• facebook
  • whatsapp
  • telegram

సమగ్ర వికాసానికి ఆయువుపట్టు

బహుళ శాస్త్ర కోర్సులతో ఎంతో మేలు

విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో పోటీని తట్టుకొని ప్రగతి సాధించాలంటే దేశాలు నిపుణులైన మానవ వనరులను కలిగి ఉండాలి. భారత నైపుణ్యాల నివేదిక-2022 ప్రకారం, దేశంలో కేవలం 46శాతం యువత మాత్రమే ఉద్యోగ సాధనకు అవసరమైన సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి డిగ్రీ స్థాయినుంచి బహుళ శాస్త్ర (మల్టీడిసిప్లినరీ) కోర్సులను ప్రోత్సహించాలి. ఉన్నత విద్యలో ఒకే అంశంలోనే పరిజ్ఞానం అందించే కోర్సులకు కాలం చెల్లింది. విద్యార్థులు సాంకేతిక, మానవీయ, సామాజిక శాస్త్రాలు, సారస్వత విషయాల సమగ్ర పరిజ్ఞానం కలిగి ఉండేలా కోర్సుల రూపకల్పన జరగాలి. అందుకోసం ఆయా కోర్సుల్లో భిన్న శాస్త్రాలను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ వారికి ఉండాలి. తద్వారా సృజనాత్మకత, వృత్తి నైపుణ్యం, సామాజిక స్పృహ, దేశీయ, అంతర్జాతీయ పరిణామాలపట్ల అవగాహన, భావవ్యక్తీకరణ సామర్థ్యాలు వారికి అలవడతాయి. 21వ శతాబ్దం విసురుతున్న సవాళ్లను యువత దీటుగా ఎదుర్కోవాలంటే ఈ లక్షణాలు చాలా అవసరం.

డిగ్రీ, పీజీ స్థాయుల్లో సైన్స్‌, సామాజిక శాస్త్రాల అధ్యయనాల మధ్య సమతౌల్యం సాధించాలని కొఠారి కమిషన్‌ సూచించింది. డిగ్రీ స్థాయిలో విద్యార్థులు ప్రధాన కోర్సును అధ్యయనం చేయడంతోపాటు ఇతర శాస్త్రాల పరిజ్ఞానాన్ని సైతం అందిపుచ్చుకొని ప్రపంచ పరిస్థితులకు స్పందించేలా ఉండాలని యశ్‌పాల్‌ కమిటీ వ్యాఖ్యానించింది. సాంకేతిక విద్యపై నియమించిన యు.ఆర్‌.రావు కమిటీ- ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు, ప్రపంచ పరిణామాలపట్ల అవగాహన పెంచేందుకు బహుళ శాస్త్ర కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించింది. నూతన జాతీయ విద్యావిధానం-2020 సైతం వాటి ప్రాధాన్యాన్ని గుర్తించింది. ఇంజినీరింగ్‌, సైన్స్‌ విద్యలో బహుళ శాస్త్ర కోర్సులు కొంత విజయం సాధించినా- మానవీయ, సామాజిక శాస్త్రాలు, ఇతర కోర్సుల్లో ఆశించిన ప్రగతిని అందుకోలేకపోయాయి. కోర్సులపట్ల అవగాహనాలోపం, గుర్తింపు లేకపోవడం, వివిధ శాఖల మధ్య సమన్వయ లేమి, ఉన్నత విద్య అవకాశాలు పరిమితంగా ఉండటం, ప్రభుత్వ మద్దతు లోపించడం ఇందుకు ప్రధాన కారణాలు. ప్రపంచీకరణ ఫలితంగా ప్రస్తుతం ఆ కోర్సులకు ప్రాధాన్యం, ప్రభుత్వ మద్దతు పెరుగుతున్నాయి. డిగ్రీ స్థాయిలో సెమిస్టర్‌ విధానం, ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం, క్రెడిట్‌ బదిలీ వంటి సంస్కరణల ద్వారా బహుళ శాస్త్ర కోర్సుల అధ్యయనానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం ప్రాధాన్యం కల్పిస్తోంది. విద్యార్థులు ప్రధాన డిగ్రీతోపాటు, మరొక సబ్జెక్టులో మైనర్‌ బీటెక్‌ పట్టా పొందేలా హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటువంటి కోర్సులు విజయవంతం కావాలంటే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పాఠ్యాంశాల కూర్పు, కాలానుగుణంగా వాటిలో మార్పులు అత్యవసరం. నాణ్యమైన బోధనా సిబ్బంది, బోధనలో నవ్యత, పరిశ్రమలతో విద్యాసంస్థల అనుసంధానం వంటి అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారించాలి. వివిధ రంగాల్లో ప్రస్తుతం యాంత్రీకరణ, సాంకేతికత వ్యాప్తి, కృత్రిమ మేధ వినియోగం అధికమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బహుళ శాస్త్ర కోర్సుల అధ్యయనం యువతలో విశ్వాసాన్ని, భరోసాను నింపుతాయి.

- డాక్టర్‌ సీహెచ్‌.సి.ప్రసాద్‌

(విద్యారంగ నిపుణులు)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఆధునిక యుగంలోనూ అసమానతలు

‣ మౌలిక వృద్ధికి నిధుల సమీకరణే కీలకం

‣ రైతుల్లో అవగాహనతోనే సక్రమ వాడకం

‣ దేశ రక్షణలో నారీ శక్తి

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం