగా, ఆర్థికంగా కుటుంబాల స్థితి మెరుగు పడుతుందనే విషయాన్ని ఎక్కువమంది తల్లిదండ్రులు గుర్తించడం లేదు.

బహుముఖ వ్యూహం అవసరం

ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ వహించడం లేదనే చెప్పాలి. ఇబ్బడి ముబ్బడిగా పథకాలు ప్రవేశపెడుతున్నా, వాటి అమలుకు తగిన నిధులు కేటాయించడం లేదు. విద్యారంగానికి కేటాయించిన నిధుల్లో సింహభాగం ఉన్నత విద్యకే వెచ్చిస్తున్నారు. సవాలక్ష సమస్యల నడుమ కొనసాగుతున్న పాఠశాల విద్యకు అరకొరగానే నిధులు సమకూరుతున్నాయి. ఎన్‌ఈపీ-2020లో పేర్కొన్న విధంగా విద్యారంగానికి జీడీపీలో ఆరు శాతం కేటాయించాలంటే వచ్చే బడ్జెట్‌లో రెట్టింపు నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. అక్షర పథకాల అమల్లో దేశవ్యాప్తంగా ఒకే విధానం పనిచేయదని గతానుభవాలు వెల్లడిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రత్యేక పరిస్థితులను బట్టి అక్కడి విద్యార్థుల అవసరాల ఆధారంగా పథకాలు అమలుచేస్తే ఫలితం ఉంటుంది. బాలకార్మికుల కోసం ప్రత్యేకంగా వేతనంతో కూడిన అక్షర పథకాలను అమలు చేయాలని గతంలో నిర్ణయించినా అమలు కావడం లేదు. సంచార జాతులు, వలస కార్మికుల పిల్లల కోసం తాత్కాలిక పద్ధతిలో ఏర్పాటు చేస్తున్న వసతి గృహాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. వాటిని శాశ్వత ప్రాతిపదికన నిర్వహించడానికి స్వచ్ఛంద సంస్థలకు తగిన తోడ్పాటును విద్యాశాఖ అందించాల్సిన అవసరం ఉంది. బహుముఖ వ్యూహంతో గ్రామీణ భారతంలోని స్థానిక సంస్థలకు విద్యాపరమైన అధికారాలు, నిధులు కేటాయిస్తే సంపూర్ణ అక్షరాస్యత సాధన సులభతరమవుతుంది.

కొత్త పథకానికి శ్రీకారం

కేంద్ర ప్రభుత్వం నవభారత్‌ సాక్షరతా పథకం పేరిట వయోజనుల కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఏడాదికి కోటి మందిని అక్షరాస్యులుగా మార్చాలని నిర్ణయించారు. 21వ శతాబ్దపు పౌరుడికి అవసరమైన జీవన నైపుణ్యాలైన ఆర్థిక అక్షరాస్యత, ఆరోగ్య అవగాహన, శిశు సంరక్షణ, కుటుంబ సంక్షేమంతో పాటు వృత్తివిద్యా నైపుణ్యాలు, మౌలిక విద్యతో పాటు నిరంతర విద్య అందేలా చూడనున్నారు. లక్ష్యం మేరకు అయిదు కోట్ల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినా, దేశాన్ని పీడిస్తున్న పెద్ద సమస్యను కొంత మేరకైనా పరిష్కరించినట్లవుతుంది. ఇతర పథకాల మాదిరిగానే అట్టహాసంగా ఆరంభించి, నెమ్మదిగా అటకెక్కిస్తే మాత్రం అక్షరాస్యత సాధనలో ఆమడ దూరంలో ఉండిపోతామన్నది నిష్ఠుర సత్యం.

- ఎం.కృష్ణారావ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కౌలురైతుకు కవుకు దెబ్బలు

‣ రసాయన దాడుల ముప్పు

‣ ఈశాన్యంలో వేళ్లూనుకొంటున్న భాజపా

‣ ఏడున్నర దశాబ్దాలుగా తప్పటడుగులే!

‣ సమగ్ర వికాసానికి ఆయువుపట్టు

‣ ఉత్తరాఖండ్‌లో కమల వికాసం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 21-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం