• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ రూపాయి వైపు అడుగులు

కేంద్ర సర్కారు కసరత్తు

రిజర్వు బ్యాంకు 2020 మార్చిలో బిట్‌ కాయిన్‌, ఎథీరియం, డోజే కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలపై నిషేధాన్ని ఎత్తేసింది. అప్పటి నుంచి దేశీయంగా క్రిప్టో లావాదేవీలు పెరగసాగాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అత్యధిక క్రిప్టో మదుపరులు భారతదేశంలోనే ఉన్నారు. అమెరికా, రష్యా దేశాలు తదుపరి స్థానాల్లో నిలుస్తున్నాయి. ప్రపంచ వర్చువల్‌ క్యాపిటల్‌ సంస్థలు నిరుడు డిసెంబరు 15వ తేదీ నాటికి క్రిప్టోల్లో రూ.2.23 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టాయని పిచ్‌బుక్‌ డేటా సంస్థ వివరించింది. భారత్‌లో 2021లో పది కోట్ల పైచిలుకు క్రిప్టో మదుపు దారులు దాదాపు రూ.75 వేల కోట్లను క్రిప్టోలలో పెట్టుబడి పెట్టారని క్రెబాకో అనే పరిశోధన సంస్థ వెల్లడించింది. ఈ మదుపరులలో చాలామంది చిన్న మొత్తాల్లో క్రిప్టోలను కొనుగోలు చేసిన మధ్యతరగతివారే. తాజా బడ్జెట్‌లో క్రిప్టో ఆస్తులపై గరిష్ఠంగా 30 శాతం ఆదాయ పన్ను విధించడంతో, చైనా మాదిరిగా వాటిని నిషేధించే ఆలోచన భారత సర్కారుకు లేదని అవగతమవుతోంది.

భారీగా మదుపు

పద్నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని ముంచెత్తిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రభుత్వాలు ఎడాపెడా కరెన్సీని ముద్రించాయి. దాంతో ఆనాడు నోట్ల విలువ వేగంగా పడిపోసాగింది. ఆ సమయంలో తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి సంపన్నులు, టెక్‌ నిపుణులు బ్లాక్‌చెయిన్‌ సాంకేతికత ఆధారంగా చలామణీ అయ్యే బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలకు మారారు. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వంటివారు సైతం వాటిలో భారీగా మదుపు చేశారు. కొవిడ్‌ సంక్షోభంలోనూ పాత కథే పునరావృతమైంది. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల ప్రమేయం లేకుండా మదుపరులు తమలో తామే క్రయవిక్రయాలు జరపడానికి క్రిప్టోలు పనికొస్తున్నాయి. అక్రమ ధన చలామణీకి, ఉగ్రవాదులకు నిధులు అందించడానికి, మాదకద్రవ్య వ్యాపారంలో డబ్బు చేతులు మారడానికి కూడా అవి తోడ్పడుతున్నాయి. నేరగాళ్ల సంగతి అటుంచి ధనికులు, బడా కంపెనీలు క్రిప్టో పెట్టుబడులతో ప్రభుత్వాల చేయిదాటిపోతే సర్కారీ ఆదాయాలకు పెద్దయెత్తున గండిపడుతుంది. ప్రజా సంక్షేమానికే కాదు- ప్రభుత్వ నిర్వహణకూ డబ్బు చిక్కని పరిస్థితి ఏర్పడుతుంది. అధికార కరెన్సీలకు పోటీగా అనధికార క్రిప్టో కరెన్సీల వాడకం సర్వవ్యాప్తమైతే ప్రభుత్వాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. మరోవైపు, అధునాతన సాంకేతికతతో పనిచేసే క్రిప్టో కరెన్సీలను నిషేధించేకన్నా అధికారిక డిజిటల్‌ కరెన్సీలను తీసుకురావడం ఉత్తమమనే భావన సైతం నెలకొంది. తదనుగుణంగా త్వరలోనే సొంత డిజిటల్‌ కరెన్సీతో ముందుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దానికి పార్లమెంటు సమ్మతి తెలిపిన వెంటనే కేంద్ర మంత్రివర్గ ఆమోదం తీసుకుని రిజర్వు బ్యాంకు డిజిటల్‌ రూపాయిని తీసుకొస్తుందని ఆవిడ చెబుతున్నారు.

కొవిడ్‌ కాలంలో ధనికులు మహా ధనికులైతే పేద, మధ్యతరగతి వారు ఆదాయాలు కోల్పోయారు. లాక్‌డౌన్‌ల వల్ల ఆర్థిక వ్యవస్థలు కుదేలై ప్రభుత్వాలకూ ఆదాయం పడిపోయింది. ఆరోగ్యం, సామాజిక సేవలపై ఖర్చులు పెరిగాయి. వాటిని తట్టుకోవాలంటే కుబేరుల సంపదపై పన్నులు పెంచాలనే ప్రతిపాదనలు బలం పుంజుకొంటున్నాయి. ఉన్నపళాన పన్నులు పెంచితే కుబేరులు, కంపెనీలు దేశం విడిచి వెళ్ళిపోతారనే అనుమానాలూ నెలకొన్నాయి. భారతీయ పౌరసత్వం వదులుకుని విదేశాల్లో స్థిరపడుతున్న సంపన్నుల సంఖ్య తక్కువేమీ కాదు. పన్నుల నుంచి ఉపశమనం కల్పించే దేశాలకు సంపన్నులు, రాజకీయ నాయకులు డబ్బు తరలిస్తున్నారని పనామా, పండోరా, ప్యారడైజ్‌ పత్రాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ఘరానా మనుషులు క్రిప్టోల్లోనూ పెట్టుబడి పెడుతున్నారు. కొవిడ్‌ ఇంకా పూర్తిగా తొలగకపోవడంతో ధనికులు, కంపెనీలపై ఇప్పటికిప్పుడు పన్నులు పెంచడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. అదే సమయంలో ఉపాధి కల్పన, మౌలిక వసతుల విస్తరణలకు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించక తప్పని స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో క్రిప్టో ఆదాయంపై 30 శాతం పన్ను విధించడం అంటే కీలెరిగి వాతపెట్టడమే అవుతుంది. పన్ను విధించినంత మాత్రాన క్రిప్టోకరెన్సీలకు చట్టబద్ధత కల్పించినట్లు కాదని కేంద్ర రెవిన్యూ విభాగ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ ఉద్ఘాటించడమూ గమనార్హం. జూదం, గుర్రపు పందేలు, స్పెక్యులేషన్‌లో గెలిచినవాళ్ల నుంచి పన్నులు ఎలా వసూలు చేస్తామో క్రిప్టోల విషయంలోనూ అంతేనని ఆయన చెప్పారు. క్రిప్టోలపై పన్ను విధించడం వల్ల ఆ మార్కెట్‌ వాస్తవ విస్తృతి ఎంతో తెలుస్తుందని, వాటిపై నియంత్రణకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన తరవాతే పూర్తిస్థాయి స్పష్టత వస్తుందని తరుణ్‌ వ్యాఖ్యానించారు.

నియంత్రణే మేలు

ధనవంతుల నుంచి పన్ను వసూలు చేయడానికి, మధ్యతరగతివారిని క్రిప్టోలకు దూరంగా ఉంచడానికి అధిక పన్ను తోడ్పడుతుందనే వాదన వినిపిస్తోంది. మధ్యతరగతి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని వేలంవెర్రిగా, ఒక జూదంలా క్రిప్టో లావాదేవీల్లోకి దూకి చేతులు కాల్చుకోకుండా అది నివారిస్తుందని నిపుణులు అంటున్నారు. క్రిప్టో కరెన్సీ అనేది కేవలం ఆర్థిక సంబంధ వ్యవహారం కాదు. అధునాతన సాంకేతికతతో పనిచేసే ద్రవ్య మాధ్యమం. క్రిప్టోలను పకడ్బందీగా నియంత్రించడానికి ఆర్థిక, సాంకేతికపరమైన నియంత్రణ చట్రాన్ని రూపొందించాలి. అంతేతప్ప వాటిని గంపగుత్తగా నిషేధించకూడదు. ఆ వాస్తవాన్ని గుర్తెరిగిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి క్రిప్టో లావాదేవీలపై అధిక పన్ను విధించింది. త్వరలో నియంత్రణ విధాన ముసాయిదానూ వెలువరించనుంది. మొత్తమ్మీద మారుతున్న కాలానికి తగినట్లు ఇండియా సైతం డిజిటల్‌ రూపాయితో సిద్ధం కానుంది.

అంతర్జాతీయ చట్రం అవసరం

బహమాస్‌, నైజీరియా తదితర తొమ్మిది దేశాలు ఇప్పటికే అధికారిక డిజిటల్‌ కరెన్సీలను విడుదల చేశాయి. మరో యాభైకి పైగా దేశాలూ ఆ దిశగా ముందుకు సాగుతున్నాయి. డిజిటల్‌ కరెన్సీల విషయంలో చైనా కూడా ఒక అడుగు ముందే ఉంది. క్రిప్టో కరెన్సీలను, లావాదేవీలను నిషేధించిన ఆ దేశం- తాజా శీతాకాల ఒలింపిక్స్‌ సందర్భంలోనే డిజిటల్‌ యువాన్‌ను ప్రారంభించాలని తలపోసింది. కొవిడ్‌ సంక్షోభం దానికి గండికొట్టింది. అయితే, గత జనవరికే చైనాలో 26.1 కోట్ల మంది డిజిటల్‌ యువాన్‌ వ్యాలెట్‌ యాప్‌లో రిజిస్టరయ్యారు. అలీపే, వియ్‌ పే వంటి ప్రైవేటు వ్యాలట్లను వాడుతున్నవారు సాధికార డిజిటల్‌ యువాన్‌ వ్యాలట్‌కు మారడమూసులువు కానుంది. కానీ, సమస్య ఏమిటంటే- డిజిటల్‌ యువాన్‌ ఎంత ప్రాచుర్యం పొందినా, విదేశీ వినియోగదారులు దానికి దూరంగా ఉంటున్నారు. ఏతావతా ఏ దేశానికి ఆ దేశం డిజిటల్‌ కరెన్సీలను ప్రవేశపెడితే, వాటి మధ్య మారక విలువ నిర్ధారణకు ఒక అంతర్జాతీయ నియంత్రణ చట్రం రూపుదిద్దుకోవాల్సిందే!

- వరప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మెట్ట సేద్యంలో అంతర్జాతీయ కీర్తి

‣ డిజిటల్‌ స్వప్నానికి అంతర్జాల సవాళ్లు

‣ సంక్లిష్ట రాజకీయ సమరం

‣ పల్లవించని రైతు సంక్షేమం

‣ విచ్చలవిడిగా నీటి తోడివేత

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 07-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం