• facebook
  • whatsapp
  • telegram

జల సరిహద్దుల్లో జగడం

లంక నౌకాదళం దూకుడు

ఇండియా, శ్రీలంక మధ్య కచ్చితమైన జల సరిహద్దులేమీ లేవు. ఫలితంగా రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ తమిళనాడు జాలర్లను లంక నౌకాదళం ఖైదుచేస్తున్న ఘటనలు ఇటీవల పెరిగాయి. మత్స్యకారులపై వారు దాడులకు పాల్పడుతుండటం, పడవలను జప్తు చేసి వేలంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండటం వంటివి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. దరిమిలా భారత్‌, లంక సరిహద్దు ఒప్పందాలను పునస్సమీక్షించుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

కచ్చథీవు వివాదం

భారత్‌, లంక దీర్ఘకాలంగా మిత్రదేశాలు. ప్రాదేశిక జలాల పరిధితో సంబంధం లేకుండా ఇరు దేశాల మత్స్యకారులు బంగాళాఖాతం, పాక్‌ జలసంధి, గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌లలో స్వేచ్ఛగా చేపలు పట్టుకునేవారు. 1970ల్లో భారత్‌-లంక జల సరిహద్దు ఒప్పందాలను కుదుర్చుకున్న తరవాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. తమిళనాడుకు, శ్రీలంకలోని నార్తర్న్‌ ప్రావిన్సుకు మధ్య పాక్‌ జలసంధిలోని కచ్చథీవు ద్వీపంపై సార్వభౌమ హక్కులను భారత సర్కారు లంకకు అప్పగించేసింది. అప్పటి నుంచి కచ్చథీవులో భారత జాలర్లు చేపలు పట్టడంపై అధికారికంగా నిషేధం అమలులోకి వచ్చింది. విశ్రాంతి తీసుకోవడం, వలలను ఆరబెట్టుకోవడం, సెయింట్‌ ఆంథొనీ చర్చి వార్షికోత్సవాల కోసం మాత్రమే భారతీయులను ఆ దీవిలోకి అనుమతించాలని లంక నిర్ణయించింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ దేశం అంత కఠినంగా వ్యవహరించకపోవడంతో భారత మత్స్యకారులు మునుపటిలానే స్వేచ్ఛగా తమ వేట సాగించేవారు. ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్‌ను సింహళ దళాలు హతమార్చిన దరిమిలా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తిరుగుబాటుదారులను అడ్డుకునేందుకు లంక నౌకాదళం తమ దేశ ఉత్తర జలాల్లో నిఘాను పటిష్ఠం చేసింది. భారత జాలర్ల కార్యకలాపాలనూ అడ్డుకోవడం ప్రారంభించింది. 2010 నుంచి ఏటా సగటున 200 మంది భారత జాలర్లను కచ్చథీవు చుట్టుపక్కల లంక నౌకాదళ అధికారులు అరెస్టు చేస్తున్నారు.

లంక జలాల్లో తమిళనాడు జాలర్లు అరెస్టు కావడం, భారత ప్రభుత్వ జోక్యంతో వారు విడుదల కావడం కొన్నేళ్లుగా సాధారణమైంది. కానీ, రెండు మూడేళ్లుగా ఆ దేశ అధికారులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. భారత జలాల్లో ఉండగానే మత్స్యకారులను వారు కాల్పులతో బెదిరిస్తూ వెనక్కి తరుముతున్నారు. తమ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించినవారిపై దాడులకూ పాల్పడుతున్నారు. గత ఏడాది జనవరిలో పాక్‌ జలసంధిలో చేపల వేటకు వెళ్లిన నలుగురు జాలర్లు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.  లంక అధికారులు వారిని చంపేశారని తమిళనాడు మత్స్యకారులు పెద్దయెత్తున నిరసనలకు దిగారు. లంక అధికారులు ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. భారత జాలర్లు తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశిస్తుండటంతో పాటు వారు అక్కడ చేపల వేట కొనసాగిస్తున్న తీరునూ లంక తప్పుపడుతోంది. సముద్ర గర్భంలోనూ చేపలు పట్టగల ట్రాలర్లను, భారీ వలలను వారు వినియోగిస్తున్నారని, ఫలితంగా జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోందని ఆరోపిస్తోంది. తమ దేశ మత్స్యకారుల జీవనోపాధిని పరిరక్షించేందుకే తమిళనాడు జాలర్లను అరెస్టు చేయాల్సి వస్తోందని వాదిస్తోంది.

కేంద్రం చొరవ కీలకం

కచ్చథీవు విస్తీర్ణం 285 ఎకరాలు. చేపల వేటకు అది అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. తమిళనాడులోని రామేశ్వరానికి, కచ్చథీవుకు మధ్య దూరం  కేవలం 12 నాటికల్‌ మైళ్లు. రామేశ్వరం నుంచి ఏడు నాటికల్‌ మైళ్ల వరకు సముద్రంలో పెద్ద పెద్ద బండరాళ్లు ఉంటాయి. అక్కడి వరకు చేపల వేట చాలా కష్టం. దాంతో ఆవల కేవలం అయిదు నాటికల్‌ మైళ్ల పరిధిలోనే భారత జాలర్లు తమ వేటను కొనసాగించాల్సి వస్తోంది. ఫలితంగా ఆ ప్రాంతంలో మత్స్య సంపద వేగంగా తరిగిపోతోంది. ఆపై జీవనోపాధి కోసం మరిన్ని చేపల అన్వేషణలో జాలర్లు లంక ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించాల్సి వస్తోంది. గతంలో రామనాథపురం రాజాకు కచ్చథీవుపై యాజమాన్య హక్కులుండేవి. ఆ తరువాత అది మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైంది. పార్లమెంటులో సరైన చర్చ జరపకుండా, తమిళనాడు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఆ దీవిని అప్పటి భారత సర్కారు లంకకు ధారాదత్తం చేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ లోగడ తమిళనాడు శాసనసభ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. కచ్చథీవుపై తిరిగి సార్వభౌమ హక్కులు పొందేందుకు ప్రయత్నించాలని తమిళ మత్స్యకారులు కేంద్రాన్ని దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఆ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం క్రియాశీలకంగా వ్యవహరించాలి. లంకతో చర్చలు జరిపి తమిళనాడు జాలర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఇరు దేశాల నౌకాదళ సిబ్బందితో సంయుక్త గస్తీ బృందాలను ఏర్పాటుచేయడం వంటి ప్రతిపాదనలను అమలులోకి తీసుకొచ్చే అవకాశాలను పరిశీలించాలి.

- మండ నవీన్‌
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ తీరాలను మింగేస్తున్న కడలి

‣ చైనా దూకుడుకు ముకుతాడే లక్ష్యం

‣ బహుళ భాషా అభ్యసనానికి సాంకేతిక దన్ను

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 23-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం