• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నచ్చని సబ్జెక్టుపై మక్కువ పెరగాలంటే?

ఏ కోర్సు చదువుతున్నా.. అందులో మీకిష్టమైన సబ్జెక్టులు కొన్ని ఉంటాయి. ఇష్టంలేనివీ మరికొన్ని ఉంటాయి. అప్పుడే అసలైన ఇబ్బంది మొదలవుతుంది. వీటిని ఇష్టంగా చదవలేక.. అలాగని అశ్రద్ధ చేయనూలేక నిత్యం సతమతం కావాల్సి వస్తుంది. దీనికి పరిష్కారంగా బోధన నిపుణులు ఏం చెపుతున్నారు?   

కొంతమంది విద్యార్థులు సైన్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులంటే భయపడిపోతుంటారు. ఎంతోమంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఇష్టమైన బ్రాంచిలో సీటు దొరక్క నచ్చని సబ్జెక్టులతోనే కుస్తీపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నచ్చని సబ్జెక్టుల మీద కూడా మక్కువ పెంచుకోవాలంటే...  

సమయం కేటాయింపు: అంతగా ఆసక్తిలేని సబ్జెక్టులోని ప్రతి అంశమూ క్లిష్టంగానే కనిపిస్తుంది. ఎంత చదివినా అయోమయంగానే అనిపించవచ్చు. అలాంటప్పుడు దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. మధ్యలో కాస్త విరామం తీసుకుని మళ్లీ చదవడం మొదలుపెట్టాలి. ఏరోజు పాఠాలను ఆరోజే చదవడం అలవాటు చేసుకుంటే మంచిది. వాయిదా వేస్తే చదవాల్సినవి ఎక్కువై ఒత్తిడి పెరిగి పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. 

సానుకూల ఆలోచనలు: అవగాహన కాని సబ్జెక్టును చూసి ఎక్కువగా భయపడకూడదు. ఎలాగోలా కష్టపడి పాస్‌మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందిలే అన్నట్టుగా బలవంతాన చదవకూడదు. ముందుగా ఆ సబ్జెక్టు గురించి సానుకూలంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. పోటీ పరీక్షల్లో పాసవ్వాలన్నా, మంచి ఉద్యోగం సాధించి జీవితంలో త్వరగా స్థిరపడాలన్నా.. ఈ సబ్జెక్టు మీద పట్టు సాధించడం ఎంతో అవసరమని పదేపదే గుర్తుచేసుకోవాలి. అవసరం ఎన్నో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. అలాగే సబ్జెక్టును ఆసక్తికరంగా మార్చి.. అందులో నైపుణ్యం సాధించేలానూ చేస్తుంది.  

త్వరగా అర్థమయ్యేలా: చార్ట్స్, మైండ్‌మ్యాప్స్, డ్రాయింగ్‌లను వేసుకోవడం వల్ల విషయం త్వరగా అర్థమవుతుంది. అందుకే ఈ దిశగానూ ప్రయత్నించాలి. పాఠంలోని ఒక అంశాన్ని మీకు మీరే విడమర్చి చెప్పుకుంటూ వీడియో కూడా తీసుకోవచ్చు. ఇలాచేస్తే అవసరమైనప్పుడు మననం చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అలాగే ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలతో నోట్సు రాసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. పరీక్షల ముందు వాటిని ఒకసారి చదువుకుంటే సమయం ఆదా అవుతుంది. 

ఉదాహరణల సాయం: పాఠ్యాంశాలను బట్టీపడితే కొన్ని రోజులకే వాటిని మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలాకాకుండా కొన్ని ఉదాహరణలతో వాటిని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. పోషకాహారం పాఠంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్ల గురించి చదివారనుకుందాం. రోజూ తినే అన్నంలో కార్బోహైడ్రేట్లు, కొబ్బరినూనెలో కొవ్వు, గుడ్లలో ప్రొటీన్లు ఉంటాయి. ఇలా ఉదాహరణలతో తెలుసుకోవడం వల్ల ఆయా విషయాలు ఎక్కువకాలంపాటు గుర్తుంటాయి. 

కలిసి చదివితే మంచిదే: చుట్టూ ఉండే వాతావరణం ప్రభావం చదువు మీద పడుతుంది. చదివింది అర్థంకావాలంటే ప్రశాంతంగా ఉండే చోట కూర్చుని చదవడం ఎంతో అవసరం. ఒక్కరే చదవడం ఇబ్బందిగా అనిపిస్తే స్నేహితులతో కలిసి చదవొచ్చు. అర్థంకాని అంశాలను వెంటనే అడిగి తెలుసుకోవచ్చు. దీంతో సందేహాలు నివృత్తి కావడమే కాకుండా.. ఎక్కువసేపు చదివినా విసుగు అనిపించదు. 

తాత్కాలికం మాత్రమే: అంతగా ఆసక్తి లేని సబ్జెక్టును జీవితాంతం చదవాల్సిన అవసరం ఉండదు. కోర్సు పూర్తయితే దాన్ని అధ్యయనం చేయాల్సిన పని ఉండదనేది గుర్తుంచుకుంటే మంచిది. ఇలాచేస్తే ఆ సబ్జెక్టు మీద అయిష్టత మరీ ఎక్కువ కాకుండా ఉంటుంది. తాత్కాలికంగానైనా ఆసక్తిని పెంచుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. సమస్య తాత్కాలికమైందే, దాని కాలవ్యవధి తక్కువ అనే దిశగా ఆలోచిస్తే అది ఎక్కువగా బాధించదు. ఒత్తిడికి గురికాకుండా ఉంటారు. 

ఎన్నో మార్గాలు: సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సబ్జెక్టు అంటే అయిష్టత ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే సందేహాలుంటే వెంటనే అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలి. ఆ సబ్జెక్టు అంటే ఆసక్తి ఉన్న స్నేహితులను అడిగి సందేహాలను తీర్చుకోవచ్చు. ఒకటి రెండుసార్లు అడిగి మరీ స్పష్టంగా తెలుసుకోవచ్చు. నిపుణుల దగ్గర ట్యూషన్‌కు వెళ్లొచ్చు. యూట్యూబ్‌లో అందుబాటులో ఉండే వీడియోల ద్వారానూ సబ్జెక్టును అర్థంచేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. వీటిలో అనుకూలమైనదాన్ని పాటించవచ్చు.  
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నానోలో అవకాశాలు ఎన్నో!

‣ మానసిక ఆరోగ్యం... మరవొద్దు!

‣ కోర్సులు.. కొలువులపై సలహాలే వృత్తిగా..!

‣ ఆసాంతం స్ఫూర్తితో అలాగే సాగాలంటే?

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-02-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌