• facebook
  • whatsapp
  • telegram

క్షమాభిక్షలో తీవ్ర కాలయాపన

విపరీత జాప్యంతో మానసిక వేదన

పలు ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్న చాలా సంప్రదాయాలను మన రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాధినేత ఒక ఖైదీ పట్ల చూపించే ఔదార్యం వాటిలో ఒకటి. దాన్నే వాడుక భాషలో రాష్ట్రపతి క్షమాభిక్ష అంటారు. ఇది అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాల్లో ఎప్పటినుంచో అమలులో ఉంది. క్షమాభిక్ష అభ్యర్థనలపై భారత ప్రథమ పౌరుడి నిర్ణయం వెలువడటంలో చోటుచేసుకుంటున్న జాప్యం చాలా కాలంగా చర్చల్లో నిలుస్తోంది. చిన్న పిల్లలను హత్య చేసిన కేసులో రేణుకా షిండే, సీమా గవిత్‌ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లకు కింది కోర్టులు విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు 2006లో సమర్థించింది. రాష్ట్రపతి వారి క్షమాభిక్షను 2014లో తిరస్కరించారు. ఇటీవల బాంబే కోర్టు వారి మరణ శిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చింది. సుప్రీం తీర్పును కింది కోర్టు కుదించడం అత్యంత అరుదైన విషయం. ఈ కేసులో క్షమాభిక్షపై రాష్ట్రపతి నిర్ణయం వెలువడటానికి ఎనిమిదేళ్లు  పట్టింది. అంత సుదీర్ఘ కాలయాపన కారణంగా తమకు అన్యాయం జరిగిందని, తమ విషయంలో రాష్ట్రపతి నిర్ణయం న్యాయ సమీక్షకు అర్హమైనదని ఆ ఖైదీలిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. వారి మొరను ఆలకించిన న్యాయస్థానం మరణ శిక్షను యావజ్జీవానికి తగ్గించింది.

పునఃపరిశీలన అవసరం

రాజ్యాంగంలోని 72వ అధికరణ రాష్ట్రపతి క్షమాభిక్ష గురించి చెబుతోంది కోర్టు విధించిన శిక్షను తగ్గించడం, మరణ దండన లేదా ఇతర శిక్షను పూర్తిగా రద్దు చేయడంలాంటి అధికారాలను రాజ్యాంగం ప్రథమ పౌరుడికి కల్పించింది. మరణ శిక్ష విధించిన కేసుల్లో పునఃపరిశీలన చెయ్యవలసిన అవసరాన్ని గుర్తించి రాజ్యాధినేతకు క్షమాభిక్ష అధికారాన్ని రాజ్యాంగంలో పొందుపరచారు. ఒకసారి పోయిన ప్రాణం తిరిగిరాదు కాబట్టి ఉరి తీసేముందు అన్ని అంశాలను లోతుగా పరిశీలించి మానవ తప్పిదం లేకుండా చూడాలి అన్నది ఈ క్షమాభిక్ష వెనక ఉన్న ఆంతర్యం. ఈ అధికారాన్ని ఉపయోగించే తీరులో అనేక లోటుపాట్లు కనిపిస్తాయి. సాధారణంగా అత్యంత అరుదైన కేసుల్లోనే నేరస్థులకు మరణదండన విధిస్తారు. ఈ శిక్షను ముందుగా సంబంధిత హైకోర్టు ధ్రువీకరిస్తుంది. ఆ తరవాత ఖైదీకి సుప్రీం కోర్టును ఆశ్రయించే హక్కు ఉంటుంది. అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ శిక్షకు ఆమోదముద్ర వేశాక, చివరి అవకాశంగా రాష్ట్రపతి క్షమాభిక్షను కోరవచ్చు. దానిపై ప్రథమ పౌరుడు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. మన రాజ్యాంగం ప్రకారం మంత్రి మండలి సలహా మేరకే రాజ్యాధినేత వ్యవహరించాలి. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ 2012లో ఒక పత్రికా ప్రకటనలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. షంషేర్‌ సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ కేసులో మంత్రివర్గ సలహా మేరకే రాష్ట్రపతి నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మరు రాం, కేహార్‌ సింగ్‌ కేసుల్లోనూ ఆ విషయాన్ని పునరుద్ఘాటించింది.

సుప్రీంకోర్టులోనూ మరణశిక్ష ఖరారయ్యాక, రాష్ట్రపతికి ఖైదీ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థన తొలుత కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చేరుతుంది. దాన్ని ఆ శాఖ ప్రథమ పౌరుడికి పంపుతుంది. ఆ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్రపతి మళ్ళీ హోం శాఖకే దాన్ని తిప్పి పంపుతారు. హోం శాఖ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు కోరుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడంలో విపరీత కాలయాపన చోటుచేసుకుంటోంది. ఆలోగా ఖైదీలు తాము బతికి ఉంటామో, ఉరికంబానికి వేలాడతామో తెలియక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. మరణంకన్నా అది మరింత ఆవేదనాభరితమైన విషయమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

తగ్గిన మరణశిక్షలు

జగత్‌ రాయ్‌ అనే ఖైదీకి మరణ శిక్షను సుప్రీంకోర్టు 2013లో ఖరారు చేసింది. 2017 జులైలోనే హోంశాఖ క్షమాభిక్ష తిరస్కరణ సూచనను రాష్ట్రపతి కార్యాలయానికి పంపింది. దాన్ని తొమ్మిది నెలల తరవాత ప్రథమ పౌరుడు ఆమోదించారు. దేశాన్ని విషాద సంద్రంలో ముంచిన నిర్భయ కేసులో దోషుల క్షమాభిక్ష తిరస్కరణకు రాష్ట్రపతి త్వరగానే ఆమోదముద్ర వేశారు. నేరం తీవ్రత దృష్ట్యా వెంటనే నిర్ణయం వెలువరించారని అనుకున్నా- అన్ని క్షమాభిక్ష అభ్యర్థనలపై నిశ్చయాన్ని వెలువరించే విషయంలో ఒక గడువు అంటూ లేకపోవడం లోపమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో ఎక్కువగా క్షమాభిక్ష అభ్యర్థనలు వచ్చేవి. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే న్యాయస్థానాలు ఉరిశిక్షలు విధిస్తున్నందువల్ల తరవాతి కాలంలో అవి తగ్గుముఖం పట్టాయి. ఏది ఏమైనా రాష్ట్రపతి నిర్ణయం వెలువడేవరకు జరుగుతున్న విపరీత జాప్యం మరణదండన ఖైదీలకు మరో శిక్షగా మారుతోంది. క్షమాభిక్ష అభ్యర్థనలపై నిర్ణీత సమయంలోనే నిశ్చయాన్ని తెలిపేలా ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. 

- డాక్టర్‌ గుమ్మడిదల పద్మజ 

(సహాయ ఆచార్యులు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాల)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిజిటల్‌ రూపాయి వైపు అడుగులు

‣ తెలుగు రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమ

‣ నిర్లక్ష్యంతో నీరుగారుతున్న ఆశయం

‣ మెట్ట సేద్యంలో అంతర్జాతీయ కీర్తి

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 09-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం