• facebook
  • whatsapp
  • telegram

పటిష్ఠ క్షిపణివ్యవస్థ భారత్‌ బలం

‘పృథ్వి’ విజయమే పునాది

స్వతంత్ర భారత అమృతోత్సవ ప్రస్థానంలో క్షిపణుల అభివృద్ధికి ప్రత్యేక స్థానముంది. ఈ అస్త్రాలను సమకూర్చుకొనేందుకు ఒకనాడు బుడిబుడి అడుగులతో మొదలైన ప్రయాణం, నేడు పరుగు పందెంలో మనల్ని ముందంజలో నిలిపింది. పడుతూ లేస్తూ తిన్న ఎదురుదెబ్బలు ఇప్పుడు దేశాన్ని ఎదురులేని స్థితికి తీసుకెళ్లాయి. ఈ విజయాలకు గట్టి పునాది ‘పృథ్వి’ క్షిపణితోనే పడింది. భారత క్షిపణి పితామహుడు డాక్టర్‌ అబ్దుల్‌ కలాం కనుసన్నల్లో ఈ ప్రాజెక్టు ప్రాణం పోసుకుంది. ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాలను ఛేదించే భారత తొలి స్వదేశీ అస్త్రం పృథ్వి క్షిపణి 1988 ఫిబ్రవరి 25న మొదటిసారి నింగిలోకి దూసుకెళ్లింది. అప్పట్నుంచి ఈ రంగంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయిదు వేల కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరం పయనించే అగ్ని-5 అస్త్రంతో మన సత్తా ఖండాంతరాలకు పాకింది. ఇప్పుడు ధ్వనికన్నా ఆరు రెట్లు అధిక వేగంతో దూసుకెళ్ళే హైపర్‌ సోనిక్‌ క్షిపణులపై కసరత్తు జరుగుతోంది. ఒకప్పుడు క్షిపణి విడిభాగాలను మనకు విక్రయించేందుకు అనేక దేశాలు నిరాకరించగా, ప్రస్తుతం మనదేశం ఉత్పత్తి చేసిన మిసైల్స్‌ కొనేందుకు ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. భారత్‌ ఇలాంటి ఉన్నత స్థితిలో నిలబడటానికి కారణమైన ‘పృథ్వి’ విజయం వెనక జరిగిన అవిరళ కృషిలో కీలకపాత్ర పోషించిన, ఆ మొదటి ప్రయోగ సమయంలో డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించిన ప్రముఖ శాస్త్రవేత్త, డీఆర్‌డీఓ మాజీ అధిపతి, ప్రస్తుతం నీతి ఆయోగ్‌ సభ్యుడిగా ఉన్న డాక్టర్‌ వి.కె.సారస్వత్‌ ‘ఈనాడు’ ప్రతినిధి కంభంపాటి సురేష్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

దేశంలో సరైన సాంకేతిక సామర్థ్యం లేని రోజుల్లో పృథ్వి క్షిపణిని ఎలా అభివృద్ధి చేశారు?

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)లోని రక్షణ పరిశోధన అభివృద్ధి ల్యాబ్‌(డీఆర్‌డీఎల్‌-హైదరాబాద్‌)లో 1978లో ‘డెవిల్‌’ ప్రాజెక్టు కింద క్షిపణి పరిజ్ఞానాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. కొత్తతరం క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఆలోచనలు మొదలయ్యాయి. అప్పుడే అబ్దుల్‌ కలాం తన మాతృసంస్థ అంతరిక్ష విభాగం నుంచి రక్షణ పరిశోధన రంగంలోకి అడుగుపెట్టారు. డీఆర్‌డీఎల్‌లో క్షిపణి అభివృద్ధి తీరుతెన్నులను పూర్తిగా మార్చేశారు. ఫలితంగా ‘సమీకృత గైడెడ్‌ క్షిపణి అభివృద్ధి కార్యక్రమం’ (ఐజీఎండీపీ) పేరిట సంకల్పించిన ప్రోగ్రామ్‌కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రయోగ పరీక్షలకే పరిమితం కాకుండా సంబంధిత ఆయుధ వ్యవస్థలను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసి, సైనిక దళాలకు అందించాలని తీర్మానించారు. ఐజీఎండీపీ కింద అయిదు ప్రాజెక్టులకు 1983లో ప్రభుత్వం సుమారు రూ.380 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా అభివృద్ధి చేయాల్సిన క్షిపణుల్లో ఉపరితలం నుంచి ఉపరితలంపైనున్న లక్ష్యాలపైకి ప్రయోగించే అస్త్రం ఒకటి. ‘ఎస్‌ఎస్‌150’ అనే సంకేత నామంతో వ్యవహరించిన ఆ అస్త్రమే ‘పృథ్వి’గా మారింది. అప్పట్లో డీఆర్‌డీఓ వద్ద పూర్తిస్థాయి సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో కలాం నిర్ణయంతో హైదరాబాద్‌లో రీసెర్చి సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) ఏర్పాటుకు 1985లో పునాది పడింది. మరోవైపు- బీడీఎల్‌, హెచ్‌ఏఎల్‌ సంస్థలు క్షిపణుల ఉత్పత్తికి అవసరమైన సామర్థ్యాలను సముపార్జించుకున్నాయి. సాంకేతికత అభివృద్ధి కోసం తొలిసారిగా ప్రైవేటు రంగాన్నీ భాగస్వామిగా చేశాం. పృథ్వికి వి.జె.సుందరం ప్రాజెక్టు డైరెక్టర్‌గా, నేను డిప్యూటీగా పనిచేశాం. 1987 చివర్లో డీఆర్‌డీఎల్‌లో నిర్వహించిన ‘స్టేజ్‌ టెస్ట్‌’ విజయాన్ని సాధించింది. పృథ్విని ల్యాబ్‌ నుంచి శ్రీహరికోటకు తరలించాం. 1988 ఫిబ్రవరి 25 దేశ రక్షణ రంగంలో మరపురాని రోజు. క్షిపణి ఠీవిగా నింగిలోకి దూసుకెళ్లింది. నిర్దేశిత గరిష్ఠ సామర్థ్యమైన 120 కిలోమీటర్లు ప్రయాణించింది. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలోనూ మంచి పనితీరు కనబరచింది. ఒక మోస్తరు స్థాయిలో పనిచేసే నేవిగేషన్‌ వ్యవస్థతోనే అద్భుతమైన కచ్చితత్వాన్ని సాధించగలిగాం. క్షిపణి ప్రయోగ విజయంతో అందరూ మమ్మల్ని అభినందనల్లో ముంచెత్తారు. అప్పట్లో అంతరిక్ష శాఖలోని పనిసంస్కృతికి, డీఆర్‌డీఓ పని పద్ధతులకూ తేడాలు ఉండేవి. అందువల్ల మమ్మల్ని కలాం ‘ఫన్నీ గయ్స్‌! మీరు ఈ పరీక్షను విజయవంతం చేస్తారా’ అని అంటూండేవారు. దీంతో ప్రయోగానంతరం ‘ఫన్నీ గయ్స్‌ సాధించారు’ అని బ్యానర్‌ ప్రదర్శించాం. దేశంలో క్షిపణుల అభివృద్ధికి పృథ్వి బాటలు పరచింది. ఆ తరవాత అగ్ని, ఆకాశ్‌, పృథ్వి-2, ధనుష్‌, బీఎండీ వంటి ప్రాజెక్టులూ ఇదే బాటన విజయాలు సాధించాయి.

మొదటి లాంచ్‌కు ముందు భావోద్వేగాలు ఎలా ఉన్నాయి?

అప్పటికి క్షిపణికి సంబంధించి ప్రతిదీ కొత్తే కావడంతో పరీక్ష విజయంపై అనుమానం పీడించేది. దేశమంతా నిశిత దృష్టి పెట్టడంతో ఒకింత ఆందోళనగా ఉండేది. సైన్యం కోసం ఉద్దేశించిన క్షిపణి కావడం వల్ల డిజైన్‌ చాలా పటిష్ఠంగా, రవాణాకు యోగ్యంగా ఉండాలి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేయగలగాలి. మొదటి ప్రయోగంలోనే రుజువు చేయాలి. ఇలాంటివన్నీ సంక్లిష్టతను పెంచాయి. అయినప్పటికీ డీఆర్‌డీఎల్‌, ఇతర ల్యాబ్‌లకు చెందిన అనేక మందితో కూడిన బృందం తిరుగులేని విధంగా రుజువు చేసింది. డీఆర్‌డీఓకు చెందిన దాదాపు 10 ఇతర ల్యాబ్‌లు కూడా పాల్గొన్నాయి. నాడు రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉన్న డాక్టర్‌ వి.ఎస్‌.అరుణాచలం, జాతీయ నిపుణులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టును సమీక్షించి, అవసరమైన మార్గనిర్దేశం చేసేవారు. ఆ తరవాత పృథ్వికి అన్నిరకాల పరీక్షలు నిర్వహించి, 1994లో విజయవంతంగా సైన్యానికి అప్పగించాం. ఈ అస్త్రం ‘జాతికే గర్వకారణం’ అని సైన్యం అప్పట్లో అభివర్ణించింది.

ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

ఇప్పుడంటే, చాలా పనుల్ని యంత్రాలే పూర్తిచేసి పెడుతున్నాయి. నాడు సౌకర్యాల లేమి వేధించేది. క్షిపణి విడిభాగాలను అనుసంధానించే వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ప్రతిదీ చేతులతో చేయాల్సి వచ్చేది. అనుసంధానం, కూర్పు వంటివన్నీ అలాగే చేశాం. అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారంగా కొత్త వ్యవస్థల్ని అభివృద్ధి చేయాల్సి వచ్చేది. ప్రకంపనల్ని పరీక్షించేందుకు కొత్త మార్గాలు వెతకాల్సి వచ్చింది. నేవిగేషన్‌ వ్యవస్థ తీరుతెన్నుల్ని జీపుపై ఉంచి పరీక్షించాం. ఆ వాహనాన్ని రోడ్డుపై నడపడం ద్వారా అవసరమైన లెక్కలు కట్టాం. అలా వినూత్న పరిష్కారాలతో ఇబ్బందులను అధిగమించాం. నాణ్యతపై ఎక్కడా రాజీపడకుండానే అవన్నీ సాధించాం. ప్రయోగానికి మూడు రోజుల ముందు ‘డిఫ్లెక్టర్‌ ప్లేట్‌’ డిజైన్‌పై ప్రయోగ సన్నద్ధత కమిటీ అభ్యంతరం తెలిపింది. ఆ మార్పులు చేయడానికి శ్రీహరికోటలోగాని, చుట్టుపక్కలగాని ఎలాంటి సౌకర్యాలు లేవు. అప్పటికప్పుడు నిరంతరంగా పనిచేసి, వెల్డింగ్‌ టార్చ్‌ సాయంతో డిఫ్లెక్టర్‌ ప్లేట్‌ ఆకృతిని మార్చాం. పరిశీలన కోసం తెల్లవారుజామున కలాం వచ్చేసరికి, పని పూర్తి చేసి, అలసటతో లాంచ్‌ ప్యాడ్‌పైనే నిద్రపోతున్నాం.

పనిసంస్కృతిలో ఈ ప్రాజెక్టు ఎలాంటి మార్పులు తెచ్చింది?

గిరిగీసుకొని పనిచేసే విధానాన్ని బద్దలుకొట్టింది. ఐజీఎండీపీ ప్రారంభం కావడానికి ముందు ఎవరికి వారే అన్న ధోరణి ఉండేది. ఒక బృహత్‌ లక్ష్యం కోసం అందరూ సర్వశక్తులూ కూడదీసుకొని ఒక్కటిగా పనిచేసే సంస్కృతి ఏర్పడింది. అలాగే బలమైన నిర్వహణ వ్యవస్థను కూడా ఈ ప్రాజెక్టు తెరపైకి తెచ్చింది. ఐజీఎండీపీ కోసం కేటాయించిన నిధుల ద్వారా ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీలు, హెచ్‌ఏఎల్‌, బీడీఎల్‌ వంటి కర్మాగారాల్లో క్షిపణి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా మేమే యంత్రాలను కొనుగోలు చేసి ఆయా సంస్థల్లో ఏర్పాటు చేశాం. పృథ్వి విజయం యావద్దేశ శ్రమఫలితం. విద్యాసంస్థల్లోని నైపుణ్యం, పరిశ్రమల్లోని సామర్థ్యాన్ని ఒడిసిపడుతూ ప్రాజెక్టును విజయవంతం చేశాం. పృథ్వి పరీక్షలతో దేశానికి ‘క్షిపణి అభివృద్ధి సంస్కృతి’ అలవడింది. ఫలితంగానే నేడు భారత్‌ మిసైల్‌ టెక్నాలజీలో అగ్రదేశాలకు దీటుగా నిలబడింది.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బందిఖానాలో మానవహక్కులు

‣ మహిళకు అందని ఆస్తిపాస్తులు

‣ ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి

‣ వందేభారత్‌ కొత్త పరుగు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 01-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం