• facebook
  • whatsapp
  • telegram

ప్రణాళిక కొరవడి... ప్రగతి తడబడి!

నగరాల్లో లోపించిన జీవన ప్రమాణాలు

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను ఆర్థిక చోదక శక్తులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా 2022-23 బడ్జెట్‌లో పట్టణాభివృద్ధి అంశాలను కేంద్ర ఆర్థికమంత్రి ఆవిష్కరించారు. 2047 నాటికి దేశ జనాభాలో 50శాతం పట్టణాల్లోనే నివసిస్తారని- అందుకనుగుణంగా మౌలిక వసతులు, ఆర్థిక ఉపాధి అవకాశాల కల్పనకు అనువైన పట్టణ ప్రణాళికలను రూపొందించేందుకు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని నియమిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఆ కమిటీలో పట్టణ ప్రణాళిక నిపుణులు, ఆర్థికవేత్తలు, ప్రసిద్ధ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పట్టణ ప్రణాళికలు, పరిపాలన విషయాల్లో వారినుంచి ప్రభుత్వం సూచనలు, సలహాలను స్వీకరిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనువైన వ్యూహాల రూపకల్పనకు ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని నియమించడం స్వాగతించదగ్గ పరిణామం. ఆ కమిటీలో విద్య, వైద్య, పర్యావరణ, గృహరంగాల నిపుణులు, డిజైనర్లకు సైతం స్థానం కల్పించాలి.

ప్రజా రవాణా కీలకం

కొవిడ్‌ విజృంభణతో ‘ఇంటి నుంచి పని’కి ప్రాధాన్యం పెరగడంతో దేశంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు ప్రతిభా, ఉపాధి కేంద్రాలుగా అవతరిస్తున్నాయి. దేశ భవిష్యత్తు అవసరాలను తీర్చే విధంగా వాటిని రూపొందిస్తామంటూ విధాన ప్రకటన చేయగానే సరిపోదు. అందుకు అవసరమైన మౌలిక వసతులను భారీయెత్తున విస్తరించాలి. జీవన నాణ్యతను మెరుగుపరచాలి. పెట్టుబడులను ఆకర్షించడానికి సకల సౌకర్యాలతో సన్నద్ధం చేయాలి. అభివృద్ధి చెందిన ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు వలసలను నిరోధించి స్థానిక ఉపాధికి బాటలు వేస్తాయి. మహానగరాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. సుస్థిరాభివృద్ధిని సుసాధ్యం చేస్తాయి. చిన్న నగరాల అభివృద్ధికి పటుతర కార్యాచరణను రూపొందించి అమలు చేయాలి.

ప్రజారవాణా పట్టణాభివృద్ధిలో కీలకమైన అంశం. రవాణా ఆధారిత అభివృద్ధిలో తాము తీసుకొచ్చే సంస్కరణలు ప్రజా రవాణా సంస్థలకు దగ్గరలో ప్రజలు నివసించేలా చేస్తాయని కేంద్రం ప్రకటించింది. బడ్జెట్‌ ప్రతిపాదనలు ప్రకటనలకు అనువుగా లేవని కేటాయింపులను చూస్తే స్పష్టమవుతుంది. ప్రాంతాల భౌగోళిక, జనాభా అంశాల ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. రవాణా ఆధారిత అభివృద్ధి- పట్టణ ఆస్తుల ధరలను మరింతగా పెంచే అవకాశముంది. అందువల్ల రవాణా ఆధారిత అభివృద్ధి విధానంలో పేద ప్రజలకు గృహవసతి అంశం తప్పనిసరిగా ఉండాలి. కొవిడ్‌ దెబ్బకు పట్టణ ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. కోట్ల మంది ప్రజలు ఉపాధి కోల్పోయి పేదరికంలోకి జారిపోయారు. వారిని ఆదుకోవడానికి గ్రామీణ ఉపాధి హామీ తరహాలో పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రకటిస్తే బాగుండేది. బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేకపోవడం మధ్య, పేద తరగతి వర్గాలను తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేసింది.

గత బడ్జెట్‌లో పట్టణాభివృద్ధికి రూ.54,581 కోట్లు కేటాయించగా - ఈసారి రూ.76,549.46 కోట్లు ప్రకటించారు. 2021-22 సవరించిన బడ్జెట్‌ అంచనా రూ.73,850.25 కోట్లు. అంటే ఇప్పుడు పెరిగింది స్వల్పమే. 2014-15 నుంచి పట్టణాభివృద్ధి బడ్జెట్‌లో మూలధన వ్యయం కంటే రెవిన్యూ వ్యయం అధికంగా ఉంటోంది. అందువల్ల ఆస్తుల వృద్ధి తక్కువగా ఉంది. బడ్జెట్‌ కేటాయింపులు ఏటా పెరుగుతున్నప్పటికీ పట్టణాభివృద్ధి శాఖ డిమాండ్‌ కంటే తక్కువగా ఉంటున్నాయని పార్లమెంటరీ సంఘం వెల్లడించింది. మెట్రోరైలు ప్రాజెక్టులకు భారీవ్యయం అవసరమవుతుందని, దశలవారీగా వాటిని అమలు చేయాలని, మొదట్లో ప్రాజెక్టులను 50 లక్షల జనాభా ఉన్న నగరాలకు పరిమితం చేయాలని ‘నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ కమిటీ’ సూచించింది. భారత నగరాలు ఇప్పుడైనా ప్రజారవాణా వ్యవస్థలను మెరుగుపరచాలని కమిటీ అభిప్రాయపడింది. ప్రజారవాణా కోసం గత ఆర్థిక సంవత్సరం 20,000 బస్సులు కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఈ సంవత్సరం ఆ ఊసే లేదు. గత సంవత్సరం ఇళ్ల నిర్మాణ లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. కేటాయించిన నిధుల్లో 80శాతం మేరకే రాష్ట్రాలు ఉపయోగించుకొన్నాయి.

నిధుల పెంపుదలే శరణ్యం

ఈ ఏడాది ఆర్థికమంత్రి ప్రసంగంలో కేంద్ర ప్రతిష్ఠాత్మక పథకం ‘ఆకర్షణీయ నగరాల’ ఊసే లేదు. పట్టణీకరణ శరవేగంగా సాగుతున్నందువల్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భారీ పెట్టుబడులు అవసరం. వాటిని మూలధన గ్రాంట్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలి. ఇప్పుడు పట్టణీకరణ వేగాన్నిబట్టి చూస్తే 2012-2031 మధ్య కాలానికి ఆశించిన మేర పట్టణాభివృద్ధి జరగడానికి రూ.39 లక్షల కోట్లు కావాలని ‘పట్టణ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల అంచనా సంస్థ’ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో 0.6శాతం వ్యయం అవుతుందని కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ అంచనాకు వచ్చింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకోసం మున్సిపల్‌ బాండ్లు, రుణాలు, ప్రైవేటు, ప్రభుత్వ పెట్టుబడుల వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత స్థూల దేశీయోత్పత్తిలో 52శాతం నగరాల నుంచి వస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నగరాల వాటా 70శాతం దాకా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే మన దేశ పట్టణీకరణ రేటు తక్కువే. ప్రణాళికయుతమైన పట్టణీకరణ అవస్థాపనా సౌకర్యాలకు, పారిశ్రామిక సేవారంగాలకు పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతుంది. అందువల్ల పట్టణాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం అవసరం. ప్రైవేటు పెట్టుబడులు పట్టణాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తాయి. నగరాలను, పట్టణాలను అందరికీ అవకాశాలు అందించగల సుస్థిర జీవనయోగ్య నెలవులుగా తీర్చిదిద్దాలంటే- పట్టణ ప్రణాళిక, పరిపాలనల్లో నామమాత్రపు చర్యలు కొనసాగనేకూడదు.

నరకానికి నకళ్లు

సరైన ప్రణాళికలు లేక పట్టణాలు అడ్డదిడ్డంగా విస్తరిస్తున్నాయి. వరద ముంపునకు గురవుతున్నాయి. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలతో నాలాలు, చెరువులు కుంచించుకుపోతున్నాయి. జల, వాయు కాలుష్యం పెచ్చరిల్లేందుకు లోపభూయిష్ఠమైన విధానాలు కారణమవుతున్నాయి. మౌలిక వసతులు, పౌరసేవల లేమి, క్షీణిస్తున్న జీవన ప్రమాణాలవంటి సమస్యలతో పట్టణాలు, నగరాలు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. దేశంలో 63శాతం నగరాలకు, పట్టణాలకు అసలు బృహత్‌ ప్రణాళికలే లేవని నీతి ఆయోగ్‌ నిరుడు కుండబద్దలు కొట్టింది. నిపుణులైన ప్రణాళికావేత్తల కొరతా నగరాలను పీడిస్తోంది. అందువల్ల దేశంలోని విభిన్న ప్రాంతాల్లోని అయిదు సంస్థలను అర్బన్‌ ఎక్సలెన్స్‌ కేంద్రాలుగా మారుస్తామంటూ బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. అవి పట్టణ ప్రణాళికలకు దిశానిర్దేశం చేస్తాయి. అందుకోసం ప్రతి సంస్థకు రూ.250 కోట్ల చొప్పున కేటాయించారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భూతాపం ఉత్పాదకతకు శాపం

‣ డ్రాగన్‌ వైపు రష్యా మొగ్గు!

‣ క్షమాభిక్షలో తీవ్ర కాలయాపన

‣ దేశీయ ఆయుధ తయారీకి దన్ను

‣ అన్నదాత ఓటు ఎటు?

‣ అంతర్గత పోరులో మయన్మార్‌

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 12-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం