• facebook
  • whatsapp
  • telegram

నూనెగింజల్లో స్వయంసమృద్ధికి బాటలు

సాగు పెంపుపై ప్రభుత్వాల దృష్టి

విదేశాలనుంచి భారత్‌ ఏటా రూ.80వేల కోట్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంటోంది. అందులో సింహభాగం పామాయిలే. నూనెల ధరలు పెరగడానికి ఇదీ ఒక కారణం. దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడం ద్వారా వంటనూనెల ధరలకు కళ్ళెం వేయడంతోపాటు దిగుమతులను పరిమితం చేయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. ఈ రబీ సీజన్‌ నుంచి ప్రత్యేక పథకాన్ని అమలులోకి తెచ్చి పామాయిల్‌ సాగును ద్విగుణీకృతం చేయనున్నాయి. ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన సందర్భంలోనూ తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్‌ సాగు విస్తరణపై మాట్లాడారు. రానున్న అయిదేళ్ల కాలంలో రెండు రాష్ట్రాల్లోనూ పెద్దయెత్తున పామాయిల్‌ సాగు చేపట్టి రైతులు లబ్ధిపొందనున్నారని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ నూనెగింజల మిషన్‌ ద్వారా ప్రోత్సాహకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. 

కార్యాచరణ ప్రణాళికలు

ఎలీస్‌ గినియెన్సిస్‌ సాంకేతిక నామం కలిగిన పామాయిల్‌ మొక్కకు ఆఫ్రికా ఖండంలోని పడమటి ప్రాంతాలు పుట్టినిళ్లు. కాలక్రమంలో తూర్పు ఆసియా దేశాలకు విస్తరించింది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పామాయిల్‌లో సగం ఇండొనేసియా, మలేసియాలనుంచే ఉంటోంది. భారత్‌లో ఎక్కువగా వినియోగించే వంటనూనెల్లో పామాయిల్‌ది ప్రత్యేక స్థానం. ఇందులో రెండు శాతం మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతోంది. 98శాతం కోసం ఇతర దేశాలపై ఆధారపడక తప్పడంలేదు. అందుకోసం ఏటా వేల కోట్ల రూపాయల విదేశమారకద్రవ్యం చెల్లించాల్సి వస్తోంది. దాన్ని గుర్తించిన కేంద్రం స్వయంసమృద్ధి అవకాశాలపై అధ్యయనం చేసి పామాయిల్‌ సాగుపై దృష్టి సారించింది. రైతులు, నర్సరీ యజమానులతోపాటు పరిశ్రమలకూ ప్రోత్సాహకాలు అందించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే దశాబ్దకాలంలో పామాయిల్‌తోపాటు ఇతర నూనెగింజల ఉత్పత్తిలోనూ మిగులు సాధించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పామాయిల్‌ కేవలం దక్షిణాదిలోని మూడురాష్ట్రాల్లో అత్యధికంగా సాగవుతోంది. దేశంలో ఇతర రాష్ట్రాలకూ దాన్ని విస్తరించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. వంటనూనెల్లో పామాయిల్‌ ధర చౌకగా ఉండటం, గృహ, పారిశ్రామిక అవసరాల్లోనూ వాడుతుండటంతో అది కీలకమైంది. అందువల్ల దేశీయంగా ఉత్పత్తి పెంచాలన్న ఉద్దేశంతో ఆత్మనిర్భర్‌ భారత్‌లో కేంద్రం ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. అందులో రాష్ట్రాలను భాగస్వాములను చేయడంతోపాటు ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

దేశవ్యాప్తంగా వంటనూనెల తలసరి వినియోగం 2012-13లో సగటున 15.8 కిలోలు ఉండగా, ప్రస్తుతం 19 కిలోలకు చేరింది. ప్రపంచంలోనే అత్యధిక నూనెగింజలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా తొలి స్థానంలో నిలిచింది. 2020-21లో రూ.80వేల కోట్ల విలువైన 133.52లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. అందులో పామాయిల్‌ 56శాతం, సోయా 27శాతం, పొద్దుతిరుగుడు 16శాతం. దేశీయంగా నూనెల ఉత్పత్తిని పెంచడానికి జాతీయ వంట నూనెలు-ఆయిల్‌పామ్‌ కార్యక్రమం పేరుతో కేంద్రం కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. అయిదేళ్లపాటు ఈ పథకానికి రూ.11,040కోట్లు వెచ్చిస్తారు. అందులో కేంద్రం వాటా రూ.8,844కోట్లు, రాష్ట్రాల వాటా రూ.2,196కోట్లు. దేశంలో ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ 3.7లక్షల హెక్టార్లలో సాగవుతోంది. 2025-26 నాటికి 10లక్షల హెక్టార్లకు చేరుకోవాలన్నది లక్ష్యం. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి 1991-92 నుంచే అడుగులు పడ్డాయి. పలు పథకాల ద్వారా నూనెగింజల సాగు విస్తరణకు 13 రాష్ట్రాల్లో ప్రోత్సాహకాలు అందించారు. ఈశాన్య రాష్ట్రాలను ప్రత్యేక ప్రాధాన్యతగా గుర్తించి కేంద్రం 90శాతం వాటాను అందించింది. ఫలితంగా 1991-92లో దేశీయంగా 8585 హెక్టార్లు ఉన్న పామాయిల్‌ సాగు 2020-21 నాటికి 3.70లక్షల హెక్టార్లకు పెరిగింది. ఇదే కాలానికి పామాయిల్‌ ఉత్పత్తి 0.21లక్షల టన్నుల నుంచి 16.89లక్షల టన్నులకు ఎగబాకింది.  

నూనెగింజల్లో మిగతా వాటితో పోలిస్తే పామాయిల్‌లో ఉత్పాదకత ఎక్కువ. హెక్టారుకు నాలుగు టన్నుల నూనె దిగుబడి వస్తుంది. పైగా ఒకసారి నాటితే 30ఏళ్లపాటు పంట కొనసాగుతుంది. అందువల్ల పామాయిల్‌ విస్తీర్ణం పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అనేక దశల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సాగుదారులకు రాయితీలు కల్పిస్తున్నారు. పామాయిల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి గల అవకాశాలపై పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలోని భారత ఆయిల్‌పామ్‌ పరిశోధన సంస్థ అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా 27.99లక్షల హెక్టార్ల వరకు సాగుకు అవకాశముందని సూచించింది. ఇందులో ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో 9.62లక్షల హెక్టార్లు, ఈశాన్యేతర రాష్ట్రాల్లో 18.37లక్షల హెక్టార్లలో సాగుకు అవకాశముంది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో 38,992 హెక్టార్లలో, దేశవ్యాప్తంగా 3.69లక్షల హెక్టార్లలో పామాయిల్‌ సాగవుతోంది. 2025-26 నాటికి ఈశాన్యేతర రాష్ట్రాల్లో 3.2లక్షల హెక్టార్లు, ఈశాన్య రాష్ట్రాల్లో 3.28లక్షల హెక్టార్లను కొత్తగా సాగులోకి తీసుకురావాలన్నది లక్ష్యం.

ప్రత్యేక రాయితీలు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ రాష్ట్రాల నుంచే పామాయిల్‌ 98శాతం ఉత్పత్తి అవుతోంది. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌, మిజోరం రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, మణిపుర్‌, నాగాలాండ్‌లలోనూ పామాయిల్‌ సాగును విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏపీలో 5.30లక్షల హెక్టార్లు, తెలంగాణలో 4.36లక్షల హెక్టార్లలో సాగు విస్తరించడానికి అవకాశమున్నట్లు భారత ఆయిల్‌పామ్‌ పరిశోధన సంస్థ గుర్తించింది. ఆయిల్‌పామ్‌ సాగుదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. ఆయిల్‌పామ్‌ మొక్కల కొనుగోలుకు ఇస్తున్న రాయితీని హెక్టారుకు రూ.12వేల నుంచి రూ.29వేలకు పెంచారు. తొలి నాలుగేళ్లలో తోటలను పెంచడానికి ఎరువులు, ఇతర ఉత్పాదకాల కొనుగోలుకు హెక్టారుకు రూ.42వేలు రాయితీ అందజేస్తారు. దేశంలో ఆయిల్‌పామ్‌ మొక్కల కొరతను తీర్చడానికి విత్తన తోటలు(నర్సరీ) 15హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేవారికి రూ.80లక్షలు ప్రోత్సాహకం ఇస్తారు. సూక్ష్మసేద్య పరికరాలు, సోలార్‌ పంపుసెట్లకు, గెలల కోతకు ఉపయోగించే యంత్ర పరికరాలకూ రాయితీలు అందిస్తారు.

- పెనికలపాటి రమేష్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉద్యోగరహిత అభివృద్ధి!

‣ యూపీలో భాజపా - ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ

‣ ప్రణాళిక కొరవడి... ప్రగతి తడబడి!

‣ యూపీలో భాజపా - ఎస్‌పీ మధ్య తీవ్ర పోటీ

‣ భూతాపం ఉత్పాదకతకు శాపం

‣ డ్రాగన్‌ వైపు రష్యా మొగ్గు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం