• facebook
  • whatsapp
  • telegram

గణాంక శాస్త్రంలో ఘనమైన కోర్సులు

ఐఎస్‌ఐ - గణితం, అర్థశాస్త్రం, కంప్యూటర్‌ సైన్స్‌లకూ ప్రసిద్ధి

దేశంలో ప్రముఖ సంస్థల్లో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) ఒకటి. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు విశిష్ట సంస్థగా దీన్ని పరిగణించవచ్చు. దీనికి కోల్‌కతాతోపాటు దిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తేజ్‌పుర్, గిరిడీల్లోనూ క్యాంపస్‌లు ఉన్నాయి. ఇక్కడ యూజీ, పీజీ స్థాయుల్లో పలు కోర్సులు అందిస్తున్నారు. ఈ సంస్థలో చదువుతోన్న విద్యార్థులకు నాణ్యమైన బోధనతోపాటు ప్రతినెల స్టైపెండ్‌ అందుతుంది. తాజాగా 2022 - 2023 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఐఎస్‌ఐ ప్రకటన వెలువడింది. ఆ వివరాలు...

ఐఎస్‌ఐ క్యాంపస్‌ల్లో బీస్టాట్, ఎంస్టాట్, బీ మ్యాథ్స్, ఎం మ్యాథ్స్, ఎంటెక్, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సులు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తిచేసినవాళ్లు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు వీటిలో చేరడానికి అర్హులు. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను కోర్సులోకి ఎంపిక చేస్తారు. సిలబస్, మాదిరి ప్రశ్నలు ఐఎస్‌ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ సంస్థల్లో డిగ్రీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.5 వేలు, పీజీ కోర్సులైతే రూ.8 వేలు, ఎంటెక్‌ కోర్సులకు రూ.12,400 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్పు (జేఆర్‌ఎఫ్‌)కు ఎంపికైతే నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఎ, సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్పులకు రూ.35,000+హెచ్‌ఆర్‌ఎ అందిస్తారు. అన్ని కోర్సుల విద్యార్థులకూ ప్రతి ఏటా కాంటింజెన్సీ గ్రాంటు దక్కుతుంది. తక్కువ ధరకు వసతి, భోజన సౌకర్యాలు ఉన్నాయి. కోర్సు చివరలో క్యాంపస్‌ నియామకాలు చేపడతారు. ఈ సంస్థలో కోర్సులు పూర్తిచేసుకున్నవారికి బహుళ జాతి సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.

కోర్సుల వారీ అర్హతలు, సీట్లు, క్యాంపస్‌లు..

బీస్టాట్‌: మ్యాథ్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తిచేసినవాళ్లు ఈ కోర్సుకు అర్హులు. కోల్‌కతా క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. 63 సీట్లు ఉన్నాయి.

బీమ్యాథ్స్‌: మ్యాథ్స్, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తిచేసినవాళ్లు ఈ కోర్సుకు అర్హులు. బెంగళూరు క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో కోర్సు నిర్వహిస్తున్నారు. కోర్సు వ్యవధి మూడేళ్లు. 63 సీట్లు ఉన్నాయి.

ఎంటెక్‌ కోర్సులు...

కంప్యూటర్‌ సైన్స్‌(సీఎస్‌): బీఈ/ బీటెక్‌ లేదా ఇంటర్‌లో మ్యాథ్స్‌తో ఏదైనా పీజీ చదివినవారు అర్హులు. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు. ఐఎస్‌ఐ పరీక్షతో 30, గేట్‌ స్కోర్‌తో 15 మందికి అవకాశం కల్పిస్తారు. 

క్రిప్టాలజీ అండ్‌ సెక్యూరిటీ (సీఆర్‌ఎస్‌): బీఈ/బీటెక్‌ లేదా ఇంటర్‌లో మ్యాథ్స్‌తో ఏదైనా పీజీ చదివినవారు అర్హులు. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందిస్తున్నారు. ఐఎస్‌ఐ పరీక్షతో 20, గేట్‌ స్కోర్‌తో 5 మందిని చేర్చుకుంటారు.

క్వాలిటీ, రిలయబిలిటీ అండ్‌ ఆపరేషన్‌ రిసెర్చ్‌(క్యూఆర్‌ఓఆర్‌): స్టాటిస్టిక్స్‌లో మాస్టర్‌ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివుండాలి. లేదా మ్యాథ్స్‌లో మాస్టర్‌ డిగ్రీతోపాటు డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివుండాలి. లేదా బీఈ/బీటెక్‌ ఉండాలి. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సు అందుబాటులో ఉంది. 32 సీట్లు ఉన్నాయి.

పీజీ కోర్సులు...

వీటిని రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.

మాస్టర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌: స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ చదివుండాలి. ఈ కోర్సు మొదటి సంవత్సరం కోల్‌కతా, చెన్నై, దిల్లీల్లో, ద్వితీయ సంవత్సరం కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తారు. 38 సీట్లు ఉన్నాయి.

మాస్టర్‌ ఆఫ్‌ మ్యాథమాటిక్స్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా మూడేళ్ల డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ కోర్సు పూర్తిచేసినవారు అర్హులు. ఈ కోర్సు కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తున్నారు. 24 సీట్లు ఉన్నాయి. 

ఎంఎస్‌ క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌: ఏదైనా డిగ్రీ కోర్సుతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కోల్‌కతా, దిల్లీ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. దిల్లీలో 35, కోల్‌కతాలో 21 సీట్లు ఉన్నాయి. 

ఎంఎస్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సైన్సెస్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా డిగ్రీలో చదివుండాలి లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌ పూర్తిచేయాలి. 20 సీట్లు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో నిర్వహిస్తున్నారు. తొలి రెండు సెమిస్టర్లు బెంగళూరు, మూడో సెమిస్టరు హైదరాబాద్‌ క్యాంపస్‌లో చదువుతారు.

ఎంఎస్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు ఈ కోర్సుకి దరఖాస్తు చేసుకోవచ్చు. బెంగళూరు క్యాంపస్‌లో అందిస్తున్నారు. 12 సీట్లు ఉన్నాయి.

పీజీ డిప్లొమా 

ఈ కోర్సుల వ్యవధి ఏడాది.

స్టాటిస్టికల్‌ మెథడ్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌: మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్‌ చదివినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. చెన్నై, తేజ్‌పూర్‌ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు. చెన్నైలో 25, తేజ్‌పుర్‌లో 18 సీట్లు ఉన్నాయి. 

పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ విత్‌ స్టాటిస్టికల్‌ మెథడ్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌(పీజీడీఏఆర్‌ఎస్‌ఎంఏ) ఏడాది కోర్సును గిరిడీ (ఝార్ఖండ్‌) క్యాంపస్‌లో అందిస్తున్నారు. ఇందులో 18 సీట్లు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్‌లో మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ చదివుండాలి. ఈ కోర్సుకు స్టైపెండ్‌ లేదు.  

ఈ సంస్థ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌లో కొత్తగా పీజీ డిప్లొమా కోర్సు ఆన్‌లైన్‌లో కోర్స్‌ఎరాతో కలిసి అందిస్తోంది. ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదివి, ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షతో ఎంపికలు ఉంటాయి. 30 సీట్లు ఉన్నాయి. 

జేఆర్‌ఎఫ్‌..

స్టాటిస్టిక్స్‌ 12, మ్యాథ్స్‌ 10, క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌ 10, కంప్యూటర్‌ సైన్స్‌ 20, క్వాలిటీ రిలయబిలిటీ అండ్‌ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌ 2, ఫిజిక్స్‌ అండ్‌ అప్లయిడ్‌ మ్యాథ్స్‌ 6, జియాలజీ 2, బయలాజికల్‌ సైన్స్‌ 2, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ 1 చొప్పున జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌లో సీట్లు ఉన్నాయి. కోల్‌కతా, దిల్లీ, బెంగళూరు, చెన్నై, గిరిడీ క్యాంపస్‌ల్లో వీటిని అందిస్తున్నారు. జేఆర్‌ఎఫ్‌ను విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి ఎస్‌ఆర్‌ఎఫ్‌లోకి తీసుకుంటారు. సంబంధిత విభాగాల్లో పీజీ పూర్తిచేసుకున్నవారు జేఆర్‌ఎఫ్‌కు అర్హులు. ఎన్‌బీహెఎం/సీఎస్‌ఐఆర్‌/ యూజీసీ నెట్‌ స్కోరుతో అవకాశం కల్పిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: మార్చి 1 నుంచి 31 వరకు స్వీకరిస్తారు. 

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1250, జనరల్‌ మహిళలకు రూ. 750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ(ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు రూ.625

పరీక్ష: మే 8న నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. 

వెబ్‌సైట్‌: https://www.isical.ac.in/

పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌

ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ), కోల్‌కతా; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఖరగ్‌పూర్‌; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), కోల్‌కతా ఈ మూడు సంస్థలూ కలిసి పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సు రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. ప్రపంచంలోనే మేటి బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సుల్లో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. ఒక్కో సంస్థలో 6 నెలలపాటు కోర్సు చదువుకుంటారు. చివరి 6 నెలలు ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. 

అర్హత: 60 శాతం మార్కులతో బీటెక్‌/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంకాం/ ఎంబీఏ పూర్తిచేసుకున్నవారు అర్హులు. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూ, ఇంటర్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం తదితరాంశాలకు కొన్నేసి పాయింట్లు కేటాయించి కోర్సులోకి ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: ఫిబ్రవరి 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

పరీక్ష తేదీ: మార్చి 27న కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహిస్తారు. 

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం

పరీక్ష ఇలా: దీన్ని 150 మార్కులకు దీన్ని నిర్వహిస్తారు. 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. వెర్బల్‌ ఎబిలిటీ నుంచి 15, లాజికల్‌ రీజనింగ్‌ 5, డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌ అండ్‌ డేటా విజువలైజేషన్‌ 5, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. సిలబస్, పూర్తి వివరాలకు http://www.pgdba.iitkgp.ac.in/ చూడవచ్చు.  
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ SSC CHSL: ఇంటర్‌ ఉంటే.. కొట్టేయవచ్చు కేంద్రం కొలువు!

‣ అటవీ ఉత్పత్తుల వృద్ధిలో నైపుణ్యం పెంచే కోర్సులు

‣ సైబర్‌ భద్రతకు రక్షకులు కావలెను!

‣ వ్యక్తిత్వ వైఖరులు... ఉద్యోగ లక్షణాలు

‣ సివిల్స్‌ సాధించాలంటే ఏ గ్రూపు ఎంచుకోవాలి?

‣ ఉద్వేగ ప్రజ్ఞ ఉందా మీకు?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 09-02-2022


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌