• facebook
  • whatsapp
  • telegram

విచ్చలవిడిగా నీటి తోడివేత

భూగర్భ జలాల నిర్వహణపై ‘కాగ్‌’ నివేదిక

మానవాళికి ప్రాణాధారమైన నీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది. అత్యంత వేగంగా పెరుగుతున్న భూగర్భనీటి వినియోగం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. నానాటికీ విస్తరిస్తున్న నగర జనాభా అవసరాలకు భూగర్భజలాలను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో నీటి లభ్యత నానాటికీ తగ్గుతోంది. దేశంలో అడుగంటుతున్న భూగర్భ జలాలపై ‘కాగ్‌ (కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా)’ అధ్యయనం చేసి, గత డిసెంబరులో పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. 2013-18 మధ్యకాలంలో (అయిదేళ్లపాటు) దేశంలోని జలాల నిర్వహణ, నియంత్రణల పనితీరుపై సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. నీటి కొరతను అధిగమించి, ఐరాస నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీ 6) సాధించే దిశగా భారత్‌ను నడిపించడం ఈ నివేదిక ప్రధాన ధ్యేయం.

కాగ్‌ నివేదిక ద్వారా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్న విషయం తేటతెల్లమైంది. ముఖ్యంగా సీటీఓ (కన్సెంట్‌ టు ఆపరేట్‌) పత్రాల్లోని నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నట్లు తేలింది. 18 రాష్ట్రాల్లో తాగునీటిని శుద్ధి చేసే 77శాతం కేంద్రాలు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) లేకుండానే పని చేస్తున్నట్లు వెల్లడయింది. 2019 మార్చి 31 నాటికి నిరభ్యంతర పత్రాల కోసం కొత్త దరఖాస్తులు 10,578, పునరుద్ధరణ కోసం 144 పెండింగ్‌లో ఉన్నాయి. అంతకుముందు ఏడాది జారీ చేసిన నిరభ్యంతర పత్రాలతో పోలిస్తే పెండింగ్‌లో ఉన్నవి మూడు రెట్లు అధికం. లైసెన్సులను ‘బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) జారీ చేస్తుండగా, నిరభ్యంతర పత్రా(ఎన్‌ఓసీ)లను కేంద్ర భూగర్భ జలాల ప్రాధికార సంస్థ (సీజీడబ్ల్యూఏ) ఇస్తుంది. దేశంలోని 15 రాష్ట్రాల్లో బీఐఎస్‌ లైసెన్సులు జారీ చేయగా... 78శాతం యూనిట్లు నిరభ్యంతర పత్రాలు లేకుండానే భూగర్భజలాలను తోడేస్తున్నాయని కాగ్‌ బయటపెట్టింది. పరిస్థితులను గమనిస్తే, ఆయా సంస్థల మధ్య సమన్వయం లేదని స్పష్టమవుతోంది.

దేశంలో భూగర్భ జలాల నిర్వహణలో ప్రస్తుతం నెలకొన్న లోపాలతో ‘ఎస్‌డీజీ 6’ లక్ష్యాన్ని సాధించడం కష్టమని కాగ్‌ నివేదిక హెచ్చరిస్తోంది. కేంద్ర భూగర్భ జలాల బోర్డు (సీజీడబ్ల్యూబీ), సీజీడబ్ల్యూఏ మార్గదర్శకాలు ఉన్నా, విధానాల అమలులో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎస్‌డీజీ 6.4 లక్ష్యంలోని నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నీతిఆయోగ్‌ ఓ సూచీని ప్రవేశపెట్టింది. ఈ సూచీ వార్షిక నీటి లభ్యతతో భూగర్భ జలాల లభ్యత శాతాన్ని పోలుస్తుంది. భారత్‌ ఈ సూచీ లక్ష్యాన్ని 70గా నిర్దేశించింది. 2004-2017 మధ్యకాలంలో ఈ సూచీలో భారీ మార్పులు జరిగాయని నివేదిక సూచిస్తోంది. జలాల సేకరణ పరిమితికి తగ్గట్లుగా ఉన్న తాగునీటి శుద్ధి కేంద్రాల సంఖ్య పడిపోయింది. జలాలను పరిమితికి మించి తోడేస్తున్న కేంద్రాల సంఖ్య భారీగా పెరిగింది. మొత్తంమీద 2004లో 58శాతంగా ఉన్న సూచీ, 2017 నాటికి ఆందోళనకర రీతిలో 63శాతానికి చేరింది. కాగ్‌ నివేదిక ప్రకారం- ఎనిమిది రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సూచీ 70కిపైనే ఉంది.

రాష్ట్రాలు నమూనా భూగర్భ జలాల బిల్లును అనుసరించాలని సీజీడబ్ల్యూఏ నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాలు ఇప్పటికే ఈ దిశగా పయనిస్తున్నాయని చెబుతున్నారు. విధానాల రూపకల్పనకు సీజీడబ్ల్యూఏ కృషి చేస్తుందని, నిరభ్యంతర పత్రాల అంశం మాత్రం సంబంధిత రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని తేల్చిచెబుతున్నారు. ఇందుకోసం రాష్ట్రాల్లోని ఆయా విభాగాలను పటిష్ఠంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించి ప్రపంచ స్థితిగతులను మెరుగుపరచాలన్న నీతి ఆయోగ్‌ సంకల్పానికి అనుగుణంగా సీజీడబ్ల్యూఏ కార్యకలాపాలు లేవని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే స్పష్టమవుతోంది. భూగర్భ జలాల సేకరణలో ఎనిమిది రాష్ట్రాలు జాతీయ స్థాయి లక్ష్యాలను ఉల్లంఘించాయి. అనేక రాష్ట్రాలు ఎన్‌ఓసీ నిబంధనలను లెక్కచేయడం లేదు. సీజీడబ్ల్యూఏ నిబంధనల అమలులో లోపాలను కాగ్‌ నివేదిక వేలెత్తి చూపించింది. ప్రస్తుత వ్యవస్థను తక్షణమే బలోపేతం చేసి, నిబంధనలను కఠినతరం  చేయడంతో పాటు అవసరమైన చర్యలు చేపడితేనే- 2030 నాటికి ఎస్‌జీడీ లక్ష్యాన్ని దేశం చేరుకోగలుగుతుంది. నిబంధనలను సమర్థంగా అమలు చేసేందుకు, దేశంలో భూగర్భజలాల నిర్వహణ కోసం బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం తక్షణావసరం. ఎస్‌డీజీ 6 లక్ష్యాన్ని ఛేదించే దిశగా సీజీడబ్ల్యూబీ పురోగతి సాధిస్తోందా లేదా అన్న విషయాన్ని కాగ్‌ ఎప్పటికప్పుడు సమీక్షించాలి. సీజీడబ్ల్యూబీ సైతం భూగర్భ జలాల నిర్వహణ, నియంత్రణల విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు కృషి చేయాలి.

- సతీష్‌ సూరి
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మధ్యాసియాతో బంధం బలోపేతం

‣ పొడిబారుతున్న పుడమి

‣ విస్తరిస్తున్న చైనా వల

‣ ఆర్థిక సంస్కరణలతో లాభపడిందెవరు?

‣ జీవవైవిధ్యానికి పెనుముప్పు

‣ గిట్టుబాటుకాని మద్దతుధర

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 04-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం