• facebook
  • whatsapp
  • telegram

వందేభారత్‌ కొత్త పరుగు

సాంకేతికత దన్నుగా రైల్వే ప్రస్థానం

రవాణా వ్యవస్థలో రైల్వేల పాత్ర అత్యంత కీలకం. దేశ జనాభాలో అత్యధికులకు ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. ప్రపంచంలోనే విపరీతమైన రద్దీ కలిగిన రైలు మార్గాల్లో భారతీయ రైల్వే కూడా చోటు సంపాదించింది. సాంకేతికంగా కొన్నేళ్లుగా రైల్వే రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికుల మన్ననలు పొందడంలో రైల్వేలు విజయవంతమైనట్లు ఆర్థిక సర్వే అభివర్ణించింది. 2014-21 కాలంలో ఈ రంగంలో పెట్టుబడి వ్యయం అయిదు రెట్లు పెరిగింది. భవిష్యత్తులో ప్రయాణికులు, సరకు రవాణా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో గత బడ్జెట్‌లో జాతీయ రైల్వే ప్రణాళిక (ఎన్‌ఆర్‌పీ) రూపొందించారు. 2022-23 బడ్జెట్‌లో సైతం దానికి ఏ మాత్రం తగ్గకుండా పలు విప్లవాత్మక చర్యలను ప్రతిపాదించారు.

సరకు రవాణాతో భారీ ఆదాయం 

కొత్తగా 400 వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సురక్షితత్వాన్ని, సామర్థ్యాన్ని పెంచే దేశీయ ‘కవచ్‌’ ప్రాజెక్టు పరిధిలోకి రెండు వేల కిలోమీటర్ల మేర నెట్‌వర్క్‌ను చేర్చనున్నారు. 100 గతిశక్తి సరకు రవాణా టెర్మినళ్లు, చిన్న రైతుల పంట అమ్మకాల కోసం ఇతర ప్రాంతాలకు రవాణా సేవలు, తపాలా, రైల్వే వ్యవస్థల అనుసంధానం ద్వారా అధిక జనాభా కలిగిన పట్టణాలకు రైల్వేస్టేషన్ల నుంచి రైతుల పంటకు రవాణా కల్పించడం వంటివి రైల్వేశాఖ కీర్తి ప్రతిష్ఠలు పెంచేవే. ఇలాంటి ప్రతిపాదనలకు భారీయెత్తున నిధుల అవసరం ఏర్పడుతుంది. ఇందుకోసం తాజా బడ్జెట్‌లో రూ.1,40,367 కోట్లను ప్రతిపాదించారు. దీనిలో రూ.1,37,100 కోట్లు పెట్టుబడి మూలధనమే. ఇది గత ఏడాదికన్నా 28 శాతం అధికం. ఇందులో సగానికిపైగా కొత్త లైన్ల నిర్మాణానికి, ఉన్న లైన్లను రెట్టింపు చేయడానికి నిర్దేశించారు. 2021-22 బడ్జెట్‌లో సరకు రవాణా(కార్గో) ఆదాయం గణనీయంగానే సమకూరింది. 2022-23 బడ్జెట్‌లో ఈ పద్దుకింద రూ.1,65,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకొన్నారు. కార్గో ఆదాయం భారీగా పెరుగుతుండటంతో 2022-23 ఏడాదిలో లక్షించిన ఆదాయవృద్ధిని సాధించడం కష్టతరమేమీ కాకపోవచ్చు. గత బడ్జెట్‌లో జాతీయ హైస్పీడ్‌ రైల్‌ సంస్థకు కేటాయించిన వ్యయంకన్నా ఈసారి కేటాయించిన రూ.24,102 కోట్లు సుమారు 72శాతం అధికం. ఇది త్వరలో పూర్తికానున్న అహ్మదాబాద్‌- ముంబయి బులెట్‌ రైలు ప్రాజెక్టుకు మరింత ఊతమిస్తుంది. కరోనా మూలంగా 2021-22లో ఆశించిన స్థాయిలో ప్రయాణికుల రవాణా ఆదాయం విషయంలో పెరుగుదల కనిపించకపోయినా- ఆ లోటును సరకు రవాణా ఆదాయం భర్తీ చేసింది. ఇది మొత్తం రైల్వే ఆదాయాన్ని భారీగా పెంచడంలో తోడ్పడింది.

బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు 400 కొత్త తరం వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెడితే- ఇప్పుడున్న శతాబ్ది, రాజధాని వంటి కొన్ని సూపర్‌ ఫాస్టు రైళ్లను, రాత్రివేళ తిరిగే రైళ్లను ఉపసంహరించవచ్చు. రైల్వే వ్యవస్థలో పరిస్థితులు గణనీయంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయడం కష్టమేనని, అదనంగా మరో మూడేళ్లు పడుతుందనేది నిపుణుల భావన. ఈ రైళ్లను చెన్నై ఇంటెగ్రల్‌ కోచ్‌ కర్మాగారంలో తయారు చేయనున్నారు. ఈ సంస్థ ఏటా 40 చొప్పున వీటిని తయారు చేస్తుందని భావించినా మూడేళ్లలో కేవలం 120 మాత్రమే పూర్తవుతాయి. మిగతా వాటిని పూర్తిచేసే బాధ్యత వేరే సంస్థలకు అప్పజెప్పక తప్పని పరిస్థితి నెలకొంటుంది. భారీ సంఖ్యలో తయారీకి అవసరమైన మౌలిక సదుపాయాలూ అందుబాటులో ఉండాలి. ఆశించిన వ్యవధిలో వీటి తయారీని పూర్తి చేసేందుకు ప్రైవేటు రంగం సహకారం కూడా అవసరమే. పెద్ద సంఖ్యలో తయారు చేయాల్సి రావడమే కాదు- సకాలంలో పూర్తి చేసేందుకు సాంకేతిక అవసరాల కోసం విదేశీ సంస్థలపై ఆధారపడాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో నిధులూ అవసరమే. వ్యయాలకు తగినరీతిలో ఆదాయం సమకూరుతుందా అన్నదీ ప్రశ్నార్థకమే. వీటి నిర్మాణం కోసం తెచ్చే రుణ పెట్టుబడులపై చెల్లించాల్సిన వడ్డీ భారంగా మారే ప్రమాదమూ ఉంది. మొత్తానికి మూడేళ్ల వ్యవధిలో 400 వందేభారత్‌ రైళ్లను అందుబాటులోకి తేవడం ప్రభుత్వానికి పెద్ద సవాలే. అయినా, ఈ ప్రాజెక్టు సాకారమైతే రైల్వే రంగం పరిస్థితుల్లో గణనీయ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇది ప్రజలకు, దేశానికి ఎంతో ప్రయోజనకరం.

మెరుగైన సౌకర్యాలతో...

కొత్త ప్రాజెక్టుల పరిపూర్తికిగాను వాటిని క్లిష్టమైనవి, అత్యంత క్లిష్టమైనవి, ప్రాధాన్య ప్రాజెక్టులుగా జాతీయ రైల్వే ప్రణాళికలో విభజించారు. దీనివల్ల ప్రాజెక్టుల సత్వర పూర్తికి, పెట్టుబడి మూలధన అప్పులపై వడ్డీని చెల్లించడానికి వీలవుతుంది. కొంతమంది ప్రయాణికులు విమాన ప్రయాణం కన్నా వందేభారత్‌ లాంటి హైస్పీడ్‌ రైళ్లకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశమూ ఉంది. ఇలాంటి రైళ్లలో విమానాల తరహా అత్యాధునిక సౌకర్యాలను కల్పించగలిగితే మరింత ఎక్కువ మంది రైలు ప్రయాణానికి ముందుకొస్తారనడంలో సందేహం లేదు. రైల్వే రంగంలో పెట్టుబడుల వ్యయం జోరు పెరిగితే దేశ ఆర్థిక వృద్ధి పరుగుకూ తోడ్పాటు దక్కుతుంది. 2022-23లో ప్రైవేట్‌ పెట్టుబడులతో కలిపి రూ.2.45 లక్షల కోట్లను ఈ రంగంలో పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రైవేట్‌ రంగానికీ అవకాశం కల్పించడం ద్వారా ప్రభుత్వం కొంతమేర పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణుల అభిప్రాయం. రైల్వే శాఖకు ప్రోత్సాహకర ఆదాయ పరిస్థితులను బట్టి భవిష్యత్తులోనూ పరిస్థితి మెరుగ్గానే ఉంటుందని ఆశించవచ్చు. ప్రజాసేవ కోసం ఉద్దేశించిన ప్రభుత్వ సంస్థల నుంచి పూర్తిగా లాభాలను మాత్రమే ఆశించకుండా లాభం నష్టంలేని స్థితిలో సంస్థను నిర్వహించగలిగితే రైల్వేల లక్ష్యం నెరవేరినట్లే! ప్రయాణికులకు మెరుగైన, స్నేహపూర్వక సేవలను అందజేయగలిగితే ప్రజాదరణ ఇనుమడిస్తుంది.

‘కిసాన్‌’ సేవలు

రైల్వే ప్రవేశపెట్టిన హైస్పీడ్‌ రైళ్లు, కిసాన్‌ రైళ్లు శాఖ ప్రతిష్ఠను పెంచాయి. గత    ఏడాదిన్నర కాలంలో సుమారు ఆరు లక్షల టన్నుల పండ్లను కాయగూరలను కిసాన్‌ రైళ్లు రవాణా చేశాయి. కొన్ని ప్రత్యేక మార్గాల్లో ప్రైవేటు మదుపరులకు భాగస్వామ్యం కల్పించడం, యాత్రా ఆధారిత సర్వీసుల విషయంలో ‘భారత్‌ గౌరవ్‌ స్కీం’ లాంటి సేవా సర్వీసులను ప్రైవేటుపరం చేయడం వంటి ప్రక్రియలు గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చాయి. మరోవైపు, ప్రయాణికులు, సరకుల భద్రత కోసం లక్ష కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన ‘రాష్ట్రీయ రైల్‌ సంరక్ష కోశ్‌ ఫండ్‌’ కాలవ్యవధి ముగిసింది. ఈ నిధికి గత బడ్జెట్‌తో పోలిస్తే, ఈసారి కేటాయింపులు తగ్గాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తీరాలను మింగేస్తున్న కడలి

‣ చైనా దూకుడుకు ముకుతాడే లక్ష్యం

‣ బహుళ భాషా అభ్యసనానికి సాంకేతిక దన్ను

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 23-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం