• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగరహిత అభివృద్ధి!  

సరైన విధానాలతోనే ఉపాధి సుసాధ్యం

భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతానికి మించిన వృద్ధిరేటుతో పురోగమిస్తున్నా- అదే వేగంతో ఉద్యోగాల కల్పన ఎందుకు సాధ్యం కావడంలేదనేది విస్మయం కలిగించే అంశం. అందుకు కారణం యాంత్రీకరణా, లేక విద్యాసంస్థలనుంచి పెద్దసంఖ్యలో బయటికి వస్తున్న పట్టభద్రులకు సరైన ఉపాధి నైపుణ్యాలు కొరవడటమా, లేదా అంతగా ప్రభావం చూపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితమా... అన్న ప్రశ్నలు పలువురిని వేధిస్తున్నాయి. సేవారంగ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొత్తగా రూపుదిద్దుకొన్నా, జీవనోపాధికి ఇప్పటికీ వ్యవసాయమే పెద్ద దిక్కుగా ఉంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కీలకమైన వ్యవసాయం, పరిశ్రమలు (తయారీ), సేవా రంగాల్లో- సాగు విభాగమే ఎక్కువ మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. దేశ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 1950-51లో 57శాతంగా ఉండేది. క్రమేపీ అది తగ్గుతూ 2020-21లో 16శాతానికి చేరింది. దేశంలోని రైతుల స్వల్ప ఆదాయాలకు, పడిపోతున్న జీవన ప్రమాణాలకు ఈ స్థితి అద్దం పడుతోంది. అదే సమయంలో స్థూల దేశీయోత్పత్తిలో సేవల రంగం వాటా 1950-51లో 29శాతం ఉండగా, 2000-01 నాటికి 49శాతానికి, 2020-21లో 55శాతానికి పెరిగింది. క్రమంగా దాని వృద్ధి కొనసాగుతోంది. ఇక పరిశ్రమల రంగం (తయారీ) వాటా 1950-51లో 14శాతం ఉండగా, 2020-21 నాటికి 30శాతానికి పెరిగింది. దేశంలోని మొత్తం ఉపాధి అవకాశాల్లో సేవల రంగం దాదాపు మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉంది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల్లో మాదిరిగా కాకుండా భారత్‌లో ఉద్యోగ కల్పనలో తయారీ రంగం కీలక పాత్ర పోషిస్తోంది.

మారుతున్న అవసరాలు

సుమారు వెయ్యి విశ్వవిద్యాలయాలు, 40 వేలకు పైగా కళాశాలలతో భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ఉన్నత విద్యావ్యవస్థను కలిగి ఉంది. పరిశ్రమల రంగంలో వేగంగా మారిపోతున్న అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడంలో మన విద్యావిధానం విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసోచామ్‌ నివేదిక ప్రకారం- దేశంలో ఏటా పట్టభద్రులైన 50 లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 20శాతమే ఉపాధి పొందుతున్నారు. 2025 నాటికి పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థల నుంచి కనీసం 50శాతం విద్యార్థులు వృత్తి విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) సిఫార్సు చేసింది.

ఒక అంచనా ప్రకారం, భారత్‌లో 47 కోట్ల మంది శ్రామికుల్లో కేవలం మూడు కోట్ల మందే సంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. మొత్తం శ్రామికుల్లో 47శాతం స్వయం ఉపాధి పొందుతున్నారు. 33శాతం సాధారణ కార్మికులు, 17శాతం సాధారణ ఉద్యోగులు, మూడు శాతం ఒప్పంద శ్రామికులు. ఈ సంఖ్యలు దేశంలోని ఉపాధి అవకాశాల్లో డొల్లతనాన్ని పట్టి చూపుతున్నాయి. భారత్‌లో ఆర్థిక పురోగతిని నిపుణులు ‘ఉద్యోగ రహిత వృద్ధి’గా అభివర్ణించడం ఆందోళన రేకెత్తించే విషయం. అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం 2019లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం- వృద్ధి రేటుకు అనుగుణంగా ఉద్యోగాల పెరుగుదల నమోదు కాలేదు. 2013, 2015 మధ్య మొత్తం ఉద్యోగాల సంఖ్య వాస్తవానికి 70 లక్షల మేరకు తగ్గిపోయిందని, రాబోయే సంవత్సరాల్లో ఉపాధి క్షీణత కొనసాగుతుందని ఆ అధ్యయనం అంచనా వేసింది. దానికి అదనంగా, భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షక కేంద్రం (సీఎంఐఈ) గణాంకాలు 2011-12 నుంచి కొత్త పెట్టుబడి ప్రతిపాదనల్లో స్థిరమైన పతనాన్ని (2010-11లో రూ.25 లక్షల కోట్లు, 2017-18లో రూ.11 లక్షల కోట్లు) సూచించింది. ఫలితంగా 2018 డిసెంబరు నాటికి ఉద్యోగాల సంఖ్య తగ్గుముఖం పట్టి- శ్రామికుల సంఖ్య 40 కోట్ల కంటే తగ్గిపోవడానికి దారితీసింది. 2020లో భారత్‌లో ఉపాధి అవకాశాలను, జీవనోపాధిని కొవిడ్‌ ఎలా నాశనం చేసిందో అందరికీ తెలిసిందే. దేశం ఇంకా దాని దుష్ప్రభావాల నుంచి కోలుకోలేదు. దేశవ్యాప్తంగా శ్రామిక శక్తికి సంబంధించిన స్వభావం, పరిమాణం గురించిన ప్రాథమిక సమాచారం సరిగ్గా లేకపోవడాన్నీ కరోనా సంక్షోభం బట్టబయలు చేసింది. సువిశాల భారత్‌లో ఉపాధి స్థితిగతులకు సంబంధించిన కచ్చితమైన డేటాను ఏ విధంగా రూపొందించి, మెరుగుపరచాలనేది పెద్ద సమస్య. భౌగోళికంగా, రంగాల వారీగా, దేశవ్యాప్తంగా ప్రబలంగా ఉన్న ఉపాధి సమస్యను అంచనా వేయడంతో పాటు ఎప్పటికప్పుడు నివేదించడానికి సరైన గణాంక వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వాలు చొరవ చూపాలి. లేకపోతే అది దేశంలో విధానపరమైన ప్రతిష్టంభనకు దారితీసి తీవ్ర సమస్యగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఉద్యోగావకాశాలపై అలాంటి సమాచారం తక్షణావసరమని నీతి ఆయోగ్‌ సైతం అంగీకరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా, కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టులో అసంఘటిత, వలస కార్మికులపై దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జాతీయ డేటా పోర్టల్‌ ఇ-శ్రామ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.

నైపుణ్య శిక్షణ ముఖ్యంకొవిడ్‌ మహమ్మారి భారత్‌ బలహీనతలను, బలాలను బహిర్గతం చేసింది. వ్యవసాయ రంగం పట్ల మన నిర్లక్ష్యం కొనసాగుతున్నా- లాక్‌డౌన్ల సమయంలో దేశం స్తంభించిపోయినా, మొత్తం దేశాన్ని రక్షించింది రైతు సమాజమే. రైతాంగానికి మద్దతు ఇవ్వడం, భద్రత కల్పించడమంటే- ఆకలి, పోషకాహార లోపంనుంచి దేశాన్ని రక్షించడమేనని ప్రభుత్వాలు ఇంకా గ్రహించలేదు. సుస్థిర ఉపాధి కల్పనలో సేవల రంగంతోపాటు తయారీ రంగాన్నీ కీలకపాత్ర పోషించేలా రూపాంతరం చెందించాలని కేంద్ర ప్రభుత్వం లక్షిస్తోంది. దానికోసం చేపడుతున్న విధానపరమైన ప్రోత్సాహకాలు సమర్థంగా అమలు కావాల్సి ఉంది. అధికారిక, అనధికారిక రంగాల్లో పనిచేసే శ్రామికశక్తికి అవసరమైన నైపుణ్య శిక్షణను అందించడంలో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ) మరింత చురుగ్గా వ్యవహరించాలి.

వేతనాల్లో అసమానతలు‌

శామికశక్తిలో కనీసం పదిశాతానికైనా సంఘటిత రంగంలో సామాజిక భద్రత కల్పించే ఉద్యోగాలు లేవు. తక్కిన ఎన్నో ఆసియా దేశాలతో పోలిస్తే- భారత్‌లో పనిలో స్త్రీల భాగస్వామ్యం తక్కువగా ఉంది. రాష్ట్రాల మధ్యా ఈ అసమానత కనిపిస్తుంది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తర్‌ ప్రదేశ్‌లో ప్రతి వంద మంది పురుషులకు కేవలం 20 మంది మహిళలే వేతనంతో కూడిన ఉపాధి పొందుతున్నారు. సంపాదనకు సంబంధించి లింగ దుర్విచక్షణ కంటే కులాల అంతరం ఎక్కువగా ఉంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా- దళితులు, ఆదివాసులు తక్కువ జీతాలు పొందే వృత్తుల్లో ఎక్కువగా ఉన్నారు. వారి సంపాదన అగ్రవర్ణ కార్మికుల వేతనాల్లో సగమే! వ్యవస్థీకృత రంగంలోనూ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. తయారీ రంగంలో కార్మికుల ఉత్పాదకత 30ఏళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఆరు రెట్లు పెరిగింది. అదే సమయంలో నిర్వాహకులు, పర్యవేక్షకుల జీతాలు మూడు రెట్లు అధికమయ్యాయి. కార్మికుల వేతనాలు కేవలం 1.5 రెట్లు మాత్రమే పెరిగాయి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గణాంక శాస్త్రంలో ఘనమైన కోర్సులు

‣ మరచిపోకుండా నేర్చుకోవాలంటే...!

‣ SSC CHSL: ఇంటర్‌ ఉంటే.. కొట్టేయవచ్చు కేంద్రం కొలువు!

‣ అటవీ ఉత్పత్తుల వృద్ధిలో నైపుణ్యం పెంచే కోర్సులు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం