• facebook
  • whatsapp
  • telegram

దేశ రక్షణలో నారీ శక్తి

పరిశోధన, అభివృద్ధిలో విశేష ఖ్యాతి

ఆధునిక మహిళలు విజయపథంలో దూసుకుపోవడం అసాధ్యం కాదని రాజకీయ, దౌత్య, సైన్స్‌, వైద్య, వ్యాపార రంగాల్లో ఎందరో వనితామణులు నిరూపించారు. ఇంటికి వెలుగైన ఇల్లాలు, నేడు జగతికే దారిదీపంగా నిలుస్తోంది. ఎందరో మహిళలు దేశ నాయకులుగా చరిత్ర సృష్టిస్తూ, జాతి దశను దిశను మార్చేస్తున్నారు. పలు సంస్థల్లో స్త్రీలు ఉన్నత స్థానాలను అందుకోకుండా పలు అడ్డుగోడలు నిరోధిస్తున్నాయనేది పాత మాట. నేటి మహిళామణులు అడ్డంకులను ఛేదించి మరీ పదోన్నతి సాధిస్తున్నారు. ఒక వనిత అందుకొనే విజయం మరెందరో నారీమణులకు ప్రేరణ ఇచ్చి, తామూ అనుకున్నది సాధించగలమనే నమ్మకాన్ని పాదుగొల్పుతుంది. ఆకాశంలో సగమైన స్త్రీలకు అన్ని రకాలుగా సముచిత, సమాన వాటా ఇచ్చే దేశాలు అభివృద్ధి పథంలో దూసుకుపోవడం చూస్తూనే ఉన్నాం. ఉన్నత విద్యార్హతలు సాధిస్తున్న యువతులు వృత్తిఉద్యోగాల్లో అధిక అవకాశాలను అందిపుచ్చుకొంటూ తమ సత్తా చాటిచెబుతున్నారు. సామాజిక కట్టుబాట్లు మహిళాభ్యుదయానికి అడ్డు కాకూడదని దేశాలు, వ్యాపార సంస్థలు గుర్తిస్తున్నాయి. తదనుగుణమైన విధానాలను రూపొందించి అమలు చేస్తున్నాయి. ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర ప్రస్థానంలో రక్షణ రంగంలోనూ మహిళలు ఉన్నత స్థానాల్లో రాణించడం సంతోషదాయకం.

పురుషాధిక్య రంగాల్లో పాగా

ఒకప్పుడు మహిళలకు అనువైనవి కావనుకున్న ఇంజినీరింగ్‌, శాస్త్ర సాంకేతిక పరిశోధన వంటి రంగాల్లోనూ వారు విజయ బావుటా ఎగురవేస్తున్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), భాభా అణుశక్తి పరిశోధన కేంద్రం (బార్క్‌), భారత శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్‌), కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ), బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) తదితర సంస్థల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. డీఆర్‌డీఓలో ఒకప్పుడు మహిళా శాస్త్రవేత్తల సంఖ్య రెండు లేదా మూడు శాతానికి మించేది కాదు. క్రమంగా అది 15.8 శాతానికి పెరిగింది. డీఆర్‌డీఓ సాంకేతిక క్యాడర్‌లో 11.7శాతం మహిళలే. పాలన, సంబంధిత ఇతర విభాగాల్లో వారు 22.7శాతం మేర ఉన్నారు. నేడు డీఆర్‌డీఓలో క్షిపణి కార్యక్రమం మొదలు ఫైటర్‌ విమానాల ప్రాజెక్టుల వరకు, ఎలెక్ట్రానిక్స్‌ డిజైన్‌ నుంచి ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ వరకు, క్వాలిటీ ఇంజినీర్లు మొదలుకొని కార్పొరేట్‌ మేనేజర్ల వరకు మహిళలు కీలక స్థానాలను అలంకరిస్తున్నారు.  

ఏదైనా ఆయుధ వ్యవస్థను రూపొందించాలంటే ఎంతో పరిశోధన అవసరం. అక్కడి నుంచి అది అభివృద్ధి దశకు చేరుకొని టెస్టింగ్‌ పూర్తి చేసుకొని ధ్రువీకరణ పొందాలి. ఆ ఆయుధ వ్యవస్థను యుద్ధ రంగంలో వినియోగించే విభాగం మదింపు వేయాలి. అంతిమ ఆమోద ముద్ర పొందాక సాంకేతికతను ఉత్పత్తికోసం పరిశ్రమలకు బదిలీ చేయాలి. ఈ అంచెలన్నీ పూర్తి కావడానికి సుదీర్ఘ సమయం పడుతుంది. రోజూ ఎన్నో గంటల పని ఒత్తిడి ఉంటుంది. దేశంలో మారుమూల ప్రాంతాల్లోని పరీక్ష వేదికల వద్దకు వెళ్ళి ఆయుధ పరీక్ష నిర్వహించాలి. ఇదంతా పూర్తయ్యేలోగా వారాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అనేక విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. అన్ని సవాళ్లనూ అధిగమించి సైనిక దళాలకోసం స్వదేశీ ఆయుధాలు, పరిజ్ఞానం అభివృద్ధి చేయాలి. నేడు క్షిపణుల నుంచి వైమానిక, అంతరిక్ష, జీవ శాస్త్ర, ఆయుధ వ్యవస్థల రూపకల్పనలో మహిళలు ముందున్నారు. మెటీరియల్స్‌, నౌకా యుద్ధ వ్యవస్థలు, ఎలెక్ట్రానిక్స్‌, సైబర్‌, భావి పోరాట రీతులు, ఆయుధాల రూపకల్పనలో నిరుపమానమైన పాత్ర పోషిస్తున్నారు. డీఆర్‌డీఓ భారత సాయుధ బలగాలకు సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను అందించి సరిపెట్టుకునే దశ నుంచి నేడు సాంకేతికంగా, నిర్వహణ పరంగా నాయకత్వ స్థాయికి ఎదిగింది. క్షిపణులను విజయవంతంగా రూపొందించి స్వదేశంలోనే ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతోంది. ఇది చాలా సవాలుతో కూడిన ప్రక్రియ. ఆధునిక ఆయుధాల రూపకల్పనకు ఒకేసారి వివిధ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు కదలాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ఎలెక్ట్రిక్‌ కనెక్షన్‌లో పొరపాటు చోటుచేసుకుంటే అది నియంత్రణ సాఫ్ట్‌వేర్‌ను తప్పుదోవ పట్టించి ఆయుధ పరీక్షను గాడి తప్పిస్తుంది. వైఫల్యాలు ఎంతటి తీవ్రమైనవో గ్రహించి, వాటికి కారణాలను ఆరా తీసి, ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడం పరిశోధన-అభివృద్ధిలో అంతర్భాగం. రక్షణ పరిశోధన అనేది ఎంతో శ్రమతో కూడిన ప్రక్రియ. సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా వివరించడమూ కుదరదు. పరిశోధనలో విజయాలు సాధించినా, వాటిని జాతీయ భద్రత దృష్ట్యా రహస్యంగానే ఉంచుతారు.

అలుపెరుగని కృషి

మహిళలు స్వభావరీత్యా విస్తృత సమాచారాన్ని ఓర్పుగా పరిశీలించి, పనికొచ్చే అంశాలను గ్రహించి, చిన్న చిన్న అపశ్రుతులను కూడా కనిపెట్టగలుగుతారు. డేటా సైన్స్‌కు ఇది అత్యంత ఉపయుక్తమైన గుణం. పరిశోధన-అభివృద్ధిలో కొన్నిసార్లు ఏదైనా శాస్త్రసాంకేతిక సమస్య తలెత్తితే, అది ఒక పట్టాన కొరుకుడు పడకపోవచ్చు. ఆ సమస్య మన మేధను నిరంతరం తొలుస్తూనే ఉంటుంది. విభిన్న సమాచార శకలాలు పరస్పరం అనుసంధానమై మనసు తెరపై పరిష్కారంగా దర్శనమిస్తాయి. ఇదే సృజనాత్మకత లక్షణం. శారీరకంగా, మానసికంగా నిత్యం ఒత్తిడికి లోనవుతూనే పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం, వృత్తిలో సృజనాత్మక విజయాలు సాధించడం తేలిక కాదు. లక్ష్యాన్ని అందుకోవాలనే దృఢ సంకల్పం ఉన్నప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకుని సహకరిస్తారు. మహిళలు చేపట్టిన సాహసిక అన్వేషణలో భాగస్వాములవుతారు. అనుకున్నది సాధించేవరకు విశ్రమించడం ఉండదు కాబట్టి సెలవులు తీసుకోకుండానే ఏళ్లకేళ్లు గడచిపోతాయి. అలాంటివారి జీవితాలు పని చుట్టూనే పరిభ్రమిస్తాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో కుటుంబానికి దూరంగా గడపాల్సి వస్తుంది. దేశం కోసం, దేశ భద్రత కోసం పనిచేస్తున్నామనే చైతన్యం అన్ని కష్టాలనూ మరచిపోయేలా చేస్తుంది. శత్రువు పనిపట్టగల ఆయుధాలను కనుగొన్నప్పుడు ఆనందంతో మనసంతా నిండిపోతుంది. ఈ విజయానికి కుటుంబమూ పరోక్ష సహకారం అందించిందనే ఆత్మతృప్తి తరవాతి సాహసిక అన్వేషణకు ఇంధనంగా పనిచేస్తుంది. డీఆర్‌డీఓలో పనిచేయడం ఒక గొప్ప అనుభూతి. సైన్స్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో సవాళ్లను స్వీకరించాలనుకునే, ఆధునిక రక్షణ పరిజ్ఞానంలో రాణించాలనుకునే యువతులకు ఇది సరైన వేదిక.

విలువైన సేవలు

రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగంలో మహిళలు విశేష పాత్ర పోషిస్తున్నారు. డీఆర్‌డీఓలోని ఏడు సాంకేతిక డైరెక్టర్‌ జనరల్‌ పదవుల్లో మూడింటిని మహిళలు నిర్వహిస్తున్నారు. ఎనిమిది ప్రయోగశాలలకు సంచాలకులుగా, కార్పొరేట్‌ డైరెక్టర్లుగా సారథ్యం వహిస్తున్నారు. ఇంకా ఎందరో మహిళలు ప్రాజెక్టు డైరెక్టర్లుగా, డీఆర్‌డీఓ సీనియర్‌ శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారు. దేశ భద్రతకు కీలకమైన రక్షణ పరిశోధనలో పాల్గొంటున్నారు.

‘నీ గెలుపు అలవోకగా, అలవాటుగా రావాలి. నీ విజయ పరంపరలో ఓటమిని ఒకింత మార్పుగా స్వీకరించి సేద తీరాలి’ - అమెరికన్‌ కవి రాల్ఫ్‌ వాల్డో ఎమర్సన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అందరికీ దక్కని ఉపాధి హామీ

‣ జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ముప్పు

‣ యుద్ధం... ప్రపంచార్థికానికి శాపం!

‣ యూఏఈతో సరికొత్త వాణిజ్య బంధం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 07-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం