• facebook
  • whatsapp
  • telegram

నిర్లక్ష్యంతో నీరుగారుతున్న ఆశయం

గ్రామ న్యాయాలయాలపై అలక్ష్యం

దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలు సుదృఢ శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలుగా, న్యాయపాలికలుగా పరిఢవిల్లాలన్నది జాతిపిత మహాత్మాగాంధీ ప్రగాఢ ఆకాంక్ష. పల్లెలో ఇంటి ముంగిళ్లలోనే గ్రామీణులకు సత్వర న్యాయం అందిస్తూ ఆ మహాత్ముడి కలలను సాకారం చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనతతో ఆ ఆశయం నీరుగారిపోతోంది. గ్రామాల్లోని పేదలకు సత్వర న్యాయం ఎండమావిగానే మిగులుతోంది. చిన్నచిన్న వివాదాలకూ పల్లెవాసులు కోర్టుల మెట్లు ఎక్కుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు.

గ్రామాల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వారితోపాటు ప్రతి ఒక్కరికీ న్యాయ సలహాలు, సత్వర న్యాయం దక్కాలన్న ఉద్దేశంతో కేంద్ర చట్టం ద్వారా 2009 అక్టోబరులో గ్రామ న్యాయాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. వాటిని ఏర్పాటు చేసుకునే అధికారాన్ని అన్ని రాష్ట్రాలకూ కల్పించిన కేంద్రం- ఒక్కో గ్రామ న్యాయాలయానికి రూ.18 లక్షలు మంజూరు చేస్తుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని హైకోర్టు సూచనల మేరకు పల్లె న్యాయపాలికలను కొలువు తీర్చాలి. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వాటి ఏర్పాటు, నిర్వహణ నిరాశాజనకంగా తయారయ్యాయి. 15 రాష్ట్రాల్లో తొలి విడతగా రూ.81.53 కోట్లతో 476 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం 256 మాత్రమే కొనసాగుతున్నాయి. తెలంగాణకు 55, ఆంధ్రప్రదేశ్‌కు 42, జమ్మూ-కశ్మీర్‌కు 20, లద్దాఖ్‌, గోవాకు రెండు చొప్పున గ్రామ న్యాయస్థానాలను కేటాయించినా, ఒక్కటీ ప్రారంభం కాలేదు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో 113కు 43, మహారాష్ట్రలో 36కు 23, ఒడిశాలో 23కు 19, పంజాబ్‌లో తొమ్మిదికి రెండు, ఝార్ఖండ్‌లో ఆరుకు ఒక గ్రామ న్యాయాలయాలనే నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌(89), రాజస్థాన్‌(45), కేరళ(30)లలో పూర్తిస్థాయిలో వాటిని ఏర్పాటు చేశారు. గ్రామ న్యాయాలయాల కోసం కేంద్రం తెలంగాణకు రూ.6.93 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4.36 కోట్లతో పాటు ఇతర రాష్ట్రాలకూ నిధులు కేటాయించింది. చాలా రాష్ట్రాలు వాటి ఏర్పాటు గురించి పట్టించుకోవడం లేదని గత డిసెంబరులో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. కేంద్రం నిధులు ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదంటే గ్రామాల్లోని పేద, సామాన్య పౌరులకు న్యాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది.

దేశంలో నేరాలు పోనుపోను పెచ్చరిల్లుతున్నాయి. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం, 2019తో పోలిస్తే 2020లో నేరాలు 28శాతం పెరిగాయి. ఏటా అధికమవుతున్న నేరాల విచారణ న్యాయస్థానాలకు తలకు మించిన భారంగా మారుతోంది. కేసులు గుట్టలుగా పేరుకుపోతుండటంతో పౌరులకు సత్వర న్యాయం అందడంలేదని గతంలో ఎంతోమంది న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టులో 2021, డిసెంబరు 6 నాటికి 69,855 కేసులు, అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో గతేడాది డిసెంబరు 10 నాటికి 56,41,212 కేసులు పెండింగులో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ ఇటీవల పార్లమెంటుకు నివేదించింది. ఇక దేశంలోని దిగువ కోర్టుల్లో నాలుగు కోట్లదాకా కేసులు అపరిష్కృతంగా పడి ఉన్నాయి. అన్ని న్యాయస్థానాల్లో కలిపి 2010-20 మధ్య పెండింగ్‌ కేసులు ఏటా 2.8శాతం చొప్పున పెరిగాయి. కరోనా కారణంగా 2019-20 మధ్య కాలంలోనే హైకోర్టుల్లో 20శాతం, కింది కోర్టుల్లో 13శాతం పెండింగ్‌ కేసులు అధికమయ్యాయి. అలా పోగుపడే కేసులతో పేద, సామాన్య ప్రజలకు సత్వర న్యాయం ఎలా అందుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి.

గ్రామాల్లో ఎక్కువగా భూ వివాదాలు, దాయాదుల మధ్య తగాదాలు, తల్లిదండ్రులు, భార్యాభర్తల మధ్య గొడవలకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటుంటాయి. రాజీ కుదుర్చుకొనే చిన్నచిన్న వివాదాల్లోనూ కొందరు పంతాలు పట్టింపులకు పోయి, అవగాహన కొరవడి కేసులు నమోదు చేస్తున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యాన్ని, విలువైన సమయాన్ని నష్టపోతున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల్లో న్యాయాలయాల ఏర్పాటుకు చొరవ చూపాలి. వాటి ద్వారా చిన్నచిన్న వివాదాల్లో రాజీకి ప్రయత్నించాలి. ఇళ్ల దగ్గరే అవసరమైన న్యాయ సలహాలు అందిస్తూ పల్లెల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలి.

- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విస్తరిస్తున్న చైనా వల

‣ ఆర్థిక సంస్కరణలతో లాభపడిందెవరు?

‣ జీవవైవిధ్యానికి పెనుముప్పు

‣ గిట్టుబాటుకాని మద్దతుధర

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 07-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం