• facebook
  • whatsapp
  • telegram

అందరికీ దక్కని ఉపాధి హామీ

పట్టణ పేదలకూ అవకాశం కల్పిస్తే ప్రయోజనం

కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలంతో ఉపాధి అవకాశాలు దెబ్బతిని- గత రెండేళ్లుగా మిగతా ప్రపంచంతోపాటు భారతదేశంలోనూ నిరుద్యోగం తారస్థాయికి చేరింది. అప్పటికే తీవ్ర నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భారత్‌కు కొవిడ్‌ సంక్షోభం పులిమీద పుట్రలా దాపురించింది. 2011-12లో 2.2శాతంగా ఉన్న వార్షిక నిరుద్యోగిత రేటు 2017-18కల్లా 6.1 శాతానికి చేరింది. నాలుగు దశాబ్దాల్లో అదే అత్యధిక నిరుద్యోగిత అని ‘జాతీయ నమూనా సర్వే సంస్థ’ గణాంకాలు ధ్రువీకరించాయి. 2020 మార్చిలో కొవిడ్‌ భారత్‌లో వ్యాపించడం మొదలైనప్పటి నుంచి పరిస్థితి మరింత తీవ్రమైంది. 2020 ఏప్రిల్‌లో నెలవారీ నిరుద్యోగిత 23.5శాతానికి, మే నెలలో 21.7శాతానికి చేరుకున్నట్లు ‘భారత ఆర్థిక రంగ పర్యవేక్షణ సంస్థ (సీఎంఐఈ)’ సర్వే తేల్చింది. 2021 డిసెంబరు నాటికి స్థూల వార్షిక నిరుద్యోగిత 7.9శాతానికి చేరుకుంది. పట్టణ నిరుద్యోగిత 9.3శాతం; గ్రామీణ నిరుద్యోగిత 7.28శాతం. నిరుడు డిసెంబరు నాటికి దేశంలో మొత్తం 5.3 కోట్ల మంది నిరుద్యోగులున్నారు. గ్రామీణ నిరుద్యోగులను కొంతవరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకున్నా, పట్టణ నిరుద్యోగులకు ఎటువంటి ఆధారమూ లేకుండా పోయింది. ఈ కారణం వల్లే కొవిడ్‌ కాలంలో గ్రామాలకన్నా పట్టణాల్లో ఎక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. దీంతో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పంథాలో పట్టణ నిరుద్యోగులకు ఉపాధి హామీ చేపట్టాలని 2021 ఆగస్టులో కార్మిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం ప్రతిపాదించింది.

ముందుకు పడని అడుగు

భారత్‌లో ఇంతకుముందు పట్టణ యువత కోసం స్వయం ఉపాధి పథకాలు చేపట్టారు. దినసరి వేతనం చెల్లించే గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటిది పట్టణాల్లో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. తొమ్మిదో పంచ వర్ష ప్రణాళికలో ‘స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్‌ యోజన’లో భాగంగా చిన్న స్థాయిలో పట్టణ వేతన ఉపాధి కార్యక్రమాన్ని చేపట్టారు. 1991 జనగణన ప్రకారం అయిదు లక్షల వరకు జనాభా కలిగిన పట్టణాలు, చిన్న నగరాల్లో నిరుపేద కుటుంబాల యువతకు దినసరి వేతనంపై ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన కార్యక్రమమది. చివరకు స్వర్ణ జయంతి కార్యక్రమం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో 2013లో దాని బదులు జాతీయ పట్టణ జీవనాధారాల పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ, అందులో దినసరి వేతనంపై పని చూపించే ఏర్పాటేమీ లేదు. కొన్ని రాష్ట్రాలు ఏడాదికి కొన్ని రోజులపాటు కనీస వేతనంపై పనులు చూపించడానికి చొరవ తీసుకున్నా, కేంద్రం నుంచి ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. పట్టణ ఉపాధి హామీ పథకం చేపడితే, దానికి నిధులు సమకూర్చడం సమస్యగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు వాదించారు. ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదని గణాంకాలు ఉటంకించారు. లోతుగా తరచి చూస్తే పట్టణ ఉపాధి హామీ ఖరీదైన వ్యవహారం కాదని అర్థమవుతుంది. ఉదాహరణకు రెండు కోట్ల మంది పట్టణ కూలీలకు రూ.300 దినసరి వేతనం మీద ఏడాదికి 100 రోజుల పని కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.60వేల కోట్లు ఖర్చవుతుంది. ఇది మరీ ఎక్కువగా ఉందనుకుంటే పథకాన్ని కోటిమందికి కుదించవచ్చు. అప్పుడు ఖర్చు రూ.30,000 కోట్లకు తగ్గుతుంది. ప్రపంచంలో పది అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌కు ఇది భరించలేనంత ఖర్చేమీ కాదు. ఈ ఖర్చుతో చేకూరే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. కోటి మంది పట్టణ యువతకు ఉపాధి హామీని వర్తింపజేస్తే వారికి తలా రూ.30,000 వార్షిక వేతనం లభిస్తుంది. ఒక్కో పట్టణ నిరుద్యోగి కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటారనుకుంటే మొత్తం నాలుగు కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నమాట. ఇంతమంది చేతిలో డబ్బు ఆడితే పట్టణాల్లో వస్తుసేవలకు గిరాకీ పెరిగి మొత్తం ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుంది. పట్టణాల్లో మౌలిక వసతుల విస్తరణకు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.

వినూత్న మార్గాలను అన్వేషించాలి

దీర్ఘకాలంలో ప్రైవేటు రంగాన్ని కూడా పట్టణ ఉపాధి హామీ పథకంలో భాగస్వామిగా చేయవచ్చు. కార్పొరేట్‌ రంగం చూపే దినసరి ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టడమెలాగన్నది పట్టణ పేద యువతకు నేర్పాలి. పట్టణ ఉపాధి హామీ కార్డు పొందిన యువతకు గ్రామాల్లోనూ పనులు చేసుకోవడానికి అర్హత కల్పించాలి. దీనివల్ల వలస కార్మికులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. పట్టణ ఉపాధి హామీ కింద ఏయే పనులు చేపట్టవచ్చో నిర్ణయించుకునే స్వేచ్ఛను, అధికారాన్ని మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లకు ఇవ్వాలి. స్థానిక పరిస్థితులు, అవసరాల గురించి ఈ సంస్థలకే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఏతావతా పట్టణ ఉపాధి హామీ పథకం నిరుద్యోగులకు ఎంతో అండగా ఉంటుందనడంలో సందేహం లేదు. పట్టణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 100 రోజులపాటు పని కల్పించడం బాగానే ఉన్నా, మిగిలిన 265 రోజుల మాటేమిటి అనే ప్రశ్న వస్తుంది. పట్టణ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి సాధ్యమైన మార్గాలన్నింటిలో ప్రయత్నించాలి. కార్పొరేట్‌ రంగాన్నీ కలుపుకొని వెళ్ళాలి. తోపుడు బండ్ల మీద విక్రయించే తినుబండారాలను, అల్పాహారాన్ని నేరుగా ఖాతాదారుల ఇళ్లకు బట్వాడా చేయడానికి స్విగ్గీ, జొమాటోలతో ‘ప్రధానమంత్రి వీధి వర్తకుల ఆత్మనిర్భర్‌ నిధి’ సంస్థ చేతులు కలిపింది. దీనివల్ల పట్టణాల్లో పలువురు యువకులకు ఉపాధి లభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పట్టణ స్వపరిపాలన సంస్థలు ఇలాంటి మరెన్నో వినూత్న మార్గాలను అన్వేషించాలి. అన్ని వర్గాలకూ ఆర్థిక ఫలాలు అందే సమ్మిళిత అభివృద్ధి నమూనాలో ముందుకు సాగాలి.

కేరళ ఆదర్శం

కేరళ 2010 నుంచే అయ్యన్‌ కళి పట్టణ ఉపాధి హామీ పథకాన్ని చేపట్టి నిరుద్యోగులకు  ఏటా 100 రోజుల పని కల్పిస్తోంది. ఈ విధంగా అందుబాటులోకి వచ్చే ఉపాధి అవకాశాల్లో 50శాతాన్ని మహిళలకు కేటాయించారు. పట్టణాల్లో నైపుణ్యం అవసరం లేని కూలి పనులను ఈ పథకం కింద అందిస్తున్నారు. చెట్ల పెంపకం, తోట పనులతో పర్యావరణ సంరక్షణకు ఈ పథకం తోడ్పడుతోంది. పట్టణ రహదారుల పక్కన, పాఠశాల మైదానాల్లో పండ్ల మొక్కలను నాటారు. రోడ్ల పక్కన గడ్డి, కలుపు మొక్కలు పెరికివేయడం, కాల్వలను శుభ్రం చేయడం, ప్లాస్టిక్‌ చెత్తను ఏరివేయడం వంటి పనులను పట్టణ ఉపాధి హామీ కింద చేపడుతున్నారు. దీనివల్ల వర్షాకాలంలో రోడ్లు వరద, మురుగునీటితో పొంగిపొర్లకుండా జాగ్రత్త పడగలుగుతున్నారు. చెట్ల పెంపకం విస్తరించి పట్టణాల్లో పరిశుభ్రమైన గాలి వీస్తోంది. కేరళ స్ఫూర్తితో మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, హిమాచల్‌, ఒడిశా రాష్ట్రాలు కూడా పట్టణ ఉపాధి హామీ కార్యక్రమాలను చేపట్టాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ యుద్ధం... ప్రపంచార్థికానికి శాపం!

‣ యూఏఈతో సరికొత్త వాణిజ్య బంధం

‣ పరిశోధనలే జవజీవాలు

‣ ఓటర్లపై తాయిలాల వర్షం

‣ నిస్సారమవుతున్న పంటభూములు

‣ పటిష్ఠ క్షిపణివ్యవస్థ భారత్‌ బలం

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 05-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం