• facebook
  • whatsapp
  • telegram

చైనా దూకుడుకు ముకుతాడే లక్ష్యం

‘క్వాడ్‌’ విస్తరణ ఆలోచన

హిందూ-పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంపై పైచేయి సాధించేందుకు తహతహలాడుతున్న చైనాకు ముకుతాడు వేయాలని క్వాడ్‌ దేశాలు (అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా) ముక్తకంఠంతో ప్రకటించాయి. ఆ ప్రాంతాన్ని అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుత వాణిజ్య కార్యకలాపాలకు, సురక్షిత నౌకాయానానికి నెలవుగా మార్చేందుకు మిగతా దేశాల మద్దతు కూడగట్టాలని ప్రతినబూనాయి. మున్ముందు చతుర్భుజ భద్రతా చర్చల యంత్రాంగాన్ని ‘క్వాడ్‌ ప్లస్‌’ పేరిట విస్తరించి మరిన్ని దేశాలకు చోటు కల్పించాలని సంకల్పించాయి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ వేదికగా ఇటీవల సమావేశమైన నాలుగు సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సంయుక్త ప్రకటన ఈ మేరకు ఉద్ఘాటించింది. క్వాడ్‌ పరిధిని పెంచుకోవడం ద్వారా పశ్చిమ దేశాల సైనిక కూటమి ‘నాటో’ మాదిరిగానే తూర్పు ప్రాంతంలోనూ పరస్పర సహకారానికి ఆలంబన చేసుకోవచ్చని అభిలషించింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఈ పర్యటనలో సభ్యదేశాల విదేశాంగ మంత్రులతో సంయుక్తంగా, విడివిడిగానూ సమావేశమై ఉమ్మడి, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే జపాన్‌ వేదికగా నాలుగు దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. అమెరికాను రష్యా, చైనాలు ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నాయి. దానికి తోడు అఫ్గాన్‌లో తాలిబన్ల పునరాగమనం, ఉక్రెయిన్‌ విషయంలో ఆ రెండు దేశాలు చేరువవుతున్నాయి. ఈ పరిణామం క్వాడ్‌ దేశాల ప్రయోజనాలను దెబ్బతీయకుండా చూసుకోవడంతోపాటు ఇండో-పసిఫిక్‌ ప్రాంత సమగ్రతను కాపాడుకోవాలని సమావేశం ఆకాంక్షించింది.

సంధానకర్తల్లా...

మానవాళి కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ క్వాడ్‌ దేశాలు గతేడాది భారీ టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఈ స్ఫూర్తిని మరిన్ని రంగాలకు విస్తరించాలని తాజా భేటీ నిర్ణయించింది. సాంకేతికత, కృత్రిమ మేధ, వాతావరణ మార్పులు, సముద్ర భద్రత, సైబర్‌ రంగంలో పరస్పర సహకారానికి భాగస్వామ్య దేశాల ప్రాతినిధ్యంతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు కానున్నాయి. కూటమి విస్తరణపై స్పష్టమైన ప్రణాళికలు లేనప్పటికీ, న్యూజిలాండ్‌ సహా దక్షిణ, ఆగ్నేయాసియాలోని బంగ్లాదేశ్‌, వియత్నాం, దక్షిణ కొరియాలకు చోటివ్వాలన్నది ప్రతిపాదన. ఏసియాన్‌లో పెద్దవైన ఇండొనేసియా, ఫిలిప్పీన్స్‌లతోనూ ఆలోచనలు పంచుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్‌, మయన్మార్‌లలో భారత్‌, జపాన్‌ ఉమ్మడిగా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాయి. ఆ దేశాలకు చైనా భారీగా ఆర్థిక సాయం అందిస్తూ, పెట్టుబడులు తరలిస్తూ తనవైపు ఆకర్షిస్తోంది. డ్రాగన్‌తో ఆర్థిక, వాణిజ్య సంబంధాల కారణంగా బంగ్లా సహా పలు దేశాలు క్వాడ్‌ విస్తరణపై స్పష్టతకు రాలేకపోతున్నాయి. అవి ముందుకొస్తేనే, చైనా నిర్మిస్తున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్టుకు ప్రతిగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో మారిటైమ్‌ కారిడార్‌ చేపట్టి రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలన్న అమెరికా ఆకాంక్ష నెరవేరుతుంది. డ్రాగన్‌ దుందుడుకు చర్యలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ క్వాడ్‌ వేదికగా పరోక్షంగా ప్రస్తావించారు. ఇరుదేశాల నడుమ కుదిరిన లిఖితపూర్వక ఒప్పందాలను సైతం చైనా కాలరాస్తోందని ఆక్షేపిస్తూ ఇటీవలి ఉదంతాలను ఉటంకించారు. భారత్‌ వాదనను అమెరికా గట్టిగా సమర్థించినా జపాన్‌, ఆస్ట్రేలియాల నుంచి అదేస్థాయి స్పందన కొరవడింది. 26/11, పఠాన్‌కోట్‌ దాడులను ఖండించడం కొంతమేర ఉపశమనంగా భావించవచ్చు. అంతర్జాతీయ న్యాయసూత్రాలను ఉల్లంఘిస్తూ తూర్పు, దక్షిణ చైనా ప్రాంతంలో సరిహద్దులను మార్చడం, చొరబాట్లను ప్రోత్సహించడంపై జపాన్‌ ఆందోళన వ్యక్తం చేయడం చైనా దురాక్రమణ వాదానికి సంకేతం. మయన్మార్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, మానవ హక్కుల సంరక్షణ, అక్రమ నిర్బంధాలపై గళం విప్పాలని సదస్సు తీర్మానించింది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదాన్ని అరికట్టి ప్రపంచ శాంతిని పాదుకొల్పాలంటే యూఏఈ లాంటి దేశాలతో భుజం కలపాలని సంయుక్త ప్రకటనలో పేర్కొనడం ఆసక్తికరం. ఏళ్లనాటి వైరాన్ని వీడిన ఇజ్రాయెల్‌, యూఏఈలతో భారత్‌, అమెరికా జట్టుకట్టి పశ్చిమ ఆసియా క్వాడ్‌గా ఒక గొడుగు కిందకు వచ్చాయి. రెండు క్వాడ్‌ కూటముల్లోనూ భాగస్వాములుగా ఉన్న భారత్‌, అమెరికాలు సంధానకర్తల్లా వ్యవహరిస్తున్నాయి.

దౌత్యవిధానానికి పరీక్ష

క్వాడ్‌లోని నాలుగు దేశాలకూ పెద్ద వాణిజ్య భాగస్వాముల్లో చైనా ఒకటి. పైగా భారత్‌తో భౌగోళిక సరిహద్దు పంచుకుంటోంది. అంశాల వారీగా డ్రాగన్‌ కుయుక్తులను భిన్న వేదికలపై ఎండగట్టడం దిల్లీకి అవసరమే. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు రష్యా, చైనాల మైత్రికి ఉత్ప్రేరకంలా తోడ్పడుతున్నాయి. యుద్ధం అనివార్యమైతే క్రెమ్లిన్‌కు బీజింగ్‌ అండగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఉక్రెయిన్‌ సంక్షోభంపై ఇటీవల ఐరాస నిర్వహించిన ఓటింగ్‌కు దూరంగా ఉండి తటస్థతను చాటుకున్న భారత్‌, చివరిదాకా అదే విధానానికి కట్టుబడి ఉండటం సాధ్యమేనా అన్నది ప్రశ్న. ఈ తరుణంలో రష్యాతో స్నేహానికి, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి విఘాతం కలగకుండా వ్యవహరించడం భారత దౌత్యవిధానానికి అసలైన పరీక్ష!

- బి.అశోక్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నూనెగింజల్లో స్వయంసమృద్ధికి బాటలు

‣ డిజిటల్‌ కరెన్సీతో మేలెంత?

‣ ఉద్యోగరహిత అభివృద్ధి!

‣ యూపీలో భాజపా - ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 21-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం