• facebook
  • whatsapp
  • telegram

విస్తరిస్తున్న చైనా వల

రుణాలిచ్చి పెత్తనం చలాయిస్తున్న వైనం

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హిందూ మహాసముద్రంలో చైనా కదలికలు పెరుగుతూ ఉండటం భారత్‌కు ఆందోళన కలిగిస్తున్న పరిణామం. ఈ సముద్రంతో ఎలాంటి సంబంధం లేని చైనా తన ప్రాబల్యం పెంచుకునేందుకు దీర్ఘకాలంగా వ్యూహాలను అమలుచేస్తోంది. ముఖ్యంగా శ్రీలంక, మాల్దీవులపై కన్నేసిన చైనా మొదట రుణాలను ఉదారంగా అందించి- అనంతరం ఆ దేశాలను తన రుణఉచ్చులో బిగిస్తోంది. వీటికితోడు శ్రీలంకలో చైనా అనుకూలురుగా పేరుపడ్డ రాజపక్స సోదరుల పాలన తిరిగి ప్రారంభం కావడం చైనాకు కలిసివచ్చింది. ఇటీవలే శ్రీలంక, మాల్దీవుల్లో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌యి పర్యటించారు. బీజింగ్‌-కొలంబో ద్వైపాక్షిక సంబంధాల్లో తృతీయపక్షం జోక్యం ఉండకూడదని ప్రకటించారు. ఈ ప్రకటన  భారత్‌ను లక్ష్యంగా చేసుకొన్నదే అన్నది బహిరంగ రహస్యం. మధ్యాసియా, తూర్పు ఆసియాల మధ్య వాణిజ్యానికి కొలంబో నౌకాశ్రయం కీలకమైన కూడలి. దీంతో ఈ నౌకాశ్రయంపై దృష్టి సారించి, కొలంబో పోర్ట్‌సిటీ నిర్మాణానికి డ్రాగన్‌ భారీగా పెట్టుబడులు పెట్టింది. శ్రీలంక ఉత్తరతీరంలో భారత్‌కు సమీపంలోని మూడు దీవుల్లో విద్యుదుత్పత్తి కేంద్రాలను ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే భారత్‌ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చైనా కంపెనీలు చేపట్టిన పనులను శ్రీలంక తాత్కాలికంగా నిలిపివేయించింది. చైనాకు శ్రీలంక ఇప్పటికే దాదాపు 500 కోట్ల డాలర్లకు పైగా బాకీ ఉంది. శ్రీలంక విదేశీరుణాల్లో ఇది పది శాతం.

చైనా నుంచి దిగుమతి చేసుకున్న సేంద్రియ ఎరువుల్లో రసాయన అవశేషాలు ఉండటంతో శ్రీలంక ప్రభుత్వ సారథ్యంలోని ‘సిలోన్‌ ఫెర్టిలైజర్‌ కంపెనీ’ చెల్లింపులను నిలిపివేసింది. దీంతో రంగంలోకి దిగిన చైనా రాయబార కార్యాలయం ఎరువుల వ్యవహారంపై అంతర్జాతీయ బృందాలతో తనిఖీలు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. చివరకు శ్రీలంక సర్కారు దిగివచ్చి రుసుము చెల్లించడంతో పాటు, అదనపు సేంద్రియ ఎరువులను ఆ కంపెనీ నుంచి కొనుగోలుచేసేందుకు అంగీకరించింది. శ్రీలంక విదేశ మారక నిల్వలు సైతం కనిష్ఠస్థాయికి చేరాయి. అవి నవంబరు 2021 చివరినాటికి కేవలం 160 కోట్ల డాలర్లు మాత్రమే. పైకి ఉదారంగా రుణాలిస్తున్నట్లు చైనా నటిస్తోందని శ్రీలంకలో పలు ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో హంబన్‌టోటా నౌకాశ్రయం నిర్మాణానికి సంబంధించిన రుణాలను కొలంబో చెల్లించకపోవడంతో ఏకంగా ఆ పోర్టును 99 ఏళ్లకు చైనా సంస్థలు లీజు పేరిట స్వాధీనం చేసుకున్న ఘటనను శ్రీలంక ప్రజాస్వామికవాదులు విస్మరించడంలేదు.

ఇక మాల్దీవులను పరిశీలిస్తే- ఇటీవల చైనా జోక్యం ఎక్కువవుతోంది. భారత విదేశాంగవిధానంలో పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలకు పెద్దపీట వేయడం ఒక భాగం. మాల్దీవులు సైతం ‘భారత్‌కు తొలిప్రాధాన్యం’ విధానాన్ని అనుసరిస్తోంది. గతంలో మాల్దీవులకు అధ్యక్షుడిగా వ్యవహరించిన అబ్దుల్లా యామిన్‌ హయాములో పూర్తిగా భారత వ్యతిరేకతను ప్రదర్శించారు. చైనాతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. అనంతరం భారత అనుకూల ఇబ్రహీం సోలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారత్‌ మాల్దీవుల మధ్య సంబంధాలు గాడినపడుతున్నాయని ఆశిస్తున్న తరుణంలో తాజాగా చైనా మంత్రి వాంగ్‌యి ఇటీవలే మాల్దీవుల్లో పర్యటించారు. మాల్దీవుల నుంచి చైనాకు వెళ్లే పర్యాటకులకు ‘వీసా ఫ్రీ’ సౌకర్యాన్ని కల్పించే ఒప్పందాన్ని చైనా ప్రకటించింది. దీంతోపాటు మాల్దీవుల్లో కీలక మౌలిక ప్రాజెక్టులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరాయి. మాల్దీవులు సైతం చైనా రుణ ఉచ్చులో చిక్కుకుంటోందని అక్కడి సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హిందూ మహాసముద్రంలో ప్రాబల్యానికి చైనా, దాన్ని అడ్డుకునేందుకు భారత్‌ యత్నిస్తుండటం శ్రీలంక, మాల్దీవులకు అయాచితవరంగా మారింది. వాంగ్‌యి కొలంబో పర్యటన సందర్భంగా తాము చెల్లించాల్సిన రుణాలను పునర్‌వ్యవస్థీకరించాలని ప్రధాని మహింద రాజపక్స చైనాను కోరారు. భారత్‌కు దగ్గరయ్యేందుకు వీలుగా ట్రింకోమలి చమురు టెర్మినల్‌ ఆధునికీకరణను భారత్‌కు చెందిన ‘ఇండియన్‌ ఆయిల్‌’కు అప్పగించారు. మాల్దీవులకు సైతం దిల్లీ భారీగా సాయాన్ని అందిస్తోంది. ఆసియా దిగ్గజాలైన చైనా, భారత్‌లు హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం పోటీ పడటం శ్రీలంక, మాల్దీవులకు ఆనందం కలిగిస్తోంది. ఇవి భారత్‌, చైనాల నుంచి భారీగా ఆర్థిక సాయాన్ని పొందుతున్నాయి. కొలంబో పర్యటన సందర్భంగా హిందూ మహాసముద్రంలోని ద్వీపదేశాలతో కలిపి ఒక వేదికను రూపొందించాల్సిన అవసరముందని వాంగ్‌యి ప్రకటించారు. తద్వారా ఈ ప్రాంతంలో తమ పట్టు పెంచుకునేందుకు చైనా తీవ్రంగా యత్నిస్తోంది. అయితే ఈ పరిణామాలను జాగ్రతగా గమనిస్తున్న భారత్‌ డ్రాగన్‌ దూకుడుకు పగ్గాలు బిగించే చర్యలను త్వరగా ప్రారంభించాలి.

- కె.శ్రీధర్‌
 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కృత్రిమ మేధతో ఆరోగ్య విప్లవం

‣ స్వశక్తితో అలుపెరుగని ప్రస్థానం

‣ కజకిస్థాన్‌లో ప్రజాందోళనలు

‣ ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా బలగాలు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 02-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం