• facebook
  • whatsapp
  • telegram

వ్యక్తిత్వ వైఖరులు... ఉద్యోగ లక్షణాలు

నియామకాల్లో కీలకంగా మారుతున్న అంశాలు

ప్రతి విద్యార్థ్థీ ప్రాంగణ నియామకాల్లో ప్రసిద్ధ కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటాడు. సాంకేతిక ప్రాథమిక అంశాలతో పాటు అభ్యర్థుల్లో వ్యక్తిత్వం, వ్యక్తి మనోవైఖరి అవసరమైన అంశాలుగా పరిగణిస్తున్నారు సెలక్టర్లు.  

ఉద్యోగికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను తగిన శిక్షణ ద్వారా పెంపొందించవచ్చు. సాంకేతికత అభివృద్ధితో ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు కూడా ప్రతి మారుమూలకూ విస్తరించి ఆన్‌లైన్‌ ద్వారా విద్యనందిస్తున్నాయి. అరుదైన సమాచారం, తక్షణ సమాచారం, అంతర్జాలంలో అందుబాటులో ఉంటుండటంతో అభ్యర్థులు వేగంగా అప్‌డేట్‌ అవుతున్నారు. నైపుణ్యాలతో పాటు ప్రధానంగా వ్యక్తి మనో వైఖరి అభ్యర్థి ఎంపికలో ప్రముఖపాత్ర పోషిస్తోంది.  

వృత్తిగత మనోవైఖరి  

వృత్తివ్యాపారాల్లో సాధారణంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారాలకు మిమ్మల్ని మీరెలా ప్రజెంట్‌ చేసుకుంటారు, ఎలా ప్రవర్తిస్తారన్న విషయాలను మీ మనోవైఖరి తెలియజేస్తుంది. వృత్తిపరమైన పనితీరుపై మనోవైఖరి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇతరులతో ఎలా మెలగుతున్నారు, వారిని ఎలా హాండిల్‌ చేస్తున్నారన్నవి ప్రధానం. ఉద్యోగ వాతావరణానికి అనుకూలంగా ప్రవర్తన మారడమన్నది అభ్యర్థి వృద్ధి చేసుకునే వృత్తిగత మనోవైఖరిపై ఆధారపడి ఉంటుంది.

పని సంస్కృతిపై అవగాహన  

ప్రతి సంస్థకూ కొన్ని పని పద్ధతులు, విధివిధానాలు ఉంటాయి. అది పని సంస్కృతి కావచ్చు, ఉద్యోగుల ప్రవర్తనా తీరుతెన్నులు కావచ్చు. ప్రతి వ్యక్తికీ కొన్ని అలవాట్లు, వైఖరి ఉంటాయి. ఇవి అతని వ్యక్తిగత జీవన విధానం నుంచి వస్తుంటాయి. అయితే సంస్థ సర్వోన్నతం కాబట్టి సంస్థలో పనిచేస్తున్నంతవరకు ఆ సంస్థ పని సంస్కృతిని గ్రహించి తగిన విధంగా పనిచేయగలగాలి. కొన్ని సంస్థలు సాంప్రదాయిక పద్ధతులు పాటించవచ్చు, మరికొన్ని ఆధునికంగా ఉండవచ్చు. ఈ విషయాలను సంస్థలు ఉద్యోగుల పరిచయ శిక్షణ తరగతుల ద్వారా తెలియజెపుతాయి. మరికొన్ని సంస్థలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో పై అధికారుల ద్వారా, మానవ వనరుల శాఖ ద్వారా తెలుసుకోవచ్చు. ఇతర సీనియర్‌ ఉద్యోగుల ప్రవర్తన ద్వారా సంస్థ సంస్కృతిని గ్రహించి తమను తాము సరిదిద్దుకోవచ్చు. ఏమైనప్పటికీ సంస్థ సంస్కృతిని స్వీకరించడం ఆశావాద మనో వైఖరికీ, విజయానికీ తొలిమెట్టు.

నాయకత్వ లక్షణాలు

విద్యార్థి దశ నుంచి సంస్థలో ఉద్యోగిగా ఎంపికయ్యాక ఆ సంస్థలో నాయకత్వ పాత్ర పోషించే స్థాయిలో ఉన్నా, లేకున్నా మీ పనితీరు ఉన్నతంగా ఉంటే స్థాయికి అతీతంగా సంస్థలోని ఉద్యోగులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. మీ వ్యవహార నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను మీ నైపుణ్యంతో ఎదుర్కోగలిగితే; పనిపై శ్రద్ధతో ఉత్తమ ఫలితాలు సాధిస్తే అందరూ మిమ్మల్నొక నాయకుడిగానే పరిగణిస్తారు. అది నాయకత్వ లక్షణానికి ప్రతీక.  

సమర్థంగా.. గౌరవప్రదంగా...

విద్యార్థి దశలో ప్రాంగణ నియామకాలతో సహా ఎన్నో పోటీల్లో పాల్గొంటుంటారు. పాల్గొన్న అందరిలోనూ విజయం సాధించాలన్న లక్ష్యం, పట్టుదల ఉంటాయి. పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థిలోనూ తపనతో పాటు స్పర్థ ఉంటుంది. స్పర్థతో పోటీకి విలువ పెరుగుతుంది. ఆశావాద దృక్పధంతో కూడిన సానుకూల మనో వైఖరి ఉన్న అభ్యర్థుల్లో స్పర్థ, విద్యాస్పర్థగా ఉంటుంది. ఇది పరిపక్వత చెందిన మనో వైఖరికి నిదర్శనం. స్పర్థ మనఃస్పర్థగా మారకుండా విద్యాస్పర్థగా ఉంటే మానవ సంబంధాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. వృత్తిస్పర్థను నిర్వహించే విధానాన్ని అనుసరించి మీ వృత్తి ఉద్యోగాలను మీరు ఎలా నిర్వహిస్తారన్న సామర్థ్యం తెలుస్తుంది. స్పర్థను సమర్థంగా, గౌరవప్రదంగా నిర్వహించే పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి.  

విశ్వసనీయత

వృత్తి నిపుణులు యాజమాన్యానికి విశ్వసనీయంగా, ఆధారపడగలిగిన వ్యక్తులుగా ఉంటారు. సంస్థలో చాలా కార్యక్రమాలు నడుస్తుంటాయి. కొన్ని సున్నితత్వంతో పాటు రహస్య సమాచారాలుగా ఉంటాయి. ఇలాంటివి నిర్వహించేవారు విశ్వసనీయులై ఉండాలి. ఆశావాద మనో వైఖరి, ఆశావాద దృక్పధం ఈ లక్షణాన్ని పెంపొందిస్తాయి. ఈ అంశాల్లో మీపై ఆధారపడగలమన్న నమ్మకాన్ని యాజమాన్యాలకు కలిగించేందుకు అవసరమైన పనితీరు, మనో వైఖరి వృద్ధి చేసుకోవాలి. ఇచ్చిన ప్రాజెక్టులు, పనులు ఆయా నిర్దిష్ట సమయంలోగా పూర్తి చేయడం లాంటివాటితో పై ఆధికారులను మీపై ఆధారపడేలా చేసుకోవచ్చు.  

ఆశావాద మనోవైఖరిని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చు?

నిరాశాజనకమైన ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఆశావహంగా మార్చుకోవడం

నిరంతరం స్ఫూర్తిదాయకమైన అంశాలను చదవడం

స్వీయ శక్తిసామర్ధ్యాలపై నమ్మకంతో ఉండడం, క్రియాశీలకంగా వ్యవహరించడం ద్వారా మనోవైఖరిలో అనుకూల మార్పులు తీసుకురావచ్చు.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సివిల్స్‌ సాధించాలంటే ఏ గ్రూపు ఎంచుకోవాలి?

‣ ఉద్వేగ ప్రజ్ఞ ఉందా మీకు?

‣ ఉచితంగా బీటెక్‌ నేవీలో ఉద్యోగం!

‣ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రతిష్ఠాత్మక కోర్సులు

‣ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష తుది సన్నద్ధత ఎలా?

‣ నచ్చని సబ్జెక్టుపై మక్కువ పెరగాలంటే?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 07-02-2022


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం