• facebook
  • whatsapp
  • telegram

దేశీయ ఆయుధ తయారీకి దన్ను

స్వావలంబన వైపు అడుగులు

వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకొంటూ తాజా బడ్జెట్‌లో రక్షణ రంగానికి చేసిన కేటాయింపులు దేశీయ ఆయుధ తయారీ పరిశ్రమలకు జవసత్వాలు సమకూర్చేలా ఉన్నాయి. చైనా, పాక్‌ల వైపు సరిహద్దుల వద్ద పెరుగుతున్న ముప్పులను దృష్టిలో పెట్టుకొని రక్షణ శాఖకు గతేడాదితో పోలిస్తే ఈసారి 9.8శాతం నిధులు పెంచారు. మొత్తం రూ.5,25,166 కోట్లు కేటాయించారు. వాస్తవానికి రక్షణ రంగానికి జీడీపీలో మూడు శాతం నిధులు ప్రత్యేకించాలన్న లోక్‌సభ స్థాయీ సంఘం సిఫార్సులను ఈసారీ అమలు చేయలేదు. తాజా బడ్జెట్‌లో ఆయుధ కొనుగోళ్లకు చెప్పుకోదగ్గ స్థాయిలో కేటాయింపులు పెంచారు. ముఖ్యంగా 68శాతం నిధులను దేశీయ తయారీ ఆయుధాలపై వెచ్చించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. డ్రాగన్‌ తీరుకు అనుగుణంగా నావికాదళానికి నిధులను పెంచారు. చైనా నావికాదళం సంఖ్యాపరంగా అమెరికాను దాటేసి ప్రపంచంలోనే చాలా పెద్దదిగా అవతరించింది. గత పదేళ్లలో 130కు పైగా యుద్ధ నౌకలను చైనా నిర్మించింది. ఇప్పటికే హిందూ మహాసముద్రంలో డ్రాగన్‌ కదలికలు అధికమవడంతో భారత్‌ తన నావికాశక్తిని పెంపొందించుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. 2012-13లో ఆయుధ కొనుకోళ్ల కేటాయింపులో నావికాదళానికి 18శాతం దక్కాయి. 2019-20నాటికి అవి 13శాతానికి పడిపోయాయి. దానివల్ల అరకొర నిధులతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోతున్నాయి. ఈసారి బడ్జెట్‌లో దేశీయ కొనుగోళ్ల లక్ష్యాలను, వాటిని అందుకోవడానికి అవసరమైన మార్గాలను పరిశీలిస్తే- నౌకాదళానికి నిధుల పెంపు సహేతుకమైన మార్గంగా ప్రభుత్వానికి స్ఫురించినట్లుంది.

నౌకాదళంలోనే అధికం

దేశీయంగా ఆయుధ తయారీ రంగంలో కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ రంగ సంస్థల ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగింది. కొన్నేళ్లుగా భారత్‌లోని ప్రైవేటు రంగం సైతం ఆయుధ తయారీలో పుంజుకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దాదాపు రెండు వందలకుపైగా ఆయుధ వ్యవస్థల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ రెండు జాబితాలను తీసుకొచ్చింది. ఫలితంగా వచ్చే ఆరు నుంచి ఏడేళ్లలోపు దేశీయ పరిశ్రమలకు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు రంగానికి జవసత్వాలు నింపే గురుతర బాధ్యతను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు అప్పగించారు. ఆ సంస్థ ప్రైవేటు రంగంతో కలిసి భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకొనేలా చర్యలు చేపట్టారు. సరికొత్త ఆయుధ వ్యవస్థల పరిశోధన, అభివృద్ధికి సంబంధించిన నిధుల్లో 25శాతాన్ని అంకురాలు, ప్రైవేటు కార్ఖానాలు, విద్యా సంస్థలకు కేటాయించడం స్వాగతించదగ్గ పరిణామం.

తాజాగా దేశీయ కొనుగోళ్లకు లక్షించిన 68శాతం నిధులు సద్వినియోగం కావాలంటే నౌకా దళానికి కేటాయింపులు పెంచాల్సిందే. సైన్యం, వాయుసేనతో పోలిస్తే నౌకాదళంలోనే అత్యధిక మొత్తంలో దేశీయంగా తయారైన ఆయుధాలు వినియోగిస్తున్నారు. నేవీ పరిధిలో 1960ల్లో ప్రారంభించిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ నేవల్‌ డిజైన్‌ ముఖ్య భూమిక పోషిస్తోంది. 19 రకాల నౌకలు, జలాంతర్గాముల బ్లూప్రింట్లను అది సిద్ధం చేసింది. వాటి ఆధారంగా దాదాపు 90 నౌకలను నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నౌకలు, జలాంతర్గాముల్లో సింహభాగం దేశీయంగా తయారవుతున్నవే.

భారత్‌ అణు సిద్ధాంతం ప్రకారం కచ్చితమైన ప్రతిదాడికి మాత్రమే అణ్వాయుధాలు వాడుతుంది. అంటే, అణుదాడి జరిగాక ప్రతిదాడి చేసే స్థితిలో ఉండాలి. దానికి అణ్వాయుధ ప్రయోగ జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్‌) సరైనది. సర్వీసులు, గస్తీలు, మరమ్మతులు, సంసిద్ధతలను దృష్టిలో పెట్టుకొని 365 రోజులు అణు ప్రతిదాడికి సిద్ధంగా ఎస్‌ఎస్‌బీఎన్‌లు అందుబాటులో ఉండాలంటే- వాటి సంఖ్య కనీసం నాలుగు నుంచి అయిదుదాకా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. భారత్‌ వద్ద ప్రస్తుతం దేశీయంగా తయారు చేసిన ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ మాత్రమే ఉంది. ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ను నౌకాదళానికి అధికారికంగా అప్పజెప్పలేదు. మరో ఎస్‌ఎస్‌బీఎన్‌ ప్రయోగ పరీక్షలకు సిద్ధమైనట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇంకో రెండు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో నౌకాదళానికి నిధుల పెంపుతో ప్రయోజనకరంగా ఉంటుంది.

సీడీఎస్‌ నియామకం అవసరం

డిసెంబర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత తొలి త్రివిధదళాధిపతి (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ కన్నుమూశాక ఆ స్థానంలో మరొకరి నియామకం జరగలేదు. ఆ ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించినా, ఇప్పటిదాకా ఒక కొలిక్కి రాలేదు. ఈ పరిణామాలు మన శత్రు దేశాలకు తప్పుడు సంకేతాలను పంపిస్తాయి. దళాల వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొనేలా థియేటర్‌ కమాండ్ల ఏర్పాటు ప్రక్రియ సగంలో ఉంది. ఈ తరుణంలో సైనిక వ్యవహారాల విభాగానికి అధిపతిగా వ్యవహరించే సీడీఎస్‌- ఆయుధ కొనుగోళ్ల ప్రాధాన్యాన్ని ప్రభుత్వానికి తెలియజెప్పాలి. ఆ పదవి ఖాళీగా ఉండటంతో భవిష్యత్తులో ఏర్పడబోయే థియేటర్‌ కమాండ్లకు ఇబ్బంది లేకుండా ఆయుధ కొనుగోళ్లు చేపట్టడం కత్తిమీద సాముగా మారుతుంది. ఈసారి రక్షణ బడ్జెట్‌లో పింఛన్లకు రూ.1.19 లక్షల కోట్లు కేటాయించారు. పదవీ విరమణ పేరిట అనుభవజ్ఞుల సేవలను రక్షణ రంగం కోల్పోతోందని, అందువల్ల ఆయా దళాల్లో కీలక అధికారుల రిటైర్మెంట్‌ వయసును పెంచాలని గతంలో సీడీఎస్‌ రావత్‌ ప్రతిపాదించారు. అవి అమలుకు నోచుకొనే అవకాశం ఉందేమో చూడాలి. ప్రస్తుతం సైనిక, నౌకా, వాయుసేనల్లో ఆయా అధికారుల పదవీ విరమణ వయసు భిన్నంగా ఉంది. అందరి రిటైర్మెంట్‌ వయసులను ఏక రీతికి పెంచాలని భావిస్తున్నారు. రావత్‌ ప్రతిపాదనలు అమలైతే రక్షణ బడ్జెట్‌ నుంచి పింఛన్ల కేటాయింపుల్లో కొంత తగ్గుదల కనిపిస్తుంది.

తీరనున్న కొరత

తాజా కేంద్ర బడ్జెట్‌లో వాయుసేనకు అత్యధిక కేటాయింపులు దక్కాయి. సైన్యానికి మాత్రం కోత పడింది. సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ)కు 40శాతం కేటాయింపులను పెంచారు. వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కీలక సొరంగాలు, రహదారులు, వంతెనల నిర్మాణంలో ఆటంకాలు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ రంగ పరికరాల కొరత బీఆర్‌ఓను వేధిస్తోంది. 2016-17లో నిర్దేశించిన సంఖ్య కంటే కనీసం 40శాతం పరికరాలు తక్కువగా ఉన్నట్లు రక్షణ రంగంపై ఏర్పాటు చేసిన స్థాయీ సంఘం నివేదిక వెల్లడిస్తోంది. ఆ కొరతను తాజా బడ్జెట్‌ కేటాయింపులతో కొంత తీర్చుకోవచ్చు. అస్సాం-అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేలా బ్రహ్మపుత్ర నది కింద 15.6 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన జంట సొరంగాల ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యే అవకాశం ఉంది.

- పెద్దింటి ఫణికిరణ్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డిజిటల్‌ రూపాయి వైపు అడుగులు

‣ తెలుగు రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమ

‣ నిర్లక్ష్యంతో నీరుగారుతున్న ఆశయం

‣ మెట్ట సేద్యంలో అంతర్జాతీయ కీర్తి

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 08-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం