• facebook
  • whatsapp
  • telegram

మహిళకు అందని ఆస్తిపాస్తులు

న్యాయవ్యవస్థ అండతోనే మార్పు

భారతీయ మహిళ పలు రంగాల్లో పురోగమిస్తున్నా- ఆస్తి హక్కుల సాధనలో పురుషుల కన్నా ఇంకా వెనకబడే ఉంది. ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి న్యాయవ్యవస్థ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోంది. కుటుంబ ఆస్తి పంపకాల్లో మహిళలకు అన్యాయం జరగకుండా చూడటానికి అది తగిన చొరవ తీసుకుంటోంది. ఆ మేరకు వారసత్వ చట్టాల్లో ప్రగతిశీల మార్పులకు న్యాయస్థానాలు బాటలు పరుస్తున్నాయి. కుటుంబ పెద్ద వీలునామా రాయకుండా మరణించినప్పుడు- అతడి స్వార్జితంలో, పూర్వీకుల నుంచి అతడికి సంక్రమించిన ఆస్తిలో కుమార్తెలకూ వాటా ఉంటుందని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పిచ్చింది. ఆస్తి పంపకంలో దాయాదులు, ఇతర సంబంధీకులకన్నా మృతుడి కుమార్తెలకే ప్రాధాన్యం లభిస్తుందని స్పష్టం చేసింది. వీలునామా రాయకుండా మరణించిన హిందూ పురుషుడి భార్య లేదా కుమార్తెకు ఆయన స్వార్జితాన్ని, పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు ఉందని ప్రాచీన హిందూ న్యాయ స్మృతులు తేటతెల్లం చేస్తున్నాయి. ఆధునిక కాలంలో పలు కోర్టు తీర్పులూ దాన్ని స్పష్టీకరించాయి.

కుమార్తెలూ సహ వారసులే...

హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనుల్లో వీలునామా రాయకుండా మరణించిన పురుషుల ఆస్తి పంపకానికి సంబంధించిన న్యాయసూత్రాలను, సంప్రదాయాలను 1956 నాటి హిందూ వారసత్వ చట్టం సవరించి క్రమబద్ధీకరించింది. హిందూ మహిళ తన ఆస్తిని ఎలా పంపకం చేయాలో నిర్ణయించుకునే అధికారం ఆవిడకే ఉంటుందని పేర్కొంది. ఈ చట్టానికి మార్పులు చేస్తూ 2005 హిందూ వారసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. హిందూ పురుషుడు లేదా స్త్రీకి ఉమ్మడి ఆస్తిగా దక్కింది కాకుండా, విడిగా ఉన్నది వారసులకు ఎలా సంక్రమించాలో నిర్దేశించే న్యాయ సూత్రాలు ‘మితాక్షర’ విభాగం కిందకు వస్తాయి. ఈ తరహా ఆస్తిలో స్త్రీ సైతం హక్కుదారు అవుతుందని అది పేర్కొంటోంది. 1929 హిందూ పారంపర్య సవరణ చట్టానికి ముందు మితాక్షరలోని బెంగాల్‌, బెనారస్‌, మిథిల ఉపవిభాగాలు కేవలం అయిదు వర్గాల మహిళా సంబంధీకులకు మాత్రమే ఆస్తిలో వాటా పొందే హక్కు ఉందని పేర్కొనేవి. మరణించిన వ్యక్తి భార్య (వితంతువు), కుమార్తె, తల్లి, నాయనమ్మ, ముత్తవ్వ (తాతమ్మ)... వీరికి మాత్రమే వారసత్వ ఆస్తి పొందే హక్కు ఉంటుందని మితాక్షర ఉప విభాగాలు పేర్కొన్నాయి. మద్రాసు, బొంబాయి ఉప విభాగాలు మరింతమంది మహిళలకు వారసత్వ హక్కులను గుర్తించాయి. మృతుడి మనవరాళ్లు (కుమారుడు, కుమార్తెల సంతానం), అక్కచెల్లెళ్లకు కూడా ఆస్తిలో వాటా లభిస్తుందని మద్రాసు ఉప విభాగం  పేర్కొంది. బొంబాయి ఉప విభాగం మరింత ఉదారంగా వ్యవహరించింది. మృతుడి మేనత్త, సవతి సోదరి, సవతి తల్లి, కుమారుడు మరణిస్తే అతడి భార్య (కోడలు), సోదరుడు మరణిస్తే అతడి భార్య (మరదలు లేదా వదిన)కు కూడా వారసత్వ హక్కు ఉందని చెప్పింది. దీన్ని బట్టి మహిళలకు ఆస్తి హక్కు కల్పించడానికి మన సమాజానికి అభ్యంతరం లేదని తేలుతోంది. మృతుడి వారసత్వ ఆస్తిలో కొడుకులు, మనవళ్లు, మునిమనవళ్లను మాత్రమే లోగడ సహ వారసులుగా పరిగణించేవారు. 2005 సవరణ చట్టం కుమార్తెలనూ సహ వారసులుగా గుర్తించింది.

హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 సెప్టెంబరు తొమ్మిది నుంచి అమలులోకి వచ్చింది. ఆ తేదీకి ముందు సహ వారసుడు (తండ్రి) మరణిస్తే, ఆయన వారసత్వ ఆస్తిలో కుమార్తెకు వాటా లభించదని 2015లో ప్రకాశ్‌ వెర్సస్‌ ఫూలవతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 2018లో దానమ్మ వెర్సస్‌ అమర్‌ కేసులో ఆ తేదీకి ముందు మరణించిన వ్యక్తి ఆస్తిలోనూ కుమార్తెలకు వాటా ఉంటుందని ద్విసభ్య ధర్మాసనం తేల్చింది. చివరకు సెప్టెంబరు తొమ్మిది, 2005కు ముందు మరణించిన వ్యక్తి కుమార్తెలకూ ఆయన ఆస్తిలో జన్మతః హక్కు లభిస్తుందని నిర్ధారించింది. అవిభక్త హిందూ కుటుంబ ఆస్తిలో కుమారులతోపాటు కుమార్తెలకూ జన్మతః సమాన వాటా లభిస్తుందని 2020 ఆగస్టు 11న వినీత వెర్సస్‌ రాకేశ్‌ శర్మ కేసులో త్రిసభ్య సుప్రీం ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశంలో వివిధ హైకోర్టులు, దిగువ కోర్టులలో అపరిష్కృతంగా ఉన్న పలు వారసత్వ కేసులకు ఈ తీర్పును వర్తింపజేసి వేగంగా పరిష్కరించాలని సుప్రీం సూచించింది. ‘స్త్రీల ఆస్తి హక్కులు’ పేరిట వెలువరించిన నివేదికలో 174వ లా కమిషన్‌ సైతం పలు సంస్కరణలను ప్రతిపాదించింది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని అది సిఫార్సు చేసింది.

ఏళ్ల తరబడి జాప్యం...

భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తోంది. అయినా, స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడంలో విపరీతమైన ఆలస్యం జరుగుతోంది. అందుకు పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. వాటిని న్యాయస్థానాలు క్రమంగా తొలగిస్తూ రావడం సంతోషకరమైన పరిణామం. ఉమ్మడి పౌరస్మృతి అమలులోకి వస్తే అన్ని మతాలు, వర్గాల స్త్రీలకు సమాన ఆస్తి హక్కులు లభిస్తాయి. కానీ, ఆ దిశగా పురోగతి నత్తనడకన సాగుతోంది. మహిళను పురుషుడి ఆస్తిగా భావించే దేశంలో స్త్రీకి సమాన ఆస్తి హక్కు లభించడం అంత తేలిగ్గా జరిగే వ్యవహారం కాదు. ఆ విషయంలో మహిళలకు పూర్తి న్యాయం జరగాలంటే మరెంతో కృషి జరగాల్సి ఉంది. లింగ సమానత్వం కోసం శాసన, న్యాయ వ్యవస్థలు మరింత పకడ్బందీగా పనిచేయాల్సి ఉంటుంది. కార్యనిర్వాహక వ్యవస్థ సైతం అందుకు కలిసి రావాలి.

సంక్లిష్ట పరిస్థితి

భిన్న మతాలు, సంస్కృతులకు నెలవైన భారతదేశంలో ఆయా వర్గాల మహిళలకు వేర్వేరు వారసత్వ సూత్రాలు వర్తిస్తున్నాయి. అన్ని మతాలు, వర్గాలకు ఉమ్మడి పౌర స్మృతి ఇంతవరకు ఏర్పడకపోవడం వల్ల స్త్రీలకు వారసత్వ ఆస్తి సంక్రమణలో అన్యాయం జరుగుతోంది. వారు ఆస్తిలో వాటా విషయంలో దుర్విచక్షణకు లోనవుతున్నారు. వేర్వేరు మతాలు వేర్వేరు వ్యక్తిగత న్యాయ సూత్రాలను (పర్సనల్‌ లా) పాటిస్తున్నాయి. వారసత్వ సంక్రమణ కూడా ఆ సూత్రాల పరిధిలోకే వస్తుంది. వాటికి అదనంగా స్థానిక ఆచారాలు, సంప్రదాయాలు ఉండనే ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో గిరిజన మహిళలకు తమ తమ తెగల ఆచారాల ప్రకారం ఆస్తిలో వాటా లభించడమో, లభించకపోవడమో జరుగుతోంది. మరోవైపు సొంత వారసత్వ చట్టాలను రూపొందించుకోవడానికి కేంద్రం, రాష్ట్రాలకు రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. ఫలితంగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారైంది. ఆ క్రమంలోనే పలు రాష్ట్రాలు వివిధ మతాల వ్యక్తిగత చట్టాల పరిధిలోకి వారసత్వ హక్కుల చట్టాలను తీసుకొచ్చాయి.

- పీవీఎస్‌ శైలజ 

(సహాయ ఆచార్యులు, మహాత్మాగాంధీ న్యాయ కళాశాల, హైదరాబాద్‌)
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి

‣ వందేభారత్‌ కొత్త పరుగు

‣ జల సరిహద్దుల్లో జగడం

‣ తీరాలను మింగేస్తున్న కడలి

‣ చైనా దూకుడుకు ముకుతాడే లక్ష్యం

‣ బహుళ భాషా అభ్యసనానికి సాంకేతిక దన్ను

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 26-02-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం