• facebook
  • whatsapp
  • telegram

ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి

ఆంక్షలతో రష్యాకు కళ్లెంవేసే యత్నం

ఉక్రెయిన్‌లో వేర్పాటువాదుల అధీనంలోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాల స్వాతంత్య్రాన్ని రష్యా గుర్తించింది. అక్కడికి తన సేనలను క్రెమ్లిన్‌ పంపడంపై అమెరికా, బ్రిటన్‌, ఐరోపా సమాఖ్య (ఈయూ) భగ్గుమన్నాయి. రాజకీయ పలుకుబడి కలిగిన రష్యన్‌ వ్యాపారవేత్తలపై, బ్యాంకులపై ఆర్థిక ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించాయి. తద్వారా రష్యా ప్రభుత్వం పాశ్చాత్య దేశాల్లో పెట్టుబడులు, రుణాలు సమీకరించే వీలు లేకుండా చేశాయి. రష్యా గురువారం ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించింది. ఫలితంగా మరిన్ని కఠిన ఆంక్షలకు అగ్రరాజ్యం, ఐరోపా  సిద్ధమవుతున్నాయి. రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆ ఆంక్షలకు వెనకడుగు వేయబోరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రష్యా, చైనా చెట్టపట్టాల్‌...

క్రిమియాను 2014లో రష్యా ఆక్రమించినప్పుడూ పాశ్చాత్య దేశాల కూటమి ఆంక్షలు మోపింది. అయినా పుతిన్‌ పంథా మారలేదు. అప్పట్లో రష్యన్‌ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటంతో ఆంక్షలవల్ల అక్కడి కరెన్సీ రూబుల్‌ భారీగా పతనమైంది. రూబుల్‌ను నిలబెట్టడానికి రష్యా కేంద్ర బ్యాంకు అపారంగా విదేశ మారక ద్రవ్యాన్ని గుమ్మరించాల్సి వచ్చింది. ఆ తరవాత రష్యా ఆర్థిక స్థితి చాలా మెరుగుపడింది. ప్రస్తుతం ఆ దేశం వద్ద 63,500 కోట్ల డాలర్ల విదేశ మారక ద్రవ్యం, బంగారం నిల్వలు ఉన్నాయి. అందువల్ల తాజా ఆంక్షలు తమను తాత్కాలికంగా చీకాకు పెట్టినా ఆర్థికంగా పెద్ద నష్టమేమీ కలగజేయలేవని క్రెమ్లిన్‌ భావిస్తోంది. అమెరికా కూటమి చాలా కాలంనుంచి ఆంక్షల గురించి ఊదరగొడుతోందని, దాన్ని వినీవినీ విసుగొచ్చిందని భారత్‌లో రష్యా దౌత్య ప్రతినిధి రోమన్‌ బబుష్కిన్‌ వ్యాఖ్యానించారు. ఆంక్షలవల్ల అంతర్జాతీయంగా చమురు, సహజ వాయు ధరలు పెరగడం వల్ల ప్రపంచ జీడీపీ కోసుకుపోతుంది. ఐరోపా గ్యాస్‌ అవసరాల్లో మూడో వంతును రష్యాయే తీరుస్తోంది. అందువల్ల ఆంక్షలు ఐరోపా దేశాలనే అధికంగా బాధిస్తాయి. పైగా గత ఆంక్షల అనుభవాలతో రష్యా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలకు అమెరికన్‌ డాలర్‌పై ఆధారపడాల్సిన అగత్యాన్ని తగ్గించుకొంటూ వస్తోంది. 2018లో ట్రంప్‌ ప్రభుత్వం ప్రారంభించిన వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కోవడానికి చైనాసైతం డాలర్‌ లావాదేవీలను క్రమంగా కుదిస్తోంది. 2014 నుంచి రష్యా, చైనాలు ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలను చాలావరకు రూబుల్‌, యువాన్‌లలో జరుపుతున్నాయి. దాన్ని తమ అంతర్జాతీయ లావాదేవీలకూ విస్తరించాలని 2019లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఏతావతా అమెరికా, ఐరోపాల ఆంక్షలు రష్యాను చైనా ఒడిలోకి నెట్టాయి. రష్యా 2013-2020 మధ్య తన విదేశ మారకద్రవ్య నిల్వల్లో డాలర్ల శాతాన్ని తగ్గించుకొని యువాన్‌, యూరోల వాటాను పెంచుకొంటూ వచ్చింది. డాలర్లకు బదులు యూరో నిల్వలను పెంచుకోవడం రష్యాకు మంచిది కాదని ఈయూ తాజా ఆంక్షలు చాటుతున్నాయి. డాలర్‌, యూరో చెల్లింపులను పూర్తిగా కట్టిపెట్టడం రష్యాకు సాధ్యపడకపోవచ్చు. 2021 డిసెంబరు నాటికి అంతర్జాతీయ చెల్లింపుల్లో 40.5శాతం డాలర్లలో, 36.7శాతం యూరోలలో, 5.89శాతం బ్రిటిష్‌ పౌండ్లలో జరిగాయి. 2.7శాతం చెల్లింపులు మాత్రమే చైనీస్‌ యువాన్లలో చోటుచేసుకొన్నాయి. రూబుల్‌ చెల్లింపులు కేవలం 0.21శాతమే. డాలర్‌ ఆధిక్యాన్ని తగ్గించడానికి చైనా డిజిటల్‌ యువాన్‌కు మళ్ళుతోంది. రష్యా సైతం అదే పనిలో ఉంది.

ప్రత్యామ్నాయ మార్గాలు

ఉక్రెయిన్‌పై రష్యా నేరుగా దాడికి దిగితే ఆ దేశ బ్యాంకులను స్విఫ్ట్‌ వ్యవస్థ నుంచి వెలివేయాలని అమెరికా, ఐరోపాలు సంకల్పించాయి. దాదాపు 11,000 అంతర్జాతీయ బ్యాంకుల మధ్య డాలర్లలో డబ్బు బదిలీ కావడానికి స్విఫ్ట్‌ మధ్యవర్తిగా, ధ్రువీకరణ వేదికగా నిలుస్తోంది. రష్యాను స్విఫ్ట్‌నుంచి వెలివేస్తే ఆ దేశ చమురు, సహజవాయు ఎగుమతులకు డాలర్‌ చెల్లింపులు అసాధ్యమై మాస్కో ఆర్థికంగా కుదేలవుతుంది. అయితే, స్విఫ్ట్‌నుంచి రష్యా బహిష్కరణ వెంటనే సాధ్యం కాకపోవచ్చు. దానివల్ల తమపైనా ప్రతికూల ప్రభావం ఉంటుందని కొన్ని ఈయూ దేశాలు భావిస్తున్నాయి. స్విఫ్ట్‌ ప్రధాన కార్యాలయం ఐరోపాలోని బ్రసెల్స్‌లో ఉన్నందువల్ల రష్యాను బహిష్కరించడంపై అమెరికా ఒత్తిడి పనిచేయడం లేదు. గడచిన ఏడేళ్లలో రష్యా, చైనాలు స్విఫ్ట్‌కు ప్రత్యామ్నాయ వేదికల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నా పురోగతి సాధించలేకపోయాయి. అమెరికా, ఐరోపాల ఆంక్షలతో చైనా, రష్యా, ఇరాన్‌లకు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవలసిన అగత్యం ఏర్పడింది. సాధికార డిజిటల్‌ కరెన్సీలు పూర్తిస్థాయిలో చలామణీ కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆలోగా రష్యా తన అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలకు క్రిప్టో కరెన్సీలను ఉపయోగించుకోవచ్చు. చమురు, ఆయుధాల ఎగుమతికి క్రిప్టోలలో చెల్లింపులను స్వీకరించే అవకాశం ఉంది. వాటిని ఎవరు జరిపారో తెలుసుకునే వీలు లేకుండా కొత్త సాధనాలను రష్యా రూపొందించింది. వాటిలో డార్క్‌ వెబ్‌ విపణి హైడ్రా ముఖ్యమైనది. మొత్తంగా భూతలంతోపాటు సైబర్‌ సీమలోనూ పోరుకు రష్యా సమాయత్తమైనట్లు బోధపడుతోంది.

- ప్రసాద్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వందేభారత్‌ కొత్త పరుగు

‣ జల సరిహద్దుల్లో జగడం

‣ తీరాలను మింగేస్తున్న కడలి

‣ చైనా దూకుడుకు ముకుతాడే లక్ష్యం

‣ బహుళ భాషా అభ్యసనానికి సాంకేతిక దన్ను

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 25-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం