• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ స్వప్నానికి అంతర్జాల సవాళ్లు

అవరోధంగా మౌలిక వసతుల లేమి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌ వరసగా మూడో ఏడాదీ టెక్నాలజీ ఆధారిత అభివృద్ధినే కాంక్షిస్తూ... ‘డిజిటల్‌ ఇండియా’కు పెద్దపీట వేసింది. వ్యవసాయంనుంచి ప్రజారోగ్యం వరకు అన్నింటినీ డిజిటల్‌ బాట పట్టించాలనే మోదీ సర్కారు నిర్ణయం టెక్‌ సంస్థలకు భారీ అవకాశాలను కల్పిస్తోంది. క్షేత్రస్థాయిలో నెలకొన్న కొన్ని లోపాలను అధిగమించగలిగితేనే ప్రభుత్వ నిర్ణయం సజావుగా అమలవుతుంది. సమాచార సాంకేతికతతో దేశంలో సేవారంగం కొత్తపుంతలు తొక్కింది. ఐటీ సేవల రంగంలో ఉపాధి పొందుతున్న సుమారు 45 లక్షల యువత ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపునిచ్చారు. భారత్‌నుంచి ఐటీ సేవల ఎగుమతుల విలువ 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో అక్షరాలా రూ.13 లక్షల కోట్లు. కొవిడ్‌తో కుదేలైన పరిస్థితుల్లోనూ అంతకు ముందు ఏడాది కంటే 18శాతం వృద్ధితో ఐటీ సేవారంగం దూసుకుపోయింది. కొవిడ్‌ సంక్షోభంలో విద్య, వైద్యం సహా ఎన్నో కీలకరంగాల్లో సాంకేతికతను జోడించే ప్రక్రియ ఊపందుకొంది. పెద్దనోట్ల రద్దు నాటినుంచి ఆర్థిక లావాదేవీలు డిజిటల్‌ వైపు మళ్ళాయి. రాష్ట్ర ప్రభుత్వాలూ సాంకేతికతపై దృష్టి సారించాయి. అన్ని శాఖలకూ సాంకేతిక పరిజ్ఞాన హంగులద్దుతున్నాయి. ఈ తరుణంలో అన్ని రంగాలనూ డిజిటల్‌ బాట పట్టించాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలు మరింత సులభ తరమవుతుందని భావించవచ్చు. 

అనుసంధానత ఎక్కడ?

డిజిటల్‌ ఇండియా కలలకు అత్యవసర మౌలిక వసతుల లేమి పెద్ద అవరోధంగా నిలుస్తోంది. డిజిటల్‌ బాటలో దేశం ముందుకు పోవాలంటే అంతర్జాల అనుసంధానం అత్యవసరం. ఆ విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నామన్నది నిష్ఠుర సత్యం. కరోనా మొదటి, రెండో దశల్లో పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని భావించినా- మొబైల్‌ నెట్‌వర్క్‌ సరిపడా లేకపోవడంతో ఆ లక్ష్యాన్ని చేరలేకపోయాం. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలో 55 వేల పల్లెలకు నేటికీ మొబైల్‌ నెట్‌వర్క్‌ కవరేజి లేదు. 2018-19లో ఒడిశా ఆర్థిక సర్వే తేల్చిన లెక్కల ప్రకారం ఆ రాష్ట్రంలోని 10 వేలకు పైగా గ్రామాలకు మొబైల్‌ ఫోన్‌ అనుసంధానతే లేదు. ఇక అక్కడ అంతర్జాలం ఉన్నవారు 28శాతమే. అంతర్జాల అనుసంధానతలో జాతీయ సగటు (38శాతం) కంటే అది పది శాతం తక్కువ. అక్షరాస్యతలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న కేరళలోనూ అదే పరిస్థితి! అక్కడి మున్నార్‌ ప్రాంతంలో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు సరిగ్గా అందక విద్యార్థులు ఆరు కిలోమీటర్ల దూరం నడిచివెళ్ళి ఓ ఎత్తయిన కొండపై కూర్చొని పాఠాలు వినాల్సి వచ్చింది. ఝార్ఖండ్‌లో కనీసం 40శాతానికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికి విద్యార్థులవద్ద స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ వంటి పరికరాలు, మొబైల్‌ నెట్‌వర్క్‌ అందుబాటులో లేకపోవడం ఈ దుస్థితికి కారణాలు. ఈ పరిస్థితుల్లో తరగతికో ప్రత్యేక టీవీ ఛానల్‌ పెట్టి డిజిటల్‌ పాఠాలు చెబుతామని ప్రకటించిన కేంద్రం- అదే బడ్జెట్‌లో అన్నింటికీ డిజిటల్‌ జపం చేయడం పరస్పర విరుద్ధ భావనలకు అద్దం పట్టడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. 

లక్ష్యానికి దూరంగా భారత్‌ నెట్‌

బ్రాడ్‌బ్యాండ్‌ అనుసంధానత పది శాతం పెరిగితే స్థూల దేశీయోత్పత్తి 1.38శాతం మెరుగవుతుందని ప్రపంచబ్యాంకు సర్వే చాలాకాలం కిందటే తేల్చింది. ఇప్పటికీ భారత్‌లో బ్రాడ్‌ బ్యాండ్‌ అనుసంధానత రెండు శాతం లోపే ఉండటం, 65శాతం ప్రజలు నివసిస్తున్న గ్రామాలు ఆ తరహా అంతర్జాల సౌకర్యానికి దూరంగా ఉండటం మన డిజిటల్‌ కలలకు పెద్ద అడ్డుగోడలా నిలుస్తున్నాయి. దేశమంతా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు విస్తరించాలని, మారుమూల పల్లెలకూ అంతర్జాలం అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భారత్‌నెట్‌ పథకం దశాబ్ద కాలం గడుస్తున్నా బాలారిష్టాలను దాటలేకపోతోంది. 2019 మార్చి నాటికి దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు అధిక వేగంతో కూడిన అంతర్జాల సదుపాయం కల్పించాలన్న లక్ష్యం- గడువు దాటి మూడేళ్లవుతున్నా నెరవేరకపోవడం ప్రస్తుత దుస్థితికి నిదర్శనం. ఈ ఏడాదే 5జీ మొబైల్‌ సేవలను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి ఘనంగా ప్రకటించారు. 3జీ, 4జీ సేవలు సైతం ఇంకా చాలా ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడం, డిజిటల్‌ పరికరాలు కొనే స్తోమత దేశంలో మూడొంతుల మందికి నేటికీ కొరవడటం వంటివి డిజిటల్‌ భారత్‌ లక్ష్యానికి పెనుసవాళ్లు విసురుతున్నాయి. అంతర్జాల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు, సాంకేతికతతో సేవల రంగాన్ని పరిపుష్టం చేయడానికి అవసరమైన ఇతర మౌలిక వసతుల కల్పనపై తక్షణమే దృష్టి సారించాలి. డిజిటల్‌ భారత స్వప్నం వాస్తవంగా మారడానికి ఇప్పుడవే అత్యావశ్యకం. 

- శ్యాంప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బ్రిటన్‌తో వాణిజ్య బంధానికి రాచబాట

‣ వర్తమానం విడిచి భవితపై సాము

‣ మధ్యాసియాతో బంధం బలోపేతం

‣ పొడిబారుతున్న పుడమి

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 05-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం